రతన్ ఖత్రీ ఎవరు..? విజయ్ వర్మ సీరిస్ తో.. మళ్లీ తెరపైకి మట్కా కింగ్ పేరు!

విజయ్ వర్మ మట్కా కింగ్ సీరిస్ తో… ముంబైని శాసించిన ఒర్జినల్ మట్కా కింగ్ పిన్ పేరు మార్మోగిపోతోంది. ఎవరా కింగ్ పిన్..? తనతో మొదలై.. ముంబైలో ఓ పెద్ద జూదంగా మారి.. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకూ పాకిన ఆ మట్కా కథేంటి..?

మట్కా గురించి మాట్లాడుకోవాలంటే… ముందు ఓ పేరు చెప్పుకోవాలి. అతనే రతన్ ఖత్రీ.

విజయ్ వర్మ ప్రధాన పాత్రలో వచ్చిన మట్కా కింగ్ సీరిస్ క్రైమ్ డ్రామాపై ఇప్పుడు ఆసక్తి కనబడుతోంది. వీధి స్థాయి బెట్టింగ్ ను భారతదేశం మొత్తం అతి పెద్ద అండర్ వరల్డ్ సామ్రాజ్యంగా మార్చిన వ్యక్తి కథనే సీరిస్ గా తెరకెక్కించడంతో ఈ క్యూరియాసిటీకి కారణం. సీరిస్ లో విజయ్ వర్మ పాత్ర పేరు బ్రిజ్ భట్టి… కానీ, ఈ పాత్రకు ఇన్స్పిరేషన్ ముంబైని శాసించిన మట్కా కింగ్ రతన్ ఖత్రీ.

అసలు మట్కా ఆట ఎలా ఉంటుంది..?

ఇదో నంబర్ గేమ్. మట్కా ఆడాలంటే ఒకటో రెండో నంబర్లపై బెట్టు కట్టాల్సి ఉంటుంది. ఒక నంబర్ పై రూపాయి పెట్టి కుండలో వేసే చిట్టీలో తగిలితే ఎనిమిది రూపాయలిస్తారు. రెండో నంబర్ పై తగిలితే ఏకంగా 80 రూపాయల వరకూ ఇస్తారు. ఇలా మట్కాలో బెట్టు కాస్తే రూపాయికి పెద్దమొత్తంలో తగిలుతుందన్న ఆశతో మట్కా చాలామందికి దేశంలో ఓ వ్యసనంగా మారిపోయింది. చాలా రాష్ట్రాల్లో ఏకంగా మట్కా నిషేధిత ఆటగా మారినా… రహస్యంగా కూడా కొనసాగింది. కూలీల నుంచి మొదలు ధనవంతుల వరకూ మట్కాకు వ్యసనపరులుగా, బానిసలుగా మారినవారూ కొల్లలు.

అసలు మట్కా కింగ్ అని రతన్ ఖత్రీకి పేరెలా వచ్చింది..?

రతన్ ఖత్రీ ముంబైకి చెందిన పాప్యులర్ బుకీ. అంటే బెట్టింగులు కాచే నిర్వాహకుడు. మట్కా వ్యాపారాన్నే పూర్తిగా మార్చేసి.. దేశం మొత్తంలో అతి పెద్ద అక్రమ బెట్టింగ్ నెట్వర్క్ ను నిర్మించాడు కాబట్టే రతన్ ఖత్రీకి మట్కా కింగ్ అనీ, కింగ్ పిన్ అనీ పేరు స్థిరపడిపోయింది.

1932లో కరాచీలో పుట్టిన రతన్ ఖత్రీ.. 1947, విభజన తర్వాత కుటుంబంతో కలిసి ముంబైకి వలస వచ్చాడు. జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టాల్సిన దరిద్రంతో.. మెల్లిగా టెక్స్టైల్, ట్రేడింగ్ రంగాల్లో పనికి కుదిరాడు. అదే సమయంలో మట్కా బెట్టింగ్ ప్రపంచాన్ని పరిచయం చేసుకున్నాడు.

మట్కా గేమ్ ను ఎలా మార్చేశాడు ఈ గేమ్ ఛేంజర్..?

రతన్ ఖత్రీ మట్కా బెట్టింగ్ ప్రపంచాన్ని తాను పరిచయం చేసుకోకముందు.. చేసుకున్న తర్వాత అని మట్కా జూదం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. బాంబేలో న్యూయార్క్ కాటన్ ఎక్స్ఛేంజ్ ఓపెనింగ్, క్లోజింగ్ రేట్లపైనే.. ప్రధానంగా మట్కా బెట్టింగ్స్ ఆధారపడి నడిచేది. ఇందులో కేవలం ఆ వ్యాపారంలో ఉన్నవారు మాత్రమే పాల్గొనేవారు. కానీ, 1962లో ఖత్రీ తన సొంత సిండికేట్ తో కలిసి రతన్ మట్కా పేరిట మెయిన్ బజార్ మట్కాను ఆరంభించి పూర్తిగా గేమ్ నే మార్చేశాడు. గేమ్ ఛేంజరయ్యాడు.

కాటన్ మార్కెట్ పై మాత్రమే ఆధారపడి ఆడే ఆటను మార్చేశాడు. సంఖ్యలపై కాచే బెట్టింగ్ లో డ్రా విధానాన్ని పరిచయం చేశాడు. మట్టికుండ నుంచి చీటీలు తీసే విధానంతో పారదర్శకంగా గేమ్ ను ఆడేలా చూశాడు. సామాన్యుడి నుంచి ధనవంతుడి వరకూ అందరికీ అర్థమయ్యే గేమ్ గా మార్చాడు. దాంతో అప్పటివరకూ కేవలం ఎవరో కొందరు కాటన్ వ్యాపారులకు మాత్రమే పరిమితమైన మట్కా.. ఆ తర్వాత జనంలోకి వెళ్లి భారీ వ్యవస్థగా రూపుదిద్దుకుంది.

కూలీ నుంచి సినీతారల వరకూ!

ఆదిలో కార్మికుల మధ్య ఆరంభమైన ఈ బెట్టింగ్ ఆట.. ఆ తర్వాత అన్ని వర్గాలకూ విస్తరించింది. 1970ల నాటికే ఖత్రీ సామ్రాజ్యం రోజుకు ఒక కోటి రూపాయల టర్నోవర్ సాధించిందని చెబుతారు.

రతన్ ఖత్రీ కస్టమర్స్ లో టెక్స్టైల్ కార్మికులు, చిన్న చిన్న వ్యాపారులు, ధనవంతులు, బాలీవుడ్ నటులు, నిర్మాతలు, రాజకీయ నాయకులు ఇలా వివిధ రంగాల వారూ ఉండేవారు.

ఆశే పెట్టుబడి!

మట్కా ఆకర్షణేంటంటే.. ఉన్నపళంగా ధనవంతులు కావచ్చనే దురాశే అలవాటైన ఆటగాళ్లను వ్యసనపరులుగా మార్చేస్తుంది.

ఖత్రీ ఎలా లెజెండ్ అయ్యాడు..?

ఖత్రీ ఇతర బుకీలతో పోలిస్తే క్రమశిక్షణ, నమ్మకం కల్గిన వ్యవస్థను నిర్మించాడు. ప్రజల్లోనే డ్రాను నిర్వహించడం ద్వారా పారదర్శకతను పెంచాడు. అందుకే తన పేరు మట్కా ప్రపంచానికి ఓ ప్రతీకగా మారింది. దాంతో మట్కా కింగ్ గా, కింగ్ పిన్ గా చలామణి అయ్యి ప్రసిద్ధి చెందాడు.

ఎమర్జెన్సీలో జైలుపాలైన ఖత్రీ!

1975-77 మధ్య ఎమర్జెన్సీ పీరియడ్ లో ఇందిరాగాంధీ అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపింది. ఆ సమయంలో రతన్ ఖత్రీ మట్కా వ్యాపారంపై దాడులు జరిగి.. ఏకంగా 19 నెలల పాటు జైలు జీవితం గడిపాడు ఈ కింగ్ పిన్.

తిరిగి వచ్చినా పుంజుకోని మట్కా వ్యాపారం!

ఖత్రీ 19 నెలల జైలు జీవితం తర్వాత తిరిగి వచ్చినా ఇక ఆయనకు మట్కా వ్యాపారం మునుపటిలా కలిసిరాలేదు. పోలీసుల దాడులు పెరిగాయి. మాఫియా ప్రభావమూ పెరిగిపోయింది. మట్కా వ్యాపారంలో తన పార్ట్నర్స్ తో అంతర్గత విభేదాలూ తారాస్థాయికి చేరాయి. దాంతో క్రమంగా మట్కా వ్యాపారం కూడా బలహీనపడింది. ఇక 1993 నాటికి ఖత్రీ తన మట్కా అక్రమ వ్యాపారాన్ని పూర్తిగా విరమించుకున్నాడు.

బాలీవుడ్ తోనూ బంధం!

మట్కా కింగ్ గా చలామణి అవుతూనే ఖత్రీ సినిమా రంగంలోకీ ప్రవేశించాడు. 1976లో వచ్చిన రంగీలా రతన్ చిత్రాన్ని ఆయనే నిర్మించాడు. అందులో రిషీ కపూర్, పర్వీన్ బాబీ హీరో, హీరోయిన్స్.

ఓ సాధారణ వ్యక్తి మట్కా గేమ్ సులభతరం చేసి, జనాలకు అలవాటు చేసి, దేశవ్యాప్తం చేసి ఒక భారీ సామ్రాజ్యాన్నే నిర్మించాడు.

చివరి దశ!

రతన్ ఖత్రీ 2020, మే 9వ తేదీన ముంబైలో తన 88 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మరణించాడు. ఆయన తర్వాత, ఆయనతో పాటు చాలామంది మట్కా వ్యాపారం చేయడానికి యత్నించినా.. ఖత్రీ స్థాయికి మాత్రం ఎవ్వరూ ఎదగలేకపోయారు.

ఖత్రీ కథ ఎందుకు ఆసక్తికరం..?

కేవలం మట్కా అనే నిషేధిత జూదాన్ని పెంచి పోషించిన ఓ జూదగాడి కథ కాదిది. విభజన తర్వాత కట్టుబట్టలతో ముంబైకి వచ్చి మళ్లీ జీవితాన్ని నిర్మించిన తీరు ఖత్రీ కథలో కనిపిస్తుంది. అవకాశాలను వినియోగించుకున్న తీరు స్పష్టమవుతుంది. అండర్ వరల్డ్ వ్యాపారన్ని ఓ భారీ వ్యవస్థగా మార్చి దేశవ్యాప్తం చేసిన పేరు ఖత్రీ జీవితంలో ప్రత్యేకమైంది. అందుకే దర్శకుడు నాగరాజ్ మంజులే.. రతన్ ఖత్రీని ప్రేరణగా తీసుకుని మట్కా కింగ్ తెరకెక్కించాడు. క్రియేటివ్, లీగల్ ఇష్యూస్ కారణంగా రతన్ ఖత్రీని కాస్తా బ్రిజ్ భట్టిగా మార్చేశాడు. 60లు 70ల కాలంలోనే ముంబైలో జూదసంస్కృతి ఏవిధంగా ఉండేదో చూపించే ఫిక్షనల్ డ్రామాగా మల్చాడు.

2024లో వరుణ్ తేజ్ హీరోగా కూడా మట్కా అనే సినిమా నిర్మించగా.. ఆ సినిమాకూ రతన్ ఖత్రీ జీవితమే నేపథ్యం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles