అయ్యవారికి చాలు ఐదు వరహాలు.. పిల్లవాళ్లకు చాలు పప్పుబెల్లాలు! దీన్ని తిరగేసి చెప్పడమే నాటి దసరా సెలబ్రేషన్!!

ఆ హుండీల పద్యాలు… దసరావేళ మధుర జ్ఞాపకాలు!!

దసరా వచ్చిందయ్యో దశనే మార్చిందయ్యో అంటాడు ఓ సినీకవి. దశను మారుస్తుందో, లేదోగానీ… అప్పటివరకూ పుస్తకాలతో కుస్తీపట్టిన పిల్లలకు… దిశను మార్చే ఆటవిడుపు దసరా సెలవులు. మరంత అలసిసొలసినప్పుడే కదా సెలవు విలువ తెలిసేది..?!! అందుకే పిల్లలు అత్యధికంగా ఉత్సాహంగా కనిపించేదెప్పుడంటే…? ఒకటి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయన్న సమయంలో… ఇంకోటి దసరా సెలవుల సమయంలో. అయితే దసరా సెలవులంటే కేవలం ఎంటర్ టైన్ మెంటే కాదు… ఇప్పుడంటే కనిపించకుండా పోయిందిగానీ.. ఈ దసరా సెలవు దినాలు ఓ ఇన్ఫోటైన్ మెంట్! అందుకే దసరా అంటే అంత వ్యామోహం అందరికీనూ!!

ఒక పండుగ… తొమ్మిది రోజుల వేడుకలు… వివిధ రకాల ఫలహారాలు… ఎంగిలిపూల బతుకమ్మ నుంచి మొదలెడితే… చద్దుల బతుకమ్మ వరకూ రంగురంగుల దుస్తులు, చీరల్లో… సీతాకోకచిలుకలే అచ్చెరువొందేలా కనిపించే ఇంద్రధనస్సును తలపించే దృశ్యాలు… పచ్చని ప్రకృతి, అప్పుడే వానాకాలపు వరదలతో నిండుగా కనిపిస్తూ గలగలా పారే సెలయేళ్లు, నదులు, చెరువులు… వీటి మధ్య పూలనే గౌరీగా కొలుస్తూ అదే పూలతో పూజించే ప్రకృతి సిద్ధమైన బతుకమ్మ పండుగ.. వా ఇది కదా తెలంగాణా పల్లె సంప్రదాయానికి నిలువెత్తు ప్రతీక!

అప్పుడే సామూహిక పండుగైన గణేష్ నవరాత్రుల్లో అంగరంగ వైభవంగా రోజోరకం భోగాలు (ప్రసాదాలు).. కళ్లు మిరుమిట్లు గొలిపే అలంకరణలతో ఆనందంగా గడిపిన రోజులకు వినాయక నిమజ్జనంతో స్వస్తి పలకడం ఒకింత బాధైతే… దాన్ని మర్పించేందుకు వెంటనే వచ్చేదే దసరా! అందుకే అదే పద్ధతిన ఇప్పుడు ఊరూరా, వాడవాడలా దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలకూ వేదికలవుతున్నాయి వీథులన్నీ. ఈ క్రమంలో ఓవైపు బతుకమ్మ వేడుకలు… ఇంకోవైపు అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు… దసరా రోజు పాలపిట్టను చూడటం.. జమ్మి ఆకును ఒకరికొకరు ఇచ్చుకుని ఆత్మీయంగా పలుకరించుకోవడం.. పెద్దలకు నమస్కరించడం.. కొన్నిచోట్ల రావణ సంహారం.. మరికొన్ని దిక్కుల మహిషాసుర వధ.. ఇదిగో ఒక పండుగంటే ఏ స్థాయిలో ఉండాలో పట్టి చూపిస్తుంది.. ఐకమత్యానికి ప్రతీకలా కనిపిస్తుంది.. దసరా శరన్నవరాత్రి వేడుక!

వీటికితోడు మనం మర్చిన మూలాలెన్నో! మోబైల్ తో సోషల్ మీడియా మాయలో నిండా మునిగితేలే రోజుల్లో.. ఎప్పుడో ఒకప్పుడు కాదు.. ఎప్పుడూ వాటి యాది మరవందే! అలా దసరా ఎప్పుడు వస్తుందా… ఎప్పుడెప్పుడు ఆటపాటలతో విందు చేయడమా అని ఎదురు చూస్తూనే ఉంటాం. ఒకటా రెండా… వర్షాకాలం అప్పుడప్పుడే ముగించుకుని భూమి పదును ఇంకా ఆరని రోజుల్లో ఊళ్లల్లో ఆడే సలాకాట… సూర్యకడియడం.. పయ్య… పిల్లలంతా గుమ్మిగూడి టంబూతో పింటీని కొట్టే.. లక్కూ, పిత్తీవంటీ గోళీలాటలు… గోనెతో చిర్రను బాదే చిర్రగోనె… క్రికెట్… సెలయేళ్లు, నదులున్న చోట ఆ గలగల ప్రవాహాల్లో పిల్లాపెద్దా తేడా లేకుండా సాగిన ఈదులాటలు… ఓవైపు బతుకమ్మ వేడుకల్లో చిలక్కొట్టుడు కొట్టే చిలక్కాయ గొట్టాలు.. అదేనండీ కొన్నిచోట్ల పాపిడికాయ గొట్టాలు.. మరికొన్ని చోట్ల పిట్టుగొట్టాలని పిలుస్తారే వాటితో ఆడే సయ్యాటలు.. ఇలా ఒకటా, రెండా.. అన్నీ మరవలేని, మరపురాని ముచ్చట్లే!

అయితే వీటిమధ్యలో ఈతరం మిస్సవుతున్న ఓ విశేషమైన విషయాన్నీ చెప్పుకోవాలి. అదే హుండీల పద్యాలు. ఆ పద్యాలీజనరేషన్ కు తెలిసే అవకాశమే లేకుండా పోయింది.పెద్దవాళ్లెవరైనా చెబుతున్నారా, లేదోగానీ… అనుభవించినోళ్లకు అదో నోస్టాల్జియా!

దసరా వచ్చిందంటే ప్రతీ గ్రామంలోనూ… గురువులూ వారివెంట పిల్లలూ ఊరంతా తిరుగుతూ పాడుకునే ఆ పాటలనే ఊళ్లల్లో నాడు హుండీల పద్యాలంటుంటిరి. కారణం ఆ పద్యాల పేరుతో… గురువుల హుండీలు మరింత నిండేవి కాబట్టి. అలాంటి హుండీల పద్యాలను మచ్చుకు ఇదిగో కింద చూడండి…

ఏదయా మీదయ మామీద లేదు! ఇంతసేపుంచుట ఇది మీకు తగదు! దసరాకు వస్తిమని విసవిసల బడక! చేతిలో లేదనక ఇవ్వలేమనక ! ఇప్పుడు లేదనక అప్పివ్వరనక!రేపురా మాపురా మళ్ళి రమ్మనక! శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా! జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

పావలా బేడైతె పట్టేది లేదు! అర్థరూపాయైతె అంటేది లేదు! ముప్పావలైతేను ముట్టేది లేదు! రూపాయి ఐతేను చెల్లుబడి కాదు! హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటాము! జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

అయ్యవారికి చాలు ఐదు వరహాలు! పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు! మా పప్పు బెల్లాలు మాకు దయచేసి! శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా! జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

అంటూ ఏ పద్యం చూసినా అయ్యగారి సంపాదన గురించే కనిపిస్తుంటుంది. అంటే అదే మన గురువుల కోసం! కానీ.. అదో థ్రిల్!! ఎన్నటికీ మర్చిపోలేని ఓ మధురజ్ఞాపకం!!!

గిలకల పండుగగా కూడా చెప్పుకునే దసరా వేడుకుల్లో… చక్కగా కొత్త దుస్తులు ధరించి.. జాతీయజెండాలను చేతపట్టుకుని ఇంటింటికీ విద్యార్థులతో కలిసి గురువులు తిరగడం కొన్ని పల్లెల్లో, ఊళ్లల్లో ఓ సంప్రదాయమైతే… వెదురుతో చేసిన విల్లంబులెక్కుబెట్టి.. ఆ విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారుచేసి దానిలో బుక్కాగులాలు వంటి రంగులను నింపి… మరికొందరైతై పువ్వులూ వేసి ఒండొరులు చల్లుకొంటూ… ఆడుతూపాడే దసరా హుండీల పద్యాలివి. పంతుళ్ళు వెనుక నడుస్తుంటే.. పిల్లలు వరుసల్లో పాడుతూ ప్రతి వాకిటా ఆగి.. దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైన ఆచారమిది.

ఒక వ్యక్తి అభివృద్ధిగాని. కుటుంబ, సమాజ, ప్రాంత, దేశ అభివృద్ధికిగానీ జ్ఞానమే కారణమని తెలిసినవారంతా… ఆ జ్ఞానానికి కారణం విద్యాలయాలే అని భావించినవారంతా… ఆయా బళ్లు బలంగా నడవడానికి తమకు తోచినంత సాయమందించడమే ఈ హుండీల పద్యాల సారాంశం. ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో.. తమ స్ధలాలను బడి పెట్టడానికి నిస్వార్ధంగా దానం ఇచ్చేవారు వెలుగొందిన ఊళ్లవి. వెలుగుతున్న దీపం.. మరోదీపాన్ని వెలిగిస్తుందని నిజాయతీగా నమ్మిన జ్ఞానమూర్తులు.. వారు బతకడానికి మాత్రమే కాకుండా… బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారిన నాటిరోజులు ఓ మధురానుభూతి!

అంతేకాదు… దసరా పండుగ సందర్భంగా ఆ ఏడాది కాలంలో తాము విద్యార్ధులకు నేర్పిన పద్యాలు, శ్లోకాలు, గణిత సమస్యలు, పొడుపు కధలవంటివన్నీ…గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవుల్లో కుమార జ్ఞాన ప్రదర్శన చేసేవారు.

పిల్లల వయస్సు, తరగతిని బట్టి.. వివిధ కళలను పిల్లకు నేర్పి.. తమను పోషిస్తున్న పెద్దలతో చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలను పొందేవారు. ఇదే కదా.. నిజమైన పరీక్ష ఉపాధ్యాయులకు..?! విద్యార్ధులకు.. ఎంత గొప్ప ఆంతర్యమో ఆనాటి దసరా పాటల్లో..?!! దేవతా వేషధారులైన చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశ్శీస్సులు అందిస్తే.. ముగ్దులైన ఆ ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని తమ ధనాన్ని దసరా కానుకగా అందించడం నాడు గ్రామాల్లో ఆనవాయితీ. నాటి పిల్లలెందరో నేటి జీవన కురుక్షేత్రంలో అర్జునునిలా తీర్చిదిద్దిన విజయులైతే.. అలాంటి ఉపాధ్యాయులంతా ద్రోణులే మరి! నేటి ఒకటి ఒకటి ఒకటి… రెండూ రెండూ రెండూ కల్చర్ లో అలాంటి సన్నివేశాలు, రోజులిక చూడలేమేమో..?!! ఈ సంప్రదాయం పాటించే అవసరమూ లేకుండా పోయింది! దాంతోపాటే.. హుండీల పద్యమూ మూలపడిపోయింది!!

ఇలాంటి వ్యామోహాన్ని (నోస్టాల్జియా) కేవలం సోషల్ మీడియా రాతల్లోనో… మధుర జ్ఞాపకాల్లోనో మిగల్చుకునే రోజుల్లో… మన సంస్కృతీ, సంప్రదాయాల చరిత్రను ఆచరించకలేకపోయినా.. కనీసం భావి తరాలకైనా తెలియపరిస్తే అదే ధన్యం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles