చెరకు గోపాలకృష్ణ… ✍️
రెండు రోజుల క్రితం ఓ సినిమా చూస్తూంటే అందులో ఓ క్యారెక్టర్ చెప్పే డైలాగ్ ఇదీ!
“మహానగారాల్లో బతకాలంటే ఆత్మాభిమానాన్ని చంపుకోవాలి ” అని తన స్నేహితుడితో చెబుతుంటాడు మరో మిత్రుడు.
ఆ సీన్ చూశాక ఆత్మాభిమానం అంటే సరైన నిర్వచనం ఎంతమందికి తెలుసనే అనుమానం కలిగింది.
కానీ ఇదిగో ఈ పెద్దాయన వార్త ఇంటర్నెట్ లో వైరల్ అవడం చూశాక..ఇది కదా, సరైన ఉదాహరణ అనిపించింది.

ఒడిశా రాష్ట్రంలోని నౌరంగ్పూర్ జిల్లా డుమరబెడక గ్రామం నుండి బయల్దేరి.. మన భాగ్యనగరం హైదరాబాద్ కు పొట్ట చేతబట్టుకుని ఓ వలస కూలీగా పనికోసం వచ్చాడు 65 ఏళ్ల సోను భోత్ర అనే ఈ పెద్దాయన. బీహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి చాలా మంది కూలీ పనులకో, రకరకాలుగా బతుకుదెరువు కోసం మన రాష్ట్రానికి రావడం తెలిసిందే. అలానే ఈ పెద్దాయన కూడా ఓ దళారీని నమ్ముకుని కుటుంబ పోషణ కోసం వచ్చేశాడు. కానీ, వయసు మీదపడటం.. చూసేందుకు శక్తిమంతుడిలా కనిపించకపోవడమో, ఏమోగానీ.. పని ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాలేదు. పైగా నీకు పని ఇవ్వలేం.. నీ ఊరు వెళ్లిపో అంటూ సదరు పని వద్దకు వెళ్లిన యజమాని ఓ రెండొందలు చేతిలో పెట్టి పంపించేశాడు. అయితే, చేతిలో ఉన్న కాస్త డబ్బు కూడా అయిపోయింది. పని కూడా దొరకలేదు. వాట్ నెక్స్ట్..? ఏం చేయాలి…?
ఊరు కాని ఊరు… అదీ హైదరాబాద్ లాంటి మహానగరం… మానవత్వం మసకగా ఎక్కడో ఓచోట తప్ప పెద్దగా కనపడని లోకం… ఉన్న ఊరి నుండి పని ఇస్తానని తీసుకొచ్చిన దళారీ కూడా ముఖం చాటేశాడు.. మొత్తంగా మన దేశం నుంచి సౌదీకి వెళ్లి గోట్ లైఫ్ అనుభవించే మేకబతుకు.. మహానగరంలోనే కనిపించింది సోను భత్రాకి. కానీ, ఏం చేస్తాడు.. ఏం చేయగలడు..?
పని ఇవ్వనని చెప్పినవాడిని ఇంకొంత డబ్బు అడగడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది. పని చూపిస్తానని ముఖం చాటేసిన వాడిని ఆశ్రయించలేకపోయాడు. కారణం…ఆత్మగౌరవం! కానీ.. సొంతూరికి వెళ్లిపోవాలి. ఎలానో తెలియదు.. చేతిలో చిల్లి గవ్వలేదు… కానీ, ఆత్మాభిమానంతో పాటు, ఆత్మవిశ్వాసం మాత్రం మెండుగా ఉన్నాయి.
అందుకే 65 ఏళ్ల వయసులో నడక ప్రారంభించాడు.. ఎక్కడైతే ఒంటిరిగా నిలబడ్డాడో అక్కడి నుండే అడుగులు మొదలుపెట్టాడు.. తన సొంతూరి వైపు ప్రయాణం ప్రారంభించాడు…14 రోజులు… 600 కిలోమీటర్లు… మొత్తంగా ఆత్మాభిమానామే ఆయన్నీ నడిపించింది. మధ్యలో ఎక్కడైనా దొరికితే తిండి.. లేదంటే పస్తులే! ఆ ఆకలిని కూడా చంపేసింది ఆ ఆత్మాభిమానమే! అలానే 14 రోజులపాటు ప్రయాణించి… చివరికు జూలై 29న రెండు రోజుల క్రితం తన ఊరికి చేరుకున్నాడు. 65 ఏళ్ల వయసులో 600 కిలోమీటర్లు నడిచిన భోత్ర శరీరం నిరసించిపోవడంతో.. రెండు రోజులు తన భార్య, పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. కానీ ముసాలయన రోషం మాత్రం ఇంటర్నెట్ లో చర్చగా మారింది.
సందర్భం ఏదైనా కావొచ్చు! కానీ, ప్రతిమనిషికి ఈ పట్టుదల.. ఆత్మాభిమానం ఎంత ముఖ్యమో ఈ పెద్దాయన కథ మనకు చెబుతుంది. అదే లేకపోతే 65 ఏళ్ల వయసులో 600 కిలోమీటర్లు నడిచే శక్తిని భోత్రకి ఎవరిచ్చారు…? ఆ మనో నిబ్బరం ఎక్కడినుంచి వచ్చింది..? ఇదే సెల్ఫ్ రెస్పెక్ట్ నేటి యువతలో నిండుగా ఉంటే.. సాధించలేనిది ఏమైనా ఉంటుందా…?



