గ్రామీణ జీవన సౌందర్యాన్ని తెరకెక్కించిన దర్శకుడు!

గ్రామీణ సౌందర్యాన్ని తెరపై పర్చాడు. సెట్టింగ్స్ కే పరిమితమై, స్టూడియో చుట్టూరా తిరుగుతున్న తమిళ సినిమాను… గ్రౌండ్ రియాల్టీకి పట్టుకొచ్చాడు. ఊళ్లల్లో ఉండే గ్రామీణ అందాలు, మానవ బంధాలు, సంఘర్షణలు ఇలా ప్రకృతి సిద్ధమైనవాటన్నింటీని సహజ సిద్ధంగా తెరపెకెక్కించి… అప్పటివరకూ స్టూడియో సెట్టింగ్స్ కే పరిమితమైన తమిళ సినిమాను ఊళ్లవైపు నడిపించాడు. తన వ్యక్తిగత భావాలెలా ఉన్నా.. జన మాధ్యమంలోకి తీసుకెళ్లే సినిమా జనం కోసం అని నమ్మి జనరంజకమైన సినిమాలు తీశాడు. అందుకే భారతీరాజా ఇవాళ్టికీ తమిళ సినిమాలో ఒక టైటానిక్ ఐకాన్ లా నిల్చాడు.

గ్రామీణ జీవితాలనూ ఆధునిక తమిళ సినిమా కథల్లో జొప్పించి.. ఆ బతుకుచిత్రాలే కేంద్రంగా కథలనెంచుకుని పల్లెపై ఉన్న తన మక్కువను చాటుకున్నాడు. అప్పటివరకూ చూస్తున్న దృశ్యమాధ్యమానికి ఎమోషనల్ టచ్ ఇచ్చాడు.

పదహరేళ్ల వయస్సు ఇదీ 1977లో భారతీరాజా తొలి చిత్రం. మొట్టమొదటి సినిమాతోనే అప్పటివరకూ స్టూడియోలకే పరిమితమై, బయటకు రాని దర్శకులకు భిన్నంగా… పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించారు. పట్టణాలు.. లేదంటే, స్టూడియోలకు పరిమితమైన సినిమా రూపకల్పన.. ఆనాడు అదో విప్లవాత్మక నిర్ణయంగా చర్చ జరిగింది. తమిళంలో ఈ సినిమా పేరు 16 వయతినిలే.

తన మొట్టమొదటి సినిమా పదహారేళ్ల వయస్సు తీస్తున్నప్పుడు భారతీరాజా వయస్సు జస్ట్ 35 ఏళ్లు. పరిశ్రమలో గుర్తింపు లేదు, అనుభవం అంతకన్నా లేదు. అప్పుడప్పుడే కమల్, రజనీ ఎదుగుతున్న రోజులవి. శ్రీదేవి యువతారగా అడుగుపెట్టింది. అలా ఆ ముగ్గురితో.. నాల్గోవాడిగా భారతీరాజా జత కట్టి ఆ సినిమా తీశాడు. ఆ తర్వాత రోజుల్లో ఆ నల్గురూ చరిత్ర సృష్టించేవారవుతారని అప్పటికింకా ఎవ్వరూ అనుకోని ఉండరు.

భారతీరాజా జననం 1941, జూలై 17- మరణం 2026, జూన్ 10

చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారతీరాజా.. 84 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. కానీ, తానెంచుకున్న ఇండస్ట్రీపైన తనదైన ముద్ర వేసి పోయారు. గత ఏడాదికి పైగా తన కుమారుడు మనోజ్ భారతీరాజా మృతితో భారతీరాజా కలత చెందుతూనే ఉన్నారు.

భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి పెరియమాయ దేవర్. తమిళ సినిమా నీడే పడని తమిళ మారుమూల గ్రామం.. మధురై జిల్లాలోని అల్లినగరంలో పుట్టాడు.

నాటి సినిమా అంటే మద్రాస్ కే పరిమితం. హీరో అంటే సూటు బూటు ఉండాల్సిందే. హీరోయిన్స్ అయితే.. ఇక ఉత్తర భారతీయ, ముఖ్యంగా హిందీ నటీమణుల ప్రభావంతో ఫుల్ మేకప్ తో కనిపించాల్సిందే. కానీ, భారతీరాజా వీటన్నింటినీ మార్చేశాడు. రూల్స్ బ్రేక్ చేశాడు. కొత్త ట్రెండ్ సృష్టించి.. ట్రెండ్ సెట్టర్ అయ్యారు. తమిళ సినిమాలో బాలచందర్ తర్వాత వెర్సటైల్ గా ఆలోచించిన దర్శకుడిగా పేరు పొందారు.

ఆయన సినిమాలంటే అంతకుముందున్న మేకప్ తో ప్యాకప్ చేసుకున్న హీరోయిన్స్ కు భిన్నంగా చామనఛాయ.. వీలైతే, ఇంకొంచెం నలుపుండాల్సిందే. హీరోలకూ పెద్దగా మేకప్ లేకుండా సర్వసాధారణమైన యువకుల్లాగా చూపించాడు. ఇవన్నీ ఆ కాలానికి ఎంతో విప్లవాత్మకమైన నిర్ణయాలే. కానీ, అవే చేసి తనెందుకు ప్రత్యేకమో… తన కెమెరా కన్నుతో ఆన్ స్క్రీన్ రుజువు చేశాడు.

అసలు పదహారేళ్ల వయస్సు వాణిజ్య చిత్రమైతుందని ఎవ్వరూ ఊహించలేదు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ సాయంతో బ్లాక్ అండ్ వైట్ మూవీగా తీయాలనుకున్న సినిమా కాస్తా రంగుల చిత్రంగా రూపుదిద్దుకుంది. భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది. మొదట్లో సినిమా కొనేందుకు ముందుకు రాని డిస్ట్రిబ్యూటర్స్ ఆ తర్వాత వెంటపడ్డారు. మీడియా కూడా స్టీరియోటైపిక్ ఆలోచనలకో ప్రాధాన్యమిస్తూ.. భారతీరాజా సినిమాను విఫల ప్రయోగంగా కొట్టిపారేసింది. కానీ, పదహారేళ్ల వయస్సు 175 రోజులాడింది.

స్టూడియోలు, సెట్టింగ్స్ ఎందుకు.. తమిళ గ్రామీణ నేలే ఓ అద్భుతమైన సినీ ప్రపంచమని నమ్మినవాడు భారతీరాజా. ఎర్రనేలలు, అరటి తోటలు, కొబ్బరి చెట్లు, చౌరస్తాలు, పంటపొలాలు, పండుగలు, అంతర్లీనంగా కనిపించే కుల పోట్లాటలు.. ఇలా ఇవే భారతీరాజాకు కథలవుతాయనిపించింది. ఆ పంథాలోనే అడుగులేశాడు. తమిళ నేల మట్టివాసనవైపు సినీ ప్రేక్షకులనూ నడిపించాడు. అవే ఆ తర్వాత అనుభూతిచ్చిన క్లాసిక్స్ గా నిల్చి.. ఆయనకంటూ ప్రత్యేక అభిమానగణాన్ని తయారుచేశాయి.

సినిమాలు చేసింది పదుల సంఖ్యలోనే అయినా… ఒక్కో సినిమా ఒక్కో మాస్టర్ పీస్ గా మల్చారు. కేవలం తీసింది 30 సినిమాలే అయినా.. ఆరు జాతీయ చలనచిత్ర పురస్కారాలందుకున్నారు. తమిళనాడు రాష్ట్ర నుంచి రెండు పురస్కారాలు కూడా ఆయన్ను వరించాయి. 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీతోనూ గౌరవించింది.

1979లో విడుదలై తెలుగులో అందమైన అనుభవం పేరిట విడుదలైన నినైతలే ఇలక్కుం, మాటే మంత్రం పాట పిక్చరైజేషన్ లోనే వెర్సటాలిటీని చూపించిన సీతాకోకచిలుక పేరిట తెలుగులో అనువదించిన 1981లో విడుదలైన అలైగళ్ ఓయత్విల్లై, శివాజీ గణేషన్, సత్యరాజ్, రాధతో తీసి.. తెలుగులో ఆత్మబంధువు పేరిట విడుదలైన1985లో తీసిన ముత్తల్ మరియాదై, 1994లో ఏ. ఆర్. రెహమాన్ సంగీతంలో వనిత పేరిట రిలీజైన కరుత్తమ్మా వంటి చిత్రాలన్నీ గ్రామీణ నేపథ్యంలోని సినిమాలే. గ్రామీణ తమిళ భారతంలో ఉండే పరస్పర గౌరవాలు, బాధలు, సామాజిక వైరుధ్యాలను కళ్లకు కడుతూ జీవన వాస్తవికతను ముందుంచాయవి.

ఇక ఇళయరాజాతో భారతీరాజా కలయిక దేశంలోనే అత్యంత సృజనాత్మక భాగస్వామ్యాల్లో ఒకటి. పదహారేళ్ల వయస్సుతో ఆరంభమైన ఇద్దరు రాజుల ప్రయాణం.. తమిళ సినిమాకు కొత్త దృశ్యశ్రవణాన్నందించింది. కర్నాటక సంగీతం నుంచి జానపద గీతాలు, గ్రామీణ జీవన రీతుల నుంచి పొందిన స్ఫూర్తితో రూపొందించిన గీతాలు ఇప్పటికీ చెవుల రింగుమని మారుమ్రోగుతూనే ఉన్నాయి.

అందుకే చిత్ర పరిశ్రమ భారతీరాజాను తమిళంలో ఇయక్కునర్ ఇమయం అంటే దర్శక శిఖరంగా పిల్చుకుటుంది. ఆయన సాధించిన విజయాలతో మాత్రమే వచ్చిన గుర్తింపు కాదు.. ఒక సినిమాకు శాశ్వతత్వాన్నిచ్చిన ఆయన సృజనాత్మక ఆలోచనా సరళికి దక్కిన గౌరవం. గ్రామీణ కథా చిత్రాలను తమిళ సినిమాలో ఒక ప్రధాన ప్రక్రియగా ఎస్టాబ్లిష్ చేసిన ఘనతా భారతీరాజాదే.

భారతీరాజాను తమిళ ప్రేక్షకులు ఓ దర్శకుడిగా మాత్రమే చూడరు. చేతులు జోడించి అభివాదం చేస్తూ ప్రేక్షకులను ఉద్ధేశిస్తూ సినిమాకు ముందు ప్రియమైన తమిళ ప్రజలారా అంటూ ఆయన నోటి నుంచే వచ్చే ఆత్మీయమైన మాటలు ఆయన్ను వారి కుటుంబ సభ్యుడిగా మార్చాయి.

సినిమా దర్శకులు, నటీనటులంటే హంగు, ఆర్భాటాలతో ఆధిపత్యం కనిపించే పరిశ్రమలో.. భారతీరాజా అభివాదం ఆయన్ను దర్శకుడిగా జనంతో కనెక్ట్ చేసిన ప్రయోగమైంది. ఓ గ్రామీణుడు తనకు తెలిసిన నేల కథలను తన ప్రేక్షకులతో పంచుకున్నట్టుగా జనం ఫీలయ్యారు.

పచ్చని పొలాలు, గ్రామోత్సవాలు, పల్లె రుచులు, జీవన సౌందర్యం, ప్రకృతి రమణీయతను ఆయన కెమెరాతో తెరకెక్కించిన తీరు.. ఆ తర్వాత తరం ఎందరో దర్శకులపై స్పష్టంగా ప్రభావం చూపింది. స్టూడియో వెలుగు జిలుగులను కాదని.. బయట ప్రపంచమెంత ఉంది.. అందులోనూ గ్రామీణ సౌందర్యమెంత బాగుంటుందో తమిళ సినిమాకు రుచి చూపించి కొత్త నడకలు నేర్పాడు.

భారతీరాజా ఇక లేకపోవచ్చుగానీ… ఆయన వల్ల తమిళ సినిమా చూసే, వినే విధానం ప్రేక్షకులకు కొత్తదనాన్ని అలవాటు చేసి, మరింత కొత్త అనుభూతినిచ్చింది. తమిళ సినిమా శైలినే మార్చిన ఆయన వెర్సటైల్ స్టైల్.. తర్వాత దర్శకులకు స్ఫూర్తి అయింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles