దానికూరనే.. రుచి !
ధనియాలు మెంతులు
దంగకపోయిన సరెగని
దాని కూరనే కమ్మగున్నది !
ఇది వొగ గమ్మతి సామెత.
ఈ కిందిది దీని వెనుకున్న కథ.
…………………………………………..

మా పక్కూర్ల కిట్టయ్య అనే బట్టెబాజి ఉన్నడు.
మీసం మొలిచినకాన్నుంచే మోరుదోపు కోల్ల్యాగె.
పక్కసూపులు పైసూపులతోటే వానికథ నడుస్తంది.
కంట్లెవడ్డ ఆడిదాన్ని కర్రెకుక్కను చేసి తిప్పుకుంటడు.
అందగాడా అంటె అదెక్కడిదని ? అమ్మోరు మొకపోడు.
ఏం మాయజేస్తడోయేమొ,వాని నాటుకాలన్ని మాటలతోనే.
భార్య రుక్మవ్వది బహుదొడ్డగుణం. దేవగణమనుకోరాదుర్రి.
పెండ్లయిన కొత్తల వీని నాటుకాలు తెలిసి మలుపజూసింది,
మెత్తగజెప్పింది, మొత్తుకోని చెప్పింది, సత్తనని బెదిరిచ్చింది.
అలువాటైన పానం అంగడంగడని కిట్టిగాడేనా మానేది,మారేది.
ఇగ ఒక్కచిత్తం జేసుకోని, పిల్లలకోసమే బతుకుడు నేర్సుకున్నది.
ఇద్దరు ఆడివిల్లల లగ్గాలుమూర్తాలు పురుళ్లు పెట్టువోతలైపేనయి.
తాడిచెట్లంత అల్లుండ్లు వచ్చినంకసుతం మామ తోక సక్కగగాలె.
కిట్టడు చిన్నోడేనా ? ఇంట్ల-బయట ఎక్కుడ తక్కునజూడడు గద,
ఇరువైలల్ల మొదలైన సంసారం అరువయేండ్లు దాటుకపోయిందా,
తిట్టుకుంట తిమ్ముకుంటనే రుక్మవ్వ, తలింత ఉడికవెట్టి పారేస్తంది.
ఇసపుగాలికోయేమొ ఆయిటిముందట కిట్టనికి జెరమంటుకున్పది.
వాని రోగముల మన్నువడ బొక్కలుదేలి కాట్లె కర్రెపిట్ట లెక్కయిండు, ఆలుమగలకొట్లాట అర్థమై మునుగుద్దా, అండ్లదండ్ల ముసలోళ్లది.
రుక్కవ్వ తెల్లందాక పొద్దందాక తిట్టుడు తిట్టుడే – పెట్టుడు పెట్టుడే.
అంబలిగాసింది. ఉప్పుడుపిండివోసింది. రాములుకకూర వండింది.
చిక్కగ పచ్చిపులుసు జేసింది. డబ్బలురొట్టె కొనుకచ్చి తినవెట్టింది.
నోటికి రుచత్తదని చింతపండుతొక్కు నూరింది. మస్తుగర్సుకున్నది.
కొద్దిగ జెరమెనుకకు వట్టినంక సౌరం జేపిచ్చి తలకు తానంబోసింది.
తామూలైంది కిట్టడు లేచి, జెర ఇంట్లకు బైటికి తిరుగుడు వట్టిండు.
మాపటికి రుక్మవ్వ బియ్యపురొట్టెజేసి, పుంటికూర తొక్కు నూరింది.
రొట్టెలు ఉడుకున్నయి-తొక్కునూరిన, తిందురాయే!అని పిలిచింది.
ఏం తొక్కే,ఏమో తొక్కుతొక్కని సంపుతన్నవు, నోరు చెడచేదున్నది.
గా చింతకింది సత్తెమ్మ, ఇంతకుముందే ఏందో పోసువెట్టినట్టున్నది,
కమ్మకమ్మటి వాసనకే పానం లేచికుసుంటంది. తింటె ఇంకెంతరుచో,
ముత్తెమంత అడుక్కరాపోరాదె, నాపేరుజెప్పు మా ఏస్తది అన్నడు. రుక్కవ్వకు మండుడుమండింది పో. ఇగ అగ్గిమీద ఉప్పురాయైంది. చింతజచ్ఛిన పులుపుజావని గాడిదికొడుకు, వీని నామునరికెయ్య, తాడుదెంపెయ్య, ఆల్లపొద్దుగాల దింపుడుగల్లం జెయ్య అనుకుంట
రుసరుసలాడుకుంట కటోరవట్టుకోని రుక్మవ్వ తలగైండ్లకువచ్చింది.
బర్లమంద అప్పుడే ఊర్లకు మర్లుతంది. రుక్మవ్వ తిక్కమీద ఉన్నది.
తోకలు లావడుతున్న బర్లదిక్కుజూసి, ఓ బర్రెతోకకు కటోర వెట్టింది.
బర్లు,నాలుగు చెడగొట్టువానలకు మొలిచిన పస్క తినివస్తున్నయి,
బడబడమని జర్రనజారి కటోర నిండింది.రుక్మవ్వ ఎనుకకు మర్లింది.
రెండురొట్టెలు కంచంలేసి,అంచుకు ఈ తొక్కుదెచ్చి కుమ్మరిచ్ఛింది.
ఉడుకుడుకు రొట్టెల్లకు, రవ్వరవ్వగ నూరిన తొక్కు గోరెచ్చగున్పది.
కిట్టడు నాలుగుముక్కలు మలిచిపెట్టి తిన్నంక, ఎట్లున్నది సత్తెమ్మ
నూరిన పుంటికూరతొక్కు, మంచిగున్నదిలే అని రుక్మవ్వ అడిగితే,
నీ యవ్వ, అవ్వలుదరియున్నది. నీ పంకిడిమొకానికి జెయ్యస్తాదె,
మొద్దుమొకానికి బద్దబాసింగమని నీకురాదు, నీ అవ్వకసలు రాదు.
పొద్దందాక ఎర్రటెండల నలి ఏరవొయింది పానంపుల్లసిల్లిందో ఏమో
పాపం, సత్తి మెత్తగ నూరలేదేమొ, కొద్దిగ కటుకుకిటుకు మంటంది,
ధనియాలు మెంతులు దంగలేదు గని, దాని కూరనే కమ్మగున్నదే..!
అనుకుంట, ఇంకోరొట్టె వెయ్యిమని కిట్టయ్య కడుపునిండ తిన్నడు.
తిన్నపానం తిప్పలవెట్టిందని, ఎంగిలిమంగలం కథలిట్లనే ఉంటయి.
ఇది.. మన సామెత – మన వంకరబుద్ధి కథ.
డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి..✍️ (తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్, కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల)
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
(పైన గిన్నెలది రుక్కవ్వ తెచ్ఛిందైతె గాదు, గుర్తువట్టినోళ్లు ఘటికులు! 😜😛😂)



