మిగ్-21 నుంచి ప్యాసింజర్ విమానం వరకు… అభినందన్ కొత్త ప్రయాణం వెనుక అసలు కథ!
భారతదేశం హీరోగా కొల్చిన అభినందన్ వర్తమాన్… ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను ఎందుకు వదిలారు..? ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో పైలట్ గా ఎందుకు జాయిన్ అయ్యారు..? ఈ సంచలన నిర్ణయం వెనుక కథేంటి..?
అది 2019, ఫిబ్రవరి 27వ తారీఖు. భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయిలో నడుస్తున్నాయి. పుల్వామాలో అప్పుడే ఉగ్రదాడి జరిగింది. భారత్ ప్రతీకారంగా బాలాకోట్ పై వైమానిక దాడులు చేసింది. మరుసటి రోజే గగనతలంలో జరిగిన ఆ వైమానిక పోరాటం ఏకంగా యావత్ ప్రపంచం దృష్టినే ఆకర్షించింది. ఆకాశంలో అత్యంత వేగంగా జరిగిన ఆ పోరులో ఒక భారతీయ పైలట్ పేరు దేశమంతా మార్మోగిపోయింది. ఆయనే అభినందన్ వర్తమాన్.
మిగ్ 21 బైసన్ లో ప్రయాణిస్తూ శత్రు విమానాన్ని ఎదుర్కొన్న ఫైటర్ పైలట్ ఈ అభినందన్ వర్తమాన్. తన విమానం కూలిపోయి పాకిస్థాన్ భూభాగంలో పడిపోవడంతో ఒక్కసారిగా అభినందన్ వర్తమాన్ పేరు వార్తల్లోకెక్కింది. పైగా మూడురోజుల పాట పాక్ చెరలో ఉండి తిరిగి స్వదేశానికి చేరుకోవడంతో అభినందన్ ను యావత్తు దేశం ఓ యోధుడిలా కొల్చింది.

అలాంటి వ్యక్తి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. 22 ఏళ్ల తన భారత వైమానిక దళ సేవకు ముగింపు పలికి.. ప్రైవేట్ కమర్షియల్ ఎయిర్ లైన్స్ లో పైలట్ గా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకోవడమే అభినందన్ వర్తమాన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం. ఫైటర్ జెట్ నుంచి ప్యాసింజర్ విమానం వరకు సాగిన అభినందన్ ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణమైంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఇంకా కెరీర్ మిగిలి ఉండగానే అభినందన్ ఎందుకు బయటకొచ్చాడు…? ప్రమోషన్స్ తో మున్ముందుకు వెళ్లాల్సిన వ్యక్తి కొత్త కెరీర్ ఎందుకు ఎంచుకున్నాడు..? ఈ నిర్ణయం వెనుక ఏదైనా వివాదముందా…? లేక, వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా..? లేక, కెరీర్ పరంగా ఏర్పడ్డ సమస్యలు, సవాళ్లా…? ఇలా పలు ప్రశ్నలతో కూడిన చర్చలకు తన నిర్ణయంతో తెరలేపారు అభినందన్ వర్తమాన్.
అసలు అభినందర్ ఎవరు..?
భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్. బాలాకోట్ దాడుల్లో భాగంగా పాక్ వైమానిక దళం భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే సమయంలో అభినందన్ మిగ్ 21 బైసన్ ఇంటర్సెప్షన్ మిషన్ లో పాల్గొన్నాడు. ఆ వైమానిక పోరూలో పాక్ ఎఫ్ – 16 ఫైటర్ జెట్ ను కూల్చేసిన ఫైటర్ పైలట్ ఈ అభినందన్. ఆ తర్వాత మిగ్ 21 కూడా దెబ్బతినడంతో.. ఆ జెట్ నుంచీ ఎజెక్ట్ కావల్సి వచ్చింది. కానీ, అభినందన్ వర్తమాన్ దిగిన ప్రాంతం పాక్ భూభాగంలో ఉండటంతో.. పాక్ అధికారులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 60 గంటలపాటు తాను పాక్ చెరలో ఉన్నాడు. ఆ తర్వాత అతణ్ని ఇండియాకు అప్పగించారు. తన ధైర్య సాహసాలకు మెచ్చిన భారత ప్రభుత్వం అభినందన్ ను వీర్ చక్ర పురస్కారంతో సత్కరించింది.
దేశంలో ఉత్కంఠ రేపిన మూడురోజులు!
అభినందన్ పాక్ అధికారుల వద్ద బందీగా ఉన్నప్పుడు భారత్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీవీ ఛానల్స్, పత్రికలు, సోషల్ మీడియాతో పాటు.. ఏ నల్గురు కలిసినా మాట్లాడుకునే ఒక హాట్ టాపిక్ అయ్యాడు అభినందన్. ఆయన విడుదల సమయంలో వాఘా బార్డర్ వద్ద కనిపించిన భావోద్వేగ దృశ్యాలు ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటాయి. ఆ తర్వాత అభినందన్ గ్రూప్ కెప్టెన్ స్థాయికెదిగాడు. కానీ, బాలాకోట్ ఘటనకు ఏడేళ్ల తర్వాత ఆయన 2026 మార్చ్ లో ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ తీసుకున్నారు.
22 ఏళ్ల తర్వాత తన నిర్ణయంతో ఆశ్చర్యపర్చిన అభినందన్!
అభినందన్ వర్తమాన్ ఐఏఎఫ్ లో 22 ఏళ్లపాటు పనిచేశారు. 2026, మార్చ్ 31న ఆయన ఐఏఎఫ్ కు పదవీ విరమణ చేశారు. తర్వాత గోవాకు చెందిన ప్రాంతీయ విమానయాన సంస్థ FLY91లో కమర్షియల్ పైలట్ గా చేరారు.
మరి వర్తమాన్ ముందస్తు రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించినట్టు..? ప్రైవేట్ ఎయిర్ లైన్స్ వైపు అడుగులెందుకు వేసినట్టు..??
అభినందన్ స్వయంగా ఎక్కడా తన ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ కు ఫలానా కారణమని బహిరంగంగా వెల్లడించలేదు. ఫ్లై 91 కూడా ఎక్కడా తన ఉద్యోగి వివరాలపై వ్యాఖ్యానించలేదు.
అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఐఏఎఫ్ లో విభేదాలే కారణమా…? 2019 ఘటన తర్వాత ఇంకేమైనా జరిగిందా..? అంతర్గత సమస్యలేమైనా చుట్టుముట్టాయా..? ఎవరైనా ఒత్తిడి తేవడం వంటివేమైనా జరిగాయా..? ఇదిగో ఇలాంటి ప్రశ్నలతో కూడిన చర్చ తీవ్రంగా జరిగింది. ఇవన్నీ జస్ట్ ఊహాగానాలు, ఉత్తుత్తి ప్రచారాలే కావచ్చు.. లేదా, అంతకన్నా కూడా ఇంకేమైనా జరిగుండొచ్చు. దేశమంతా తెలుసుకోవాలనుకుంటోంది. కానీ, కారణం చెప్పగల్గే వ్యక్తుల మౌనం సమాధానం లేని ప్రశ్నలనే ముందుంచుతోంది. అందుకు వివిధ కారణాలుండొచ్చు.
ఏదైనా సాధారణ కారణం ఉండొచ్చా..?
సైనిక వ్యవస్థలో పైకెదుగుతున్నకొద్దీ.. పైలట్స్ పని స్వభావం మారిపోతుంటుంది. యువ ఫైటర్ పైలట్ గా ఉన్నప్పుడు నిర్వర్తించే బాధ్యతలకూ.. సీనియర్ ర్యాంకులకు చేరుకున్న తర్వాత ఆచరించాల్సిన బాధ్యతలకు మధ్య తీవ్ర వ్యత్యాసముంటుంది. ఫ్లైయింగ్ డ్యూటీస్ తగ్గిపోయి.. అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు పెరగడంతో అనుభవజ్ఞులైన కొందరు పైలట్స్ కెరీర్ ను అలాగే కొనసాగించేందుకు సివిల్ ఏవియేషన్ వైపు మళ్లేందుకు అవకాశాల్లేకపోలేదనే వాదనా ఉంది. అయితే, ఇదే అభినందన్ వ్యక్తిగత కారణంగా ఎవ్వరూ ధృవీకరించలేదు. ఇది మిలటరీ పైలట్స్ నుంచి కమర్షియల్ ఏవియేషన్ కు మారే సాధారణ కెరీర్ ధోరణిని వివరించే ఓ విశ్లేషణ మాత్రమే.
యూనిఫామ్ వదిలాడు.. కానీ, ఆకాశాన్నైతే వదల్లేదు!
మిగ్ 21 నుంచి ఏటీఆర్ 72 వరకు.. ఎంత మార్పు..?
అభినందన్ మిగ్ 21 నడపడమంటే… సింగిల్ సీట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అది. అత్యంత వేగవంతమైన ఆపరేషన్స్ దాని సొంతం. శత్రువును తుదముట్టించడం, సెకన్లలో తీసుకునే నిర్ణయాల నుంచి… ఏకంగా ఏటీఆర్ 72 అంటే ప్యాసింజర్ విమానం… ప్రయాణీకుల బాధ్యత, షెడ్యూల్డ్ ఆపరేషన్స్, క్రూ కో ఆర్డినేషన్, సివిల్ ఏవియేషన్ ప్రోటోకాల్స్ పాటించడం, కమర్షియల్ రూట్ ఆపరేషన్స్ కు మారడమంటే ఇదో పెద్ద మార్పు.
ఇక మిలటరీ పైలట్ కు కమర్షియల్ ఏవియేషన్ లోకి రావడానికి డీజీసీఏ నిబంధనల ప్రకారం మిలిటరీ ఫ్లైయింగ్ అనుభవాన్ని సివిల్ ఏవియేషన్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకునే ప్రక్రియకు అవకాశముంటుంది. రికార్డుల పరిశీలన, కావల్సిన పరీక్షలు పాస్ అవ్వడం, ఆరోగ్యపరంగా కావల్సిన అర్హతలు, అవసరమైన ట్రైనింగ్ వంటి దశలుంటాయి.
మరి అభినందన్ ఫ్లై 91నే ఎందుకు ఎంచుకున్నాడు..?
దేశంలో ఉన్న అతి పెద్ద ఎయిర్ లైన్స్ ను కాదని.. అభినందన్ ఫ్లై 91ను ఎందుకు ఎంచుకున్నారు..? 2024లో కార్యకలాపాలు ఆరంభించిన ఫ్లై 91 చిన్న, మధ్యస్థ నగరాల మధ్య రీజనల్ కనెక్టివిటీపై దృష్టి సారించిన సంస్థ. గోవా కేంద్రంగా దీని కార్యకలాపాలు నిర్వహిస్తూ.. హైదరాబాద్ తో సహా పలు నగరాలకు దీని రాకపోకలు సాగిస్తోంది. యాదృచ్ఛికంగా అభినందన్ విధుల్లో చేరిన రోజే.. ఫ్లై 91 భవిష్యత్తును విస్తరిస్తున్న మరో పెద్ద వార్త కూడా ఆకట్టుకుంది. 600 ఏటీఆర్ 72 విమానాలను ఆర్డర్ ఇచ్చినట్టు రాయిటర్స్ వంటి వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అలా వేగంగా విస్తరించాలని చూస్తోన్న ఓ కొత్తతరం రీజనల్ ఏవియేషన్ సంస్థలో అభినందన్ చేరడం విశేషం.
అయితే డబ్బు కోసమే అభినందన్ ఐఏఎఫ్ వదిలేసి.. ఈ ప్రైవేట్ ఫ్లై 91 బాట పట్టాడా అనే చర్చా సోషల్ మీడియాలో కనిపించింది. అలాగని కచ్చితంగా ఎవ్వరూ ధృవీకరించలేరు. కానీ, మిలటరీ పైలట్స్ తమ రెండో కెరీర్ గా రిటైర్మెంట్ తర్వాత ఇలా సివిల్ ఏవియేషన్ వైపు అడుగులేసిన దాఖలాలూ గతంలోనూ ఉన్నాయి.
అభినందన్ నిర్ణయం వెనుక కారణం బయటకు రాకపోవడమే ప్రస్తుతం అసలు మిస్టరీ. అయితే, అభినందన్ యూనిఫామ్ మార్చుకున్నారు. బాధ్యతలు మార్చుకున్నారు. విమానం మార్చుకున్నారు. కానీ, ఆకాశంలో ఎగరడం మాత్రం మానుకోలేదు. కానీ, అభినందన్ వంటి దేశమంతా కొల్చిన వీరుడు ఎందుకు ఐఏఎఫ్ ను వదిలి వెళ్లాడన్న ప్రశ్న మాత్రం సరైన సమాధానం లభించేవరకూ చర్చకొస్తూనే ఉంటుంది.



