15 ఏళ్ల కుర్రాడు.. నాల్గంకెల స్కోర్ చేసి ప్రపంచాన్నే నివ్వెరపర్చాడు!

మనమెప్పుడూ లైమ్ లైట్ లో ఉండే ఆటగాళ్లు, సెలబ్రిటీల గురించే చర్చింకుంటాం. మీడియా కూడా వాటినే ఎక్కువ చూపించడమూ.. మట్టిలో మాణిక్యాలకు అలాంటి ప్రచారం దక్కకపోవడమూ అందుకు ఓ కారణం. ప్రపంచ క్రికెట్ దిగ్గజాలనే తన స్కూల్ డేస్ లోనే బ్యాటింగ్ తో అబ్బురపర్చిన ఓ క్రికెటర్ ఘనత గురించి తెలుసుకుందాం.

అతనే ప్రణవ్ ధన్వాడే. జస్ట్ 15 ఏళ్ల వయస్సుకే.. ఒక ఇన్నింగ్స్ లో 1 వెయ్యి 9 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్ నే నివ్వెరపర్చాడు ఈ ముంబై కుర్రాడు.

సరిగ్గా పదేళ్ల క్రితం ఈ అద్భుతం జరిగింది. ముంబై సబర్బన్ ప్రాంతంలో ఓ సాధారణ మైదానం. అక్కడేం స్టేడియం కాదు, స్టాండ్స్ లేవు, పెద్దగా జన సమూహం లేదు. షూట్ చేసి టీవీల్లో చూపించే కెమెరాలూ లేవు. కానీ, 2016, జనవరి 5న పాఠశాల క్రికెట్ ఎప్పుడూ చూడని ఓ ఇన్నింగ్స్ కు తెరలేచింది.

ప్రణవ్ ధన్వాడే అనే కుర్రాడు హెచ్టీ బండారీ కప్ ఆడుతున్నాడు. అది రెండు రోజుల ఇంటర్ స్కూల్ మ్యాచ్. ధన్వాడే స్మితి కే.సీ. గాంధీ స్కూల్ తరపున ఓపెనింగ్ కు దిగాడు. జట్టు డిక్లేర్ చేసే సమయానికి అతడి స్కోర్ 327 బంతుల్లో 1009 పరుగులు.. పైగా నాటౌట్. గుర్తింపు పొందిన పాఠశాల క్రికెట్ మ్యాచ్ అది. అలాంటి మ్యాచులో నాల్గంకెల స్కోర్ చేసిన ఒకే ఒక్క ఆటగాడు ప్రణవ్ ధన్వాడే. తన రికార్డుతో.. 117 ఏళ్ల రికార్డులన్నీ కూలిపోయాయి. 1899లో ఆర్థర్ కాలిన్స్ చేసిన 628 పరుగుల స్కోర్ కూడా ధన్వాడే ముందు ఓ చెరిపేసిన చరిత్రగా మారిపోయింది.

అయితే, ఇప్పటికీ కూడా నమ్మశక్యం కాని అంకెలు.. ధన్వాడే స్కోర్ సాధించడం విశేషం. వెయ్యి తొమ్మిది పరుగుల్లో… ధన్వాడే 129 ఫోర్స్, 59 సిక్సర్స్ బాదాడు. స్ట్రైక్ రేట్ 308.56. క్రీజులో మొత్తం 396 నిమిషాలు.. అంటే, రెండు రోజులపాటు ఆరున్నర గంటలకుపైగా బ్యాటింగ్ చేశాడు. తన జట్టు స్కోర్ 1465/3. మొత్తం స్కోరులో 70 శాతం పరుగులు ధన్వాడేవే.

ప్రణవ్ ప్రారంభంలో జాగ్రత్తగా ఆడాడు. మొదటి రోజు లంచ్ సమయానికి ప్రణవ్ చేసింది కేవలం 45 పరుగులే. ఆరోజు ఇన్నింగ్స్ ముగిసే సరికి 652 ప్రణవ్ స్కోర్. కలయా, నిజమా అన్నట్టుగా ఆడాడు. అలా ధన్వాడే ఆడుతుండగానే.. ఆయన ఇంట్లో ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. స్నేహితులు, బంధువుల ద్వారా తల్లిదండ్రులకు విషయం తెలిసింది. తను మొదటిరోజు ఆట ముగించేవరకే.. పృథ్వీ షా చేసిన 546 పరుగుల రికార్డును చెరిపేశాడు. శతాబ్దానికి పైగా నిల్చిన ఆర్థర్ కాలిన్స్ మార్కునూ దాటేశాడు.

తెల్లవారి ఉదయం నెక్స్ట్ ఇన్నింగ్స్ లో మళ్లీ ఫ్రెష్ గా దిగిన ప్రణవ్.. ధూంతడాఖా చూపించాడు. అదేం పెద్ద ఇంటర్నేషనల్ మ్యాచేం కాదు. కానీ, ప్రణవ్ ఆట గురించి అప్పటికే ఆ నోటా ఈనోటా మార్మోగడంతో ఆ గ్రౌండ్ నలుమూలలా జనం గుమ్మిగూడారు. ఫెన్సింగ్స్ వద్ద నిలబడి చూశారు. అలా లంచ్ సమయానికి ప్రణవ్ 921 పరుగులు సాధించాడు. విరామం తర్వాత నాల్గు అంకెలు దాటి.. ఏకంగా 1 వెయ్యి 9 పరుగులు చేసి యావత్ క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపర్చాడు. ఆ సమయంలో పెద్ద వేడుకేమీ లేదుగానీ.. కొన్ని కెమెరాలు మాత్రం అతణ్ని బంధిస్తున్నాయి. అలా దుమ్మరేగుతున్న ఆ మైదానంలో బ్యాట్ అప్ చేసి సాధించిన ఒకింత విజయ గర్వం మాత్రం ప్రణవ్ లో కనిపించింది.

క్రికెట్ కు పెట్టింది పేరైన ముంబైలో చిన్న చిన్న ఇన్నింగ్స్ ఆడితే ముందుకెళ్లలేరు. వందలు, రెండొందలు చేస్తే జట్టులో ఎవ్వరూ తీసుకోరని తన కోచ్ తనకు చెప్పినట్టు ఓ మీడియా సంస్థకు తెలిపాడు ప్రణవ్. బ్యాటింగ్ కు దిగినప్పుడు అతడి ప్లాన్ సింపుల్. పెద్ద ఇన్నింగ్స్ ఆడాలన్నదే తన బలమైన కోరిక. అలా వంద, రెండొందలు, మూడొందలు.. చివరకు వెయ్యికి చేరుకున్నాడు. మధ్యలో అదృష్టం కూడా తోడవ్వడంతో.. కొన్ని లైఫ్స్ వచ్చాయి. కొన్ని క్యాచులు, ఓ స్టంప్ అవుట్ అవకాశం కూడా చేజారడంతో.. దాన్ని తన పరుగుల వరదకు అవకాశంగా మల్చుకున్నాడు. అయితే సెషన్ తర్వాత సెషన్ క్రీజులో అన్నేసి గంటలు ఆ వయస్సులో ఆడేందుకు కావల్సిన శారీరక, మానసిక స్థైర్యం ప్రణవ్ లో ప్రత్యేకం.

ఇక టెంపర్మెంట్ పరంగా చూసినా.. 101 శాతం ఫిట్ అన్నట్టుగా ఆ యువకుడు అందరినీ ఆకట్టుకున్నాడు. ఎంత స్కోర్ చేసినా అలసట లేకపోవడం అక్కడివారిని ఆశ్చర్యపర్చింది. సెంచరీ చేస్తే నీళ్లు కావాలనేవారే ఎక్కువ. కానీ, అందుకు భిన్నంగా ఊహకందని రీతిలో ఆడి ఒక మామూలు గ్రౌండ్ కు అంతర్జాతీయ స్టేడియంలో జరిగే బిగ్ మ్యాచును మించిన కిక్కునందించాడు. మొత్తంగా మ్యాచ్ ముగిసే సరికి ప్రణవ్ ప్రాతినిథ్యం వహించిన స్మితి కే.సీ. గాంధీ స్కూల్ 1382 పరుగుల ఆదిక్యంతో గెల్చింది.

