కుల, మతాల్లేని ధృవీకరణ కోసం.. 9 ఏళ్ల పోరాటం: ఇది ఓ మహిళ విప్లవాత్మక విజయం!

రెండు ఖాళీ కాలమ్స్ కోసం.. 9 ఏళ్ల యుద్ధం!

ఓవైపు, సమాజాన్ని నడిపిస్తూనే… మరోవైపు, సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల, మత నినాదంపై పోరాటంలోనూ… తమ ప్రాంత భాష, యాస, కల్చర్ పై గళం విప్పడంలోనూ తమిళనాడు ఎప్పటికీ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఒక అడుగు ముందే కనిపిస్తుంది. ఒక్క వ్యక్తి సాధించిన ఓ విజయం.. ఇప్పుడా సమాజపు పోకడను కళ్లకు కట్టేది. తొమ్మిదేళ్లు పోరాడి నో క్యాస్ట్, నో రిలీజియన్ సర్టిఫికెట్ సాధించిన ఓ మహిళ విజయమిది.. తమిళనాడు ప్రాంత కథ
ఇది.

ఎం. ఏ. స్నేహ.. ఈ పేరు ఇప్పుడు ఒక వైబ్రేషన్. చిన్నప్పుడు బళ్లో ఏదైనా దరఖాస్తు ఫారమ్ నింపాల్సి వస్తే రెండు ప్రశ్నలకు మాత్రం స్నేహ దగ్గర సమాధానం ఉండేది కాదు. అవే కులం, మతం. ఈ ప్రశ్నలకు సమాధానాలు స్నేహకు తెలియక కాదు… ఆమె తల్లిదండ్రులే ఆ గుర్తింపును ఆమెకు ఇవ్వలేదు.

జనన ధృవీకరణ పత్రంలో కులం లేదు, మతం లేదు. స్కూల్ రికార్డుల్లోనూ అంతే. తమిళనాడు తిరుపత్తూరుకు చెందిన న్యాయవాది ఎం. ఏ. స్నేహ చిన్నప్పట్నుంచీ పెరిగిన వాతావరణమిది. కానీ, జీవితంలో ఇవి రెండూ లేకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన వచ్చినప్పుడు మాత్రం సమస్య మొదలైంది. కుల, మతాలు ఎంత ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తాయో అర్థమైంది.

నాకు కులం లేదు, మతం లేదు. సమాజంలో అంతా సమానమే అని చెప్పడం సులభం. కానీ, ప్రాక్టికల్ గా బతకడం కష్టం. బతకాలంటే కాంప్రమైజ్ కావాల్సిందే. కుల, మత కార్డులను తగిలించుకోవాల్సిందే. ఓవైపు కులాలు, మతాలు తెచ్చిన సంప్రదాయాలూ కొన్ని సమాజాలకు ఓ గౌరవాన్నీ, గుర్తింపునూ ఇస్తుంటే.. మరికొన్ని అణగారిన వర్గాలు వివక్షను ఇంకా చూస్తూనే ఉన్నాయి. వివక్ష జరిగినప్పుడు ఆ జరిగిన ఘటనకే పరిమితం కాకుండా.. కారణమైన వారినే టార్గెట్ చేయకుండా… జనరలైజ్జ్ గా దాడులూ జరుగుతున్నాయి. మొత్తమ్మీద కులం, మతం ఈ రెండు కార్డులే సమాజాన్నీ, రాజకీయాలను, ఉద్యోగాలను, సోషల్ మీడియాను ఇలా అన్నింటినీ నడిపిస్తున్న రోజులివి.

అయితే తనకు కులం లేదు, మతం లేదు అని నిర్భయంగా చెప్పుకోగల్గిన తమిళనాడుకు చెందిన స్నేహ… ఒకే ఒక్క ధృవీకరణ పత్రం కోసం న్యాయవాది అయి ఉండి కూడా తాను తొమ్మిదేళ్ల పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు 2019, ఫిబ్రవరి 5వ తేదీన స్నేహ పోరాటానికి తాను కోరుకున్న రీతిలో ఫలితంలో ముగింపు లభించింది.

భారతదేశంలోనే తొలి మహిళగా గుర్తింపు!

తమిళనాడు తిరుపత్తూర్ తహశీల్దార్ టీ. ఎస్. సత్యమూర్తి 2019 ఫిబ్రవరి 5వ తేదీన స్నేహకు ఓ ప్రత్యేకమైన సర్టిఫికెట్ జారీ చేయడంతో ఓ విప్లవాత్మకమైన అడుగుకు స్నేహ జీవితం శ్రీకారం చుట్టింది. ఆ సర్టిఫికెట్ లో స్నేహకు కులం, మతం లేదని పేర్కొనడమే స్నేహ పోరాటానికి దక్కిన అద్భుత ఫలితం. దీంతో స్నేహ భారతదేశంలోనే కుల, మత ధృవీకరణ పత్రాలు అవసరం లేని ఓ మహిళగా గుర్తింపు సాధించింది.

కుల, మతాలు గిట్టని ఇంట్లో పెరిగిన స్నేహ!

స్నేహ తల్లిదండ్రులిద్దరూ పి. వి. ఆనందకృష్ణన్, మణిమొళి న్యాయవాదులే. కమ్యూనిస్ట్ భావజాలమున్న మిత్రులతో ఈ కుటంబానికి మంచి సాంగత్యం, సాన్నిహిత్యముంది. అలాగే, ఇంట్లో ఉండే పుస్తకాల్లోనూ కమ్యూనిజం, హేతువాదం, నాస్తికత్వానికి సంబంధించిన రచనలే ఎక్కువగా ఉండేవి. దీంతో స్నేహతో పాటే, తన సోదరీమణులు కూడా చిన్నప్పట్నుంచీ ప్రశ్నించాలే తప్ప.. దేన్నీ గుడ్డిగా నమ్మకూడదనే ఒక విషయాన్ని ఒంటబట్టించుకున్నారు. కులం, మతం, దైవం వంటి అంశాలపై తమదైన శైలిలో ఆలోచించుకునే స్వేచ్ఛ.. ప్రశ్నించే తత్వాన్ని తల్లిదండ్రులు వీరికిచ్చారు. అందుకే ఎవరైనా మీదే కులం అని స్కూల్లో అడినప్పుడు మాకు కులం లేదు, మతం లేదనే చెప్పేవారు. అదే వారి జీవన విధానమైంది. కానీ, ఆ మాట చెప్పినంత సులభంగా ధృవీకరణ పత్రాలపై ప్రభుత్వ ముద్ర ఉండదనే సారం రంగంలోకి దిగాకగానీ స్నేహకు అర్థం కాలేదు. అయితేనేం, తొమ్మిదేళ్లు పోరాడి కుల, మతమన్న ప్రస్తావన లేని ధృవీకరణ పత్రాన్ని సాధించి దేశంలో ఓ విప్లవాత్మక అడుగుకు శ్రీకారం చుట్టింది స్నేహ.

పేర్లల్లోనూ కొట్టొచ్చే భావజాలం!

స్నేహ కుటుంబంలో ఆలోచనలు కేవలం మాటలకే పరిమితం చేయలేదు. ప్రతీ అడుగులోనూ వారి భావాలు ఆచరణాత్మకంగానే కనిపిస్తాయి. స్నేహ సిస్టర్స్ పేర్లు.. ముంతాజ్ సూర్య, జెన్నిఫర్. అంటే విభిన్న మతాలకు చెందిన పేర్లు ఒకే కుటుంబంలో సహజంగా కలిసిపోయే విధమైన ఆలోచనలు ఈ పేర్ల వెనుక కనిపిస్తాయి. ఇక్కడితో ఆగకుండా స్నేహ తమిళ ప్రొఫెసర్ కే. పార్థిబరాజాతో పెళ్లయ్యాక కల్గిన ముగ్గురు కుమార్తెలకూ.. భిన్న మత సంప్రదాయాలను కలిపేలా పేర్లు పెట్టారు. అధిరై నస్రీన్, ఆధిలా ఐరీన్, ఆరిఫా జెస్సీ వంటి పేర్లను తన కూతుళ్లకు పెట్టింది స్నేహ. పేరనేది కులానికో, మతానికో కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్న ఒక ప్రగతిశీల ఆలోచన ఇక్కడ కనిపిస్తుంది.

మరి స్నేహకు అసలు సమస్య ఎక్కడ మొదలైంది?

చిన్నప్పట్నుంచీ కుల, మత ప్రస్తావన లేకుండా జీవించడం పెద్ద సమస్యేం కాలేదు. కానీ, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, ప్రభుత్వ నియామకాల దగ్గరకొచ్చేసరికి.. రాజ్యమే కుల, మతాలను ఎలా పెంచి పోషిస్తుందో స్నేహకు అర్థమైంది. స్నేహ న్యాయరంగానికి సంబంధించిన పరీక్షలు రాయడానికి.. నోటరరీ పదవికి దరఖాస్తు చేసుకునే క్రమంలో ఇలాంటి ఇబ్బందులెదుర్కొంది. దరఖాస్తు ఫారంలో ఆమె తనకు కులం లేదు, మతం లేదని పేర్కొంది. దానికి అధికారుల నుంచి దానికి అలాంటి సర్టిఫికెట్ ఉందా అనే ప్రశ్న ఎదురైంది. ఇక్కడే స్నేహ పోరాటం మొదలైంది.

కులముందని సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు.. లేదని ఎందుకివ్వరు..?

ఇదీ స్నేహ పోరాటానికి బీజం వేసిన ప్రశ్న..? అలా 2010లో స్నేహ పోరాటం మొదలైంది. అలాంటి సర్టిఫికెట్ ఇవ్వడానికి అంతకుమునుపు ఎలాంటి ఉదాహరణ, ప్రొఫార్మా, ప్రొసీజర్ లేదని అధికారులు తేల్చి చెప్పారు. అంటే, అప్పటివరకూ ఎవ్వరూ అడగలేదు.. ఇవ్వడబడలేదన్నది దానర్థం. కానీ, స్నేహ అధికారుల సమాధానంతో సంతృప్తి చెందేందుకు మొదలుపెట్టలేదు పోరాటాన్ని. కమ్యూనిటీ సర్టిఫికెట్స్ జారీచేసే పాలనా విధానాన్నే ఆసరా చేసుకుని.. ఆమె అభ్యర్థనను కొనసాగించారు. అలా పోరాటం ఒకటీ, రెండేళ్లు కాదు.. తొమ్మిదేళ్లు చేసి ఏకంగా ఇప్పుడు కుల, మతాల ఊసు అవసరం లేని ధృవీకరణ పత్రం సాధించింది స్నేహ.

కొత్త గుర్తింపు కోసం తాపత్రం కాదిది.. నిజాన్ని గుర్తించాలన్న తపన!

ప్రభుత్వం తనను నాస్తికురాలిగా ప్రకటించాలన్నది ఆమె కోరిక కాదు. లేదా, ఇంకేదైనా ప్రత్యేక హక్కులో, ప్రయోజనాల కోసమో అంతకన్నా కాదు. అలా అని మతానికి వ్యతిరేకంగా ఎక్కడా ఒక్క రాజకీయ ప్రకటనా ఆమె నుంచి రాలేదు. తాను జీవితాంతం ఎలా జీవిస్తుందో.. ప్రభుత్వ రికార్డుల్లోనూ అదే నమోదు కావాలన్నదే స్నేహ కోరిక. తన కుటుంబం తరతరాలుగా కుల, మత భావనలు, గుర్తింపులకు దూరంగా జీవించిన నేపథ్యమే తనను పోరాటానికి సిద్ధం చేసిందని ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పుకొచ్చారు స్నేహ. భర్త పార్థిబరాజా కూడా మొదట మతపరమైన కుటుంబంలోనే పెరిగినప్పటికీ.. ఆ తర్వాత పెరియార్, అంబేద్కర్ ఆలోచనల ప్రభావంతో హేతువాదం, నాస్తికత్వంవైపు ఆకర్షితులయ్యారు.

ఒక్క సర్టిఫికెట్ తెచ్చిన ఫోన్ల మోత!

స్నేహకు నో క్యాస్ట్, నో రిలీజియన్ సర్టిఫికెట్ వచ్చాక దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. చాలామంది ఆమెను సంప్రదించారు. మాకూ అలాంటి సర్టిఫికెట్స్ కావాలనే ఫోన్స్ మోత మోగాయి. తాను కులం, మతం లేని గుర్తింపును ఎంచుకున్నప్పటికీ రిజర్వేషన్స్ కు వ్యతిరేకం కాదంటోంది స్నేహ. తన వ్యక్తిగత నిర్ణయాల వల్ల ఇతరుల హక్కులకు ఎలాంటి ఇబ్బంది కావొద్దని.. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్స్ అవసరమేనంటోంది.

ఇది స్నేహ జీవితంలో మార్పు కాదు.. వాస్తవాన్ని ప్రభుత్వ రికార్డుల్లోనూ ప్రతిబింబించడం!

స్నేహ ఏ మతంలో పుట్టిందో ఆ మతం వీడుతున్నట్టు ఎక్కడా ప్రకటించలేదు. తన కులం వీడుతున్నట్టూ ఎక్కడా బహిరంగపర్చలేదు. కానీ, వాటికి దూరంగా తమ కుటుంబం ఏ జీవన విధానాన్నైతే అనుసరిస్తూ వచ్చిందో.. అదే సత్యాన్ని సర్టిఫికెట్స్ లోకి ఎక్కించేందుకు పోరాటం చేసింది. అలాంటి గుర్తింపులు వద్దనుకున్న తన తొమ్మిదేళ్ల పోరాట ఫలితం ప్రభుత్వ రికార్డులకెక్కింది.

ఓ వ్యక్తి తన గుర్తింపును తానే నిర్వచించుకునే హక్కును స్నేహ సాధించి చూపించింది. అందుకే, కుల, మతాలే ప్రధానంగా బతికే, చర్చలు సాగే భారతావనిలో ఇప్పుడు స్నేహ ఓ ప్రత్యేక పౌరురాలిగా వార్తల్లోకెక్కింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles