“మనోనేత్రంతో సమాజాన్ని ఆవిష్కరించిన అక్షరఫిరంగి.. అలిశెట్టి”
మరణం నా చివరి చరణం కాదు.. మౌనం నా చితాభస్మం కాదు… నిర్విరామంగా, నిత్యనూతనగా కాలం అంచున చిగురించే నెత్తుటి ఊహను నేను అంటాడు అలిశెట్టి. ఎందరో ప్రజాకవులున్నా… కొందరు ఎప్పటికీ చిరస్మరణీయులుగా మిగిలిపోతుంటారు. దేశవిదేశాల్లో ఇచ్చే గొప్ప అవార్డులనందుకోకపోయినా… సుకవి మరణించెనొక తార గగనమెక్కెనని జాషువా అన్నట్టు ప్రజల గుండెల్లో అలా ఒదిగిపోయిన కవి అలిశెట్టి. తన కళ్లకు జోడుగా… తన కెమెరా కన్నును జోడించి… అంతకుమించి మనోనేత్రపు మహారచన చేసిన ప్రజాకవి అలిశెట్టి. అందుకే అలాంటి అక్షరఫిరంగి ముచ్చట కచ్చితంగా ప్రాంతాలకతీతంగా తెలుగువాళ్లందరూ ముచ్చటించుకోవాల్సిన రోజిది.

అల్బర్ట్ పింటోకో గుస్సా క్యో ఆతా హై అనే సినిమాలో నసీరుద్దీన్ షా తన ప్రియురాలు షబానాతో కలిసి సినిమాకెళ్తాడు. ఆ సినిమాకు ముందు వేసే న్యూస్ రీల్ చూశాక అదంతా అబద్ధమనిపిస్తుంది. వెనువెంటనే లేచి నసీరుద్దీన్ షా ఏ సబ్ ఝూట్ హై అని సీటులోంచి లేచి అరుస్తాడు. అదిగో అబద్ధాలను క్షమించలేని… జీర్ణించుకోలేని.. నిజాలుగా చలామణి అవుతుంటే సహించలేని ఆ అరుపులే అలిశెట్టి కవితలు. ఒక ఛాయాచిత్రం వంద పదాలకు… ఓ వీడియో చిత్రాన్ని వెయ్యిపదాలకు సరిసమానంగా పోలుస్తుంటారు… కానీ అతి తక్కువ పదాల్లోనే లక్షల గుండెల బరువును సామాజిక ఇతివృత్తాలుగా మల్చాడు అలిశెట్టి.
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అలిశెట్టి ప్రభాకర్ ది ఓ ఉమ్మడి కుటుంబం. తండ్రి ఆకస్మికంగా కాలం చేయడంతో కేవలం 11 ఏళ్ల వయస్సులోనే ఓ చిత్రకారుడిగా, ఫోటోగ్రాఫర్ గా కుటుంబ బాధ్యతలు మోసిన అలిశెట్టిలో… ఆ బతుకుచిత్రంలోంచి అంతకుమించిన అక్షరసూరీడుదయించాడు. అలిశెట్టి ఆదర్శాలు కేవలం తన చిత్రాలకో, ఛాయాచిత్రాలకో మాత్రమే పరిమితం కాలేదు. తన జీవితంతో పెనవేసుకున్నాయి. తనాచరించి, ఆ ఆదర్శాలను వల్లించాడన్నది ఆయన ఓ పేదరాలైన భాగ్యంను పెళ్లి చేసుకుని లోకానికి చాటిచెప్పాడు.
జీవిక కోసమే తప్ప… ఏనాడూ సంపాదన కోసం ఆరాటపడని కవి, కళాకారుడు అలిశెట్టి. ఆరేళ్లపాటు ఆంధ్రజ్యోతిలో సిటీలైఫ్ పేరిట ఆయన రాసిన సీరియల్ కవితలు భాగ్య నగరంపై ఆయన పర్సెప్షన్ ను చూపేవి. పాఠకుల్లో ఆలోచనా దృక్పథాన్ని, చైతన్యాన్ని పెంపొందింపజేసేలా అత్యంత ప్రభావశీలమైన కవిత్వం అలిశెట్టి సొంతం కాబ్టటే ఇప్పటికీ ఆయన గురించి మనమిలా ముచ్చటించుకుంటున్నాం. క్షయ బారిన పడి 1993 జనవరి 12న మరణించారు అలిశెట్టి. జననం, మరణం రెండింటినీ యాదృచ్ఛికంగా ఒకే రోజు చేసుకుని… పుడితే ఉబ్బితబ్బిబ్బై పోవాల్సిందీ లేదు.. పోతే బాధ పడుతూ కూర్చోవాల్సిన అవసరమూ లేదు.. ఆ మధ్య డ్రామాలో మన పాత్ర ఎలా పోషించామన్నదే ముఖ్యమన్నది అలిశెట్టి జీవితం ఇచ్చే సందేశం. అందుకే అలిశెట్టి భౌతికంగా లేకపోయినా.. తన కవితలతో చిరంజీవి అయ్యాడు. ఆ అక్షర సూరీడి కవితల ప్రభావశీలత చెదపట్టిన సమాజాన్ని ఎప్పటికప్పుడు ముళ్లకట్టె పట్టి పొడిచే ఓ అంకుశమే!
తాను శవమై… ఒకరికి వశమై… తనువు పుండై… ఒకడికి పండై.. ఎప్పుడూ ఎడారై… ఎందరికో ఒయాసిస్సై అన్న అలిశెట్టి కవితా రచన ఎన్ని లక్షల భాధలకో ఓ ప్రతీక.
ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట… ఇంకెవర్నీ వంచించనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించందట… తోటి జంతువుల్ని సహరించినందుకు. ఈ కట్టుకథ విని గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయంటాడు సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతూ!
నగరాల్లో అత్యద్భుతంగా అస్థిపంజరాల్ని చెక్కే ఉలిగా ‘ఆకలిని’ పోలుస్తూ రాసిన కవితైనా… శిల్పం చెక్కకముందు బండ, శిక్షణ పొందకముందు మొండి, ప్రతిభ వెనకాల ఎంతో ప్రయాస! సో, కాలానికి వదలకు భరోసా అని రాసిన కవితైనా సమకాలీన సమాజ ఇతివృత్తాలే ఆయన కవితా క్యాన్వాస్. కటువుగా, కటిక చేదుగా, వెగటుగా, పదునుగా, ముక్కుసూటిగా.. ఒక్కమాటలో చెప్పాలంటే ఆధ్యాత్మికతలోనూ ఈ సరళిననుసరించిన ఓ శేషప్ప కవిలా… విప్లవకవిత్వంతో ఉర్రూతలూగించిన ఓ శ్రీశ్రీలా.. సమకాలీనంగా రాసిన కవుల్లో భూతద్దం పెట్టి వెతికితే కనిపించేవారిలో కాళోజీ తరహాలో అలిశెట్టిదీ ముమ్మాటికీ ఓ ప్రత్యేక శైలి!
సినిమాలు, యూనివర్సిటీలు, కోర్టులు, చట్టసభలు, సామ్రాజ్యవాదులు, దేశాన్ని తాకట్టుపెట్టే నాయకులు, దేవుళ్లు, పెత్తందార్లు, మతోన్మాదులు, పోలీసులు.. ఎవ్వరినీ వదలని నిప్పులు మింగిన అక్షరాస్త్రాలు అలిశెట్టి కవితలు. తెలంగాణా ఎక్కుపెట్టిన రెడ్ రెవల్యూషనరీ సిరా ప్రభాకర్!
జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తి అలిశెట్టి కవితల్లో అణువణువూ కనిపిస్తుంటుంది. ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన కవితల్లో ప్రతిబింబిస్తాయి. పేదల పక్షపాతిగా సమాజాన్ని ప్రశ్నిస్తుంటాయి. ఆయన దృష్టిలో ఆయన ఓ సిద్ధాంతీ కాదు… మేధావి అంతకన్నా కాదు. అందుకే తన పాఠకలోకానికెప్పుడూ ఆయన సందేశాలివ్వలేదూ… ఉపదేశాలంతకన్నా ఇవ్వలేదు. హితోక్తులంతకన్నా చెప్పలేదు. విప్లవ కవిత్వం… విప్లవ సహానుభూతివంటివి ఎక్కడైతే ఓడాయో… అక్కడే గెల్చాడు అలిశెట్టి. అందుకే అలిశెట్టి ఉన్నా, వెళ్లిపోయినా… ఆచంద్రార్కం ఆయనెప్పుడూ తెలంగాణా ప్రజల గుండెచప్పుడే!


