అస్తిత్వ సంక్షోభంలో ఉద్ధవ్ శివసేన: 60 ఏళ్ల ప్రస్థానంలో మునుపెన్నడూ లేని కుదుపు!

మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన ఎప్పటికీ ఒక చర్చ. వేర్పాటువాద పార్టీ అన్నా… స్థానికులకే పెద్దపీట అని నినదించినా… శివసేన మహరాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తూ వచ్చింది. ఎంతటి జాతీయపార్టీలైనా శివసేన కనుసన్నల్లో నడిచేలా ఏలింది. ఇప్పుడీ పార్టీకి 60 ఏళ్లు… కానీ, 60 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంలో ఇప్పుడు శివసేన రెండుగా చీలిపోయింది. బ్రిటీష్ కాలం నుంచీ వింటూ వస్తున్న విభజించి పాలించు అనే ఆటవిక పద్ధతే రాజకీయమైపోయి.. రాజకీయమంటేనే అలా ఉంటుందనే కాలంలో శివసేనది ఇప్పుడు అస్తిత్వ పోరాట సమస్య.

గమ్మత్తేంటంటే, 25 ఏళ్లపాటు బీజేపీకి స్థిరమైన మిత్రపక్షంగా ఉన్న అవిభాజ్య శివసేన.. ఇవాళ అదే బీజేపీ వల్ల రెండుగా నిట్టనిలువుగా చీలిపోవడం. ఉద్ధవ్ బాల్ థాకరే పేరిట యూబీటీ శివసేనగా చీలిపోయి.. అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న ఉద్ధవ్ వర్గం ఒకవైపు… పెరుగుతున్న బీజేపీ ఆధిపత్య రాజకీయాల్లో ఏక్ నాథ్ షిండే రూపంలో జరిగిన ఈ చీలికతో మర్రి మాను కింద ఓ చిన్న మొక్కలా ఉంటూనే తన ప్రాధాన్యత కోసం ఆరాటపడుతున్న మరోవర్గం… ఇలా రెండు భాగాలుగా శివసేన ఒక క్రైసిస్ ఎదుర్కొంటోంది.

మహారాష్ట్ర రాజకీయాల్లో ఒకనాడు శివసేనది పెద్దన్న పాత్ర. 2014లో నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక మాత్రం రాజకీయ సమీకరణాలిక్కడ పూర్తిగా మారుతూ వస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ – శివసేన కూటమి విచ్ఛిన్నం మొదలైంది. నాల్గు నెలలనంతరం అవి కలిసినా.. తెగిన రబ్బర్ అతుకబెట్టినట్టుగా… మునుపటి స్నేహపూర్వక వాతావరణం మాత్రం కనిపించలేదు. తరచూ ఉద్రిక్తతలు, విభేదాలు రెండింటి మధ్యా స్పష్టంగా కనిపించాయి.

ఇక 2019కి వచ్చేసరికి ఈ విభేదాలు, తగాదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి పదవి విషయంలో తలెత్తిన అభిప్రాయభేదాలతో.. శివసేన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి బయటకొచ్చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు శివసేనను నిట్టనిలువుగా రెండు వర్గాలుగా విడగొట్టే దిశలో సాగాయి.

అంతర్గత తిరుగుబాట్ల చిరునామా శివసేన!

ఛగన్ భుజ్ బల్ నుంచి మొదలు గణేష్ నాయక్, నారాయణ్ రాణే, రాజ్ ఠాక్రే వంటి నేతలంతా గతంలో శివసేనపైన తిరుగుబావుటా ఏగురేసినవారే. కానీ, 2022లో ఏక్ నాథ్ షిండే రూపంలో జరిగిన తిరుగుబాటే శివసేనను అతి పెద్ద కుదుపు కుదిపేసింది.

శివసేనతోనే ఎదిగిన షిండే ఏకంగా 39 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఎంపీలతో కలిసి పార్టీని వీడి.. ఆ తర్వాత తనదే శివసేనగా క్లెయిమ్ చేసుకుని పార్టీ పేరును, విల్లు, బాణం సింబల్ నూ సొంతం చేసుకుని శివసేన రాజకీయ ప్రస్థానంలో ఒక పెద్ద సంక్షోభానికి తెరలేపాడు.

అగ్నిజ్వాలల్లాంటి ఉపన్యాసాలతో అలరించిన బాల్ ఠాక్రే పార్టీకి గడ్డు రోజులు!

1966 సమయంలోనే చురుకైన మాటలతో, ఆకట్టుకునే ప్రసంగాలతో ప్రసిద్ధి చెందిన బాల్ కేశవ్ ఠాక్రే ఉరఫ్ బాలాసాహెబ్ ఠాక్రే శివసేనను స్థాపించారు. ఒక కార్టూనిస్టుగా అప్పటికే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న బాల్ ఠాక్రే… సామాజిక సంస్కర్తైన కేశవ్ ప్రబోధంకర్ ఠాక్రే కుమారుడు. మహారాష్ట్రలోని మరాఠీ మాట్లాడే జనం హక్కుల కోసం ఉద్యమంచిన నాయకుడిగా గుర్తింపు పొందారు.

బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన మహారాష్ట్రలో… ముఖ్యంగా ముంబైలో ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది. శివసైనికులు వీధి స్థాయిలో స్ట్రీట్ ఫైటర్స్ గా పార్టీ లక్ష్యాల కోసం కష్టపడి, కట్టుబడి పనిచేసి పార్టీకి గుర్తింపు తెచ్చారు.

అవిభాజ్య శివసేన నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు!

60 ఏళ్ల అవిభాజ్య శివసేన చరిత్రలో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని చూసింది. మనోహర్ జోషి, నారాయణ్ రాణే, ఉద్ధవ్ ఠాక్రే. కానీ, వీరెవ్వరూ కూడా ఐదేళ్ల పూర్తి పదవీకాలం పాటు ముఖ్యమంత్రి పదవిలో లేకపోవడం కూడా ఓ విశేషం. 2022లో జరిగిన శివసేన విభజన తర్వాత.. చీలికైన శివసేన నుంచి షిండే రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీంతో శివసేన నుంచి నల్గురు ముఖ్యమంత్రులు పనిచేసిన రికార్డ్ కూడా శివసేన పేరిట చేరింది.

ఉద్ధవ్ ఠాక్రేకు సవాళ్ల మీద సవాళ్లు!

బాల్ ఠాక్రే పార్టీ స్థాపించి.. ముంబైని శాసించే స్థాయికెదిగే క్రమంలో.. మహారాష్ట్రలో ఒక కీలకపార్టీగా అవతరించే సమయంలో ఎదుర్కొన్న సవాళ్లకంటే కూడా ఇప్పుడు కొడుకు ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురవుతున్న సవాళ్లే పెద్దవి. ముఖ్యంగా బాల్ ఠాక్రే కాలంలో బీజేపీ రాజకీయాలు ఈవిధంగా లేకుండేవి. ఇంత పెద్ద శక్తిగా కూడా అప్పటికింకా బీజేపీ అవతరించలేదు. కానీ, ప్రస్తుతం చీలిపోయిన రెండు శివసేన వర్గాలూ… అలాంటి బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. షిండే వర్గాన్ని పూర్తిగా బీజేపీ నడిపిస్తుంటే.. యూబీటీ శివసేన వర్గం బీజేపీని ఎలాగైనా ఢీకొట్టే క్రమంలో అపసోపాలు పడుతోంది.

ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గానికి అసెంబ్లీలో కేవలం 20 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం మాత్రమే ఉంది. అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ… షిండే వర్గానికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ మంది ఎమ్మెల్యేలుండటంతో… వారిదే పైచేయి. షిండే వర్గానికి బీజేపీ కూడా మద్దతుండటంతో ఇంక తిరుగు లేకుండా పోయింది. అదే సమయంలో యూబీటీ తీవ్ర సంక్షోభాన్నెదుర్కొంటోంది.

బృహన్ ముంబైపై పట్టు కోల్పోయిన శివసేన!

శివసేన రెండుగా చీలిపోకమునుపు.. అవిభాజ్య శివసేనగా ఉన్న కాలమంతా స్వర్ణయుగం. 1997 నుంచి 2022 వరకూ కూడా 25 ఏళ్ల పాటు బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పై శివసేదే ఆధిపత్యం. కానీ, 2022లో కార్పోరేటర్ల పదవీ కాలం ముగిసి ఎన్నికలయ్యేసరికి పూర్తిగా సీన్ మారిపోయింది. 2026లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లోనైతే ఏకంగా బీజేపీ అతి పెద్ద శక్తిగా అవతరించి.. తమ మేయర్ ను బీఎంసీలో ఏర్పాటు చేసుకోగల్గింది. ప్రస్తుతం ఉద్దవ్ ఠాక్రే యూబీటీ శివసేన మహారాష్ట్రలో ఒక్క పరభణి మున్సిపల్ కార్పోరేషన్ లో మాత్రమే జెండా ఎగురేసి మేయర్ పీఠాన్ని దక్కించుకోగల్గింది.

కుటుంబ పార్టీల రాజకీయాలు – మారుతున్న ప్రాధాన్యతలు!

వారసత్వ రాజకీయాలపై భారతదేశంలో ఎప్పుడూ పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కుటుంబ వారసత్వం ఆధారంగా నాయకత్వ మార్పులు జరిగే ప్రాంతీయ పార్టీల హవా విషయంలో… ఇప్పుడు మహారాష్ట్రలో రెండుగా చీలిపోయిన శివసేన నిశితంగా పరిశీలించాల్సిన ఒక కేస్ స్టడీ. ఎందుకంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల విషయంలో షిండే శివసేన ఎక్కువ స్థానాలు గెల్చుకున్నప్పటికీ.. ఓట్ల విషయానికి వచ్చేసరికి ఈ రెండు వర్గాలకూ ఓటింగ్ శాతం తగ్గినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.

ప్రమాదంలో యూబీటీ ఉనికి!

అవిభాజ్య శివసేన విభజన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే వర్గం మెల్లిమెల్లిగా తన ప్రాధాన్యతను కోల్పోతూ వస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన ఎంపీల ఘటన మరువకముందే… ఆ మంట చాపకింద నీరులా మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే పీఠం కిందకు వచ్చింది. ఎప్పటికప్పుడు రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు, డైనమిక్స్ ను గమనించకపోతే… చుట్టుపక్కల రాష్ట్రాలు, దేశంలో జరుగుతున్న రాజకీయాలపై అవేర్ గా లేకపోతే.. ఏం జరుగుతుందో యూబీటీ గ్రహించలేకపోయింది. గమనించేసరికి జరగాల్సిందతా జరిగిపోతూనే ఉంది.

అధికారానికి దూరమవ్వడం కూడా యూబీటీకి మరింత కష్టాలను తెచ్చిపెడుతోంది. దీంతో ఇప్పుడు యూబీటీ శివసేన ఆరుగురు ఎంపీలు పార్టీకి దూరమవ్వడంతో పాటే.. రాబోయే రోజుల్లో రాజ్యసభకు పంపే సభ్యుల సంఖ్యపైనా నేరుగా డివిజన్ పాలిటిక్స్ ప్రభావం ఉండబోతోందన్నది విశ్లేషకుల అంచనా. దీనివల్ల జాతీయ రాజకీయాల్లో యూబీటీ శివసేన ప్రాతినిథ్యం కూడా తగ్గిపోతుంది.

సైద్ధాంతికంగానూ బలహీనపడ్డ శివసేన!

శివసేన పార్టీగానే కాకుండా.. ఇప్పుడు సైద్దాంతికంగానూ సంక్షోభ కాలాన్ని ఎదుర్కొంటోంది. ఎందుకంటే, బీజేపీ కూడా అదే హిందుత్వ ఎజెండాతో విస్తరిస్తూ.. మహారాష్ట్ర రాజకీయాలను ఇప్పటికే తన చేతుల్లోకి తెచ్చుకుంది. అయితే, బీజేపీకి ఇంకా పూర్తి స్థాయి సంఖ్యా బలం లేకపోవడంతోనే షిండే నేతృత్వంలోని శివసేన ఇంకొంత కాలం ప్రాధాన్యతను కల్గి ఉండవచ్చునేమోగానీ.. ఆ తర్వాత క్రమంగా బీహార్ లో జేడీయూ తరహాలోనే షిండే శివసేన కూడా ప్రాధాన్యతను కోల్పోయే ప్రమాదమే ఎక్కువ కనిపిస్తోంది.

మొత్తంగా ప్రాంతీయ పార్టీలు, వారసత్వ రాజకీయాలు, సైద్ధాంతిక సంక్షోభాలు.. విభజన రాజకీయాలు ఇలా ఎన్నో పాఠాలు చెప్పే ఓ రాజకీయ పాఠ్యపుస్తకంలా మనం ఇప్పుడు మహారాష్ట్ర తాజా రాజకీయాలను అధ్యయం చేయొచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles