అప్పటివరకూ వాడుకలో లేని వేడుకకు భారత క్రికెట్ ను వేదిక చేశాడు. 24 ఏళ్లకే కెప్టెన్ గా ప్రపంచకప్ పైకెత్తినవాడు. గెలుపొక ఉత్సవం కావాలంటే ఎంత ఉత్సాహంగా ఆడాలో చూపించినవాడు. నేటితరానికి తాను చేసిన ఉత్సవంతో ఉత్సాహం నింపినవాడు. ఒకే ఒక్కడు.. హర్యానా హరికేన్ నామధేయుడు.. ఆ కపిల్ దేవుడే ఇవాల్టి క్రికెట్ దేవుడు.
భరతమాత ముద్దుబిడ్డైన కపిల్ దేవ్ కు క్రికెట్ పట్ల ఉన్న ప్యాషనే.. ప్రపంచకప్ సాధనకు, వరల్డ్ క్రికెట్ లోనే ఆయనో ఐకానిక్ ఫిగర్ గా అవతరించడానికి కారణం. 1983లో తన నాయకత్వంలో కపిల్ సాధించింది కేవలం ప్రపంచకప్పు మాత్రమే కాదు… అప్పటివరకూ ప్రపంచ క్రికెట్ లో మిగిలిన జట్లలో ఒకదానిగా మాత్రమే కొనసాగుతున్న భారత్ పై ఒక విశ్వాసం పెరిగేందుకు కారణమైంది. ఒక్కమాటలో భారత జెండాను ప్రపంచ క్రికెట్ యవనికపై రెపరెపలాడించింది.

ఇప్పుడంటే వెస్ట్ ఇండీస్ అంటే నాలుకపై తీసేసంత తీసికట్టుగా తయారై ఉండొచ్చునేమోగానీ.. అప్పుడు వెస్ట్ ఇండీస్ ను ఢీకొట్టడమంటే ఏ జట్టుకైనా అదో మహాయుద్ధమే. అదిగో అలాంటి సమయంలో 1983 ప్రపంచకప్ ను ఫైనల్ లో వెస్ట్ ఇండీస్ పై విజయాన్ని ముద్దాడి… భారతదేశానికి ఓ భావోద్వేగమయ్యాడు కపిల్ దేవ్. చాలా మంది క్రికెటర్స్ అయితే బౌలింగ్.. లేదా, బ్యాటింగ్ లో మాత్రమే నిష్ణాతులై ఉంటారు. అంత ఫోకస్డ్ గా ఒక వింగ్ ను ఎంచుకుంటారు. కానీ, బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ దుమ్మురేపాడు కపిల్. అదే వరల్డ్ కప్ లో జింబాబ్వేపై కెప్టెన్ అంటే ఎలా ఉండాలో ముందుండి నడిపించిన నాయకుడిలా కపిల్ ఆడిన తీరు భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ అజరామరం. అప్పటికే, ఆస్ట్రేలియా, విండీస్ తో టఫ్ ఫైట్ ను ఎదుర్కొంటున్న భారత్.. జింబాబ్వేపై చావో, రేవో తేల్చుకోవాల్సిన మ్యాచది. 17 కు 5 వికెట్లను కోల్పోయింది ఇండియా. అదిగో అప్పుడు ఎంటరయ్యాడు. కెప్టెన్ అంటే ఏంటో చూపించాడు. రోజర్ బిన్నీతో కలిసి 60 పరుగుల భాగస్వామ్యం చేశాక బిన్నీ 22 వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత కిర్మాణీ 24 రన్స్ తో కపిల్ కు సపోర్ట్ గా నిల్చాడు. అలా 60 ఓవర్ల మ్యాచ్ లో 266 పరుగులు చేశారు. కపిల్ 138 బాల్స్ లో 16 బౌండరీలు, ఆరు సిక్సులతో ఏకంగా 175 వ్యక్తిగత స్కోర్ తో ఒక రికార్డ్ సృష్టించిన ఆట అది. అయితే ఆ టైంలో బీబీసీ స్ట్రైక్ లో ఉండటంతో ఆ అద్భుతమైన మ్యాచ్ కు సంబంధించిన లైవ్ టెలిక్యాస్ట్ కూడా లేకుండా పోయింది.
వాస్తవానికి నాకౌట్ దశకు చేరాలంటే జింబాబ్వేపై జరిగిన ఆ మ్యాచ్ ఎంతో క్రూషియల్. అలాంటి సమయంలో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలి ఐదు వికెట్లు కోల్పోయిన దశలో కపిల్ జట్టును నిలబెట్టి గెలిపించిన తీరు… అదే స్పిరిట్ ను కొనసాగిస్తూ ఫైనల్ లో విండీస్ పై జయకేతనం ఎగురేసిన తీరు భారత క్రికెట్ చరిత్రలోనే ఓ నోస్టాల్జియా.
సీ.కే. నాయుడు లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ అందుకుంటున్నప్పుడు కిర్మాణీ ఏమంటాడంటే.. 1983 వరల్డ్ కప్ గెలవడానికి బిగ్ రీజన్ ఎవరంటే కపిల్ దేవ్ మాత్రమేనంటాడు. మాటలు కాదు.. చేతల్లో చూపించే వ్యక్తి కపిల్ అంటూ పొగిడాడతను.
కపిల్ బౌలింగ్ యాక్షనే డిఫరెంట్. ఇప్పటికీ అలాంటి బౌలింగ్ యాక్షన్ ను ఇంకొకరిని చూడలేం. అలా భారతీయులతో పాటు, ప్రపంచ అభిమానులెందరిలోనో రిజిస్టర్ అయిపోయిన కపిల్ నేపథ్యం కూడా సునీల్ గవాస్కర్, రోజర్ బిన్నీ, కిర్మాణీ వలె అర్బన్ ఒరియెంటేషన్ నుంచి వచ్చిందేం కాదు. కానీ, కపిల్ కు ఆటపై ఉన్న మక్కువతో మాత్రమే మిగిలినవారందరికీ భిన్నంగా అంతెత్తు ఎదగగల్గాడు.
1983 కప్ కెప్టెన్ గా వ్యవహరించిన కపిల్ సీనియర్స్ తో ఒకటే చెప్పేవాడట. మీరంతా సీనియర్స్. మీ బాధ్యతలేంటో మీకు తెలుసు. నేను చెప్పాల్సిన పనేం లేదు. నేనేమైనా తప్పు చేసినా నన్ను గైడ్ చేయాల్సిన బాధ్యత కూడా కల్గిన వాళ్లు. పైగా ప్రత్యర్థుల గురించి బాగా తెలిసినవాళ్లు. మనకు కోచ్ కూడా ఎవరూ లేరు. కాబట్టి ఒకరికొకరం మనం సహకరించుకుందాం. ప్రత్యర్థులను చిత్తు చేద్దాం. ఇదిగో ఇలాంటి ఆలోచనలు, స్మార్ట్ కెప్టెన్సీతో కపిల్ ప్రపంచకప్ ను కొల్లగొట్టి భారత్ కు క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించాడు.
కోర్ట్నీ వాల్ష్ తన రికార్డును అధిగమించేవరకూ అంటే సుమారు 8 ఏళ్లపాటు అత్యధికంగా 434 టెస్ట్ వికెట్స్ తీసిన బౌలర్ గా కపిల్ పేరే రెపరెపలాడింది. 431 వికెట్లతో టెస్టుల్లో రిచర్డ్ హ్యడ్లీ పేరు మీదున్న రికార్డును కపిల్ చెరిపేశాడు. ఇక వన్డేల్లోనూ 1994లో వసీం అక్రమ్ బ్రేక్ చేసేవరకు 253 వికెట్లతో కపిల్ పేరే నంబర్ వన్ గా కొనసాగింది.
1983 ప్రపంచకప్ లోనే కపిల్ ఆటనోసారి పరిశీలిస్తే మొత్తం 303 రన్స్, 12 వికెట్స్, 7 క్యాచులతో ఒక కెప్టెన్ గా ఉండి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనబర్చాడు. 1990లో జరిగిన ఓ టెస్ట్ మ్యాచులో ఎడ్డీ హెమ్మింగ్స్ బౌలింగ్ లో వరుసగా నాల్గు సిక్సులు బాది తనెంత అగ్రెసివ్ గా బ్యాట్ ఝళిపించగలడో చూపించాడు. అంతేకాదు, టెస్టుల్లో ఒక్కసారి కూడా రన్ ఔట్ కాని రికార్డ్ కపిల్ దేవ్ కే దక్కింది. 16 ఏళ్లపాటు 131 టెస్టులాడితే ఒక్కసారి కూడా గాయాల కారణంగానో, ఇతరత్రా కారణాల వల్లనో ఏనాడూ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా మిస్ కాలేదు కపిల్ దేవ్.
2002లో ఒక సర్వే నిర్వహిస్తే సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ కంటే కూడా అత్యధిక ఓట్లు సంపాదించి క్రికెటర్ ఆఫ్ ది సెంచరీగా ఎంపికైనవాడు కపిల్. టెస్టు క్రికెట్ లో వంద వికెట్లు, వెయ్యి పరుగులు సాధించిన అతి పిన్న వయస్కుడిగా కూడా కపిల్ పేరే నిల్చిపోయింది.
కపిల్ దేవ్ రామ్ లాల్ నిఖంజ్ అనే హర్యానా హరికేన్… 1959, జనవరి 6న పంజాబ్ చండీగడ్ లో జన్మించాడు. 1975లో ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లోకి ఎంటరైన కపిల్.. 1975 నుంచి 1992 వరకూ కూడా హర్యానా కొరకు 17 ఏళ్లపాటు ఆడాడు. తన ఫస్ట్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ పాకిస్థాన్ తో ఫైసలాబాద్ లో 1978లో ఆడిన కపిల్ ఆ తర్వాత తన ఫెర్మార్మెన్స్ తో భారత క్రికెట్ దశదిశనే మార్చేశాడు. కపిల్ మూడు తన ఆటోబ్రయోగఫీస్ బుక్స్ నూ మన ముందుంచాడు. గాడ్స్ డిక్రీ, క్రికెట్ మై స్టైల్, స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్ వంటి మూడు పుస్తకాలు కపిల్ ను మరింతగా మనకు పరిచయం చేస్తాయి.
పద్మభూషణ్, పద్మశ్రీ , ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్, సీ.కే. నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వంటి ఎన్నో పురస్కారాలు కపిల్ ఖాతాలో ఉన్నాయి.
భారత క్రికెట్ చరిత్రలో ఎందరు ఎన్ని రికార్డులు నెలకొల్పినా… కపిల్ అనే పేరు మాత్రం సువర్ణాక్షరాలతో శాశ్వతంగా మిగిలిపోయేది. హ్యాపీ బర్డ్ డే టూ హర్యానా హరికేన్!



