మంచికి చెడు, చెడుకు మంచి చేయని కమర్షియల్ సినిమా.. లలితం సుందరం !

Aranya Krishna…✍🏼

……………………………………………………………………

ఓ సత్కాలక్షేపం!

మలయాళం సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? వాళ్ల సినిమాల్లో భారీ సెట్టింగులకి, ఐటం సాంగ్స్ కి, గ్రూప్ డాన్సులకి, హీరోలు ఇరగదీసే ఫైటింగులకి, ఫారిన్ లొకేషన్స్ కి, వందల కోట్ల రూపాయిల బడ్జెట్లకి పెద్ద స్థానం లేదు. కానీ వాళ్ల్ల సినిమాల్లో వాణిజ్య విలువలు తక్కువగా ఏమీ ఉండవు.

ఎలిపత్తాయం, ముఖాముఖం వంటి గొప్ప సినిమాలు తీసిన ఒకప్పటి ఆడూరి గోపాలకృష్ణన్, కాంచనసీత వంటి సినిమాలు తీసిన అరవిందన్ వంటి దర్శకులు ప్రస్తుతం మలయాళం పరిశ్రమలో లేకపోవచ్చు. కానీ వారి ప్రస్తుత సినిమాలు వాణిజ్య సూత్రాలకు లోబడే సృజనాత్మకతకి, మానవ సంబంధాలకు సంబంధించిన ఘర్షణకి, మానవీయ విలువలకి, సమాజంలో వస్తున్న సానుకూల మార్పుల ప్రతిఫలనానికి పెద్ద పీట వేస్తున్నాయి. ప్రస్తుతం నేను ఇదివరకు చూసినంత విరివిగా సినిమాలు చూడటం లేదు. కానీ మలయాళం సినిమాలు ఎప్పుడు చూసినా నిరాశ పరచడం లేదు. అలా ఓ స్నేహితురాలి సలహా మీద చూసిన సినిమా “లలితం సుందరం”. మంచికి చెడు, చెడుకి మంచి చేయని ఓ కమర్షియల్ సినిమా ఇది. ఏ సినిమాలో అయినా ఈ ఒక్క విషయం కనబడితే నేను ఫుల్ హాపీస్! ఇంతకు మించిన ఆశ నాకు సినిమాలకు సంబంధించి ప్రస్తుత వినిమయదారీ వాతావరణంలో లేదు. అలా ఆశ పడే పరిస్థితి లేదు మరి.

మధ్య తరగతి కుటుంబాల్లో తోబుట్టువుల మధ్య అనేక విభేదాలుంటాయి. తోబుట్టువులైన కారణంగా ఎంత అటచ్మెంట్ వున్నా వారి మధ్య ఘర్షణలు సహజంగా జరుగుతాయి. వాళ్లకి పెళ్లిళ్లైపోయి వేరు వేరు ఊళ్లల్లో బతుకుతున్నా వారి మధ్య విభేదాలు కొనసాగుతాయి. అందుకు కారణాలనేకం. అపార్ధం, అసూయ, తక్కువ స్థాయి ప్రవర్తన, అహం…ఇలా ఏదైనా కావొచ్చు. మనిషి అహానికి తొట్ట తొలిగా బలైపోయేది కుటుంబ సభ్యులే. ఇలా తోబుట్టువుల మధ్య ఘర్షణలే కథాంశంగా తీసిన సినిమా “లలితం సుందరం”. అయితే ఈ కథ ఓ ఎగువ మధ్య తరగతికి చెందినది. “అయ్యప్పనుం కోషియం”లో పోలీస్ ఇన్స్పెక్టర్ గా వేసిన బిజు మీనన్ ఇందులో గొప్పగా చేశాడు. జీవితంలో బతకడానికి ఏ పని మొదలెట్టినా విఫలమవుతున్నందున ఏర్పడే సైకలాజికల్ డిస్టర్బెన్స్, కాంప్లెక్సిటీని ఆయన అద్భుతంగా చూపించాడు. ఫ్రస్ట్రేషన్, యాంగర్ మేనేజ్మెంట్లో వైఫల్యం, చిన్నపాటి అసూయ, బాధని పంచుకోవడం కంటే మాటలు తూలే సంక్లిష్ట ప్రవర్తనని ఆయన తన నటనలో సహజంగా చూపించాడు. అతని చెల్లెలిగా పరిణతి చెందిన మనస్తత్వపు పాత్రలో ఈ సినిమా సమర్పకురాలు మంజు వారియర్, ముక్కు మీద కోపం వున్న తమ్ముడిగా అను మోహన్ బాగా చేశారు. మరో మెచూర్డ్ పాత్రని సజ్జు కురూప్ వేశారు. ఈ పాత్రని ఆయన అర్ధం చేసుకొని పెర్ఫార్మ్ చేసిన తీరు హృద్యంగా అనిపిస్తుంది.

వేగవంతమైన సామాజిక జీవనంలో ప్రశాంత జీవనం కోసమో, అనివార్యమైన సర్దుబాట్ల కోసమో మధ్య తరగతి మానవ సంబంధల్లో ఏర్పడుతున్న కొత్త పరిణామాల్ని, సమాజం వాటిని ఆమోదిస్తున్న తీరుని సానుకూల ధోరణిలో చూపించడం నాకు నచ్చింది. మెర్కండైజ్ షిప్స్ మీద పని చేసిన భర్త ఎర్లీ రిటైర్మెంట్ తీసుకొని వృత్తిలో బిజీగా వుండే భార్యకి సహకరించడంతో పాటు పిల్లల పెంపకాన్ని ఓ ఇష్టమైన బాధ్యతగా స్వీకరించడం ఓ నమూనా మార్పుగా చెప్పొచ్చు. అలాగే తన కంటే పెద్దది, ఓ డైవోర్సీ అయిన కొలీగ్ ని తన వాళ్లందరికీ పరిచయం చేయడానికి తీసుకురావడం, ఆ విషయాన్ని మిగతా వాళ్లు కష్టమైనా అర్ధం చేసుకొని ఆమోదించడం వంటి అంశాలున్నాయి. దర్శకుడు జెండర్ పరంగా చాలా సెన్సిటీవ్ అని తెలుస్తుంది. ఒక అతి సాధారణ కథలో ప్రగతిశీలకమైన వాస్తవిక దృష్టి ప్రదర్శించడం బాగుంది.

సినిమా సమీక్షల్లో నేనెప్పుడూ కథ మొత్తాని రివీల్ చేయడానికి ఇష్టపడను. నిజానికి అంత పెద్ద కథ కూడా ఏమీ లేదిందులో. కానీ ఘర్షణలు ఎంత అనివార్యమో ప్రేమని కూడా అంత కంటే అనివార్య అంశమని గురించాలని ఈ సినిమాలోని వృద్ద్ధ తండ్రి పాత్ర తాపత్రయ పడుతుంది. చక్కటి ఫోటోగ్రఫీ, అద్భుతమైన కేరళ అందాలు, మంచి సంగీతం, ఎవరూ చెడ్డవారు కాకపోయినా అనివార్యంగా సంభవించే ఘర్షణల్లో పెల్లుబికే చిక్కనైన భావోద్వేగాలు, నటుల మంచి నటన, పరిశుభ్రమైన వినోదం…ఇవన్నీ కావాలనుకుంటే డిస్నీ హాట్ స్టార్లో వున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ చూడండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles