పిల్లల కలలకు తల్లి భరోసా!
పేదరికం పరుగు పెట్టించింది. సంకల్పం వయసును ఓడించింది. ఆత్మవిశ్వాసం పరుగు పందాన్ని గెలిపించింది. ఇది పిల్లల చదువు కోసం ఓ తల్లి గెల్చిన పరుగు పందెం. ఇందుకు మహారాష్ట్ర వేదికైంది.
మరఠ్వాడా బీడ్ జిల్లాకు చెందిన రమాబాయి రణ్ వీర్ అనే మహిళ.. కూతుళ్ల చదువు కోసం తన 47 ఏళ్ల వయస్సులో పరుగు పందెంలో పాల్గొని గెల్చిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాతో చప్పట్లు కొట్టిస్తోంది. రమాబాయి ఓ వంట మనిషి. భర్త చనిపోతే.. తానే, అమ్మా, నాన్న అయి పిల్లల్ని పెంచుతోంది. రోజూవారీ కూలీ డబ్బులతో కుటుంబాన్ని భారంగా లాక్కొస్తున్న మహిళ. కానీ, పిల్లల చదువులకు ఫీజులు కట్టాలంటే డబ్బులు కావాలి. ఆ ఆశతో కేవలం 3 వేల రూపాయల నగదు బహుమతి కోసం పరుగు పందెంలోకి దిగింది.
ఓవైపు స్పోర్ట్స్ షూస్… ఇంకోవైపు, ట్రాక్ సూట్స్… పరుగు పందెంలో అప్పటికే అనుభవమున్న యువతీ, యువకులు.. అలాంటి వారందరి మధ్య రమాబాయి రణ్ వీర్ చీరపైనే, చెప్పులు చేతిలో పట్టుకుని కుర్రకారును కూడా వెనక్కి నెట్టింది. ఈ పరుగు పందెంలో గెల్చిన ఘటన ఆమె పట్టుదలనూ, సంకల్పాన్నీ.. అదే సమయంలో, మన దేశంలో పేదరికాన్ని జయించేందుకు ఇలాంటివారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఇలా భిన్న పార్శ్వాలనూ ఒకేసారి ప్రపంచం ముందుంచింది.

3 వేల రూపాయలు చాలామందికి పెద్ద మొత్తం కాకపోవచ్చుగానీ.. రమాబాయికి మాత్రం తన కూతుళ్ల భవిష్యత్తుకు ఓ భరోసా.
బీడ్ జిల్లా అంబాజోగాయిలో అమృత్ దౌడ్ పేరుతో నిర్వహించిన.. సుమారు 3 కిలోమీటర్ల పరుగు పోటీలో పాల్గొని ప్రైజ్ గెల్చుకున్న రమాబాయి కథ పేద జీవితాల్లో నెలకొన్ని పార్శ్వాన్ని కళ్లకు కట్టేది.
పిల్లల ఆకలి తీర్చేందుకు వృత్తి రీత్యా వంట చేసే పనిమనిషి రమాబాయి. కానీ, ఇప్పుడు ఏకంగా పిల్లలు చదువుకోవాలనుకుంటున్న వారి ఆశలు అడియాశలవ్వకుండా ఓ పరుగు పందెంలో పాల్గొన్న అథ్లెట్. కూతుళ్ల చదువు కోసం ఫీజ్ ఎలా కట్టేదని ఆలోచిస్తున్న సమయంలో ఈ పరుగు పందెం రమాబాయి చెవిన పడింది. పాల్గొని గెలిస్తే తన పిల్లల చదువుల ఖర్చుకయ్యేంత డబ్బైతే చేతికొస్తుంది. అందరికీ ఇది క్రీడా పోటీ. కానీ, రమాబాయికి పిల్లల చదువు కోసం కళ్ల ముందున్న ఓ అవకాశం. అందుకే పరుగెత్తడం మొదలెట్టింది. చెప్పులు జారుతున్నా పరుగు మాత్రం ఆపలేదు. వాటిని విడిచి పట్టుకుని మళ్లీ పరుగెత్తింది. ఆమె కాళ్ల కింద ట్రాక్ ఉంటే… ఆమె కళ్లల్లో మాత్రం తన పిల్లల భవిష్యత్తు కనిపించింది. అందుకే ఎందరో యువతీ, యువకులు పాల్గొన్న ఈ పరుగు పందెంలో ఆమె పట్టుదల వారందరినీ వెనుకేసి గెల్చి నిల్చేలా చేసింది.
రమాబాయి పరుగు 3 వేల కోసం కాదు!
47 ఏళ్ల రమాబాయి పరుగు పందెం సోషల్ మీడియాలో ఓ పెద్ద చర్చగా మారింది. ఆమె విజయంలో ఆమెకు తోడ్పడింది ఆమె ఫిట్నెస్ కాదు.. ఓ తల్లి పట్టుదల. పేదరికాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడే మనస్తత్వం. వయస్సొక సంఖ్య మాత్రమేనని నిరూపించే ఆత్మవిశ్వాసం. ఇక చాలు అనుకుని అప్పుడప్పుడే అలసటకు గురయ్యే వయస్సులో రమాబాయి పరుగు మొదలెట్టింది. గెలుపు కోసం ఆమె చేరుకునే ఫినిషింగ్ లైన్.. తన కూతుళ్ల చదువుకు మరో ఆరంభం.
3 వేల రూపాయల బహుమతితో రమాబాయి జీవన స్థితిగతులేమీ మారిపోవు. కానీ, పిల్లలపై తల్లి ప్రేమను చూపించిన పరుగు పందెమిది. వారికోసం ఎంతదూరమైనా వెళ్తాననే అమ్మ హృదయమది. అందుకే, రమాబాయి గెలిచింది కేవలం రన్నింగ్ రేస్ కాదు… వయసుపై, పేదరికంపై, పరిస్థితులపై గెల్చింది. కూతుళ్ల కోసం కన్న కలను. అన్నింటికంటే ముఖ్యంగా తన కూతుళ్ల ఓటమిని ఒప్పుకోని గెలుపు ఆమెది.
రమాబాయి జీవితంలో పరుగు కొత్త కాదు!
భర్త మరణించిన తర్వాత ఇద్దరు కుమార్తెల బాధ్యత రమాబాయి భుజాలపైనే పడింది. కుటుంబాన్ని పోషించేందుకు వంట పని చేస్తోంది. అంబాజోగాయిలోని ఒక అకాడమీలో కుక్‌గా పనిచేస్తూ కూతుళ్లను చదివిస్తోంది. రోజూ జీవితం కోసం పరుగెత్తే ఆమె.. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జస్ట్ రన్నింగ్ ట్రాక్ ఎక్కింది అంతే. పేదరికం ఊహించని సవాళ్లను ముందుంచొచ్చుగానీ… పిల్లలపై తల్లికున్న అవ్యాజమైన ప్రేమను, వారి కోసం తల్లి పెట్టే పరుగును మాత్రం ఆపలేదన్నదీ రమాబాయి కథ నిరూపించింది.
ఈ రేస్‌కు ముందు రమాబాయి ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. ఆమె ఓ అథ్లెట్ కూడా కాదు. ట్రాకుపై ఎప్పుడూ పరుగు పెట్టిన దాఖలాలూ లేవు. కోచ్ లేడు. డైట్ ప్లాన్ లేదు. ఫిట్నెస్ ట్రైనర్ లేడు. కానీ, జీవితంలో పెయిన్ అవన్నీ నేర్పించింది. రోజూవారీ కష్టపడి పనిచేసే తత్వం ఆమెకు ఆ స్టామినానిచ్చింది. బాధ్యత బలాన్నిచ్చింది. కూతుళ్ల భవిష్యత్తు ఆమెకు వేగాన్నిచ్చింది. అందుకే, జీవితం నేర్పిన క్రమశిక్షణతో తన పిల్లల్ని గెలిపించాలన్న తపనతో.. ఓ తల్లి గెల్చింది. తాను గెల్చి చూపించి కూడా తన పిల్లలకు ఓ రోల్ మాడలైంది.
ఒకటే జననం… ఒకటే మరణం… ఒకటే గమనం…ఒకటే గమ్యం… గెలుపు పొందేవరకు అలపు లేదు మనకు.. బతుకు అంటే గెలుపు.. గెలుపు కొరకే బతుకు అని మన తెలుగు సినీ కవి ఒకరు రాసిన ఆ పాటలోని మాటలను అక్షరసత్యాలు చేసిన మహిళ రమాబాయి రణ్ వీర్.



