ఏదైనా కల్తీ చేసేందుకు అవకాశమున్న రోజులివి. ఫేక్ తో అసలేదో, నకిలీ ఏదో కూడా గుర్తించకుండా బురిడీ కొట్టించే కాలమిది. మొత్తంగా నకిలీలల కలియుగమిది. ఇందులో ఆరితేరేందుకు ఇప్పుడు ప్రాంతాలకతీతంగా కసరత్తు జరుగుతుంటే.. బీహారీలు మరి కాస్త ఎక్కువే అని చెప్ప స్టోరీ ఇది.
ఆమధ్య డాగ్ బాబు పేరుతో జరిగిన ఓ నకిలీ నివాస ధృవీకరణ పత్రం జారీ గురించి తర్వాత చెప్పుకుందాంగానీ.. ముందు ఓ తాజా విషయం చూద్దాం.

బీహార్ లోని రోహ్తాస్ జిల్లాలో క్యాట్ కుమార్ పేరిట ఓ పిల్లి బొమ్మతో ఓ నివాస ధృవీకరణ పత్రం కోసం ఆన్లైన్ దరఖాస్తందింది. అదిప్పుడు సంచలనం రేపుతోంది. క్యాట్ కుమార్ తండ్రి పేరు క్యాట్ బాస్, తల్లి పేరు క్యాటియా దేవి. వావ్ ఇదేదో ఇంట్రస్టింగ్ గా, బాగుంది కదా..?
పిల్లి ఫోటో పెట్టి క్యాటీకుమార్ పేరుతో అప్లై చేయడమే కాకుండా.. తల్లిదండ్రుల పేర్లు కూడా క్యాట్ బాస్, క్యాటియాదేవిగా పేర్కొంటూ దరఖాస్తు చేయడమంటే ఇది ఎవరైనా ఆకతాయిల పనై ఉంటుందా, అసలేం జరిగుంటుందనే వివిధ కోణాల్లోనూ అధికారులు పరిశోధిస్తున్నారు.
with times now courtesy
ఇప్పటివరకూ ఇలాంటివాటికి చనిపోయినవారి పేరిట దరఖాస్తులు, పుట్టకుండానే మనుషులను సృష్టించి క్రియేట్ చేసే ప్రధానమైన పాన్, ఆధార్ వంటి కార్డులు, బతికుండగానే చనిపోయినట్టుగా రికార్డులు సృష్టించే కథలు చూసిన మనకు.. ఇదిగో ఇప్పుడు బీహార్ కేటుగాళ్లెవ్వరోగానీ.. ఇలా పెంపుడు జంతువుల పేరిట నివాస ధృవీకరణ పత్రాలకు, ఇళ్లు, జాగల రిజిస్ట్రేషన్లకూ ఉపయోగిస్తుండటం కొత్త చర్చకు తెరలేపుతోంది.
ఇక ఇదే బీహార్ లో గత నెల జూలై 29వ తేదీన డాగ్ బాబు పేరిట ఒక నివాస ధృవీకరణ పత్రాన్నే జారీచేయడం తీవ్ర కలకలం రేపింది. నెల కూడా తిరక్కుండానే అలాంటి ఓ దరఖాస్తే ఇప్పుడు పిల్లి పేరిట రావడం చర్చనీయాశమైంది.
పాట్నాలోని మసౌర్హి బ్లాకులో ఒక కుక్కకు నివాస ధృవీకరణ పత్రాన్ని అధికారికంగా జారీ చేశారు బీహారీ అధికారులు. ఆ షాకింగ్ విషయం సంచలనం రేపడంతో.. పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ వెంటనే అక్కడి నస్రిగండ్ రెవెన్యూ అధికారికి కౌశల్ పటేల్ ను విచారణకు ఆదేశించారు. అంతేకాదు, నస్రిగంజ్ పోలీస్ స్టేషన్ కుక్క పేరిట నివాస ధృవీకరణకు అప్లై చేసిన సదరు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాదు, నిర్లక్ష్యంగా కుక్కు పేరిట వచ్చిన దరఖాస్తును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకుండా.. పైగా, అలాగే ఆ కుక్కకు నివాస ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడం వివాదాస్పదంగా మారడంతో బాధ్యులైన అధికారులను సస్పెండ్ కూడా చేశారు.
అయితే తాజాగా నివాస ధృవీకరణ పత్రం కోసం క్యాట్ కుమార్ పేరిట దరఖాస్తు చేసిన పత్రంలో తల్లిదండ్రుల పేర్లను క్యాట్ బాస్, క్యాటియాదేవిగా పేర్కొంటే.. గతంలో కుక్క పేరిట ఏకంగా జారీ కూడా అయిన నివాస ధృవీకరణ పత్రం కోసం డాగ్ బాబు పేరిట అప్లై చేయగా.. తల్లిదండ్రుల పేర్లను కుత్తా బాబు, కుత్తియాదేవిగా నమోదు చేశారు.
బీహార్ లో ఓటర్ల జాబితా సవరణ కోసం జరుగుతున్న తంతులో ఈ రెండు వ్యవహారాలు నెల గ్యాపులో బయటపడటంతో మన వ్యవస్థలో లోపాలెలా ఉన్నాయి.. అధికార యంత్రాంగాలు ఎంత అపహాస్యంగా పనిచేస్తున్నాయో కళ్లకుగట్టి ఆందోళన రేకెత్తిస్తోంది.
తాజాగా పిల్లి పేరిట నమోదైన నివాస ధృవీకరణ పత్రమైనా.. గతంలో కుక్క పేరిట జారీ చేసిన నివాస ధృవీకరణైనా.. రెండూ కూడా బీహార్ రైట్ టూ పబ్లిక్ సర్వీస్ యాక్ట్ విభాగంలో డిజిటల్ గా ఆన్లైన్ లో సమర్పించినవి. అయితే, అధికారులు ఆ మాత్రం మోసాలను పసిగట్టే జాగ్రత్తే వహించకపోవడం వారి పనితీరుపై విమర్శలకు తావిస్తోంది.
నెల క్రితం ఏదైతే సంచలనం రేపిందో డాగ్ బాబు నివాస ధృవీకరణ కోసం.. ఢిల్లీకి చెందిన ఓ మహిళ పేరిట ఉన్న ఆధార్ కార్డును సమర్పించారు. దరఖాస్తుదారుగా ఓ వీధికుక్కను చట్టబద్ధమైన నివాసిగా పేర్కొనడం బీహార్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. దాంతో శరవేగంగా కదిలిన అధికారిక యంత్రాంగం వెనువెంటనే డాగ్ బాబు పేరిట ఉన్న నివాస ధృవీకరణ పత్రాన్ని రద్దు చేసింది. అంతేకాదు, ఆ సర్టిఫికెట్ జారీ చేసిన రెవెన్యూ అధికారిపైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆపరేటను ఉద్యోగం పోయింది. రెవెన్యూ అధికారిని ఏకంగా సస్పెండ్ కూడా చేసేశారు.
ఈరోజు పిల్లి.. నిన్న కుక్క… రేపేంటి…? ఇదిగో ప్రజాసేవల పంపిణీ విభాగంలో అధికారుల తీరుపై ఇప్పుడెన్నో ప్రశ్నలకు బీహార్ ఓ కేరాఫ్. చట్టాల్లోని లొసుగులు, అధికారుల తీరుపై సోషల్ మీడియాలోనూ నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. ఒక వీధి కుక్కను కూడా చట్టపరంగా నివాసిని చేశారంటూ అధికారయంత్రాంగం తీరును ఎగతాళి చేసేస్తున్నారు.



