ఆయన సేవల ముందు.. నోబెల్ రిజెక్షన్ జుజుబీ!

తన తర్కానికి ఎదురు జవాబివ్వలేని ఎందరో తోటి శాస్త్రజ్ఞులకు ఆ పేరొక వైబ్రేషన్… నేటితరం శాస్త్రవేత్తలకు ఆయన పేరో ఇన్స్పిరేషన్. పలుమార్లు నోబెల్ బహుమతి నామినీల్లో ఉండి రిజెక్టైన.. దేశం గర్వించదగ్గ ఆ బిడ్డడెవరు… ఎందుకు ఆయనకు నోబెల్ దక్కకుండా పోయింది..? ఆ ఐకానిక్ పర్సనాలిటీ గురించి ఓసారి కాస్త చెప్పుకుందాం.

ఆయన పేరు ఎన్నక్కల్ చాందీ జార్జ్ సుదర్శన్. ముద్దుగా ఈసీజీ సుదర్శనంటారు. కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లావాసి. పల్లోమ్ అనే మారుమూల గ్రామంలో 1931, సెప్టెంబర్ 16న పుట్టిన ఈసీజీ సుదర్శన్… భౌతికశాస్త్రంలో అర్థవంతమైన పాత్ర పోషించిన ఆదర్శవంతుడు. అందుకే ఆయన్ను భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో సన్మానించుకుంది. అయితే, సుదర్శన్ కు దక్కాల్సిన నోబెల్ బహుమతి దక్కకపోవడం.. నోబెల్ బహుమాన స్ఫూర్తికి విఘాతం.. నోబెల్ ప్రైజ్ చరిత్రలోనే ఓ అతి పెద్ద విషాదం.

అసలెందుకలా జరిగింది…?

నోబెల్ ప్రైజ్ పొందడం ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన వారికి ఎంత పెద్ద గుర్తింపో… అసలు నోబెల్ దాకా వెళ్లి పలుమార్లు రిజెక్ట్ కావడం అంత బాధాకరం. నోబెల్ బహుమతి సాధించాల్సిన చోట నెలకొన్న వివాదాలకు కుహానా మేధావుల మాఫియా కారణమైతే… ఆయన నమ్ముకున్న నిజాయితీ కూడా ఆయనకా ప్రైజ్ రాకుండా అడ్డుకుందంటారు. అందుకే, రిపీటెడ్ గా నోబెల్ కు తిరస్కరించబడ్డా… శాస్త్ర సాంకేతిక రంగంలో మాత్రం ఆయన పేరు ఓ చెరగని ముద్ర వేసింది.

సుదర్శన్ అమెరికన్ ఇండియన్ థియరిటికల్ ఫిజిసిస్ట్. టెక్సాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్. సుదర్శన్ సైద్ధాంతిక భౌతికశాస్త్రంలో చేసిన సేవలు అనన్య సామాన్యమైనవి. 1960లో క్వాంటమ్ ఆప్టిక్స్ పైన పరిశోధనలు చేసిన సుదర్శన్… 1962లో వెలువరించిన గ్లాబర్-సుదర్శన్ పీ రిప్రజంటేషన్ ఆయన జీవితంలో కీలకమైన పరిశోధన. ఓపెన్ క్వాంటమ్ సిస్టమ్, క్యాంటమ్ జినో ఎఫెక్ట్, వీ-ఏ థియరీ, క్వాంటమ్ మాస్టర్ ఈక్వేషన్స్, స్పిన్- స్టాటిస్టిక్స్ థీరమ్, క్వాంటమ్ కంప్యూటేషన్ వంటివెన్నో ఆయన పరిశోధనల్లో దేశం గర్వించదగ్గవి.

సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన సుదర్శన్… ఆ తర్వాత హిందూమతాన్ని స్వీకరించడం ఆయన వ్యక్తిగత జీవితంలో ఊహించని ఓ పెద్దమార్పు. లలితారావును మొదటి పెళ్లి చేసుకున్న సుదర్శన్ కు ముగ్గురు కుమారులు కాగా… ఆమెతో 1990లో విడాకులవ్వడంతో.. ఆస్టిన్ లో భామతి గోపాలకృష్ణన్ ను వివాహమాడారు. కొట్టాయంలో డిగ్రీ, మద్రాస్ లో మాస్టర్స్ పూర్తి చేసిన సుదర్శన్… టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో ఉద్యోగం లభించడంతో.. హోమీబాబా వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత న్యూయార్క్ లోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ లో ప్రొఫెసర్ రాబర్ట్ మర్షక్ వద్ద గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గా పని చేస్తూనే… అదే యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత పోస్ట్ డాక్టరల్ ఫెల్లోషిప్ కోసం.. ప్రొఫెసర్ జూలియన్ స్వింగర్ వద్ద హార్వర్డ్ యూనివర్సిటీలో చేరారు.

అదే రాబర్ట్ మర్షక్ తో కలిసి వీ-ఏ థియరీ కోసం పనిచేసిన సుదర్శన్.. ఆ భౌతికశాస్త్ర థియరీతో శాస్త్రవేత్తగా తన సత్తా చాటడంతో.. పలు జర్నల్స్ లో ఆయన పేరు మారుమ్రోగింది. అయితే, గ్లాబర్-సుదర్శన్ రిప్రజంటేషన్ ఆయనకో పీడకలలా మారింది. తన కాంట్రిబ్యూషన్ ను గుర్తించకుండా నోబెల్ జ్యూరీ… ఆ ప్రైజ్ ను గ్లాబర్ కు మాత్రమే ప్రకటించడం నాడు వివాదానికి కారణమైంది. కాంతి కంటే వేగంగా ప్రయాణించే కణాల ఉనికిని కూడా గుర్తించేలా సుదర్శన్ పరిశోధనలు సాగాయి. బైద్యనాథ్ మిశ్రాతో కలిసి చేసిన క్వాంటమ్ జీనోమ్ పరిశోధన కూడా సుదర్శన్ కెరీర్ లో ఓ మైలురాయి. ఒక శాస్త్రవేత్తగా శాస్త్ర విజ్ఞానంపై ఎంత శోధన చేస్తూ శాస్త్రీయతపై పట్టు పెంచుకున్నారో… అలాగే, ఒక తత్వవేత్తైన జిడ్డు కృష్ణమూర్తితో అంతగా చర్చలు జరపడం… ఆయన ఓపెన్ మైండ్ సెట్ కు నిదర్శనం.

ఏ థియరీకి నోబెల్ ప్రైజ్ వచ్చింది… అసలెందుకు వివాదం చెలరేగింది..?

న్యూయార్క్ లోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ లో 1960లోనే సుదర్శన్ క్యాంటమ్ ఆప్టిక్స్ పై తన పరిశోధన ప్రారంభించాడు. రెండేళ్లనంతరం గ్లాబర్ అనే మరో శాస్త్రవేత్త.. సుదర్శన్ చేస్తున్న క్యాంటమ్ ఆప్టిక్స్ పరిశోధనలో శాస్త్రీయ విద్యుత్ అయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడాన్ని తప్పుబట్టాడు. బహిరంగంగా విమర్శలు ఎక్కుపెట్టాడు. దానిపై స్పందించిన సుదర్శన్… పూర్తిస్థాయి వివరణలతో సిద్ధాంతాన్ని ఆధారసహితంగా గ్లాబర్ కు పంపాడు. కానీ, గ్లాబర్ విమర్శలు ఆగలేదు సరికదా.. కొద్దిపాటి మార్పులతో సుదర్శన్ క్యాంటమ్ ఆప్టిక్ సిద్ధాంతాన్నే తన సిద్ధాంతంగా.. పీ రిప్రజంటేషన్ పేరుతో ప్రచారంలోకి తీసుకొచ్చాడు. మొదట సుదర్శన్ క్వాంటమ్ ఆప్టిక్స్ థియరీని విభేదించి, విమర్శించిన గ్లాబరే… ఆ తర్వాత గ్లాబర్-సుదర్శన్ థియరీగా పిల్చినా మారు మాట్లడకపోగా… నోబెల్ జ్యూరీ సుదర్శన్ పేరు కాదని కేవలం గ్లాబర్ కే నోబెల్ ప్రైజ్ ను ప్రకటించడం నిలువెత్తు వివక్షకు కారణమనే వాదనకు తెరలేపింది. ఈ వివాదం 2005లో జరగ్గా… సుదర్శన్ కు నోబెల్ బహుమతి విషయంలో పలుమార్లు ఇలాంటి సవాళ్లే ఎదురయ్యాయి. అనేకమంది శాస్త్రవేత్తలు కూడా స్పందించి స్వీడిష్ అకాడమికి కూడా సుదర్శన్ కు మద్దతుగా లేఖలు రాశారు. డయాగ్నల్ రిప్రజంటేషన్ లో కూడా సుదర్శన్ కు నోబెల్ బహుమతిలో షేర్ ఇవ్వాలని కూడా ఆ సైంటిస్టుల బృందం డిమాండ్ చేసింది.

ఒక బిల్డింగ్ నిర్మిస్తే… పునాదులతో కూడిన మొదటి అంతస్తు నిర్మించినవారికి బహుమతినివ్వకుండా… రెండో అంతస్తు నిర్మించినవారికి బహుమతినివ్వడం ఎలా సమంజసమో ఆ నోబెల్ జ్యూరీకే తెలవాలంటూ ఒకానొక సందర్భంలో ఓ ప్రముఖ పత్రికతో సుదర్శన్ సర్క్యాస్టిక్ గా మాట్లాడిన తీరు ఆయన ఎంత నొచ్చుకుని ఉంటారో తెలియజేసింది.

ఇంట్రడక్షరీ ఆఫ్ ఎల్మెంటరీ పార్టికల్ ఫిజిక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ క్వాంటమ్ ఆప్టిక్స్, డౌట్ అండ్ సెర్టైనిటీ వంటి ఎన్నో బుక్స్ రాసిన పద్మవిభూషణుడైన మనం గర్వించదగ్గ అన్ సంగ్ హీరో సుదర్శన్ చేతుల్లో పడలేక… ఆ నోబెల్ బహుమతి కూడా తన పరిపూర్ణతకు దూరమవ్వడం విచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles