వేటు ఆగిందా…? వాయిదా పడిందా..??
తెలంగాణా కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా… ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన తర్వాత… అంతకుముందు నుంచే కొనసాగుతున్న సీఎం వర్సెస్ క్యాబినెట్ మంత్రి వైరం మరింత వెలుగులోకీ, చర్చల్లోకీ వచ్చింది.
అయితే, ప్రస్తుతానికి కొండా సురేఖ సేఫ్ జోన్ లో ఉన్నట్టే ప్రచారం జరుగుతోంది. గత రెండు రోజులుగా అన్ని మీడియా చానల్స్, పత్రికల్లోనూ కొండాపై వేటు తప్పదన్నట్టుగా వార్తా కథనాలు చూస్తున్నాం. కానీ ,ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి అడుగులేస్తున్నట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రతీ మైనస్ నూ పట్టుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా అటాక్ చేస్తోంది. ఈ క్రమంలో ఆ అటాక్సే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కొండా విషయంలో అప్రమత్తం చేసినట్టుగా కూడా రాజకీయ వర్గాల అంచనా.

ఇప్పటికైతే కొండా సేఫ్: కానీ, ఇప్పుడే పవర్ గేమ్ ఆసక్తికరం!
కొండా సురేఖ కూతురు సుష్మిత రేవంత్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాక.. ఈ విషయంలో చాలామంది నోరు మెదపలేదు. మరికొందరు మాట్లాడినా.. ఆబ్వియస్ గా ముఖ్యమంత్రికే మద్దతు తెలుపడం సహజం. ఈ క్రమంలో కొండా సురేఖనే రాజీనామాకు సిద్ధపడే యోచనలో ఉన్నట్టుగా కూడా ఒక ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా కొన్ని నివేదికలు తెప్పించుకుని కొండా సురేఖపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే, ఈ విషయాన్ని ప్రతిపక్షాలు తమకనుకూలంగా మార్చుకునే అవకాశాలు బోలెడు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొండా సురేఖ కుటుంబానికి కూడా తన ప్రాంతంలో పట్టుంది. పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా సభలో ప్రకాశ్ రెడ్డి పేరును ఇప్పుడప్పుడే ఎలక్షన్స్ లేకుండానే ముందుగానే ప్రకటించడాన్ని కూడా కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంది. దానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం, ఏఐసీసీ వంటివి ఉండగా.. ముఖ్యమంత్రి ఒక అధికారిక సభలో ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు ఎలా అభ్యర్థిని ప్రకటిస్తారనే చర్చా జరుగుతోంది. ఇవన్నీ బేరీజు వేసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం కొండా సురేఖపై వేటు విషయంలో వెనుకడుగు వేసినట్టుగా తెలుస్తోంది.
రేవంత్ దూకుడుకు కొండా బ్రేక్: కాంగ్రెస్ లో తెరపైకి కొత్త లెక్కలు!
రెండు రోజుల క్రితం ప్రజా భవన్ లో ఉపముఖ్యమంత్రి భట్టిని కలవడానికి కూడా కొండా మురళి కాస్త అటూ ఇటు అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే, అక్కడ ఉత్తమ్ తో పాటు, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారన్న సమాచారం మేరకే మురళి అక్కడికెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రిని చిన్నగా క్షమాపణ కోరితే బాగుంటుందని అక్కడి నేతల భేటీలో ప్రస్తావించారట మంత్రులు. తమ కూతురు మేజర్. తనకూ వాక్ స్వాతంత్రం ఉంటుంది. కేసీఆర్ ను ధిక్కరించి కవిత బయటకు వచ్చిన ఉదంతాన్నీ మురళి ప్రస్తావించినట్టుగా సమాచారం. ఈ క్రమంలో ముఖ్యమంత్రిని నారాజ్ చేయకుండా ఓ చిన్న రీజాయిండర్ తో ఈ మొత్తం వ్యవహారాన్ని టీ కప్పులో తుఫాన్ లా మార్చాలన్న యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులున్నట్టు సమాచారం.
ఆది నుంచీ కొండాను పక్కనబెడుతున్న సీఎం!
ముఖ్యమంత్రి రేవంత్ క్యాబినెట్ లో స్థానం దక్కవచ్చుగానీ… సీతక్కకు దక్కిన ప్రాధాన్యత కొండా సురేఖకు దక్కకపోవడం చాలాకాలంగా చర్చల్లోకొస్తోంది. ఇద్దరే మహిళా మంత్రులున్న క్యాబినెట్ లో… దేవాదాయశాఖ మినిస్టర్ గా ఉన్న సురేఖను కాదని.. సీతక్క ఆధ్వర్యంలో సమ్మక్క సారక్క జాతరను నడిపించడం మొదలు.. యాదగిరి లక్ష్మీనృసింహ స్వామి పాలకవర్గ కూర్పులోనూ ఆమెను పట్టించుకోకపోవడం వరకూ.. పలు కారణాలతో రేవంత్ వర్సెస్ సురేఖ మధ్య గొడవకు దారితీసింది. ఈ విషయంలో ఇప్పటికే సురేఖ కూడా తనకు జరుగుతున్న అన్యాయం గురించి సీఎం రేవంత్ పైన ఏకంగా అధిష్ఠానానికి ఓ నివేదిక సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే పరకాల సీటు రాజకీయ పంచాయతీ కూడా తెరపైకి రావడంతో… వరుస పరిణామాలు ముఖ్యమంత్రి వైపే వేలెత్తి చూపే విధంగా ఉన్నాయనే ది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. అందుకే, సురేఖ ఫ్యామిలీ ఏదైతే అదవుతుందని ఒకింత గట్టిగానే రేవంత్ ను ఎదుర్కొనేందుకు టిట్ ఫర్ ట్యాట్ గా వ్యవహరిస్తోందన్న వాదన వినిపిస్తోంది.
పైగా కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు కాకపోవడంతో… నేరుగా సురేఖపైన చర్యలు తీసుకునేందుకు కూడా టెక్నికల్ గా వీలుండదు. తన కూతురు వ్యాఖ్యలపైన సురేఖ ఇచ్చిన వివరణ… ముఖ్యమంత్రికి, ఆయన వర్గానికీ రుచించకపోవచ్చునేమోగానీ.. ఆమె స్టైలే ఆవిధంగా ఉంటుందనేది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో సురేఖ మాజీ ఒఎస్డీ ఇష్యూను కూడా ఆమె వ్యతిరేక వర్గం తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తోందా అనే చర్చ జరుగుతోంది. సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఓ వ్యాపారిని బెదిరించాడని, దాడికి యత్నించాడన్న ఆరోపణలతో ఆయనపైన ఏకంగా హత్యాయత్నం కేసే నమోదు కాగా.. ఇప్పటికే ఆయన డ్రైవర్ నూ అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు, సుమంత్ పరారీలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటికే అతడు చేరుకోవాల్సిన చోటుకు చేరుకున్నట్టుగా కూడా కొన్ని నిర్ధారించని రాజకీయ ప్రచారాలూ ముందుకొస్తున్నాయి. కొండా ఫ్యామిలీకి సంబంధించిన పలు అంశాలు సుమంత్ కు తెలుసునని.. అతణ్ని చేరదీసి ఆ రహస్యాలను సేకరించే పనిలో కొండా సురేఖ వ్యతిరేక వర్గం పనిచేస్తున్నట్టుగా మరో ప్రచారమూ ఉంది.
పేచీ అంతా పరకాల అభ్యర్థి ప్రకటనతోనే!
రేవూరి ప్రకాష్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమంలో ప్రకటించడం ఆయన్ను ప్రోత్సహించే ఉద్ధేశంతో యాదృచ్ఛికంగా జరిగిందా… లేక, కొండా ఫ్యామిలీని రెచ్చగొట్టేందుకే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారా అన్నవీ తెలంగాణాలో చర్చగా మారాయి. ఇలాంటి వ్యాఖ్యలే జగ్గారెడ్డికి సంబంధించిన విషయంలోనూ సీఎం చేశారు. జగ్గారెడ్డి తాను బరిలో ఉండనంటున్నారు.. కానీ, తనలాంటి నాయకులను అధిష్ఠానం వదులుకోదంటూ జగ్గారెడ్డినీ పైకెత్తే యత్నం చేశారు రేవంత్. అలాంటి భావనతోని.. టీడీపీ నుంచి తనకున్న అనుబంధంతోని ప్రకాష్ రెడ్డిని కూడా రేవంత్ అలాగే అని ఉంటారా… లేక, తనకు పొసగని కొండా కుటుంబాన్ని కవ్వించే చర్యనా అన్నది ముఖ్యమంత్రే సమాధానం చెప్పాల్సిన విషయం. పైగా రేపు డీలిమిటేషన్ అయితే మరో నియోజకవర్గం ఏర్పాటై రేవూరికీ, కొండా సుష్మితకు ఇద్దరికీ ఛాన్స్ దక్కవచ్చు. కానీ, ఒక జనరలైజ్డ్ కాంట్రవర్సియల్ అనౌన్స్ మెంట్ చేసిన సీఎం… ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఈ వ్యవహారం ఓ ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనిపైన కాంగ్రెస్ నేతలు, మంత్రులెవ్వరూ మాట్లాడలేరు. కానీ, సురేఖ విషయంపై మాత్రం కొందరు ఆమెను తప్పుబడుతున్నారు. అధిష్ఠానం మాత్రం ఈ విషయాలన్నీ పరిశీలించడం వల్లే కొండాపై వేటు ఇప్పట్లో లేనట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ లో… ఇప్పటికిప్పుడు సురేఖకు వేటు అనే ముప్పేమీ లేకపోగా.. ఇదే జరిగితే ముఖ్యమంత్రిపై సురేఖదే పైచేయి అనే వాదనా ప్రచారంలోకొస్తుంది. అదే రేపు మళ్ళీ ప్రతిపక్ష పార్టీలకు మరో కొత్త అస్త్రంగా మారవచ్చు.