ప్రణవ్ తండ్రి ప్రశాంత్ కళ్యాణ్ ప్రాంతంలో ఆటో డ్రైవర్. మొదటిరోజే ఓ దోస్త్ ఫోన్ చేసి నీ కొడుకు ఇక్కడ చించిపారేస్తుండని చెప్పాడు. వెంటనే తండ్రి పరిగెత్తుకొచ్చి కొడుకు ఆటను ఆస్వాదించాడు. రెండోరోజు తల్లిదండ్రులిద్దరూ వచ్చి చూశారు. వెయ్యి 9 పరుగులు చేయడంతో మురిసిపోయారు, గర్వపడ్డారు. తెల్లారేసరికి కళ్యాణ్ ప్రాంతంలోని వాయాలే నగర్ చుట్టూ మీడియా వెహికిల్స్ నిండిపోయాయి. ప్రణవ్ తల్లిదండ్రులైన ప్రశాంత్, మోహినీకి శ్వాస కూడా పీల్చుకునేంత సమయం ఇంటర్వ్యూలిస్తూ పోయారు. అప్పటికే ప్రణవ్ గురించి ప్రపంచమంతా మాట్లాడుతోంది.

ది గార్డియన్ వంటి పత్రిక నర్వస్ 990లను దాటిన తొలి క్రికెటర్ గా కొనియాడింది. సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో అభినందించి.. కష్టపడుతూ మరిన్ని కొత్త శిఖరాలు అధిరోహించాలని సూచించాడు. ఆజింక్య రహానే సందేశం పంపించాడు. ఎం.ఎస్. ధోనీ మార్గదర్శకత్వం చేస్తూ కొన్ని ప్రాధాన్యాలను వివరించాడు. అంతేకాదు, ప్రణవ్ వయస్సులో అంత స్కోర్ చేయడం చాలా చాలా కష్టమన్నాడు ధోనీ. అయితే అలాంటి సక్సెస్ ఫుల్ స్కోర్ చేశాక వచ్చే లైమ్ లైట్ ప్రభావం ప్రణవ్ పై పడకుండా.. అతణ్ని మరింత ముందుకెళ్లేలా చేయడంలో వారి తల్లిదండ్రులు, కోచ్ పాత్ర ముఖ్యమంటూ ధోనీ సూచించాడు.

మైఖేల్ ఆథర్టన్ ఒక టెస్ట్ మ్యాచ్ ప్రసారంలో ప్రణవ్ ఆడిన ఇన్నింగ్స్ ను ప్రస్తావించాడు. మహారాష్ట్ర క్రీడల మంత్రి ప్రణవ్ విద్య, కోచింగ్ కు తన మద్దతుంటుందని ప్రకటించాడు.

ముంబై ఎందరో ప్రతిభావంతులను క్రీడా ప్రపంచానికి పరిచయం చేసింది. కిశోర వయస్సులోనే టెండూల్కర్ – వినోద్ కాంబ్లీ జంట 884 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. సర్ఫరాజ్ ఖాన్ పన్నెండేళ్లకే 439 పరుగులు చేశాడు. పృథ్వీ షా 14 ఏళ్లకే 546 పరుగులు చేశాడు. ప్రణవ్ చేసిన 1009 పరుగులు వీరందరినీ మించినవి కావడంతో ప్రణవ్ ధన్వాడే పేరు మార్మోగిపోయింది. దాంతో అదే సమయంలో ధన్వాడేను ఇతరులతో పోల్చడమూ మొదలైంది. ఆ అంచనాలు కాస్తా ప్రణవ్ బ్యాటింగ్ పై ఒత్తిడిని పెంచుతూ పోయాయి.

ఇప్పుడు ప్రణవ్ వయస్సు 25 ఏళ్లు. కానీ ఇప్పుడతని నిలకడలేమి ఆట తీరుతో సెలక్షన్ కమిటీ అతణ్ని ఎంపిక చేయడం లేదు. సెలక్షన్ కమిటీల ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ కాకపోవడంతోనూ ప్రణవ్ కు ప్రస్తుతం అవకాశాలు రావడం లేదు. దాంతోపాటే.. కోవిడ్ ప్యాండమిక్ సమయం ప్రణవ్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. తన తోటి సహచరులెందరో ఇప్పుడు ఐపీఎల్ తో పాటు, రంజీల్లోనూ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోనూ, ఇంటర్నేషనల్ మ్యాచుల్లోనూ ఆడుతుంటే.. తను మాత్రం ఇంకా అవకాశాల కోసం నిరీక్షిస్తూనే ఉన్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles