చర్చ తక్కువ.. డ్రామా ఎక్కువ! ప్రజా సమస్యలకు టైం ఎక్కడ..?
అసెంబ్లీనా….? డ్రామా వేదికనా..?
సోషల్ మీడియా యుగంలో మారుతున్న అసెంబ్లీ రాజకీయాల స్వరూపం!
ప్రజా సమస్యలు పక్కదారి పట్టి.. పొలిటికల్ మైలేజీ స్క్రిప్ట్స్ పెరిగిపోతున్నాయా..? బాధ్యత కల్గిన ప్రజాప్రతినిధుల వ్యవహారం చూస్తుంటే.. రెండురోజులుగా వినిపిస్తున్న చర్చ ఇది!
సమస్యలు తక్కువ… సన్నివేశాలెక్కువ! అసలు తెలంగాణా శాసనసభ దారెటు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రజా సమస్యలపై చర్చించడానికి ఏర్పాటైన శాసనసభ.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు శక్తివంతమైన రాజకీయ వేదికగా మారుతోందా..?
ఎవ్వరినీ మాట్లాడనివ్వకుండా ప్రశ్నా తమదే, సమాధానమూ తమదేనన్నట్టు.. కొంతమంది నేషనల్ న్యూస్ ఛానల్స్ ప్రెజంటర్స్ ఏవిధంగా విసుగు పుట్టిస్తారో.. అదే పోకడ ఇప్పుడు తెలంగాణా శాసనసభలో కనిపిస్తుండటం విషాదం. ఒకరు మాట్లాడితే ఇంకొకరు అడ్డుకోవడం. ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కంటే ఎదురు ప్రశ్నలను సంధించడం, పాత వీడియోలు ప్రదర్శించడం, సభ తమకు అనుకూలంగా లేకుంటే వాకౌట్, నినాదాలు చేయడం, పరస్పర వ్యక్తిగత, రాజకీయ ఆరోపణలతో సభను పక్కదారి పట్టించడం ఒక ఆనవాయితీగా మారి సభా సమయం వృథా అవుతున్న దృశ్యాలు ఇప్పుడు సమాజంలో చర్చకు పెడుతున్నాయి.
అసలు అది ప్రజా సమస్యలపై చర్చించేందుకు వేదిక కావాల్సిన శాసనసభనా… లేక, రాజకీయ పార్టీల మధ్య జరిగే డ్రామాకు ఓ వేదికా…? ఈ ప్రశ్నే ఇప్పుడు ప్రధాన చర్చ!
సభ బయట ఏ విధమైన రాజకీయాలు, నినాదాలు, పరస్పర ధూషణలు, పోలీసులు, నేతల మధ్య నెలకొనే వివాదాలెలాగైతే కనిపిస్తున్నాయో.. అదే సీన్ శాసనసభలోనూ కనిపించడం విషాదం. ప్రతీ మాట వెనుక ఒక రాజకీయ వ్యూహం, ప్రతీ గొడవ వెనుక ఓ కెమెరా, ప్రతీ వాకౌట్ నూ సోషల్ మీడియాకెక్కించే ఓ యాక్షన్ ప్లాన్ ఇవన్నీ రాజకీయ పార్టీలు తమ రాజకీయ పబ్బం కోసం పక్కా ప్రణాళిక రచించుకుని అసెంబ్లీని వేదిక చేయడం.. హుందాగా నడపాల్సిన సభా సంప్రదాయాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నట్టే.

అసలు అసెంబ్లీలో చర్చ జరుగుతోందా…? రాజకీయ బల ప్రదర్శన జరుగుతోందా..?
శాసనసభ అంటే ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వేదిక. ప్రభుత్వ విధానాలను సమర్థించే, వ్యతిరేకించే అవకాశమున్న ఓ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. కానీ, ఇటీవలి కాలంలో బాగా పరిశీలిస్తే అసెంబ్లీలో చర్చల స్వభావమే మారిపోతోంది. సమస్యపై వాదనల కంటే కూడా ప్రత్యర్థులపై విమర్శలే కనిపిస్తున్నాయి. విధానాలపై ప్రశ్నల కంటే కూడా వ్యక్తిగతమైన ధూషణలే వినిపిస్తున్నాయి. సమాధానాలు రావాల్సిన చోట కౌంటర్ అటాక్స్ జరుగుతున్నాయి.
అధికార పార్టీకైనా, ప్రతిపక్షాలకైనా ఓ అవకాశం!
అధికారంలో ఉన్న పాలక పార్టీకి తమ పాలనా తీరును, వారు అనుసరిస్తున్న విధానాలను, అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలను, రాబోయే రోజుల్లో చూపించబోయే ప్రగతిని చెప్పుకునే, సమర్థించుకునే ఓ వేదిక. బడ్జెట్ నుంచి సంక్షేమ పథకాల అమలు వరకూ… ప్రస్తుతం తమ పాలనలో పార్టీ విజయాల నుంచి గత పాలకుల వైఫల్యాల వరకూ చట్టసభ సాక్షిగా సమర్థవంతంగా చెప్పుకునే డయాస్.
ప్రతిపక్షానికి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అధికారిక వేదిక. అవసరమైతే ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపి సమస్యకు పరిష్కారం చూపే అవకాశాలున్న డయాస్. కానీ, అసెంబ్లీ సమావేశాలు మొదలైతే రాజకీయ పార్టీలన్నీ తమ స్క్రిప్టులతో సిద్ధమవుతున్నాయనే అభిప్రాయం ఏర్పడుతోంది. ఎవరు ఎవరిని ఇరుకున పెట్టాలి..? ఏ అంశంపై ప్రభుత్వాన్ని కార్నర్ చేయొచ్చు..? ఏ వ్యాఖ్యను సోషల్ మీడియాలో వైరల్ చేయాలి..? ఇదిగో ఈవిధమైన ట్రెండ్ ఇప్పుడు కనిపిస్తోంది. మొత్తంగా ప్రజా సమస్యలపై చర్చల కంటే కూడా రాజకీయ లెక్కలే ఇప్పుడు పార్టీలకు ముఖ్యమైపోయాయనే భావన క్రమంగా బలపడుతోంది.
వాకౌట్, నిరసన, నినాదం!
ఇవన్నీ ప్రజల కోసమా…? లేక, కెమెరాల ముందు ప్రదర్శనా..?
వాకౌట్ పార్లమెంటరీ రాజకీయాల్లో ఓ నిరసన రూపం. కానీ, ప్రతీసారీ వాకౌట్ జరిగితే అది ప్రజాస్వామ్య పోరాటమా…? లేక, రాజకీయ సందేశమా..? ఈ చిన్న విభజన గీత.. ఇప్పుడు సమాజం ముందుంచుతోంది. సభలో ఐదు నిమిషాలు కనిపించే ఓ నిరసన.. సోషల్ మీడియాలో లక్షల వ్యూస్ తెచ్చిపెడుతోంది. ఇదే ఇప్పుడు కొత్త రాజకీయ వాస్తవం. ఇప్పుడు నాయకుల ప్రసంగాలన్నీ చట్టసభల్లో అధికారపార్టీ సభ్యుల దృష్టికీ, సభ ద్వారా జనం దృష్టికి తీసుకురావడం కంటే కూడా… టీవీ కెమెరా కోసం, అంకంటే ఎక్కువగా సోషల్ మీడియా కోసమన్నట్టుగా హైడ్రామాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ప్రసంగాలు గతంలో పాలసీ డిబేట్స్ గా ఉండేవి. ఇప్పుడు వైరల్ కంటెంట్ ఎలా అవుతాయా అన్న లెక్కలు ఆ ప్రసంగాల వెనుక కనిపిస్తాయి.
జనం సమస్యలెక్కడ..?
రైతు సమస్యలు, విద్యావ్యవస్థ పనితీరు, నిరుద్యోగం, గ్రామీణ రోడ్ల అభివృద్ధి, తాగునీరు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, వాతావరణ ప్రభావం, తద్వార తలెత్తుతున్న పరిస్థితులు, మహిళ భద్రత, ధరల పెరుగుదల, ప్రభుత్వ ఉద్యోగాలు, నోటిఫికేషన్స్, పారిశ్రామికాభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు, మారుతున్న పోటీ ప్రపంచంలో ఎక్కడున్నాం, పోటీలో ఎలా ముందుకెళ్లాలి, సమాజాన్ని పీడిస్తున్న కల్తీలు, ఫేక్ ఉద్యోగాల కల్పన, పెరుగుతున్న క్రైమ్ నివారణ ఇలాంటి ఎన్నో అంశాలపై ఎంత చర్చ జరుగుతోంది..? పోనీ, జరిగిన చర్చలపై ప్రభుత్వ సమాధానాలు ఎంతవరకూ అమల్లోకొస్తున్నాయి…? అసెంబ్లీలో గంటల తరబడి జరిగే రాజకీయ రగడల కంటే.. ఓ గ్రామంలో తాగునీటి సమస్యపై జరిగే అరగంట సీరియస్ చర్చ ఎంత ఉపయోగం..? ఇలాంటి ఆలోచనా ధోరణే కొరవడిందా అన్నదే ఇప్పుడు చర్చ.
పెర్ఫార్మెన్స్ పాలిటిక్స్ దే పైచేయి!
తెలంగాణా రాజకీయాల్లో ఇప్పుడు పెర్ఫార్మెన్స్ పాలిటిక్స్ దే పైచేయిలా మారింది. మాట్లాడటమే కాదు.. ఎలా మాట్లాడాలి.. ఎంత ఆవేశంగా మాట్లాడాలి.. ఎంత చులకన చేస్తే ఎదుటివారిని హర్ట్ చేయగలం, రెచ్చగొట్టగలం, కౌంటర్ కు కౌంటర్ అటాక్ ఎలా ఉండాలి, తమ ప్రసంగాలు ఎంత వైరలవుతున్నాయి, వాటిపై ఎన్ని మీమ్స్ వస్తున్నాయి ఇవే ఇప్పుడు రాజకీయ కొలమానాలుగా మారిపోవడాన్ని గమనించవచ్చు. దీంతో శాసనసభ కూడా రాజకీయ బల ప్రదర్శనల వేదికగా మారుతుందా అన్న అనుమానాలు తలెత్తడం సహజం.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా… ప్రతిపక్షంలో కూర్చోగానే మరోలా!
ఇదే ద్వంద్వ నీతే రాజకీయాల్లో, పార్టీల్లో ఇప్పుడు మనకు కొట్టొచ్చినట్టు కనిపించేది. దాదాపు ప్రతీ రాజకీయ పార్టీ అనుసరించే పద్ధతిగా మారిపోయింది ఇది. నిన్నటిదాకా అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలోకెళ్లగానే సభా సంప్రదాయాల గురించి మాట్లాడతారు. నిన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారంలోకి రాగానే సభా క్రమశిక్షణ గురించి లెక్చర్లిస్తారు. పాత్రలు మారుతున్నాయేగానీ… రాజకీయ నాటకం మాత్రం కొనసాగుతూనే ఉంది.
మరి అసెంబ్లీకి గౌరవం పెరగేదేప్పుడు..?
పార్టీలు వేరైనా మరీ వ్యక్తిగతంగా ప్రతీదాన్నీ తీసుకుని విమర్శించుకునే స్థాయికి ఈగోస్ పెంచుకోకపోవడం ప్రధానం. శాసనసభలో వేడి చర్చలుండాలి. విమర్శలూ, ప్రతివిమర్శలూ తప్పనిసరి. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీయాల్సిందే. ప్రతిపక్షాన్నీ ప్రభుత్వం ప్రశ్నించొచ్చు. కానీ, ఇవన్నీ చివరకు ఒకే లక్ష్యం కోసం కావాలి. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే అసెంబ్లీ అంతిమ లక్ష్యం కావాలి.
రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బయట ఎన్ని సభలైనా పెట్టుకోవచ్చు. ఎంత తీవ్రంగానైనా విమర్శించుకోవచ్చు. ఎన్ని రాజకీయ నాటకాలైనా ఆడుకోవచ్చు. కానీ, చట్టసభలు వేదికగా డ్రమటిక్ పాలిటిక్స్ కొనసాగితే మాత్రం.. నష్టపోయేది ప్రభుత్వమూ కాదు… ప్రతిపక్షమంతకన్నా కాదు.. ప్రజాస్వామ్యం మాత్రమే.



