ఇవాళ్టి డిజిటల్ టెక్నాలజీ వెనుక.. ఓ ఇండియన్ జీనియస్ గణిత సమీకరణం!

మనం స్పాటిఫైలో వింటూనో, యూట్యూబ్ లో చూస్తూనో స్ట్రీమింగ్ చేస్తున్న సంగీతమైనా… స్క్రోల్ చేస్తూ చూస్తున్న ఫోటోలు, వీడియోలైనా… వీటన్నింటి వెనుక గణతావిష్కరణలున్నాయి. ఈ డిజిటల్ ఇన్వెన్షన్స్ వెనుక ఓ భారతీయ గణితమేధావి ఉండటం మరో విశేషం. ఎవరాయన…? రండి కాస్త తెలుసుకుందాం.

నసీర్ అహ్మద్… 1940లో బెంగళూరులో పుట్టిన ఈయనపై తన తాత ప్రభావం మెండు. నసీర్ అహ్మద్ తాత అమెరికాలో ఆ రోజుల్లోనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేశారు.

1961లో బెంగళూర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో… తాత ప్రభావంతో నసీర్ అహ్మద్ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో తన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉన్నత విద్యకు అమెరికాకు వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికోలో ప్రొఫెసర్ గా కూడా పనిచేశాడు.

ఒక సాధారణ ఆలోచన – గొప్ప పలితం!

1970ల కాలంలో ఫోటోలు, వీడియోలను డిజిటలైజ్ చేయడం ఓ పెద్ద సమస్యగా ఉండేది. ఒక హై క్వాలిటీ ఫోటో చాలా పెద్ద సైజ్ కల్గి ఉండటం వల్ల.. అలాగే, కావల్సిన స్పీడుతో ఇంటర్నెట్ నెట్వర్క్స్ లేకపోవడం వల్ల ఏ ఫోటోనైనా, వీడియోనైనా డిజిటలైజ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్నది.

1974లో అహ్మద్ తన సహచరులైన టి. నటరాజన్, కే. ఆర్. రావుతో కలిసి ఓ గొప్ప పరిష్కారాన్ని కనుగొన్నారు. అదే డిస్క్రీట్ కోసైన్ ట్రాన్స్ఫార్మ్.

సరళంగా, కాస్త సులభ పద్ధతిలో చెప్పాలంటే డీసీటీ అనేది ఓ గణిత సాధనం. ఇది పెద్ద పెద్ద చిత్రాల్లోని రంగులు, ప్రకాశాన్ని ఫ్రీక్వెన్సీ కంపోనెంట్స్ గా మారుస్తుంది. అంటే, డేటాను తరంగాల రూపంలో విభజిస్తుంది. దీంతో మన కళ్లకు పెద్దగా కనిపించనివాటిని తొలగించి ఫైల్ సైజును తగ్గిస్తుంది. కానీ, చిత్రాల్లోనూ, వీడియోల్లోనూ ఉన్న క్వాలిటీ మాత్రం తేడా రాకుండా ఈ సమీకరణం ద్వారా డిజిటలైజ్ చేయొచ్చు.

ఇంకేం అదే సంవత్సరం అహ్మద్, నటరాజన్, కే. ఆర్. రావు ముగ్గురూ కలిసి తమ పరిశోధనను ప్రచురించారు. కానీ, అప్పటికే గణిత మేధావులైనవారెవ్వరూ వీరి పరిశోధనను గుర్తించలేదు. పెద్దగా పట్టించుకోలేదు. ఆ కాలంలోనూ ఫండింగ్ రివ్యూస్ కు చేసే ఓ కుహానా మేధావి.. జస్ట్ సింపుల్ ఐడియా అని కొట్టిపారేశాడు.

కానీ, అహ్మద్ మిత్రుల బృందం మాత్రం పంచ్ కార్డ్ కంప్యూటర్లతో వారి పరిశోధనను నిరూపించారు. తమ ఇన్వెన్షన్ తో చిత్రాల ఫైల్ సైజును భారీగా తగ్గించగల్గారు.

డిజిటల్ ప్రపంచానికి బలమైన పునాది వేసిన అహ్మద్ బృందం ఆవిష్కరణ!

1970ల్లో అహ్మద్ బృంద సభ్యులు ముగ్గురు కలిసి తీసుకొచ్చిన ఆ ఆవిష్కరణే.. ఈరోజు మనముపయోగిస్తున్న అనేక రకాల సాంకేతికతలకు పునాదైంది. ఇవాళ మనం ఫోటోలకు ఉపయోగించ జెపెగ్ ఫార్మాట్ డీసీటీపైనే ఆధారపడి నడుస్తుంది. ఈ ఫార్మాట్ లో చిత్రాలను పదవ వంతుకు సైజు తగ్గించొచ్చు. ఇక వీడియోల కోసం మనముపయోగిస్తున్న ఎంపెగ్, సంగీతం కోసం ఉపయోగించే ఎంపీ త్రీ వంటి ఫార్మాట్స్ కూడా దాదాపు ఇదే ఆలోచనపై ఆధారపడి నడుస్తున్నాయి.

నేటి మెటా టెక్నాలజీకి ఊతమిచ్చిన అహ్మద్ ఆవిష్కరణ!

డీసీటీనే లేకపోతే ఇవాళ వాట్సప్ లో ఫోటోలు పంపించుకోవడంగానీ.. నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు చూడటంగానీ… స్పాటిఫైలో పాటలు వినడంగానీ ఇంత స్పీడుగా జరగకపోయేవి. ఎక్కువ డేటా ఖర్చుతో నెమ్మదిగా సాగేవి.

అహ్మద్ బృందం తీసుకొచ్చిన కంప్రెషన్ టెక్నాలజీ రాకమునుపు ఒక ఫోటో పంపించడానికి కూడా నిమిషాల నుంచి గంటల సమయం పట్టేది. అహ్మద్ చేసిన ఒక ఆవిష్కరణ ఈరోజు ఇంటర్నెట్ ను మరింత విజువలైజ్డ్ గా, వినోదాత్మకంగా మార్చింది. ఈరోజు మనం మోబైల్ లో హై క్వాలిటీలో ఫోటోలు, వీడియోలు చూసే అవకాశాన్ని కల్పించింది అహ్మద్ బృంద సభ్యుల డీసీటీ ఆవిష్కరణే.

గుర్తింపు తక్కువే అయినా ప్రభావమెక్కువ!

ఇవాల్టి టెక్నాలజీకి పునాదైన నసీర్ అహ్మద్ పేరు ఈ సాంకేతిక ప్రపంచానికి బయట ఇప్పటికీ పెద్దగా తెలియకపోవడం విషాదం. ప్రస్తుతం ఆయన అర్జెంటీనాలో ఉంటున్నారు. ప్రొఫెసర్ అహ్మద్ చేసిన సేవలు ఆధునిక డిజిటల్ జీవితాల్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. అంత ప్రభావవంతమైన వ్యక్తికి కావల్సినంత గుర్తింపు మాత్రం దక్కలేదు.

మనం ఫోటోలు తీస్తూ, సినిమాలు చూస్తూ, పాటలు వింటూ ఆనందించే ప్రతీ క్షణం… బెంగళూర్ వాసైన నసీర్ అహ్మద్, ఆయన బృంద సభ్యులైన నటరాజన్, కే.వీ. రావు గుర్తు రావాల్సిందే. ఈ భారతీయుల ప్రతిభ యావత్ సాంకేతిక ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిందే.

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసిందన్నది ఓ అడ్వర్టైజ్మెంట్ క్యాప్షన్ కావచ్చు.. కానీ, అహ్మద్, నటరాజన్, కే.వీ. రావు ఐడియా ఎన్నో జీవితాల్నే సాంకేతికంగా మార్చేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles