Vamsy Krishna.. ✍🏻
———————————————
ఫలితం కంటే ప్రక్రియ మీదనే ఎక్కువ ప్రశ్నలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంగ్రామం ఇప్పుడు కేవలం ఓట్ల యుద్ధం మాత్రమే కాదు, ఒక పెను రాజ్యాంగ సంక్షోభంగా మారుతోంది. మొదటి విడత పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న తరుణంలో, భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. దాదాపు 91 లక్షల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించడం అనేది ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామం. ఇందులో 34 లక్షల మంది తమ ఓటు హక్కును తిరిగి పొందడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 ట్రిబ్యునళ్ల ముందు పోరాటం చేస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే, ఈ ట్రిబ్యునళ్లు పని చేస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క పిటిషన్‌ను పరిష్కరించడం, అది కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తికి అనుకూలంగా రావడంపై ఇతర పార్టీలు మరియు పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. న్యాయ వ్యవస్థ ఇంత నెమ్మదిగా స్పందిస్తుంటే, ఎన్నికలు ముగిసేలోగా ఈ లక్షలాది మంది ఓటర్ల భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది.

34 లక్షల మందికి గుంప గుత్తగా ఓటు హక్కు కల్పించలేం. గెలిచిన చోట మెజారిటీ మార్జిన్ తొలగించిన ఓట్ల కంటే తక్కువగా ఉంటే బాధితులు మళ్ళీ కోర్టు తలుపు తట్టవచ్చు అంటూ సుప్రీం చేసిన వ్యాఖ్యలు బాధితులకు కొంత ఊరటనిచ్చినా, అవి తక్షణ పరిష్కారం చూపడం లేదు. ఒకవేళ ఎన్నికల ఫలితాల్లో గెలుపు మెజారిటీ కంటే తొలగించిన ఓట్లు ఎక్కువగా ఉంటేనే కోర్టు తలుపు తట్టవచ్చని సుప్రీం చెప్పడం అంటే, ఒక రకంగా ఈ 34 లక్షల మంది ప్రస్తుతానికి తమ ఓటు హక్కును వినియోగించుకోలేరనే చేదు నిజాన్ని అంగీకరించడమే. జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించినట్టుగా, సామాన్య ఓటరు రెండు రాజ్యాంగ శక్తుల మధ్య, అంటే ఎన్నికల కమిషన్ , న్యాయ వ్యవస్థ మధ్య నలిగిపోతున్నాడు. ఓటు అనేది ప్రాథమిక హక్కు మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్యంలో పౌరుడికి ఉండే ఏకైక ఆయుధం.అది భారత్ లాంటి దేశాలలో ఒక సెంటిమెంట్ కూడా! ఆ నిజం సుప్రీం కూడా వొప్పుకుంది అలాంటి ఆయుధాన్ని, సెంటిమెంట్ ను సర్వేలు లేదా ఇతర సాంకేతిక కారణాల పేరుతో దూరం చేయడం ఆందోళనకరం.
బెంగాలీ మీడియా విశ్లేషణల ప్రకారం, ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ వెనుక బలమైన సామాజిక రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. తొలగించబడిన వారిలో అధిక శాతం అణగారిన వర్గాలు, మైనారిటీలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ కి బలమైన పట్టున్న ప్రాంతాల్లో బిజెపి తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలనుకుంటున్న సరిహద్దు జిల్లాల్లో ఈ తొలగింపులు ఎక్కువగా జరిగాయని అన్నాడా బజార్ పత్రిక లాంటి స్థానిక పత్రికలు విశ్లేషిస్తున్నాయి . ఇది కేవలం సాంకేతిక పొరపాటు కాదని, ఒక పక్కా ప్రణాళికతో జరిగిన ‘డిజిటల్ ప్రక్షాళన’ అని మమతా బెనర్జీ వర్గం ఆరోపిస్తుంటే, అక్రమ చొరబాటుదారులను ఏరివేయడంలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నామని ప్రత్యర్థి పార్టీ వాదిస్తోంది.
సర్ ప్రక్రియలో భాగంగా తొలగించిన ఓటర్లలో ముస్లిం ఓటర్లు 27% కాగా హిందూ ఓటర్లు 34% ఉండటం చర్చనీయాంశం అయింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలో కూడా సుమారు 50,000 పైగా ఓట్లు తొలగించబడ్డాయి. ముర్షిదాబాద్ జిల్లాలోని సంషేర్‌గంజ్ లాల్గోలా, భగబంగోలా, రఘునాథ్‌గంజ్ లో రమారమి 29.5% ఓట్లు తొలగించారు. అంటే ఈ నియోజకవర్గాలలో గెలిచిన అభ్యర్ధికి కనీసం 30% మెజారిటీ మార్జిన్ ఉండాలి. లేకపోతే ఆ ఎన్నిక పైన సుప్రీం తలుపు తట్టవచ్చు అన్నమాట. మతువా సామాజిక వర్గం ఎక్కువగా ఉండే నదియా జిల్లాలో కూడా పెద్ద సంఖ్యలో తొలగింపులు జరిగితే అత్యల్పంగా జంగల్‌మహల్ ప్రాంతంలోని పురూలియా, బాంకురా, ఝార్గ్రామ్ జిల్లాల్లో చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు తొలగించబడ్డాయి.
ఈ ఘర్షణ వాతావరణం వల్ల ఓటర్లలో ఒక రకమైన భయాందోళన నెలకొంది. తమకు ఓటు హక్కు లేదని తెలిసిన సామాన్యులు, తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి సర్కారీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామీణ హౌరా, ముర్షిదాబాద్ మాల్దా జిల్లాల్లో ఓటర్ల జాబితా సవరణ అనేది ఒక భావోద్వేగ సమస్యగా మారింది. ప్రజలు తమ పనులను మానుకొని మరీ ట్రిబ్యునళ్ల ముందు వరుస కడుతున్నారు. అయితే న్యాయపరమైన ప్రక్రియలో జాప్యం వారిని నిరాశకు గురి చేస్తోంది. ఎన్నికల తర్వాత వచ్చే న్యాయ పోరాటాలు అటుంచి, ప్రస్తుతానికి తమ గొంతుకను వినిపించే అవకాశం కోల్పోతున్నామన్న బాధ వారిలో కనిపిస్తోంది.
ఈ ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం పాత్రపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. బెంగాల్ రాజకీయాల్లో హింస అనేది కొత్త విషయం కాకపోయినా, ఈసారి ‘ఓటర్ల జాబితా యుద్ధం’ సరికొత్త మలుపు తిరిగింది. ఏప్రిల్ 23 మరియు 29 తేదీల్లో జరగబోయే పోలింగ్ ముగిసిన తర్వాత కూడా బెంగాల్ ప్రశాంతంగా ఉంటుందని ఎవరూ ఊహించడం లేదు. ఎందుకంటే, ఓటు హక్కు కోల్పోయిన ఈ 34 లక్షల మంది ఫలితాలను ప్రభావితం చేయగల శక్తి ఉన్నవారు. ఒకవేళ ఏ నియోజకవర్గంలోనైనా మెజారిటీ తక్కువగా ఉండి, అక్కడ తొలగించిన ఓట్లు ఎక్కువగా ఉంటే, ఆ ఎన్నిక చెల్లుబాటుపై ఖచ్చితంగా కోర్టులో సవాళ్లు ఎదురవుతాయి.
ఇది బెంగాల్ రాజకీయాలను ఏళ్ల తరబడి న్యాయ వివాదాల్లో చిక్కుకునేలా చేస్తుంది. పత్రికల విశ్లేషణ ప్రకారం, బిజెపి ఈ అంశాన్ని దేశభక్తి, చొరబాటుదారుల అంశంగా మలుచుకోవాలని చూస్తుంటే, తృణమూల్ కాంగ్రెస్ దీనిని బెంగాలీ అస్తిత్వం పౌర హక్కుల అణిచివేతగా ప్రచారం చేస్తోంది. ఇరు పక్షాలు గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నా, మధ్యలో బలైపోతున్నది మాత్రం సామాన్య పౌరుడే. ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్ల ప్రజాస్వామ్య పునాదులే కదులుతున్నాయన్నది మేధావుల వాదన. ప్రతిపక్షాలు అధికార పక్షం ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణల మధ్య, నిజమైన ఓటరు తన హక్కు కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం దురదృష్టకరం.
బెంగాల్ ఎన్నికలు ముగిసినా, ఈ 34 లక్షల మంది ఆవేదన వారు చేసే న్యాయ పోరాటం దేశ రాజకీయాల్లో ఒక మైలురాయిగా మిగిలిపోనుంది. ఎన్నికల ఫలితాల కంటే కూడా, ఆ తర్వాత రాబోయే న్యాయస్థాన తీర్పులు భారత ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలకు నాంది పలకవచ్చు. మొత్తం మీద, బెంగాల్ ఇప్పుడు ఒక చారిత్రాత్మక ఎన్నికకు వేదికైంది, ఇక్కడ ఫలితం కంటే ప్రక్రియ మీదనే ఎక్కువ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ న్యాయ పోరాటాలు ఏ తీరానికి చేరుతాయో బెంగాల్ ఓటరుకు న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి. ఈ ఉత్కంఠభరిత పోరులో అంతిమంగా ప్రజాస్వామ్యం గెలవాలని, ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటు హక్కు దక్కాలని బెంగాల్ ప్రజలు ఆశిస్తున్నారు.



