ఆయనో నడిచే గ్రంథాలయం!

వాకింగ్ లైబ్రేరియన్.. సుకుమారన్ ఇన్స్పైరింగ్ జర్నీ!

ముఖపుస్తకం వచ్చాక… పుస్తకముఖం చూసేవారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతున్న రోజులివి. కానీ పుస్తకం ద్వారా.. దాని పఠనం ద్వారా ఎంత నేర్చుకోవచ్చో ముఖపుస్తకమే పుస్తకమైపోయినవారికి తెలియంది కూడా ఏంకాదు! అయితే అలాంటి పుస్తకాలకు ఊరూరా ఓ లైబ్రరీ… సాయంత్రం కాగానే ఆ లైబ్రరీలో రకరకాల పుస్తకాలు, నవలలు, సాహితీ గ్రంథాలు చదివేందుకు ఆసక్తితో, అనురక్తితో వచ్చే పాఠక మహాశయులు… ఇవన్నీ ఇప్పుడు గత జ్ఞాపకాలే! ఇప్పుడంతా డిజిటల్ యుగం. పీడీఎఫ్ ల్లో వచ్చినదాన్ని… అక్షరాలను జూమ్ చేసుకుని మోబైల్స్ లోనే ఓపిక ఉన్నంత చదివి.. మిగిలినదాని సంగతి తర్వాత చూద్దాంలే అనుకునే రోజులివి. పుస్తకాలు.. లైబ్రరీలంటే ఈకాలం యువత నవ్వవచ్చును కూడా! కానీ, ఓ లైబ్రేరియన్ మాత్రం అందుకు భిన్నంగా… కిలోమీటర్ల మేర నడిచి పఠనాసక్తి ఉన్న చదువరులందరికీ ఎంతో ఓపికతో పుస్తకాలను సరఫరా చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఆ కేరళకు చెందిన సుకుమారన్ ముచ్చటే ఇది.

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న 64 ఏళ్ల ఈ వ్యక్తి.. కేరళకు చెందిన పి. సుకుమారన్.. ఓ వాకింగ్ లైబ్రేరియన్. 46 ఏళ్లుగా రోజుకు 12 కిలోమీటర్ల మేర నడిచి.. పుస్తకప్రియులకు పుస్తకాలను పంపిణీ చేస్తూనే ఉన్నాడు! ప్రతీరోజూ కనీసం 35 ఇళ్లకైనా వెళ్లి వారికి కావల్సిన పుస్తకాలు పంపిణీ చేయనిదే.. ఈ వాకింగ్ లైబ్రరీకి నిద్రపట్టదు. ఇప్పుడు ఈయన జాబితాలో చేరిన ఇళ్ల సంఖ్య ఏకంగా 107. అలప్పుళాలోని కరువట్టకు చెందిన సుకుమారన్ ఉదయాన్నే లేవగానే… తన కాలకృత్యాలు, టిఫిన్ ముగించుకుని.. రెండు బ్యాగుల నిండా కనీసం 60 నుంచి 70 పుస్తకాలు నింపుకుని… మార్గమధ్యంలో భోజనం కోసం అదే బ్యాగులో లంచ్ బాక్స్ ను కూడా పెట్టుకుని ఓ స్కూల్ కు వెళ్లే పిల్లాడిలా కాలిబాటన బయల్దేర్తాడు. కుమారపురం లైబ్రరీలో 1979లో లైబ్రేరియన్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు సుకుమారన్. ఎందుకిలా… అని ఎవరైనా ప్రశ్నిస్తే…? తాను పుస్తకాలను ప్రేమిస్తాను… పుస్తకాలను ప్రేమించేవారినీ ప్రేమిస్తాను.. అందుకే వారిని చేరుకుని వారికి పుస్తకాలందజేయడంలో ఆనందం పొందుతానన్నది సుకుమారన్ సమాధానం.

అలప్పుళాలో ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన సుకుమారన్… తన రోజూవారీ నడకలో తనకెంతో ఆనందముందని… చుట్టూ కొండలూ, చెట్లూ, పుట్టా, పిట్టా ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూనే… తాను చదివింది… తాను పుస్తకాలు పంపిణీ చేసినవారు చదివినవీ.. ఒకరికొకరం షేర్ చేసుకోవడాన్ని ఇష్టపడతానంటాడు. అలా విజ్ఞానానికి విజ్ఞానం… నడకకు నడక… పచ్చని ప్రకృతి ఆస్వాదన… ఇలా అన్నీ జీవితానికి టానిక్ వంటివే కదానన్నది సుకుమారన్ తిరిగి తనను ప్రశ్నించేవారిని అడిగే ఎదురుప్రశ్న..?

కుమారపురంలోని పబ్లిక్ లైబ్రరీని 1950లో స్థాపించగా… కేవలం రెండు గదులతో నడుస్తోందది. ఒకనాడు ఒక వెలుగు వెలిగిన ఈ లైబ్రరీ ఇప్పుడు ఈ సమకాలీన డిజిటల్ వ్యవస్థలో మూగబోయింది. సందర్శకులు తగ్గిపోవడంతో… సుకుమారనే సందర్శకులను సందర్శించైనా చదివించాలని తల్చాడు. అనుకున్నదే తడువుగా నడుం బిగించాడు. అలా 41 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఆయన పాదయాత్ర… వాకింగ్ లైబ్రరీగా ఇంకా కొనసాగుతూనే ఉంది. బైక్ రైడింగే కాదు… కనీసం సైకిల్ కూడా తొక్కడం కూడా రాని సుకుమారన్ కు తన పాదాలే చక్రాలయ్యాయి. అందుకే ఉదయం 8 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఆయన ప్రయాణం.. ఇంటి నుంచి లైబ్రరీకి చేరుకుని… అలా అలా పాదయాత్రతో పాఠకుల ఇంటింటికీ చేరుకుంటుంది. తిరిగి సాయంకాలం 4 గంటలకుగానీ మళ్లీ… ఆయన కుమారపురం లైబ్రరీకి చేరుకోరు! తాను కళాశాలలో చదువుతున్న రోజుల్లో ఇంటింటికీ నడుచుకుంటూనే వెళ్లి వార్తా పత్రికలు వేసిన అనుభవం… ఇప్పుడు వాకింగ్ లైబ్రేరియన్ గా సుకుమారన్ కు బాగా ఉపయోగపడుతోంది.

పుస్తకాల విలువను తెలపడం…చదివే అలవాటును పెంపొందించడమే ధ్యేయంగా సుకుమారన్ మారడానికి… ముందుగా తానో ఆసక్తి గల పాఠకుడవ్వడమే ప్రధాన కారణం. బాల్యం నుంచే చదవడం మీద మమకారం పెంచుకున్న సుకుమారన్… రోజూ దాదాపు 11 వార్తాపత్రికలు చదువుతాడు. చదువుతో మాత్రమే విజ్ఞానవంతులం కాగలమని… నేర్చుకోవడంతోనే ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవచ్చని నమ్మిన ఓ చదువరి సుకుమారన్. తెలుసుకుంటున్నప్పుడే.. ఇంకెంత తమకు తెలియదో తెలుసుకునే అవకాశముందని నమ్మిన వివేకవంతుడు. ఆ స్ఫూర్తిని తన గ్రంథాలయానికొచ్చిన పాఠకుల్లోనూ ఎప్పటికప్పుడు నింపాలన్న తపనే ఇవాళ సుకుమారన్ ను ఓ వాకింగ్ లైబ్రేరియన్ గా ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే సుకుమారన్ ప్రయత్నంతో… ఇప్పుడు కుమారపురం గ్రంథాలయంలో సభ్యత్వాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. తాను పుస్తకాల పంపిణీ కోసం మాత్రమే ఇంటింటికీ తిరుగుతున్నాడంటే మాత్రం సుకుమారన్ నొచ్చుకుంటాడు. ఎందుకంటే.. ప్రతీ ఇంటికీ వెళ్లి వారితో వారేం చదివారు, ఏం అర్థం చేసుకున్నారన్నవి అడిగి… వారికర్థం కానివి తనకు తెలిసినవి వివరిస్తాడు సుకుమారన్. ముఖ్యంగా చిన్నపిల్లలకు అర్థం చేయించే ఓ గురువైపోతాడా సమయంలో!

ఈ వాకింగ్ లైబ్రేరియన్ త్యాగం ఎంత స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుందో… ఆయన సంసార జీవితంలో అన్నే ఆటుపోట్లు కూడా మనల్ని కంట తడి పెట్టిస్తాయి. భార్య, ఆటిజంతో బాధపడుతున్న తన 12 ఏళ్ల కుమారుడితో కలిసి.. ఏళ్లుగా అద్దె ఇంట్లోనే తమ బతుకుచిత్రాన్ని వెళ్లదీస్తున్నాడు సుకుమారన్‌. లైబ్రేరియన్‌గా.. కేరళ స్టేట్ లైబ్రరీ కౌన్సిల్ నుండి సుకుమారన్ కి నెల భత్యం 4 వేల 120 రూపాయలందితే.. పుస్తక విక్రయాల ద్వారా పొందే మరో 30 శాతం కమీషనే తన కుటుంబం మొత్తానికీ ఆధారం. ఎప్పటి నుంచో సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్న సుకుమారన్ కల.. అందుకే ఇంకా కలగానే మిగిలింది. కొడుక్కి సరైన వైద్యం, మందులు కావాలి… కాబట్టి సుకుమారన్ సంపాదనలో ఎక్కువ భాగం కొడుకు సంరక్షణకే ఖర్చు పెట్టాల్సిన దయనీయ పరిస్థితి. అయినప్పటికీ వాకింగ్ లైబ్రేరియన్ గా… తన పని పట్ల తనకున్న మక్కువ తనకు ఆనందాన్నే ఇస్తుందంటాడు ఈ అల్పసంతోషి. ఎప్పటికైనా కుమారపురం లైబ్రరీకి మహర్దశ పట్టించాలని… అక్కడున్న అరుదైన పుస్తకాలను మరింత మంది చదివేలా చేయాలన్న స్పిరిట్ తో ఇప్పటికీ ఈ వాకింగ్ లైబ్రేరియన్… తాను నడుస్తూనే… కుమారపురం లైబ్రరీని నడిపిస్తున్నాడు.

సుకుమారన్ సేవలను గుర్తించిన కేరళ స్టేట్ లైబ్రరీ కౌన్సిల్ స్టాఫ్ అసోసియేషన్… 2016లో ఆయన్ను ఐవీ దాస్ మెమోరియల్ అవార్డ్ తో సత్కరించింది. తనకున్న పఠనాసక్తి.. ఇతరుల్లోను పఠనంపై ఆసక్తి కల్పించాలన్న అనురక్తి.. వెరసి ఇలాంటి సుకుమారన్ లు ఈ రోజుల్లోనూ ఇంకా కనిపించడమంటే నిజంగా అరుదే మరి!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles