ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు ఎర్రబస్సెక్కి వచ్చాడు: నీలోఫర్ ను ఇరానీ ఛాయ్ కి కేరాఫ్ గా మార్చాడు!

భాగ్యనగరపు భావోద్వేగ బంధం ఇరానీ ఛాయ్!

ఖరీదులో చీపురా భాయ్… ఖుషీలనే చూపురా భాయ్… గరీబులకి విందురా భాయ్.. నవాబులకూ బంధువేనోయ్.. ఛాయ్ చటుక్కురనా తాగరా భాయ్ అంటూ ఈ పాటలో చంద్రబోస్ ఛాయ్ ను విశ్లేషించినట్టే… నీలోఫర్ కేఫ్ ల ముందు ఇప్పుడు జనం క్యూ కడుతున్నారు. ఒకనాడు బ్లూసీ మార్కెట్ ను తోసిరాజని.. నీలోఫర్, హైదరాబాద్ కేఫ్ ఛాయ్ కు ఓ ప్రధాన అడ్డాగా మారింది.

హైదరాబాద్ అంటేనే కేఫ్… ఆ కేఫ్ ల్లో నల్గురు కలిసి ఛాయలు తాగడం.. ఆ ఛాయల్లో ఉస్మానియా బిస్కెట్స్ నంచుకుంటూ బాతాఖానీ కొట్టడం… ఇంకొందరు ఉఫ్పుమంటూ పొగలూదటం. ఇవన్నీ 90ల చివరివరకూ భాగ్యనగరంలో కనిపించినా.. రాను రాను మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మన హైదరాబాదీ ఫ్లేవర్ ఇరానీ కేఫ్ ఛాయ్ ఎక్కడో కానీ దొరకడం లేదు. పేరులోనే ఇరాన్ ను ముందు పెట్టుకుని నాటి పర్షియా నుంచి 1935ల కాలంలో మోసుకొచ్చిన ఇరానీ ఛాయ్ హైదరాబాద్ అస్తిత్వంలో ఓ భాగమైపోయింది. ఇరానీ కేఫ్స్, అందులోని ఛాయ్ ని అమితంగా ఇష్టపడ్డ భాగ్యనగర్ వాసుల జీవితాలు.. ఏకంగా వాటితో ఒక ఎమోషనల్ బాండ్ నే ఏర్పర్చుకున్నాయి.

అలా 1935లో గ్రాండ్ హోటల్ కేఫ్ నుంచి ప్రారంభమైన ప్రస్థానంలో ఎన్నో కేఫ్స్ వెల్లువలా పుట్టుకొచ్చాయి. కొన్ని, ఇప్పటికీ.. కాలంతోనూ, పెరుగుతున్న నగరంతో పోటీ పడుతూ కనిపిస్తుంటే… మరికొన్ని కాలగమనంలో కలిసిపోయి కనిపించకుండాపోయాయి. అలాంటి కేఫ్ ఛాయ్ కు పాప్యులరైన వాటిల్లో నీలోఫర్ కూడా ఒకటి. మరెన్నో కేఫ్స్ ఉంటే నీలోఫర్ గురించే మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఇప్పుడు భాగ్యనగరంలో నీలోఫర్ కు వెళ్లి ఓ ఛాయ్ తాగితే అదో నోస్టాల్జియా.

ఇక కేఫ్స్ గురించి… ఆ కేఫేటేరియాల్లోని ఛాయల గురించి చెప్పుకోవడం కాస్సేపు ఆపేసి.. పర్షియా నుంచి వలస వచ్చిన ఆ ఛాయ్ ని ఆసరా చేసుకుని ఓ అనామకుడు అంచెలంచలుగా ఎలా ఎదిగాడో చెప్పుకుందాం.

ఆదిలాబాద్ జిల్లా నుంచి ఓ బిస్తర్ పట్టుకుని 1975వ సంవత్సరంలో ఓ పెద్దమనిషి హైదరాబాద్ బయల్దేరాడు. ఆయన పేరు అనుముల బాబూరావు. 50 ఇళ్లు కూడా లేని ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన బాబూరావు ఎగ్జామ్ ఫీ కోసం తన తల్లిదండ్రులు వాళ్లకున్న ఒకే ఒక్క ఆవును కూడా అమ్మేశారు. ఆ ఆవును ఎలాగైనా తల్లిదండ్రులకు కొనివ్వాలన్నది బాబూరావు పట్టుదల. అందుకోసమని బాబూరావు రాష్ట్ర రాజధానికి ఎర్రబస్సెక్కాడు.

తన తండ్రి తనను పాఠశాలకు పంపాలని ప్రయత్నించినా ఆర్థిక స్థోమత సరిపోలేని పరిస్థితుల నుంచి.. మహారాష్ట్రలోని వాళ్ల మామ సాయంతో కాస్తో కూస్తో చదువుకోగల్గాడు. చంద్రాపూర్ లో ఓ హాస్టల్ లో ఉండి తన చదువు కొనసాగించాడు. అప్పుడే పదో తరగతి చదువుతున్నప్పుడు డబ్బవసరమైతే తన తల్లిదండ్రులు ఆవును అమ్మేశారు. అది బాబూరావును కదిలించింది.

ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు!

అలా గట్టి పట్టుదలతో నాటి ఉమ్మడి రాష్ట్ర రాజధానైన హైదరాబాద్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అడుగుపెట్టాడు బాబూరావు. ఒక బట్టల షాపులో సేల్స్‌మ్యాన్‌గా పని దొరికింది. రాత్రిళ్లు తను పనిచేస్తున్న దుకాణం వరండాలోనే పడుకోవడం.. స్నానాదులకు రైల్వే స్టేషన్ ను వాడుకోవడం అదీ హైదరాబాద్ కు కొత్తలో వచ్చిన రోజుల్లో బాబూరావు దినచర్య. హోటల్‌లో పని చేస్తే ఫ్రీ ఫుడ్, బస చేయడానికి వంటివన్నీ లభిస్తాయికదా… ఏదైనా హోటల్ లో పని చూసుకోనుంటివని ఆయన్ను బాగా గమనిస్తున్నవారు ఓ సూచన చేశారు. అలా బాబూరావు చేరిన ఓ చిన్న హోటలే.. కాలక్రమంలో హైదరాబాద్ లో ఇరానీ చాయ్ కు పాప్యులరైన నీలోఫర్ కేఫ్ గా రూపాంతరం చెందింది.

నీలోఫర్ లో వెయిటర్‌గా పనిచేసే క్రమం నుంచి ప్రారంభించి.. మెల్లిగా కౌంటర్‌లో కూడా పనిచేసే స్థాయి నమ్మకాన్ని సంపాదించాడు బాబూరావు. కానీ, కొంతకాలానికి నీలోఫర్ నష్టాల్లో కూరుకుపోయింది. డిస్కషన్ లో భాగంగా యజమానులు బాబూరావునే…ఏం చేద్దాం హోటల్ ని అని అడగడాన్ని బాబూరావు తనకు దక్కిన ఓ గొప్ప అవకాశంగా మల్చుుకున్నాడు. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వదిలేయండి.. మీరు జస్ట్ పర్యవేక్షించండని యజమానులకు చెప్పాను. అలా ఒక ఏడాది పాటు నీలోఫర్ లో ఇరానీ ఛాయ్ వైపు జనాన్ని ఆకర్షించడంతో పాటు.. అక్కడి పూరీ వంటి టిఫిన్స్ వైపు మళ్లించడానికి బాబూరావు తన శాయశక్తులా ప్రయత్నించాడు. అందుకు తనకు వచ్చిన ఆలోచనలను అమలు చేస్తూ వ్యూహాత్మకంగా నీలోఫర్ ను నడిపాడు. అలా యజమానులు సంతోషించేలా పనిచేశాడు బాబూరావు. కానీ, అప్పటికే నీలోఫర్ ను అమ్మేయాలని ఆ యాజమాన్యం డిసైడైంది. ఆ విషయం బాబూరావుకు చెప్పారు. ఇంకేం ఎగిరి గంతేసిన బాబూరావు నీలోఫర్ ను తానే కొనుగోలు చేస్తానన్నాడు. అలా ఓ వెయిటర్ గా పనికి కుదిరిన బాబూరావే నీలోఫర్ ను కొనుగోలు చేసి దాని యజమానయ్యాడు.

అనుముల బాబు రావు అంటే.. హైదరాబాద్ ఛాయ్ మాస్టర్!

తను యజమాని కాబట్టి లోపల ఏదో ఏసీలో కూర్చుని పెత్తనం చెలాయించడం కాదు… హోటలంతా కలియ తిరుగుతాడు. కేవలం నాల్గైదు గంటలు మాత్రమే పడుకునే బాబూరావు నీలోఫర్ ఛాయ్ ని హైదరబాద్ ఐకానిక్ సింబల్ గా మార్చడంలో ఇంకా ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. ఇప్పటికే లక్డీకాపూల్ లోని నీలోఫర్ కేఫ్.. బంజారాహిల్స్, హిమాయత్ నగర్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, తాజాగా హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో ఔట్ లెట్స్ గా విస్తరించింది.

నీలోఫర్ లో ప్రత్యేకంగా దొరికే బన్ మస్కా తో పాటు, ఉస్మానియా బిస్కెట్స్ ఇరానీ ఛాయ్ తాగితే చాలు అదో భూతల స్వర్గమని భావించేవాళ్లెందరో. అలాంటివారందరూ రోజులో కనీసం ఒక్కసారైనా నీలోఫర్ కు క్యూ కట్టకుండా ఉండలేరు.

తన తల్లిదండ్రులు తనకోసం పడ్డ కష్టాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుంటూ అడుగులు వేసే బాబూరావు.. వ్యాపారాన్ని నడపడానికి ఏమవసరమో గుర్తించగల్గడంలో మాత్రం దిట్టగా రాటుదేలాడు. కస్టమర్స్ ను దేవుడిలా భావించడమే బాబూరావు వ్యాపార రహస్యం. దేవుడికి ప్రసాదం సమర్పించేటప్పుడు ఎంత భక్తితో చేస్తామో… కస్టమర్ దేవుళ్లకు సర్వీస్ విషయంలోనూ అదే భక్తి ఉండాలంటాడు బాబూరావు. అందుకే నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదని.. అదే ఇప్పుడు నీలోఫర్ సక్సెస్ మంత్ర అంటాడు. అయితే, నీలోఫర్ కేఫ్ లో దొరికే ఛాయ్ ఎంత బాగుంటుందని కస్టమర్స్ అటువైపు వెళ్తారో.. వచ్చేవారి పార్కింగ్ కోసం కూడా కావల్సిన ఏర్పాట్లు చేయడంతో ఇప్పుడు నీలోఫర్ ఛాయ్ ప్రియుల సంఖ్య రానురాను మరింత పెరుగుతోంది. అదే స్థాయిలో డిమాండ్ కూడా పెరుగుతూ ఔట్ లెట్సూ కొత్తగా వెలుస్తున్నాయి.

బాబూరావు కొడుకు ఎంబీఏ పూర్తి చేసి తండ్రి మార్గంలోనే వ్యాపారంలో చేరాడు. వ్యాపారంలో మొదటి రెండేళ్లు లాభాలు ఆశించకపోవడంతో పాటు.. నష్టాలు వచ్చినా తట్టుకునేలా మానసికంగా సిద్ధపడాలంటాడు బాబూరావు. మనం అందించే ఆహరం రుచి, నాణ్యత ఎప్పుడూ కస్టమర్ డబ్బుకు సరైన విలువ చేకూర్చేలా స్థిరత్వాన్ని కావాడుకోవాలంటాడు. ప్రజలు ఇప్పుడు ఛాయ్, సిగరెట్, పాన్ వంటివాటికి అలవాటు పడ్డారు. కాబట్టి, హైదరాబాద్ వంటి చోట్ల ఇలాంటి వ్యాపారాన్ని సరిగ్గా చేస్తే ఇదిగో మా నీలోఫర్ లా నిలదొక్కుకుంటోందంటున్నాడు బాబూరావు.

నీలోఫర్ ఇప్పుడు టాప్ కేఫ్ ఇరానీ ఛాయ్ గా హైదరాబాద్ లో ఓ ట్రెండింగ్ టాపిక్ కాగా.. దాన్ని విదేశాలకు విస్తరించే ఆలోచనలేవీ తనకు లేవని తన ఇంటర్వ్యూస్ లో చెబుతున్నాడు బాబూరావు. కస్టమర్ కు ఏదిష్టమో అదే తనకూ ఇష్టమని చెబుతున్న బాబూరావు.. నీలోఫర్ కేఫ్ లో ఇప్పుడు టీ ఆకులు కూడా విక్రయిస్తున్నాడు. కోవిడ్ సమయంలో హైదరాబాదీలు హోటల్స్, రెస్టారెంట్స్ కు రాలేని సమయంలో.. నీలోఫర్ ఛాయ్ ని ఎప్పటికీ మర్చిపోవద్దని నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ విక్రయాలను ప్రారంభించాడు బాబూరావు.

ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ బాట పట్టిన బాబూరావు పర్షియన్ ఇరానీ ఛాయ్ పై హైదరాబాదీలకున్న మమకారాన్ని కనిపెట్టి, వారి నాడీని పట్టి అంచెలంచెలుగా ఎదగడమే కాదు.. 20 ఏళ్లకు పైగా ఎంఎన్జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ తో పాటు.. నీలోఫర్ హాస్పిటల్ లో రోగుల వెంట వచ్చే సహాయకులకు ఉచిత భోజనాన్ని అందిస్తున్నాడు. ప్రభుత్వం రోగులకు మాత్రమే హాస్పిటల్స్ లో భోజన వసతి కల్పిస్తుందేగానీ.. వారి బంధువులు, కుటుంబీకులకు కాదు కాబట్టి.. ఆ లోటు తీర్చాలనిపించే తాను 27 ఏళ్ల నుంచీ అన్నదానం చేస్తున్నాడు బాబూరావు. తద్వారా పేదలకు సాయమందిస్తానని తన తండ్రికిచ్చిన వాగ్ధానాన్ని నెరవేరుస్తున్నానంటాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles