అయ్యా ఏస్ అనకుంటే.. ఎంతటి ఐఏఎస్ అయినా ఇదిగో ఈయనలా బదిలీ కావల్సిందే!

ఎంత చదువుకుంటే మాత్రం ఏంటి… డిగ్రీ సర్టిఫికెట్ లేనివాడి దగ్గరా సాహో అనాల్సిందే. ఓ క్రమపద్ధతిలో నడవని దిక్కుమాలిన సిస్టమ్స్ గురించి మాట్లాడుకుంటూ.. వాటిపై ఎవరికి తోచిన రీతిలో వారు పోస్టులు పెట్టుకుంటూ సాగిపోవడమే తప్ప.. ఆశించిన మార్పులు చూడలేని సమాజమిది. ఈ మాటలకు అక్షరసత్యం ఈ ఐఏఎస్ ల కథలు.

అయ్యా.. ఏస్ అంటే… ఎంతటి ఐఏఎస్ కైనా అనుకున్న స్థానం దక్కుతుంది. సాగిలపడ్డోళ్లకే నాల్గు కాలాలపాటు జీవితం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. లేకపోతే.. పాము పగేమోగానీ… డెమోక్రసీ పేరిట అధికారంలోకొచ్చేవారు కక్షసాధింపు చర్యల్లేకుండా వదిలిపెట్టిన, పెద్ద మనసు ప్రదర్శించిన దాఖలాలే కనిపించవు. అయితే, అయ్యా ఏస్ అంటూ కొందరు సాగిలపడే ఐఏఎస్ ల వల్లే… ఒక యాంబిషన్ తోని ఆ పదవులు చేపట్టిన వారి బతుకులు ప్రజాప్రతినిధులు, నాయకుల కాళ్ల దగ్గర ఫుట్ బాల్ లా మారిపోతున్నాయి.

అలాంటి తుకారం ముండే గురించి మనం ఓసారి చెప్పుకుందాం. తుకారం ముండే మహారాష్ట్రలోని 2005 బ్యాచుకు చెందిన ఐఏఎస్ అధికారి. ముంబైలో డెవల్ప్మెంట్ కమిషనర్ గా ఉన్న ఆయన్ను.. ఈ మధ్యే అక్కడి ప్రభుత్వం దివ్యాంగ్ కళ్యాణ్ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. చాలామంది దృష్టిలో ఇదో సాధారణ బదిలీలాగే కనిపిస్తుండొచ్చు. కానీ, ముండే 19 ఏళ్ల ఐఏఎస్ కెరీర్ లో ఇది 23వ బదిలీ అంటే ఆయన్ను పాలకవర్గాలు ఎలా చూస్తున్నాయో అర్థం చేసుకోవాల్సిన హిడెన్ స్టోరీ ఆ బదిలీ వెనుక ఉంది.

నీతి, నిజాయితీ ఈ మాటల కేవలం రాతలకు మాత్రమే పరిమితమైపోయిన రోజులు. ఈ మాత్రం రాతలకు పరిమితమైన స్థానం నుంచి భవిష్యత్తులో ఈ పదాలు కనిపించకుండా నిషిద్ధమైపోయే రోజులూ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పన్లేదు. ఎందుకంటే, నీతి, నిజాయితీ అనేవి ఇతరులకు సమస్యగా పరిణమించినప్పుడు ఏం జరుగుతుందో.. మనకు తుకారాం ముండే స్టోరీ చెబుతుంది. ఇదేదో తాత్విక కథలా అనిపించినా.. ఇది ప్యూర్ ప్రాక్టికల్ గా కొందరు నిజాయితీ కల్గిన అధికారులు అనుభవించే.. నేడు సమాజం పెద్దగా పట్టించుకోని ఓ ప్రధాన సమస్య.

గతంలో హర్యానాకు చెందిన అశోక్ ఖేమ్కా అనే ఐఏఎస్ అధికారి కూడా ఇలాగే నీతి, నిజాయితీ వంటివి ప్రదర్శించిన చురుకుదనానికి.. అత్యధికంగా బదిలీ అయిన ఐఏఎస్ ల్లో ఒకరిగా వార్తల్లోకెక్కారు. ఇప్పుడా గుర్తింపు తుకారం ముండే కూడా దక్కించుకున్నారు. ఒక ఐఏఎస్ సాధారణంగా కనీసం రెండు నుంచి మూడేళ్లైనా ఒక చోట పోస్టింగ్ లో ఉంటారు. కానీ, మనం చెప్పుకున్న ఈ తుకారం ముండేకుగానీ… అంతకుముందు ముండేలాంటి పేరు తెచ్చుకుని దేశంలో హైలెట్ అయిన అశోక్ ఖేమ్కాకుగానీ పాలకులు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.

తుకారం ముండే మహారాష్ట్రంలోని బీడ్ జిల్లాకు చెందిన వ్యక్తి. చురుకైన, నిజాయితీపరుడైన, నిష్కపటమైన అధికారిగా గుర్తింపు పొందాడు. సోలాపూర్ జిల్లాలో ఆయన అధికారిగా ఉన్నప్పుడు ఆయన చర్యలతో వార్తల్లో పతాకశీర్షికయ్యాడు. అక్రమ మద్యం స్థావరాలపై దాడులు చేసి వణుకు పుట్టించాడు. ఇసుకాసురుల పాలిట సింహస్వప్నమైనాడు. క్రమశిక్షణకు మారుపేరై నిల్చి… అవినీతిని అరికట్టారు ముండే.

ఐఏఎస్ అంటే ఇలా కదా ఉండాల్సింది అని ప్రజలు ఆయన రీతిని హర్షించారు. ఐఏఎస్ అంటే ఇలా ఉన్నాడేంటి.. అయ్యా, ఏస్ అని కదా మన దగ్గర అనాల్సింది.. అని పాలకులు విసుక్కున్నారు. ఇదీ ముండే కెరీర్ లో కనిపించిన ప్రధానమైన తేడా.

నిబంధనల పేరిట ఆయన పెట్టిన ఆంక్షలు రాజకీయ నాయకులకు నిద్రలేని రాత్రులు మిగిల్చాయి. ఆయన చెప్పే నిబంధనలు అసౌకర్యంగా మారి.. ఉన్నతస్థాయిలో ఒత్తిడిలు పెరిగిపోయేవి. దాంతో ముండేకు బదిలీలు సర్వసాధారణమైపోయాయి.

ముండే అంటే కేవలం అవినీతిపై యుద్ధం. నీతి, నిజాయితీకి కేరాఫ్ మాత్రమే కాదు… వాటర్ మ్యాన్ ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని కరువు పీడిత ప్రాంతాల్లో ఆయన వాటర్ షెడ్ కార్యక్రమాలు, నీటి వనరుల పునరుద్ధరణ వంటివి ఆయనకు ఆ బిరుదును కట్టబెడితే.. వృత్తి పట్ల ఆయన నిబద్ధత ఆయన్ను ఉత్తమ కలెక్టర్ ను చేసింది.

తప్పని తెలిసినా… తమ సేఫ్ జోన్ కోసం రాజీపడే ఐఏఎస్ లే ఎక్కువ కనిపించే నేటి కాలంలో.. ఒక అశోక్ ఖేమ్కా… మరో తుకారం ముండే.. సరైంది కాదనుకున్న అంశంపై కట్టుబడి ఉండేందుకు రాజీ పడకుండా బదిలీలకూ సదా సిద్ధంగా ఉంటారు. అసలు వీళ్లు కదా.. సమగ్రమైన అవగాహనతో సిస్టమ్ పై పనిచేస్తూ నిశ్శబ్ద చిహ్నాలుగా నిల్చే అధికారులు!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles