అతడేమో అడవిని సృష్టించాడు… వారేమో అడవిని తగలబెడుతున్నారు!

వివేక్ లంకమల.. ✍🏻

నువ్వెప్పుడైనా మొక్కలు నాటావా?
నువ్వు నాటిన మొక్క బతికి, చెట్టవ్వడం చూశావా?

ఎప్పుడోకప్పుడు మనందరం చెట్లు నాటింటాం. అవి చిగురెత్తగానే ఏదో తెలియని సంతోషం. మన సంబరమంతా నాలుగు రోజులే. ఆ ఎగ్జయిట్మెంట్ తీరగానే అవే పెరుగుతాయిలే అని వదిలేస్తాం. బతికి కాలానికి నిలబడేవి కొన్నే.

కానీ అతడు నిలబడ్డాడు.
ఒక్కో మొక్కను నాటుతూ, నాటిన మొక్కను కాపాడుకుంటూ ఒక అడవినే సృష్టించాడు.

చెట్లను వెతుక్కుంటూ పక్షులు, ఆహారాన్ని వెతుక్కుంటూ జంతువులు వచ్చాయి. ఏనుగులు, పెద్ద పులులకు కూడా ఆవాసమైంది. ఒక మానవ నిర్మిత ఎకో సిస్టమ్ తయారైంది.

అదే అస్సాంలోని ‘మొలాయ్ రిజర్వ్ ఫారెస్ట్’.

అతడే ‘జాదవ్ పాయెంగ్, ది ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’.

బ్రహ్మపుత్ర నదికి వరదలెక్కువ. ఒకసారి వరదొచ్చిందంటే నదికి అటు ఇటు కిలోమేటర్ల మేర ఇసుక మేటలు పేరుకుపోతాయి. ఇసుకలో గెడ్డి కూడా మొలవదు. ఒకవేళ మొలిచినా మళ్లీ సంవత్సరం వచ్చే వరదలో పూడుకుపోతాయి.

వరదొచ్చినప్పుడు సముద్రంలా
నీళ్లు లేనప్పుడు ఇసుక ఎడారిలా కనిపిస్తుంది. అందుకే బ్రహ్మపుత్ర నదిని అస్సాం దుఃఖదాయని అంటారు.

ఆ దుఃఖానికి అతడు చిరు సాంత్వన కలిగించాడు. అలాగని అతడేమీ దేశ విదేశాలు తిరిగి, పీహెచ్‌డీలు పూర్తిచేసుకొచ్చినోడు కాదు, బ్రహ్మపుత్ర నది ఒడ్డున అస్సాం రాష్ట్రంలోని ఒక మారుమూల పల్లెలో ఆవును మేపుకుంటూ జీవనం సాగించే సాధారణ మనిషి.

మొక్కలు నాటాడు. నీళ్లు పోశాడు. అతడు నాటిన వనం1360 ఎకరాల అడవిలా మారింది. ఇదంతా అతడొక్కడే చేశాడు. డబ్బుతో కాదు, ప్రేమతో, బాధ్యతతో.

సుప్రీంకోర్టే సర్టిఫికేట్ ఇచ్చి మరీ చేయించబోయిన ఆరావళి పర్వతాల మైనింగ్ సంఘటన నిన్ననే చూశాం.

బాక్సైట్, ఐరన్ ఓర్ మైనింగ్ కోసం పాలకులు పట్టుబట్టి మరీ చేయిస్తున్న దండకారుణ్య విధ్వంసం ఇంకా పచ్చిగానే ఉంది.

ప్రాజెక్ట్ టైగర్, శాంక్చయరీ అని సామాన్యులకు కథలు చెప్పి, యురేనియం ఉందని తెలియగానే మైనింగ్ మొదలుపెట్టబోయి ఆగిన నల్లమల గొడవ మనకు తెలియనిది కాదు.

బైరెటీస్, లిథియం, యురేనియం, గోల్డ్, డైమండ్స్ ఇలా ఏ కొంచెం సంపాదనకు అవకాశం ఉందని తెలిస్తే చాలు

లక్షల సంవత్సరాల అడవి అనే ఆలోచన లేదు
వేల ఏళ్లుగా కాపాడుకున్న ప్రకృతి సంపద అనే ములాజు లేదు

అడవులకు అడవులు, ఏరియాలకు ఏరియాలు, బ్లాకులు బ్లాకులుగా కార్పొరేట్‌లకు అమ్మి పెట్టడమే దేశ పాలకుల నయా ట్రెండ్. ఏమైనా అంటే దేశం కోసం, ధర్మం కోసం అనే పల్లవి ఎత్తుకుంటారు.

రియల్ ఎస్టేట్‌లో ఆదాయాన్ని, కన్‌స్ట్రక్షన్‌లో తృప్తిని వెతుక్కుంటున్న భారతదేశంలో ఇసుక అత్యంత విలువైనది.

ఎక్కడిక్కడ డ్యాంలు కట్టడం, వరద పొర్లి కిందికి రావడం తగ్గుతుండడంతో చిన్న చిన్న నదులు, వాగులు, వంకల్లో ఇసుక తయారు కావడం కొంత తగ్గింది. ఇక మిగిలింది పెద్ద పెద్ద నదులే. అందుకే విపరీతంగా తోడేస్తున్నారు.

అలా బ్రహ్మపుత్రను తోడటం మొదలపెట్టారు. దానికతడు అడ్డు నిలిచాడు. బెదిరించారు, భయపెట్టారు. అయినా అతడు లొంగలేదు. మైనింగ్ మాఫియాకు రాజకీయ నాయకులతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా తోడయ్యింది. ఇంకేముంది ఇప్పుడు అతడి అడవినే తగలబెడుతున్నారు.

పాలకులే ప్రకృతి విధ్వంసాన్ని ప్రోత్సహిస్తున్న నయా భారతంలో

ఏటికి ఎదురీది
సృష్టికి ప్రతిసృష్టిలా అడవిని సృష్టించిన అతడెంత..?

its UTVలో వివేక్ గారి ఈ లింక్ కూడా చూసేయండి. కింద ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles