అనవసరమైన సిలబస్ మనకెంతవసరం..?

పాఠ్య పుస్తకాలు

డా. పుల్లూరి సంపత్ రావు

సెప్టెంబర్ 1991 నుంచి నేను బోధనారంగంలో ఉంటున్నాను. ప్రభుత్వ కాలేజిలో రాజనీతి శాస్త్రం చెప్పేటపుడు టెక్స్ట్ బుక్స్ లో లోపాలు కనిపిస్తే వాటిని ఒక సీనియర్ ఉపన్యాసకుని సలహాపై తెలుగు అకాడెమీ వారికి లెటర్ రాశాను. ఆశ్చర్యకరంగా తాము రివైజ్ చేయబోయే టెక్స్ట్ బుక్ కు సహా రచయిత గా రావాలని వారు ఆహ్వానం పంపారు. ఆ రకంగా తెలుగు అకాడెమీ వారి నాలుగు టెక్స్ట్ బుక్స్ లోనూ, ఆ తర్వాత కాకతీయ, అంబేద్కర్ విశావిద్యాలయాల వారు రూపొదించిన టెక్స్ట్ బుక్స్ లోనూ పాఠాలు రాసే అవకాశం లభించింది. అయినప్పటికీ మరోన్నో లోపాలు ఇప్పటికీ ఉన్నాయి. డిగ్రీలోనే కాదు ఇంటర్ మరియు స్కూల్ టెక్స్ట్ బుక్స్ లోనూ చాలా మార్చవలిసినవి ఉన్నాయనిపిస్తుంది.

అసలు పాఠాలు ఎంపిక చేయడంలోనూ కంటెంట్ రాయడంలోనూ అలసత్వం ఉంటుంది. అవసరం లేని లేదా ప్రస్తుతం ఉనికిలోలేని కొన్ని విషయాలు పాఠాలుగా లేదా పదాలుగా వాక్యాలుగా ఉంటున్నాయి. ఉదాహరణకు 1993లోనే చెకోస్లోవేకియా విడిపోయి చెక్ స్లోవేక్ దేశాలుగా ఏర్పడ్డాయి. ఇప్పటికీ కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఇంకా చెకోస్లోవేకియా పేరే ఉంది. కొన్ని అవసరానికి మించి ఉంటున్నాయి. ఆఫ్రికా ఖండం గురించి ఆఫ్రికా దేశాల విద్యార్థుల కంటే ఎక్కువ సిలబస్ మన విద్యార్థులకే ఉందట. అమెరికాలో సిలబస్ ను కేంద్రం, రాష్ట్రం స్థానిక పాఠశాల కలిసి నిర్ణయిస్తాయట. ఫిన్లాండ్ లో పూర్తిగా టీచరే నిర్ణయిస్తాడు. మన దేశంలో పాఠశాలలకు జాతీయ స్థాయిలో ఎన్.సి.ఇ.ఆర్.టి. రాష్ట్రాల స్థాయిలో ఎస్.సి.ఇ.ఆర్.టి. ఉన్నత విద్యలో ఆయా అకడెమిక్ కౌన్సిల్లు ఈ బాధ్యతను చేపడుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీల భావజాలం కరికులంలో చొప్పిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.

వీటిలో వాడే భాష విషయంలోనూ ఎంతో జాగ్రత్త అవసరం. కులం, మతం, ప్రాంతం, లింగం వంటివాటిలో సమతౌల్యం,గౌరవం కలిగించే పదకోశం వాడాలి. కనీసం గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉండకూడదు. తక్కువ కులాలు, కింది కులాలు అనే మాటలు అక్కడక్కడా ఉంటున్నాయి. వెనుకబడిన కులాలకు మరో మాట వాడలేమా? “అందం” అనే మాట కనిపించినా నాకైతే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇవి కేవలం ఉదాహరణలు. తరచి చూస్తే చాలా వాక్యాలు సరిచేయాలనిపిస్తుంది.

భాషాశాస్త్రాల విషయంలో పాఠాల ఎంపిక ఎంత ముఖ్యమో అవి చెప్పేవారికి ఉండే విచక్షణ అంత ముఖ్యం. ఉదాహరణలు చెప్పేటపుడు స్వంత వాక్యాలు రాయించేటపుడు వారికి ఉండే స్వేచ్చను లింగ సమానత్వాన్ని పెంచేందుకు, పర్యావరణ పరిరక్షణకు,స్వావలంభనను, నిజాయితీని, సేవాభావాన్ని పెంచేందుకు వాడవచ్చు.

నిజానికి ఈ మద్యకాలంలో పాఠాలు ఎంపిక చేయడంలో కొంత వైవిద్యం కనుపడుతున్నది. మంచి మంచి పాఠాలున్నాయి. టెలివిజన్ చర్చల్లో మాట్లాడేవారు “ఇవన్నీ స్కూల్లోనే నేర్పించాలండి”అన్నప్పుడల్లా వీళ్ళకు సిలబస్ తెలియదని స్పష్టమవుతుంది. అయితే కంటెంట్ రూపకల్పనలో మరింత శ్రద్ధ అవసరం. ప్రతి పదం, వాక్యం ఆచి తూచి ఎంపిక చెయ్యాలి. హేతుబద్దంగా, మారిన కాలానికి అనుగుణంగా ఉందోలేదో చెక్ చేసుకోవాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles