విడిపోయిన భార్యభర్తలు అకస్మాత్తుగా తారసపడ్డప్పుడు.. రివీల్ అయ్యే భావోద్వేగాల చిత్రిక ఇజాజత్. జీవితం ఎలాంటి నిరీక్షణో.. ఓ రైల్వేస్టేషన్ వెయిటింగ్ రూం ప్రతీకగా తెరకెక్కించిన కావ్యం.
మనిషి మెదడుకందని.. మనసుతో మాత్రమే కొలిచే భావోద్వేగాలను పట్టుకుని ఒక దృశ్య రూపకల్పన చేయడమంటే కత్తిమీద సాము. దానికి పెద్దగా సెట్టింగ్సూ అవసరం లేదు.. భారీ తారాగణన్నంతా దింపి హంగామా చేయాల్సిన గత్యంతరమూ అంతకన్నా లేదు. కావాల్సిందల్లా భావోద్వేగాలతో కూడిన కథ.. ఆ కథకు కావల్సినంత కల్పనా చాతుర్యం.. వాటిని అంతే అందంగా తెరపై ఆవిష్కరించడం.. అవన్నీ మిళితమైన మాస్టర్ పీస్ ఇజాజత్. కాస్త ఆ సినిమా గురించి.. దాన్ని ఓ అద్భుతశిల్పంగా మల్చిన కవిదర్శకుడి గురించి.. ఆయన పుట్టినరోజైన ఈ ఆగస్ట్ 18న కాస్త చెప్పుకుందాం.

కేవలం, భావోద్వేగాలను బలంగా పండించగల్గే నల్గురు నటులుంటే చాలు… తాననుకున్న కథా లోతును అంతే అందంగా క్యాన్వాస్ పైకి ఎక్కించగలనన్న నమ్మకముంటే చాలు.. తరతరాలు మర్చిపోలేని ఓ సినిమా తీయొచ్చు. కవిగా తన పొయెట్రీతో సాధించినదాన్ని… సెల్యూలాయిడ్ పైన దృశ్యరూపకంగానూ అంతే అందంగా పర్చి.. ఇజాజత్ తో గుల్జార్ అద్భుత కావ్యదర్శకుడనిపించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫట్టనేవాళ్లు ఉండొచ్చునేమోగానీ… ఈ వర్షకాలపు చిరుజల్లుల్లో మనసును కుదురుపర్చుకుని ఒక్కసారి ఆ సినిమా తరచి తరచి కాస్తా లోతుల్లోకి వెళ్లి చూడండి. రైల్వేస్టేషన్ లోని ఆ వెయిటింగ్ రూమ్ నిగూడార్థం మీకేం చెబుతుందో ప్రయత్నించండి. ఎంత బాగుంటుందో!
మహేందర్ (నసీరుద్ధీన్ షా), సుధ (రేఖ) ఇద్దరూ కొత్తగా పెళ్లైన జంట. వారి అన్యోన్య దాంపత్యం మధ్య మాయ చేసే క్యారెక్టరే మాయ (అనురాధా పటేల్)
మహేందర్, సుధ ఇద్దరూ తరచూ మాట్లాడుకునే మాయ.. మహేందర్ మాజీ ప్రేయసి. ఆమె వస్తువులన్నీ పెళ్లయ్యాక ఇంట్లో కనిపించడంతో మొదలైతుంది అసలు కథ.
మహేందర్ పర్సులో మాయ ఫోటో.. సుధలో అంతర్మథనానికి కారణమవుతుంది. ఓ కోటు, ఓ శాలువా, సన్ గ్లాసెస్… ఇలా మాజీ ప్రేయసి వస్తువులున్నింటిని చూస్తూ భరిస్తున్నా… మనసులో ఎక్కడో ఓ చిన్న కలవరం మాత్రం వెంటాడుతూ ఉంటుంది. అదే మహేందర్, సుధ మధ్య నిరంతర చర్చగా మారుతుంది. సుధలో తెలీని మానసిక సంఘర్షణను లేవనెత్తుతుంది. అందుకే, సుధ మెల్లిగా వాటన్నింటినీ కనిపించకుండా చేయాలనుకుంటుంది. అలా అని తాను బయటపడకుండా.. భర్తకు ఎలాంటి అనుమానం రాకుండా.. మళ్లీ మాయకు ఉపయోగపడుతాయేమోనని ఆమె వస్తువులను తిరిగి పంపించమని భర్త మహేందర్ ను అడుగుతుంది. సుధ మాటను కాదనకుండా.. మాయ వస్తువులను మహేందర్ తిరిగి పంపించేస్తాడు.
అదిగో అలాంటి సందర్భాలనే.. కవులైన దర్శకులుంటే ఇంకెంత సృజనాత్మకంగా మల్చుకోగలరో… తన కలంకున్న బలంతో పాట రూపంలో వినిపించి.. సినిమా మొత్తానికే ఆ పాటను ఒక లైఫ్ గా మారుస్తాడు.
మహేందర్ తిరిగి పంపిన తన వస్తువులకు బదులుగా… మాయ నుంచి లేఖ రూపంలో అందే ఆ పాట… సినిమా మొత్తానికే ప్రాణం.
ఓ వార్తలా రాశారు.. ఇది అసలు పాటేనా… నేనెలా కంపోజ్ చేసేదని కొంచెం అటుఇటు అయ్యాడట అంతటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బర్మన్. కానీ, తాను ఆందోళన చెందినదానికన్నా.. అద్భుతంగా బాణి కట్టాడు పంచమ్. వెరసి, పాడిన ఆశా ఉత్తమ గాయకురాలు.. రాసిన గుల్జార్ ఉత్తమ గీత రచయిత.. అలా, ఇద్దరికీ నేషనల్ అవార్డులను కట్టబెట్టింది ఆ త్రయ సంగీత బంధం.
భావోద్వేగపు లోతులను స్పృశిస్తూ… మానసిక సంఘర్షణలను ఒడిసిపడుతూ… ఒక పాటను సృష్టించిన కవే… ఒక సినిమా మొత్తాన్నీ అంతే బిగి సడలకుండా తీయగల్గితే ఎంత బావుంటుందంటే… అది ఇజాజత్ లా ఉంటుంది.
తన దగ్గర మిగిలిపోయిన సామాన్లను పంపిన మహేందర్ కు.. తన మాజీ ప్రేయసైన మాయ రాసే లేఖ సారాంశాన్ని పాటలో ఎంతందగా చిత్రించాడు గుల్జార్! అక్షరాలతోనే దృశ్యకల్పన చేసే చిత్రకారుడతను. భావుకతకు ఓ నిలువుటద్దంలా మాయ, మహేందర్ స్టోరీని చెబుతాడు. ఇంకా నా వస్తువులు కొన్ని నీ దగ్గరే మిగిలిపోయినాయి.. మరి వాటి సంగతేంటి… నాటి ఆ వర్షపు రాత్రుల క్షణాలను తిరిగిమ్మని కోరుతుంది. సగం సగం తడిసిన ఆ రాత్రుల్లోని పొడిని మాత్రమే తాను తెచ్చుకున్నానని.. మిగిలిన తడి సంగతేంటని మహేందర్ ను ప్రశ్నిస్తూ సాగే ఆ పాట ఒక్కటి చాలదూ దర్శకకవి గుల్జార్ సినిమా లోతెంతో స్పృశించడానికి..?
అంతేనా..? ఆ లేఖను భార్య సుధకు, మహేందర్ వినిపించడం… అప్పుడు సుధలో కనిపించే చింతన.. వెళ్లిపోయింది ఆమె వస్తువులేగానీ, జ్ఞాపకాలు కావు కదా.. ఈ మాత్రం దానికే ఆ వస్తువులను ఆమెకు పంపించేశానే… అనే భావనలు ఇలా సుడులు సుడులుగా చుట్టుముట్టే భావోద్వేగాల దృశ్యరూపం ఇజాజత్.
1980ల కాలంలో విడాకులకు సంబంధించిన సినిమాల్లో ఇజాజత్ ఒక భిన్నమైన కవితాత్మక చిత్రం. అంతెందుకూ, ఇప్పటికీ భావోద్వేగాలు, నిగూఢమైన ప్రతీకాత్మక భావనలతో అంత లోతైన సినిమా రాలేదేమో బహుశా! ఇప్పటికీ బ్రేకప్స్ కు సంబంధించిన పాటల్లో… మేరా కుఛ్ సామాన్ తుమ్హారే పాస్ పడా హై అనే పాట ఓ హంటింగ్ సాంగ్.
జీవితమంటేనే నిరీక్షణ!
అసలు సినిమా సీన్ ప్రారంభమే… భారీ వర్షం పడుతున్న సమయంలో రైల్వే స్టేషన్ తో చేస్తాడు గుల్జార్. అక్కడే సినిమాతో మొదట ప్రేమలో పడిపోతాం. అందులో ఓ వీఐపీ లాంజ్. రావల్సిన ట్రైన్ కొన్ని గంటల ఆలస్యం. ఇంకేం సినిమా ప్రారంభించి.. ఫ్లాష్ బ్యాక్ లోకి అద్భుతంగా తీసుకెళ్లడానికి ఆ మాత్రం నేపథ్యం చాలదూ!
అలా జీవితకాలం లేట్ అయ్యే ట్రైన్ కోసం వెయిటింగ్ చేయకతప్పని పరిస్థితుల్లో లాంజ్ లోకి వెళ్లిన మహేందర్.. సుధ కంటపడటం.. ఆ తర్వాత సుధ, మహేందర్ ఒకరికొకరు తారసపడటం.. తదనంతర సన్నివేశాలన్నీ ప్రశాంతంగా చూస్తుంటే… ఎంత పొయెటిక్ గా తీశాడు సినిమాని గుల్జార్ అనిపిస్తుంది.
అంతేనా…? సినిమాకు రైల్వేస్టేషన్ ఎంపిక.. వర్షపు సీన్స్… ట్రైన్ లేటవ్వడం… వెయిటింగ్ రూమ్ నిరీక్షణ… ఇలా అన్నీ ప్రతీకాత్మకంగా కనిపించేలా డిజైన్ చేశాడు గుల్జార్. కాబట్టే ఇజాజత్ ఓ కావ్యమని చెప్పుకోవడం.
ఆ స్టేషన్ లాంజ్ రూమ్ లో విడిపోయిన భార్యభర్తల మధ్య జరిగే సంభాషణలు.. అంతర్లీనంగా లోతులను స్పృశించే మాటల రచనలతో మొదలై… భార్యా, భర్త, ఓ ప్రేయసీ మధ్య ఏం జరిగిందన్న ఫ్లాష్ బ్యాక్ తో ట్రైన్ వెయిటింగ్ టైంను ఎంగేజ్ చేస్తాడు దర్శకుడు.
మహేందర్ గా నసీరుద్దీన్ షా… సుధగా రేఖ పాత్రలకు ఎంత ప్రాధాన్యతనైతే ఇచ్చాడో… మాయ క్యారెక్టర్ లో అనురాధా పటేల్ కు కూడా అదే స్థాయి ప్రాధాన్యత కనిపిస్తుంది. నేటి సహజీవనం ధోరణులు నాడే మాయ పాత్రతో చూపించాడు గుల్జార్. మొత్తంగా కథను విప్పి విప్పనట్టు ఇక్కడ చర్చించామేగానీ… అసలు సినిమా మొత్తం కాస్తా ఆసక్తితో చూడాలనుకునేవారు ఇజాజత్ కోసం ఎవ్వరి అనుమతీ తీసుకోనవసరం లేదు.



