Vamsy Krishna.. ✍🏻
———————————————-
దక్షిణ తమిళనాడు ఎవరికి దారి ఇస్తుంది?
తమిళనాడు రాజకీయ యవనికపై 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక చారిత్రక ఘట్టంగా నిలవబోతున్నాయి. దశాబ్దాలుగా ద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం మధ్య సాగుతున్న ద్వైపాక్షిక పోరులోకి ఇప్పుడు నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం ఒక శక్తివంతమైన మూడవ శక్తిగా ప్రవేశించింది. ఏప్రిల్ 23న జరగబోయే పోలింగ్‌కు ముందు, ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో సమీకరణాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.
దక్షిణ తమిళనాడు రాజకీయాలు సామాజిక సమీకరణలు, మతపరమైన ధ్రువీకరణ కొత్తగా వచ్చిన ‘విజయ్ ప్రభంజనం’ చుట్టూ తిరుగుతున్నాయి మధురై, తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి కన్యాకుమారి వంటి జిల్లాలతో కూడిన ఈ ప్రాంతం రాష్ట్రంలో సుమారు 50 నుండి 60 నియోజకవర్గాలను కలిగి ఉంది. ఈ ఎన్నికల్లో ఇక్కడ గెలుపు గుర్రాలు ఎవరు అనేది అంచనా వేయడం విశ్లేషకులకు కూడా సవాలుగా మారింది.
దక్షిణ తమిళనాడులో ముక్కులతార్, నాడార్ సామాజిక వర్గాల ఓట్లు అత్యంత కీలకం. గతంలో ఏఐఏడీఎంకే కు ఈ ప్రాంతం బలమైన కోటగా ఉండేది. కానీ ఓ. పన్నీర్ సెల్వం (OPS) టిటివి దినకరన్ వంటి నేతలు పార్టీకి దూరం కావడం ఏఐఏడీఎంకే బలాన్ని కొంత దెబ్బతీసింది. అయితే, 2026 ఎన్నికల నాటికి దినకరన్ నేతృత్వంలోని AMMK తో ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకోవడం ఈ ప్రాంతంలో ఆ కూటమికి మళ్ళీ పునర్వైభవం తెచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ముక్కులతార్ ఓటర్లు మళ్ళీ ఏఐఏడీఎంకే-AMMK కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి.

డిఎంకె (DMK) కూటమి ఇక్కడ సంక్షేమ పథకాలను నమ్ముకుంది. ముఖ్యంగా తూత్తుకుడి కన్యాకుమారి జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి మత్స్యకారుల కోసం చేపట్టిన పథకాలు వారికి కలిసొచ్చే అంశాలు. అయితే, ఏప్రిల్ 16న జరిగిన ‘డీలిమిటేషన్ బిల్లు’ వ్యతిరేక నిరసనలు ఈ ప్రాంతంలో డిఎంకెకు కొత్త ఊపిరి పోశాయి. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల దక్షిణ తమిళనాడు ప్రాతినిధ్యం తగ్గుతుందనే సెంటిమెంట్‌ను డిఎంకె బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీనివల్ల భాషా మరియు ప్రాంతీయ సెంటిమెంట్లు ఉన్న ఓటర్లు డిఎంకె వైపు నిలిచే అవకాశం ఉంది.
ఈ ఎన్నికల్లో దక్షిణ తమిళనాడులో ‘కింగ్ మేకర్’గా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న శక్తి విజయ్ మధురైలో ఆయన నిర్వహించిన భారీ బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సంచలనం. మధురై, తిరునెల్వేలి వంటి పట్టణ నియోజకవర్గాల్లో విజయ్ అభిమాన సంఘాలు కార్యకర్తలుగా మారి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కులాలకు అతీతంగా యువత విజయ్ వైపు ఆకర్షితులవుతుండటం డిఎంకె మరియు ఏఐఏడీఎంకేలకు ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ విజయ్ 15-20 శాతం ఓట్లను చీల్చితే, అది అభ్యర్థుల మెజారిటీని తలకిందులు చేయడం ఖాయం.
కన్యాకుమారి మరియు నాగర్ కోయిల్ వంటి ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిరూపించుకోవాలని చూస్తోంది. క్రైస్తవ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో, విజయ్ రాకతో ఆ ఓటు బ్యాంకు చీలిపోయే అవకాశం ఉంది. దీనివల్ల హిందూ ఓటర్ల ఏకీకరణ జరిగితే బీజేపీకి లాభం చేకూరవచ్చు. అలాగే, సీమాన్ (NTK) కూడా ఈ ప్రాంతంలో గణనీయమైన ఓట్ షేర్ కలిగి ఉన్నాడు, ఇది ప్రధాన కూటముల ఓట్లను చీల్చుతోంది.
మొత్తంగా చూస్తే, దక్షిణ తమిళనాడులో పోరు ఈసారి చతుర్ముఖంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 23న జరగబోయే పోలింగ్‌లో ముక్కులతార్ నాడార్ ఓట్లు ఏకీకృతంగా ఒక కూటమి వైపు పడతాయా లేదా కొత్త శక్తుల వైపు చీలిపోతాయా అనే దానిపైనే ఈ ప్రాంతం నుండి అసెంబ్లీకి వెళ్లే ప్రతినిధులు ఎవరో తేలిపోతుంది. ఏఐఏడీఎంకే-AMMK కూటమి డిఎంకె కూటమి మధ్య ‘నెక్ అండ్ నెక్’ (Neck-and-Neck) పోటీ ఉండగా, విజయ్ ఫలితాలను తారుమారు చేసే ‘గేమ్ ఛేంజర్’గా నిలవబోతున్నారు.

మీనాక్షి అమ్మన్ ఆశీర్వాదం ఎవరికీ ?
మధురై వంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో మీనాక్షి అమ్మవారి దయ ఎవరిపై ఉంటుందనేది అనూహ్యం. మధురై సెంట్రల్ నియోజకవర్గంలో మంత్రి పళనివేల్ త్యాగరాజన్ (PTR) కు పోటీగా దర్శకుడు సుందర్ సి ఏఐఏడీఎంకే గుర్తుపై బరిలోకి దిగడం ఒక సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తోంది. సుందర్ సి నేరుగా బీజేపీ తరపున కాకుండా, ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షమైన పుదియ నీది కట్చి తరపున బరిలోకి దిగారు. అయితే, ఆయన ఏఐఏడీఎంకే కి చెందిన ‘రెండాకులు’ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఇది ఆయనకు క్షేత్రస్థాయిలో ఏఐఏడీఎంకే కేడర్ మద్దతు లభించడానికి బాగా కలిసివచ్చే అంశం.సుందర్ సి తనను తాను ‘మధురై వాసి’గా ప్రకటించుకుంటూ ప్రచారంలో దూసుకుపోతుంటే, పీటీఆర్ తన మేధోపరమైన ఇమేజ్‌తో ఎదురుదాడి చేస్తున్నారు.పళనివేల్ త్యాగరాజన్ (PTR).
గత రెండు సార్లు ఇక్కడ భారీ మెజారిటీతో గెలిచారు.నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన ఇచ్చే ‘ప్రోగ్రెస్ కార్డ్స్’ ఓటర్లలో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.సుందర్ సి ని ప్రత్యర్థులు ‘నాన్ లోకల్ ‘ గా చిత్రీకరిస్తుండగా, పీటీఆర్ మధురై మట్టి మనిషిగా ప్రచారం చేసుకుంటున్నారు.ఒక కమర్షియల్ దర్శకుడిగా సుందర్ సికి ఉన్న పాపులారిటీ యువతలో క్రేజ్ తెచ్చింది. ఆయన భార్య ఖుష్బూ బీజేపీలో కీలక నేత కావడంతో ఆమె ప్రచారం కూడా మహిళా ఓటర్లను ఆకట్టుకుంటోంది.డిఎంకె ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను, స్థానిక పౌర సమస్యలను సుందర్ సి తన ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నారు.ఏఐఏడీఎంకే ఓటు బ్యాంకు మరియు ఎన్డీయే మద్దతు ఆయనకు భారీగా ఓట్లు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.అయితే, నటుడు విజయ్ పార్టీ అభ్యర్థి కూడా ఇక్కడ గణనీయంగా ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ఇది ఎవరికి నష్టం కలిగిస్తుందనే దానిపైనే సుందర్ సి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.సుందర్ సి కేవలం గ్లామర్ తోనే కాక , పీటీఆర్ వంటి బలమైన నేతను ఢీకొనే స్థాయిలోనే పోటీ ఇస్తున్నారు. గెలుపు కష్టమైనప్పటికీ, మెజారిటీని గణనీయంగా తగ్గించి పీటీఆర్ కి ముచ్చెమటలు పట్టించే పరిస్థితిలో సుందర్ సి ప్రస్తుతం ఉన్నారు అని క్షేత్ర స్థాయి రిపోర్టులు చెపుతున్నా,మొగ్గు మాత్రం పళనివేల్ త్యాగరాజన్ వైపు కనిపిస్తోంది .
అరుణాచలేశ్వరుడి అనుగ్రహం ఎవరికీ?
ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవని తిరువణ్ణామలై నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఆసక్తికరంగా వుంది , ఈ నియోజకవర్గం దశాబ్దాలుగా డిఎంకె కు బలమైన , దుర్భేద్యమైన కోట. కానీ ప్రస్తుత ఎన్నికల్లో కూటముల సమీకరణాలు బీజేపీకి కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి.బీజేపీ తరపున సి. ఎలుమలై బరిలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి ఉన్న అతిపెద్ద సానుకూల అంశం ఏఐఏడీఎంకే తో ఉన్న పొత్తు. 2021లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయాయి, కానీ ఇప్పుడు ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలోని ఏఐఏడీఎంకే మద్దతు బీజేపీ అభ్యర్థికి క్షేత్రస్థాయిలో బలాన్ని ఇస్తోంది.బీజేపీ ప్రధానంగా ‘అవినీతి రహిత పాలన’ ‘కేంద్ర పథకాల అమలు’ అనే నినాదాలతో ప్రచారం చేస్తోంది. ఆధ్యాత్మిక నగరమైన తిరువణ్ణామలైలో హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ రాష్ట్ర మరియు జాతీయ నేతలు ఇక్కడ విస్తృతంగా పర్యటించారు.అరుణాచలేశ్వర ఆలయ ప్రాశస్త్యం దృష్ట్యా, ఇక్కడి ఆధ్యాత్మిక భావాలున్న ఓటర్లలో బీజేపీ పట్ల కొంత సానుకూలత కనిపిస్తోంది.
డిఎంకె తరపున సీనియర్ నేత, ప్రస్తుత మంత్రి ఇ.వి. వేలు పోటీ చేస్తున్నారు. ఆయనకు ఈ నియోజకవర్గంలో తిరుగులేని వ్యక్తిగత ఇమేజ్ ఉంది. గత పది ఎన్నికల్లో పదిసార్లు ఇక్కడ డిఎంకె గెలిచింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.వాస్తవంగా చెప్పాలంటే, ఇ.వి. వేలు వంటి ఉద్దండుడిని ఆయన సొంత గడ్డపై ఓడించడం బీజేపీకి ఒక సవాలుతో కూడుకున్న పనే. అయితే, గత ఎన్నికల్లో (2021) బీజేపీకి కేవలం 1% లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ఏఐఏడీఎంకే మద్దతుతో ఆ ఓటు శాతాన్ని భారీగా పెంచుకుని, డిఎంకెకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి బీజేపీ చేరుకుంది.డిఎంకె, ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమితో పాటు, విజయ్ TVK మరియు సీమాన్ NTK కూడా ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ఇది అధికార పార్టీ ఓటు బ్యాంకుకు గండి కొడితే, అది బీజేపీకి లాభించవచ్చు.
కన్యాకుమారి ఎవరికీ దారి చూపిస్తుంది?
కన్యాకుమారి జిల్లా రాజకీయాలు తమిళనాడులోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. ఏఇవాళ్టి కి కూడా , అంటే పోలింగ్‌కుమూడు రోజులు ముందు కూడా కన్యాకుమారి రాజకీయ వాతావరణం క్లిష్టంగానే ఉండి అంచనాలు తారుమారు చేసే సూచనలే కనిపిస్తున్నాయి . కన్యాకుమారిలో ప్రధానంగా మతపరమైన ఓట్ల సమీకరణలు కొత్తగా రంగంలోకి వచ్చిన విజయ్ పార్టీ ప్రభావం ఫలితాలను శాసించబోతున్నాయి. కన్యాకుమారి జిల్లాలో క్రైస్తవ ఓటర్లు (సుమారు 47%) అత్యంత కీలకం. గత ఎన్నికల్లో చర్చిలు బహిరంగంగా డిఎంకె-కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇచ్చేవి. కానీ ఈసారి పరిస్థితి మారింది.విజయ్ పార్టీ రంగంలోకి రావడంతో క్రైస్తవ ఓటర్లు చీలిపోయే అవకాశం ఉంది. దీంతో ఈసారి చర్చిలు ఏ ఒక్క పార్టీకి అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. కొన్ని ప్రాంతాల్లో ఫాదర్లు పరోక్షంగా ‘మార్పు’ కావాలని కోరుతుండగా, మరికొందరు ‘హస్తం’ గుర్తు వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం
DMK-కాంగ్రెస్ కూటమి గత ఎన్నికల్లో ఈ జిల్లాలోని 6 స్థానాల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. ఈసారి కూడా కాంగ్రెస్ తన పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. అయితే, సిట్టింగ్ మంత్రి మనో తంగరాజ్ వంటి కీలక నేతలకు టికెట్ నిరాకరించడం పార్టీలో అంతర్గత అసంతృప్తికి దారితీసింది. ఈసారి ఏఐఏడీఎంకే జిల్లాలోని 6 స్థానాల్లో 4 స్థానాలను బీజేపీకి కేటాయించింది. కన్యాకుమారిలో బీజేపీకి సాంప్రదాయకంగా బలమైన ఓటు బ్యాంకు ఉంది. ముఖ్యంగా నాగర్ కోయిల్ వంటి చోట్ల బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది.
విజయ్ పార్టీ ఇక్కడ ‘డార్క్ హార్స్’గా మారింది. ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో విజయ్ అభ్యర్థులు (ఉదాహరణకు కిల్లోయూర్, కొలచెల్) బలమైన ప్రచారం చేస్తున్నారు. ఇటీవల సముద్రంలో గల్లంతైన బాలుడి మృతదేహాన్ని వెలికితీసే విషయంలో టీవీకే అభ్యర్థులు చొరవ చూపడం స్థానికుల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. కన్యాకుమారి లో ఏఐఏడీఎంకే అభ్యర్థి ఎన్. దళవాయి సుందరం తన పట్టును నిలుపుకోవాలని చూస్తుండగా, డిఎంకె అభ్యర్థి ఆర్. మహేష్ గట్టి పోటీ ఇస్తున్నారు.నాగర్ కోయిల్ లో బీజేపీ డిఎంకె మధ్య ముఖాముఖి పోరు పోటా పోటీ గా సాగుతోంది. కిల్లోయూర్ కొలచెల్: లో కాంగ్రెస్ బలమైన పట్టు కలిగి ఉన్నప్పటికీ, టీవీకే చీల్చే ఓట్ల వల్ల గెలుపు మార్జిన్ తగ్గే అవకాశం ఉంది.
సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి (NTK) ఒంటరి పోరాటం చేస్తూ, తమిళ జాతీయవాద నినాదంతో స్థిరంగా తన ఓటు బ్యాంకును పెంచుకుంటూ రావడం విశేషం. 2026 నాటికి ఈ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మూడవ లేదా నాలుగవ పెద్ద శక్తిగా ఎదిగే క్రమంలో ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం డిఎంకె కూటమికి స్వల్ప ఆధిక్యం కనిపిస్తున్నప్పటికీ, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో విజయ్ కింగ్ మేకర్‌గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రధాని మోదీ రోడ్‌షోలు, స్టాలిన్ ద్రవిడ మోడల్ పాలన, ఎడప్పాడి పళనిస్వామి ఐక్యతా మంత్రం, విజయ్ హామీల మధ్య తమిళ ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపుతాడనేది ఉత్కంఠ రేపుతోంది. మొత్తంగా చూస్తే, ఈ ఎన్నికలు కేవలం ఒక ప్రభుత్వం మార్పు కోసం మాత్రమే కాకుండా, తమిళనాడు రాజకీయాల్లో కొత్త నాయకత్వ ఉదయాన్ని నిర్ణయించేవిగా మారనున్నాయి.



