ఆయనో అన్ స్టాపబుల్ స్విమ్మింగ్ మాస్టర్: చదవాల్సిన ఓ కేరళ టీచర్ రివర్ జర్నీ ఇది!

మనమోసారి అలా సరదాగా కేరళకు వెళ్లి అబ్దుల్ మాలిక్ అనే మేథమెటిక్స్ టీచర్ ను కలిసొద్దాం రండి. ఎందుకంటే, సరిగ్గా మూడు దశాబ్దాల నుంచి ఆ ఉపాధ్యాయుడు ఓ నదిని ఈదుతూ పాఠశాలకెళ్లి పాఠాలు చెబుతున్నాడు.

మండల హెడ్ క్వార్టర్స్ లోనో, జిల్లా కేంద్రాల్లోనో ఉంటూ ఇతర ఊళ్లల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారెందరో బస్సుల్లో, బైకుల్లో, కాస్త దూరమై బస్సు సౌకర్యం లేకుంటే ఓ నల్గురైదుగురు కలిసి కార్లల్లో స్కూల్స్ కి వెళ్లి వస్తుండటం మనం తరచూ చూస్తున్నదే. కానీ, కేరళకు చెందిన అబ్దుల్ మాలిక్ అనే ఉపాధ్యాయుడు మాత్రం ఎండాకాలం, వానాకాలమన్న తేడా లేకుండా, వరదలు వచ్చినా లెక్క చేయకుండా.. ఈదుతూ నదిని దాటి స్కూల్ కు వెళ్లి వస్తుంటాడు.

సరిగ్గా 33 ఏళ్ల నుంచి మాలిక్ కాదలుండి అనే నది దాటి ప్రయాణిస్తూ పిల్లలకు చదువు చెప్పి వస్తున్నాడు. అదీ ఎలాంటి ఆలస్యం లేకుండా.. ఒక్క రోజూ మిస్ కాకుండా. అందుకే అబ్దుల్ మాలిక్ ఇప్పుడు ప్రత్యేకం.

మరి ఎందుకు మాలిక్ ఈదాల్సి వస్తోంది..?

తన స్కూల్ కు మాలిక్ తన ఊరి నుంచి వెళ్లాలంటే.. 3 గంటల సమయం పడుతుంది. పైగా అందుకు మూడు బస్సులు మార్చాల్సి ఉంటుంది. అదే నది దాటితే జస్ట్ 15 నిమిషాల్లో మాలిక్ తాను పనిచేసే పాఠశాలకు చేరుకుంటాడు.

మలప్పురం జిల్లా పడింజట్టుమరిలో ముస్లిం లోయర్ ప్రైమరీ స్కూల్ లో జాబ్ వచ్చిన తొలినాళ్ళలో మాలిక్ కు కూడా తన ట్రాన్స్పోర్ట్టేషన్ ఇబ్బందిగానే అనిపించింది. కానీ, తన కొలీగ్ ఇచ్చిన ఐడియాతో కాదలుండి నదిని దాటే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. అది షైనైనా.. రెయినైనా పాఠశాలకు ఆ నదిని దాటుతూనే వెళ్తున్నాడు. పిల్లలకు ఎలాంటి ఆలస్యం కూడా లేకుండా వెళ్లి గణిత బోధన చేస్తూనే ఉన్నాడు.

మాలిక్ వెళ్లేటప్పుడు ఓ ట్యూబ్ అతడి వెంట ఉంటుంది. తన వెంట ఓ బట్టల జత, తన లంచ్ బాక్స్, తన చెప్పులు, పుస్తకాలు, ఇతరత్రా సామాగ్రి అంతా ఓ ప్లాస్టిక్ కవర్ లో గట్టిగా కట్టి దాన్ని ట్యూబ్ కు కట్టి.. ఆ ట్యూబ్ తో సహా తానూ ఈదుతూ నది దాటుతాడు. నది దాటగానే.. అక్కడే ఉన్న ఓ బండరాయి వెనక్కెళ్లి తన వెంట బ్యాగ్ లో ఎక్స్ట్రా తెచ్చుకున్న డ్రెస్ మార్చుకుని.. తన ముఖం మీద ఎలాంటి అలసటా కనిపించకుండా వెళ్లి పిల్లలకు విద్యా బోధన చేస్తున్నాడు అబ్దుల్ మాలిక్.

12 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్ కు బస్సు సౌకర్యం సరిగా లేక.. రోడ్డు సౌకర్యం అంతకన్నా బాగా లేక.. చుట్టూ తిరిగి మూడు బస్సులు మార్చిపోతే మూడు గంటల సమయం పడుతున్న క్రమంలో.. ఈదటమే తన ట్రాన్స్పోర్టేషన్ లో భాగంగా మార్చుకున్నాడు మాలిక్. సరిగ్గా 15 నిమిషాల నుంచి 30 నిమిషాల మధ్య ఈదుతూ స్కూల్ కు చేరుకుంటాడు. ఇప్పుడు ముస్లిం లోయర్ ప్రైమరీ స్కూల్ లోని పిల్లలంతా.. మాలిక్ ను ట్యూబ్ మాస్టర్ అని పిల్చుకుంటారు.

తాను ఈదడం తన బతుకు చిత్రానికి సంబంధించిన సర్వైవల్ జర్నీ. గణిత బోధన తన కర్తవ్యం. కానీ, అక్కడికే పరిమితం కాలేదు మాలిక్. ఆ ప్రాంతంలో తానో హీరో. తాను నిత్యం ఈదే నది ఎంత కాలుష్యానికి గురవుతుందో చూస్తూ నది దాటే మాలిక్.. ఆ నది శుభ్రపర్చే యజ్ఞానికీ శ్రీకారం చుట్టాడు. పిల్లలతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, ఇతర చెత్తా చెదారాన్ని సేకరించి నది నుంచి వేరు చేస్తున్నాడు మాలిక్. అంతేకాదు, ఈత వచ్చి ఉండటం జీవితంలో ఎంత అవసరమో తెలిసిన తను.. తన విద్యార్థులకూ ఈత నేర్పుతున్నాడు. నీళ్లంటే భయం లేకుండా ఈదేలా తర్ఫీదు ఇస్తున్నాడు. ఈ మాలిక్ స్ఫూర్తిగాధ కేరళకే పరిమితం కాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక రియల్ హీరో ఎలా ఉంటాడో తెలియజెప్తోంది.

ఇంతకీ మరి మాలిక్ స్టోరీ నుంచి నేర్చుకోవాల్సిందేమిటి..?

నెవర్ గివ్ అప్.. ఎప్పుడూ ఎంత కష్టమైనా పోరాటం ఆపకు, చేతులెత్తేయకనే సందేశాన్నిస్తోంది. టైం సెన్స్ మేనేజ్మెంట్ నూ నేర్పిస్తుంది. ప్రకృతి పట్ల ఓ మనిషికి ఉండాల్సిన బాధ్యతను చూపిస్తుంది. అలాగే, తన ఈతను తనవరకే పరిమితం చేసుకోకుండా.. తనలాగే, భవిష్యత్తులో తన విద్యార్థులకు అవసరమైతే ఈత వచ్చి ఉండాలని వారికీ తర్ఫీదునివ్వడం.. ఇతరులకూ సాయం చేసే గుణాన్ని చెబుతుంది.

స్కూల్ కు వెళ్లాలంటేనే ఇబ్బంది పడే ఉపాధ్యాయులైనా, విద్యార్థులైనా.. బద్ధకంగా, ఆలస్యంగా వెళ్లే అలవాటున్నవారైనా.. అబ్దుల్ మాలిక్ కథనోసారి తల్చుకుంటే వాళ్లలో మేటమేసిన నిస్సత్తువ మాయమైపోవచ్చు. ప్రతీరోజూ దినం తప్పకుండా, సమయపాలనతో బడికెళ్లే తన క్రమశిక్షణ స్ఫూర్తి నింపవచ్చు. అందుకే, ఇప్పుడు అబ్దుల్ మాలిక్ స్టోరీ అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లోనూ విరివిగా షేర్ అవుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles