కొండపల్లి నుంచి కోల్ కత్తా వరకు.. సంగీతం వెంట పరుగెత్తిన కుర్రాడు!

స్వరాలకు భాష లేదని నిరూపించిన కొండపల్లి కుర్రాడు!

తెలుగు సినిమా ఎందరో సంగీత దర్శకులను చూసింది. చాలామంది చాలా హిట్స్ తో అలరించారు. కానీ, కొందరు మాత్రం ప్రత్యేకమైన, వారిలో మాత్రమే కనిపించే భిన్నమైన శైలితో ఎప్పుడూ గుర్తుంటారు. అలాంటి సంగీత దర్శకుడు, వైవిధ్య గాయకుడే రమేష్ నాయుడు. మేఘసందేశంలో శాస్త్రీయ సంగీత ఛాయల గాంభీర్యం నుంచి శ్రీవారికి ప్రేమలేఖలోని సున్నితమైన ప్రేమగీతాల వరకూ… శివరంజని విషాదం నుంచి ఆహ నా పెళ్లంటలో వినోదభరిత పాటల వరకూ ఒక మూసలో కొట్టుకుపోని సంగీతం రమేష్ నాయుడిది. పలు భాషల్లో స్వరకర్తగా ఆయన ప్రస్థానం గురించోసారి తెలుసుకుందాం.

సాహిత్యం, భావం, రాగం, జానపదాల వాసన, పాత్రల మనస్తత్వం ఇలా అన్నీ కలిసి ఒక పాటలో వినిపిస్తే అది రమేష్ నాయుడు సంగీతమందించిన పాట. తెలుగు ప్రేక్షకులకు తెలుగు సంగీత దర్శకుడిగానే గుర్తున్నా.. రమేష్ నాయుడిది భారతీయ సినీ సంగీతంలో బహు భాషా ప్రయాణం.

ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం తెచ్చిపెట్టిన మేఘసందేశం.. శాస్త్రీయ సంగీతంతోనూ, సినిమా సౌందర్యాన్ని పెంచేలా చేసిన సంగీత దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చి పెట్టింది. అవకాశాల కోసం భాషల సరిహద్దులు దాటి ప్రయాణించి, తనదైన సంగీత భాషను నిర్మించుకున్న ఆయన జీవితం నేటి సంగీత తరానికి ఓ పాఠం.

కొండపల్లి నుంచి దేశం నలుమూలలా విస్తరించిన సంగీతం!

రమేష్ నాయుడి జన్మస్థలం కృష్ణా జిల్లా కొండపల్లి. 1933లో జన్మించిన రమేష్ నాయుడిపై బాల్యం నుంచే సినిమా సంగీతం తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా హిందీ సినిమా సంగీత ప్రభావం మెండు. అలాగే, తెలుగులో సాలూరి రాజేశ్వరరావు వంటివారి పాటలు కూడా ఆయనకు సంగీతంపై మక్కువ పెరగడానికి కారణమయ్యాయి.

గాయకుడిగా ఎదగాలన్నదే మొదటి కల!

రమేష్ నాయుడు మొదటి కల సినిమా సంగీత దర్శకుడిగా ఎదగడం కాదు. గాయకుడిగా ఎదగాలన్నదే ఆయన కోరిక. సినిమాల్లో పాటలు పాడాలన్న అభిలాషతో చిన్ననాటే ఇంటి నుంచి బయల్దేరి బొంబాయి బాట పట్టాడు. సంగీత వాద్యాల దుకాణాల్లో పనిచేశాడు. సంగీత ప్రపంచాన్ని దగ్గరగా గమనించాడు. హిందీ, మరాఠీ సంగీత ధోరణులను అధ్యయనం చేశాడు.

హామ్లెట్ తో జాతీయస్థాయి గుర్తింపు!

రమేష్ నాయుడు సినీ కెరీర్ కు 1954 సంవత్సరం ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన కిషోర్ సాహు.. షేక్ స్పియర్ ప్రసిద్ధ నాటకం ఆధారంగా రూపొందించిన సినిమా హామ్లెట్. కొత్త సంగీత దర్శకుడి అన్వేషణలో రమేష్ నాయుడు ఆయన్ను మెప్పించి ఒప్పించాడు. ఆ సినిమాతోనే ఆశాభోంస్లే, మహమ్మద్ రఫీ వంటి సుప్రసిద్ధ గాయకులతో పనిచేసే అవకాశం దక్కింది. ఇదేం చిన్న విషయం కాదు.. ఓ తెలుగువాడు తెలుగు సినిమాకు సంగీతం అందించకమునుపే హిందీలో ఓ ప్రయోగాత్మక సినిమాకు సంగీతం చేయడం రమేష్ నాయుడు ప్రతిభకు గీటురాయి.

తెలుగులోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు..?

హిందీ సినీ రంగంలో పనిచేస్తున్న తరుణంలోనే అనారోగ్య సమస్యలతో రమేష్ నాయుడు కెరీర్ లో కొంత విరామమేర్పడింది. ఆ సమయంలో మద్రాసుకొచ్చారాయన. అక్కడ ప్రముఖ నటి, నిర్మాత కూడా అయిన సి. కృష్ణవేణి దృష్టిలో పడ్డారు. 1957లో దాంపత్యం అనే సినిమా ద్వారా రమేష్ నాయుడు తెలుగు సినీ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. అదే సమయంలో స్వయంప్రభ అనే చిత్రానికీ సంగీతమందించారు.

తెలుగులో ఎవ్వరి దగ్గరా సహాయకుడిగా పనిచేయకుండానే ఎదిగిన సంగీత దర్శకుల్లో రమేష్ నాయుడొకరు. బొంబాయిలో సంగీతం నేర్చుకున్నారు. హిందీలో అవకాశాలతో మొదలుపెట్టారు. తెలుగు సినీ సంగీత దర్శకుడిగా నేరుగా రంగంలోకి దిగారు. దాంపత్యం, స్వయంప్రభ సినిమాల్లో ఆయన ఆర్కెస్ట్రైజేషన్ మెలోడీనిష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తలాత్ మహమూద్ ను తెలుగులో పాడించిన స్వరకర్త!

రమేష్ నాయుడు కెరీర్ లో కీలకంగా చెప్పుకునే సినిమాల్లో 1959లో రిలీజైన మనోరమ ఒకటి. ఇదే సినిమాలో హిందుస్థానీ గజల్, బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ అయిన తలాత్ మహమూద్ తో మరిచిపోయేవేమో అనే పాటను సుశీలతో కలిసి తెలుగులో పాడించారు రమేష్ నాయుడు. ఉచ్ఛారణ తెలియని గాయకుడితో భావాన్నేమాత్రం కోల్పోకుండా పాడించిన సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడుకు ఆ సినిమా పాట మరింత క్రేజును తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత తెలుగు సినిమాకు ఎందుకు దూరమయ్యాడు..?

రమేష్ నాయుడు కెరీర్ సాధారణ తెలుగు సంగీత దర్శకుడి ప్రయాణానికి పూర్తి భిన్నమైంది. 1960ల ఆరంభంలో ఆయన చూపు మళ్లీ కలకత్తా వైపు పడింది. అక్కడి బెంగాలీ సినిమా ప్రపంచం ఆయన్ను ఆకర్షించింది. దాదాపు పదేళ్లపాటు బెంగాలీ, ఒరియా, నేపాలీ చిత్రాలకు ఆయన సంగీతమందించారు. ఆ భిన్నమైన నేపథ్యం రమేష్ నాయుడి సంగీత దృష్టిని మరింత విశాలం చేసింది. తెలుగు జానపదమే కాదు, బెంగాలీ సంగీత సున్నితత్వం, నేపాలీ స్థానిక మేళవింపులతో విభిన్న సంగీత సంస్కృతులను ఆయన ఆకళింపు చేసుకున్నారు. విభిన్న ప్రాంతాల సంగీత సంస్కృతుల అనుభవం.. తిరిగి మళ్లీ తెలుగులోకొచ్చాక తర్వాతి తెలుగు బాణీల్లోనూ ప్రతిబింబించింది.

తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, ఒరియా, బెంగాలీ, నేపాలీ తదితర భాషల్లో 150కి పైగా చిత్రాలకు రమేష్ నాయుడు సంగీతమందించారు.

మళ్లీ తెలుగు నేలపై మెలోడీలతో కొత్త అధ్యాయం!

1972లో మళ్లీ అమ్మ మాట అనే సినిమాతో తిరిగి ఆయన తెలుగు సినిమా సంగీత దర్శకుడిగా రెండో అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇక ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూడలేదు.

జీవితం, తాతా మనవడు, చందన, చిల్లరకొట్టు చిట్టెమ్మ, శివరంజని, తూర్పు పడమర, మేఘ సందేశం, ఆనంద భైరవి, శ్రీవారికి ప్రేమలేఖ, ఆహ నా పెళ్లంట, స్వయంకృషి వంటి సినిమాలకు వరుసగా సంగీతపరంగా గుర్తుండిపోయే బాణీలందించాడు రమేష్ నాయుడు. 1988లో ఆయన మరణించేవరకూ కూడా.. అత్యంత సృజనాత్మకమైన పాటలతో అలరించాడు.

జీవితం సినిమాలో.. ఆనందమౌగా పల్లెసీమ.. ధాన, ధర్మాలకిల్లు మా పల్లె సీమ అనే పాట… పల్లె మట్టి పరిమళాల్ని వినిపించేది. ముద్ద మందారంలోని అలివేణి ఆణిముత్యమా పాట ఇప్పటికీ చెవిలో పడితే ఆగిపోవాలనిపించేది. తాతా మనవడులో అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకమంటూ రామకృష్ణతో పాడించిన పాట.. మధ్యతరగతి జీవితాల్లోని నాటకాన్ని కళ్లకు కట్టేది. తూర్పు పడమరలోని శివరంజని పాటైనా.. శివరంజనిలోని అభినవ తారవో అయినా నాటి రేడియోల కాలం నుంచి నేటికీ చెవి కోసుకునే మధురగీతాలే. ఇలా చెప్పుకుంటూ పోతే రమేష్ నాయుడు అందించిన పాటలతోట గుబాళింపులు తనివి తీరనివి.

రమేష్ నాయుడు సంగీతంలో ప్రత్యేకతేంటి..?

సాహిత్యానికి పెద్దపీట వేసిన సంగీత దర్శకుల్లో రమేష్ నాయుడు పేరు ముందువరుసలో ఉంటుంది. ఆ తర్వాతే బాణీ. ట్యూన్ చేసి పాట రాసే విధానానికి ఆయన వ్యతిరేకి. సాహిత్యాన్ని సంగీతం మింగేయకూడదనుకున్న స్వరకర్త. ఆ సమతుల్యతే రమేష్ నాయుడిని మెలోడీ కింగ్ గా నిలబెట్టింది.

మెలోడీకి తనదైన భాష నేర్పిన స్వరకర్త!

మేఘ సందేశం, ఆనంద భైరవి వంటి చిత్రాలు రమేష్ నాయుడి శాస్త్రీయ సంగీత ఆలోచనా సరళికి క్లాసిక్ ఎగ్జాంపుల్స్. కానీ, ఆ శాస్త్రీయ సంగీతాన్ని సామాన్య ప్రేక్షకుడు కూడా హమ్ చేసుకునేలా మార్చడమే ఆయన ప్రత్యేకత. ఆనంధభైరవి వంటి సినిమాల్లో వాడిన గంభీరమైన రాగాల్ని కూడా సినీ ప్రేక్షకులకు తగ్గట్టుగా వినసొంపుగా మల్చారు రమేష్ నాయుడు. అలాంటి సరళే ఆయన మేఘ సందేశంకూ జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది.

ఆయన పాటకు జానపదం అలంకారం కాదు.. ఆత్మ!

అవును, రమేష్ నాయుడు తన పాటలో మట్టి పరిమళాన్నిష్టపడ్డారు. గ్రామీణత తొంగిచూసేలా బాణీలు కట్టారు. అందుకే, ఆయన పాటలను స్టూడియోల్లో రికార్డైన పాటల్లా కాకుండా.. ఎక్కడో ఊళ్లల్లో వినిపించే పాటల్లా జనం హత్తుకున్నారు.

మూసధోరణికి భిన్నంగా – వైవిధ్యతే ప్రత్యేకత!

ఒకే జానర్ లో చిక్కుకోని సంగీత దర్శకుడు రమేష్ నాయుడు. ఆ వైరుధ్యం ఆయన సినిమా సంగీతం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మేఘ సందేశం గాంభీర్యంతో కూడిన శాస్త్రీయ సంగీత క్లాసిక్ అయితే.. ఆహ నా పెళ్లంట కామెడీతో కూడిన లలిత సంగీతం. శ్రీవారికి ప్రేమలేఖ సున్నితమైన లవ్ మెలోడీ అయితే.. శివరంజని భావోద్వేగాల విషాదం. ఇలా ఆయన తన సినిమా సినిమాకు తనదైన పరిధిని విస్తరించుకున్న తీరు ఆయన సంగీతంలో కనిపిస్తుంది.

కొందరు దర్శకుల ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్!

రమేష్ నాయుడితో తరచూ పనిచేసినవారిలో దాసరి నారాయణరావు, విజయ నిర్మల, జంధ్యాల వంటివారిని చెప్పుకోవాలి. దీనికి కారణం కథను డామినేట్ చేయని ఆయన సంగీత శైలి. సన్నివేశం కోరుకునే నేపథ్య సంగీతాన్నివ్వడం. పాట వెనుక నేపథ్యాన్ని అర్థం చేసుకుని ట్యూన్ కట్టడం ఇవన్నీ ఈ ముగ్గురు దర్శకులు.. రమేష్ నాయడితో లాంగ్ జర్నీచేసేందుకు కారణాలయ్యాయి.

గాయకుడిగా కూడా రమేష్ నాయుడు పాటంటే ఎందరికో ఇష్టం!

గాయకుడిగానే సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాలు మొదలుపెట్టిన రమేష్ నాయుడు సంగీత దర్శకుడిగానే ప్రపంచానికి పెద్దగా పరిచయమయ్యాడు. చిల్లరకొట్టు చిట్టెమ్మ వంటి సినిమాలో తల్లి గోదారికే ఆటుపోటుంటే.. తప్పుతుందా మనిషికి తలరాత అంటూ ఆర్ద్రతతో పాడిన ఆయన పాట జీవితంలో సుఖదుఖాలను గుర్తు చేస్తుంది. అందుకే ఆయన సంగీత జీవిత ప్రయాణం 360 డిగ్రీల్లో సాగిన ఓ వృత్తం లాంటిది.

నిరాడంబర శైలి ఆయన మరో ప్రత్యేకత!

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరు ఏనాడూ కోరుకోలేదు. ప్రచారానికీ దూరమే. భారీ ఆర్కెస్ట్రాలు, హడావిడీ కంటే కూడా సంగీత మాధుర్యానికే ప్రాధాన్యతనిచ్చినవాడు. పాటకు రిథమ్ ఎంత ముఖ్యమో.. మాధుర్యం అంత ప్రాధాన్యమని తెలిసినవాడు. అందుకే రమేష్ నాయుడు సంగీతం ఇప్పటికీ మనల్ని అలరిస్తోంది.

సంగీతానికి భాష లేదంటారు. రమేష్ నాయుడు జీవితం దానికో ఉదాహరణ. కొండపల్లిలో సంగీతాన్ని కలగా కన్న ఓ కుర్రాడు.. బొంబాయిలో అవకాశాల కోసం తిరిగాడు. హిందీలో ప్రతిభను నిరూపించుకుని.. కలకత్తాలో కొత్త సంగీత ప్రపంచాలను చూసాడు. మళ్లీ జన్మభూమైన తెలుగు నేలకు వచ్చి.. మధురమైన మెలోడీలతో తనకంటూ ఒక సంగీత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు.

హిట్ల సంఖ్యతో కాదు.. పాటల్లోని మాధుర్యంతో గుర్తుండిపోయే సంగీత దర్శకులు చాలా అరుదు. రమేష్ నాయుడు అలాంటి అరుదైన స్వరకర్త.. ఆయన పాటలు వినిపిస్తున్నంతకాలం… తెలుగు సినిమా సంగీత చరిత్రలో ఆ కొండపల్లి కుర్రాడు మనల్ని ఎప్పటికీ ఓ బండగుర్తులా పలకరిస్తూనే ఉంటాడు!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles