87 ఏళ్ల బామ్మ… మరో 84 ఏళ్ల బామ్మను ఎక్కించుకుని.. షోలేలో అమితాబ్, ధర్మేంద్రలా యే దోస్ తీ హమ్ నహీ తోడెంగే అంటూ రయ్యుమంటూ రోడ్లపై తిరుగుతుంటే ఆ దృశ్యమెలా ఉంటుంది. సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నవారందరి దృష్టీ వారివైపు పడేలా ఆకట్టుకుంటుంది. ఇప్పుడీ సీన్ కు గుజరాత్ లోని అహ్మదాబాద్ కేంద్రం కాగా.. ఓ ఇద్దరు ముదిమి వయస్సు ప్రౌఢలు వయసొక సంఖ్య కాదని నిరూపిస్తూ రైడ్ చేస్తున్నారు.
మందాకినీ షాకు 87 ఏళ్లు… ఆమె సోదరి ఉషాబెన్ కు 84 ఏళ్లు. వీరిద్దరూ కలిసి సేమ్ టూ సేమ్ షోలేలో అమితాబ్, ధర్మేంద్ర పాటలో నడిపే స్కూటర్ తరహా వాహనంలో చెలరేగిపోతున్నారు. అందరి హృదయాలనూ గెల్చుకుంటున్నారు. మహిళలు ధైర్యంగా వాహనాలను నడిపేందుకు ప్రేరణవుతున్నారు.

వెండిలా మెరుస్తున్న తెల్లజుట్టు, భారతీయతకు దర్పణం పట్టే చీరకట్టులో… ఈ ఇద్దరు బామ్మలు ట్రాఫిక్ లో దూసుకెళ్తున్న దృశ్యం అహ్మదాబాద్ రోడ్లకు ఓ కొత్తందాన్నిస్తోంది. 87 ఏళ్ల మందాకినీ షా స్కూటర్ నడుపుతుంటే… పక్కనే సైడ్ కార్ లో 84 ఏళ్ల ఉషాబెన్ హాయిగా కూర్చుని ఎంజాయ్ చేస్తోంది. వీళ్లిద్దర్నీ రోడ్లపైన చూస్తున్నవారు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు వీరిద్దరి ప్రయాణాల వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్స్ నుంచి స్ఫూర్తి నింపే కామెంట్స్ పోటెత్తుతున్నాయి. ఇప్పుడు వీరిని సోషల్ మీడియా బైకర్ దాదీలు అని పిల్చుకుంటోంది. మొత్తంగా వీరిద్దరూ ఇప్పుడు అహ్మదాబాద్ జై- వీరు జంటలా అలరిస్తున్నారు.
62 ఏళ్లకు స్కూటర్ నేర్చుుకన్న మందాకినీ షా!
మందాకినీ షా కుటుంబం పెద్దది. ఆరుగురు సోదరీ, సోదరుల్లో మందాకినే పెద్దామె. ఈమె తండ్రి ఓ స్వాతంత్ర్య సమరయోధుడు. చిన్నవయస్సులోనే కుటుంబ బాధ్యతలు చేపట్టింది మందాకిని. కేవలం 16 ఏళ్ల ప్రాయంలోనే ఉపాధ్యాయురాలిగా పనిచేశారీమె. ఆ తర్వాత వివిధ సామాజిక, సంక్షేమ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొని తన ప్రాంతంలోని ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు 87 ఏళ్ల మందాకినీ.
62 ఏళ్ల వయస్సులో మందాకినీ తొలిసారి బైక్ నడపడం నేర్చుకుంది. ఆ తర్వాత జీప్ నేర్చుకుంది. చివరకు సైడ్ కార్ ఉన్న ఓ స్కూటర్ కొనుగోలు చేసి.. ఇప్పుడు, ఏ పనికైనా.. లేక, సరదాకైనా అహ్మదాబాద్ రోడ్లపై హాయిగా షికార్లు వేస్తోంది. ఎవరైనా బడికెళ్లే పిల్లలో, వృద్ధులో.. లేక, తాను వెళ్లే దారిలో వెళ్తూ అవసరమున్నవారో కలిస్తే తన సైడ్ కార్ లో కూర్చోబెట్టుకుంటూ లిఫ్ట్ కూడా ఇస్తోంది మందాకిని.
సోషల్ మీడియాలో వైరలవ్వడంతో కొన్ని ఆనందాలు, మరికొన్ని ఇబ్బందులు!
మందాకినీ అహ్మదాబాద్ రోడ్లపై రైడింగ్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… ఈమెను చాలామంది ఓ సెలబ్రిటీలా చూస్తున్నారు. ఆసుపత్రులకు వెళ్లినప్పుడు ఏకంగా డాక్టర్లు కూడా ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు దిగుతున్నారు. మరికొన్నిసార్లు ఈమెకున్న క్రేజ్ దృష్ట్యా ఫీజులు కూడా మాఫీ అవుతున్నాయి.
అదే సమయంలో ఈ ముసలావిడ ఈ వయస్సులో స్కూటర్ పై సైడ్ కార్ తో వెళ్లడం ట్రాఫిక్ పోలీసులకు మాత్రం ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తోందట. అందుకే, ఎందుకు ఈ వయస్సులో స్కూటర్ నడుపుతున్నారని తరచూ ట్రాఫిక్ పోలీసులు ప్రశ్నించడం ఇబ్బంది పెట్టినా.. మౌనంగా, చిర్నవ్వుతో వెళ్లిపోతానంటోంది మందాకిని.
ఎందుకు మందాకినీని ప్రేరణగా భావిస్తున్నారు..?
కొన్ని ఆనందాలతో పాటే, ఇబ్బందులూ ఉన్నప్పటికీ.. స్వతంత్రంగా జీవించడంలో ఉండే మజా వేరంటోంది మందాకిని. ఇదే ఈమె నుంచి ఇప్పుడు సమాజం నేర్చుకోవాల్సిన పాఠం. అందుకే ఇప్పుడు మందాకినీ ఓ సెలబ్రిటీ. క్రేజ్ కూడగట్టుకున్న బామ్మ. ఈమెను చూసి ఇప్పుడు చాలా మంది తమ భార్యలను వాహనాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారట. అది చాలదా అంటోంది మందాకిని. డిపెండెన్సీకన్నా.. ఇండిపెండెంట్ గా ఉండటంలో ఉండే ఆనందాన్ని మందాకిని ఆస్వాదిస్తోంది.
ఉషాబెన్ దీ ఇదే ఆలోచన!
తమను చూసి వయస్సొక అడ్డంకి కాదని గుర్తించాలి. మనసుంటే… దానికి తగ్గట్టుగా ఆరోగ్యాన్నీ కాపాడుకుంటే… మాలాగా ఎవరైనా మహిళలు ఏ పనైనా చేసుకోవచ్చు. 80 ఏళ్ల ముదిమి వయస్సులోనూ వండర్స్ చేయొచ్చు. మేం ఎందరికో ప్రేరణగా నిలవడం సంతోషం కల్గించే విషయమంటోంది ఉషాబెన్.
దాదాపు సెంచరీకి దగ్గర పడ్డ ఈ ఇద్దరు ఎనభైయవ్వ దశకపు వయోవృద్ధులు ఇప్పుడు అహ్మదాబాద్ జై – వీరూ గా సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్స్ గా మారారు.



