అర్థం కాని ఓ మిస్టరీ.. ఈ ఎడారి పల్లె హిస్టరీ!
ఎప్పటిలానే నునులేత నారింజ కిరణాలతో అక్కడ ఉషోదయమైంది. ఆ ఊరికి కాలదోషం పట్టిందనే విషయం ఉదయించిన ఆ ప్రభాకరుడికి తెలుసో, లేదోగానీ.. చుట్టుపక్కలవారికి మాత్రం లేశమాత్రం కూడా తెలీదు. ఎందుకంటే, ఆ ఫైన్ మార్నింగ్, సూర్యోదయం కంటే ముందే ఆ అమావాస్య అర్ధరాత్రి ఆ ఊరు ఊరంతా ఖాళీ అయింది. దాని వెనుక రకరకాల కథలున్నాయి. అదే సమయంలో దెయ్యాలు, ఆత్మలు తిరిగే ప్రాంతంగా ఆ ఊరు పేరు మూటగట్టుకుంది. ఇప్పుడు డార్క్ టూరిజం సెంటర్ గా కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ మాత్రమే అలరిస్తోంది. పరిశోధకులకు కూడా అంతుచిక్కని ఆ మోస్ట్ హాంటెడ్ విలేజ్ కథే ఇది.
రాజస్థాన్ ఎడారి పల్లె కుల్ధారా. 200 ఏళ్లుగా మనుషులు కనిపించని ఓ నిర్జీవ ప్రదేశం. కాదు కాదు మనుషులు వదిలేసిన ఓ శాపగ్రస్థ గ్రామం. నేటి ఆర్కిటెక్చర్ కు ఏమాత్రం తీసిపోని నమూనా ఇళ్లు… ఒక ఇంజనీర్ గీచిన ప్లాన్ రీతిలో నిర్మించబడ్డ గ్రామం కుల్ధారా.

జైసల్మేర్ జిల్లాలో నీటి ఎద్దడికి కేరాఫ్ గా ఉండే ఓ బార్డర్ విలేజ్ కుల్ధారా. జిల్లా కేంద్రానికి ఏకంగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ రాజస్థానీ గ్రామం. ఎడారి దుమ్ము, ధూళి మధ్య చెట్లస్సలే కనిపించవు. కేవలం గ్రామంలో విడిచిపెట్టిన ఇళ్లు.. వాటి శిథిలాల మధ్య అక్కడక్కడా కనిపించే పచ్చికను తింటూ మేకలో, గొర్లో మాత్రమే పట్టపగలు కనిపిస్తాయి. అక్కడి నిర్మానుశ్యం, నిశ్శబ్దమే అక్కడ మనల్ని భయపెట్టే సంగీతమవుతుంది.
అసలేమైంది ఆ గ్రామానికి..?
కుల్ధారా ఒకనాడు సుసంపన్నమైన గ్రామం. సుభిక్షంగా వెలుగొందిన ఊరు. పాళీ నుంచి వచ్చిన పాళీవాల్ బ్రాహ్మణులు అధికంగా నివశించిన అడ్డా. అదిగో అప్పుడే సుమారు 2 వందల ఏళ్ల క్రితం జైసల్మేర్ దివాన్ గా ఉన్న సలీం సింగ్ కన్ను ఆ ఊళ్లో గ్రామపెద్ద కూతురిపై పడింది. సలీం సింగ్ పుట్టుకతోనే దుర్మార్గుడు కాకపోయినా.. తన తండ్రిని శత్రువులు చంపిన తీరును కళ్లారా చూడటంతోనే తాను ఒక సైకోలా మారాడన్న వాదనా ఉంది. ఆ క్రమంలో సలీం సింగ్ గ్రామపెద్ద కూతురును ఎలాగైనా సొంతం చేసుకోవాలని కసితో రగిలిపోయాడు. ఆ విషయాన్ని గ్రామస్థులకు తెలియపర్చాడు. అడ్డుకుంటే పన్నులు వేస్తామని, హింసిస్తామని బెదిరించాడు.
అయితే దివాన్ సలీం సింగ్ ఓ దివానే కాదు.. ఓ మూర్ఖుడు. పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టుగా.. మూర్ఖుడైన రాజు చేతిలో ఇబ్బందులు పడే బదులు ఊరంతా ఖాళీ చేద్దామని తీర్మానించుకుంది కుల్ధారా గ్రామం. అలా తమ ఆస్తులు, భూములు, ఇళ్లు అన్నీ వదిలి గ్రామస్థులు కుల్దారాను వదిలేసి రాత్రికిరాత్రే మాయమయ్యారు. ఆ తర్వాత వారెక్కడికి వెళ్లిందీ తెలియరాలేదు. వారెక్కడ స్థిరపడ్డారో కూడా ఆ తర్వాత వెలుగులోకి కూడా రాలేదు. కానీ, వెళ్లేటప్పుడు మాత్రం పాళీవాల్ బ్రాహ్మణులు.. ఇకపై కుల్ధారాలో ఎవ్వరూ కూడా స్థిరపడలేరనే శాపం పెట్టారని చెబుతుంటారు. అదెంత వరకు నిజమో తెలీదుగానీ.. అక్కడ మాత్రం బలంగా వినిపించే వారి నమ్మకం మాత్రం అదే.
ఒక క్రమబద్ధమైన గ్రామంగా కనిపించే కుల్ధారా!
కుల్ధారాలో ఇప్పటికీ చాలా ఇళ్లు ఎలా వదిలేసి వెళ్లారో అలాగే కనిపిస్తాయి. కొన్ని మాత్రం శిథిలమయ్యాయి. ఓ ఇంటి మెట్లెక్కి చూస్తే గ్రామం మొత్తం కనిపిస్తుంది. సమాన దూరాల్లో నిర్మించిన వీధులు.. ఇటుకలతో క్రమబద్ధంగా కట్టుకున్న ఇళ్లు ఇలా కుల్దారా చూడ్డానికీ ఓ పర్యాటక క్షేత్రంగా ఉంటుంది. ఇళ్ల సమూహాల మధ్యన ఓ చిన్న ఆలయం కూడా ఉంది. దాని గోడలకే చిన్న చిన్న గూళ్లను ప్రమిదెల్లో దీపాలు పెట్టడం కోసం ఏర్పాటు చేశారు.
సూర్యాస్తమయం తర్వాత అంధకారమే!
రాజస్థాన్ ఎడారి దిబ్బల వెనుక నుంచి సూర్యుడు అస్తమిస్తుండగా… కుల్ధారా ద్వారాలను మూసుకుంటాయి. ఎందుకంటే, కుల్దారాలో ఆత్మలు, దెయ్యాలు సంచరిస్తుంటాయనేది చాలామంది నమ్మకం. ఆ సమయంలో అక్కడికెళ్లితే ఓ చల్లని గాలి తాకుతుంది. కానీ, అది ఆ ప్రదేశం కల్గించే వింత భయమా.. లేక, ఎడారి సాయంత్రపు వింజామరమా అర్థం కాదు. అయినా, కుల్ధారా కథ ఓ మిస్టరీగా ప్రపంచాన్నే ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం కుల్ధారా భారత పురావస్తు సర్వేక్షణ శాఖ ఆధ్వర్యంలో వారసత్వ ప్రదేశంగా సంరక్షణలో ఉంది.
అయితే, ఇక్కడ 2013లో పారానార్మల్ పరిశోధకుడిగా పేరుగాంచిన గౌరవ్ తివారీ నేతృత్వంలో ఇండియన్ పారానార్మల్ సొసైటీ సభ్యులు పర్యటించారు. సర్వసాధారణ పరిస్థితులను మించి అసలు కుల్దారాలో ఏముందో తెలుసుకోవడానికి ఒక పరిశోధన చేపట్టింది ఆ ఐపీఎస్. అక్కడి రేడియేషన్, భౌగోళిక పరిస్థితులను అంచనా వేయడానికి ఈఎంఎఫ్ మీటర్లు, ఉష్ణోగ్రతలను కొలిచే సెన్సార్స్, లేజర్ గ్రిడ్స్ తో పాటు.. అప్పటికే ప్రచారంలో ఉన్న ఆత్మల సంచారం నేపథ్యంలో వాటిని తెలుసుకోవడానికి ఓ ఘోస్ట్ బాక్స్ తో సహా కుల్ధారాలో పర్యటించింది. కానీ, ఆ పరిశోధక బృందానికీ కొన్ని అసాధారణ ఘటనలెదురయ్యాయి. వారిని కూడా ఎంత లేదన్నా ఆశ్చర్యపర్చాయి. రాత్రి వేళ ఇంకొంత ఆందోళనకూ గురిచేశాయి.
సదరు దర్యాప్తు బృందం ఏం పేర్కొంది..?
కారణం తెలియకుండా కదిలే నీడల గురించి.
శిథిలాల మధ్య నుంచి వినిపించే శబ్దాలు, స్వరాల గురించి.
సమీప దూరంలోపే పది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతల తేడా కనిపించడం.. ఆకస్మికంగా మారిపోయే ఉష్ణోగ్రతల గురించి.
చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోయినా ఎవ్వరో వచ్చి ముట్టుకున్నట్టుగా అనిపించడం గురించి.
ఘోస్ట్ బాక్సులో రికార్డైనవన్నీ అక్కడ ప్రచారంలో ఉన్నట్టే ఆత్మలతో సంభాషణల్లా ఉండటం గురించి ఈ సంస్థ కొన్ని వివరాలను వెల్లడించింది.
అయితే, పరిశోధకులకు మాత్రం పూర్తిగా చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకం భయపడుతున్నట్టుగా… కుల్ధారాలో దెయ్యాలు తిరుగుతున్నాయని, ఆత్మలు సంచరిస్తున్నాయనే శాస్త్రీయమైన ఆధారాలైతే లభించలేదు. అసలక్కడ సర్వసాధారణమైన వాతావరణముందా, లేదా అన్నది కూడా కచ్చితంగా నిర్ధారించలేకపోయినట్టు చెప్పారు ఇండియన్ పారానార్మల్ సొసైటీ సభ్యులు.
ఇప్పటికీ ఓ వివాదాస్పాద అంశంగానే కుల్ధారా మాయాప్రపంచం ఓ మిస్టరీగా మిగిలిపోయింది. చారిత్రకంగా చూస్తే మాత్రం చాలామంది పండితులు ఊరు ఊరంతా ఖాళీ అయ్యేందుకు ప్రధాన కారణం.. పాళీవాల్ బ్రాహ్మణుల శాపాలు, అతీంద్రయ శక్తుల కంటే కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలే కారణమై ఉండొచ్చంటారు. అయినప్పటికీ ఈ గ్రామానికి శాపం పట్టిందన్న కథనాలే ఇక్కడికొచ్చే పర్యాటకులను ఆకట్టుకుంటూ… ఇదో డార్క్ టూరిజం హాట్ స్పాట్ గా మారిపోయింది.



