మీ పిల్లాడు పనికిరాడన్న టీచర్ కు ఆ అమ్మ ఇచ్చే జవాబు అల్టిమేట్! 35 చిన్నకథ కాదు.. లోతైన కంటెంట్!!

Padmaja Suraparaju…✍️

Johnson and Johnson వారి no tears పురిటికందుల షాంపూ పిల్లవాడి తలకు రుద్దేముందు తనకు try చేసుకుని, మధ్యలోకళ్ళు తెరిచి మరీ చూసి , వీడు చెప్పేదంతా అబద్ధం అని తెలుసుకుని మళ్ళీ అమ్మ ఇచ్చిన సున్నిపిండి తోటే పిల్లవాడికి తలంటు పోస్తుంది తల్లి. టైమ్ లేక గానీ సవాలక్ష తిట్లతో ఆ జాన్సన్ కంపెనీకీ తలంటు పోసేదే కంప్లెయింట్ లతో పోస్ట్ రాసి పడేసి ఇప్పుడైతే.

పిల్లలను హింస పెట్టే వాళ్ళను గుర్తు పట్టి ఏరేయడం తనకు వెన్నతో పెట్టిన విద్య అనేసుకుంటుంది అమ్మ. అది నిజం కూడా ముమ్మాటికీ. పిల్లల పాలిటి క్రూరుల కోవలోకి కొంతకాలానికి లెక్కలు చెప్పడం రాని పిల్లల లెక్కల టీచర్లు వస్తారు.

అసలు లెక్కలది ఒక తమాషా కథ.

ఆ సంఖ్యలు కొందరికి అరచేతిలో వెన్నముద్దలు, కొందరికి గొంతులో పచ్చి వెలక్కాయలు. ఆ సబ్జెక్ట్ లో వెనకబడటం పెద్ద తలవంపులు. జీవితంలో పరాజయం అక్కణ్ణించే మొదలు. నిజానికి లెక్కల సమస్య లో ఒక చిన్న చిక్కుముడి విప్పితే లెక్క తనంతట తను విశదమౌతుంది. ఎక్కడో తప్ప సామాన్యంగా ఏ లెక్కల టీచర్ కూ అది రాదు. దయ్యాలున్నాయంటే నమ్మని తెలివైన పిల్లలను కూడా లెక్కల టీచర్లు భయపెట్టిన దాఖలాలు బోలెడు. టీచ్ చేయడం రాని టీచర్లను పెట్టుకుని పిల్లలతో ఈమధ్య థీరమ్స్ ప్రాబ్లమ్స్ కూడా బట్టీ పట్టించి ముక్కున పెట్టించి పేపర్లో కక్కిస్తున్నాయి కొన్ని సిలబస్లు, స్కూల్సు. లెక్కలు చెయ్యడం వచ్చేవారు వందకు యాభై మంది ఉన్నారనుకుంటే, పిల్లలకు ఆ సబ్జెక్ట్ సవ్యంగా చెప్పగలవారు వెయ్యికి ఒకరు కూడా ఉండరు.

పిల్లలను వాళ్ళ మార్కులతో కొలుస్తూ అవే పేర్లుగా చేసి పిలుస్తూ చిన్నప్పుడే వాళ్ళను పనికిరానివారి కింద జమేసే లెక్కల మాస్టర్ లే ఎక్కువ, అరుదైన గొప్ప బడులలో చదువు చెప్పే నలుగురైదుగురు తప్ప.

పిల్లల డిస్లెక్సియా సమస్యతో కొన్ని సినిమాలు వచ్చి ప్రేక్షకుల కన్నీళ్ళతో చెరువులు నింపాయి గతం లో. నేను అవేవి చూడలేదు, విన్నాను చెప్పుకుంటుంటే. నచ్చవు, పిల్లల సమస్య అడ్డం పెట్టుకుని కడివెడు నీళ్ళు కుళాయి తిప్పడం.

ఈ ‘35 చిన్న కథ కాదు‘ కూడా చాలామంది బావుంది అన్నా చూడదలచలేదు. రెండు సార్లు ట్రై చేసి మొదటి పది నిమిషాల్లో ఇవాళ తల్లి వేషం వేసిన మొన్నటి హీరోయిన్ అవే మూతి భంగిమలు చూసి వల్ల కాదులే నాకు అని ఆపేసా కూడా. మరింకేం లేక మళ్ళీ చూసా. ఒక అరగంట దాటాక సినిమా, ఆ అమ్మ కూడా మెరుగు తేలారు.

ముఖ్యంగా తండ్రి లా వేసిన అతను అలా ఆ కండక్టర్ ఖాకీ డ్రెస్ తోటే, ఇద్దరు పిల్లలతో టి, ముఖాన బొట్టుతోటి, మంచి నవ్వుతోటి పుట్టాడా అన్నట్టు ఉన్నాడు. 👌👌

లెక్కల మాస్టర్ ‘జీరో‘ ఇల్లెతుక్కుంటూ వచ్చి మరీ మీ పిల్లాడు పనికిరాడు అని చెప్తే అరుణ్ అమ్మ లెక్కల వాడికి వేడి కాఫీ ఇచ్చి కూల్ గా మా వాడికి మంచి పేరు పెట్టుకున్నాం ఇష్టం గా, నీవు జీరో అని పిలవడం నీ అనాగరికత అని మెత్తటి చెప్పుతో చెపుతుంది.

అదే పిల్లవాడి నాన్న కు తనెదురుగానే కొడుకుని జీరో అని అంటుంటే ఆయనకు ప్రపంచమే స్థంభించిపోతుంది. తల తిరిగి పోతుంది. అదీ తేడా. ఆయనకు అవమానం. అమ్మకు కొడుకు మీద నమ్మకం.

అతను బడి మాన్పిస్తానంటాడు కొడుకుకి, తల్లి తను నేర్చుకుని నేర్పుతుంది వాడికి ఆ లెక్కలు.

అక్కడక్కడా కొంత, చివర్న మరికొంతా డ్రామా తగ్గించితే బావుండేది సినిమా ఇంకా.

ఆ చిన్న ఇల్లు అందులో వాళ్ళు పెద్ద తృప్తితో బ్రతికే వైనం, గుళ్ళో అమ్మానాన్నల పెళ్లి సీన్ అందంగా ఉన్నాయి. అరుణ్ గా చేసినవాడు భలే బాగా చేసాడు❤️.

సినిమా బావుంది, జస్ట్ పాస్ మార్కులు కాదు. మంచి మార్కులే వేయవచ్చు.

పిల్లవాడు అడిగిన నెంబర్ల వెనక లాజిక్ చెప్పడానికైనా మరో బ్రహ్మవిద్యకైనా అవసరమైతే అమ్మ చీర చెంగు బిగించి దోపుకుని రంగంలోకి దిగాల్సిందే.

చదువు ఎవడూ గొప్పగా చెప్పేదేం ఉండదు పిల్లలకు, వాళ్ళకున్న సందేహాలను నిర్భయంగా అడిగే స్వతంత్రం ఇచ్చి, వారి సమస్యలను సావధానంగా వినగలగడమే తాము తీసుకుంటున్న జీతానికి న్యాయం చెయ్యాలనుకున్న టీచర్లు చేయవలసిన ఉద్యోగం. చదువుకోవాలనే ఉత్సాహం వైపు పిల్లలను మళ్ళించడమే టీచర్ పని.

ఏవేవో చేస్తాం అంటారు. చదువు వచ్చి, అది చెప్పడం వచ్చి, ఆ చెప్పడం నచ్చే వాళ్ళను టీచర్లగా పంపిస్తే స్కూళ్ళకు చాలా ఆత్మహత్యలు, ఆత్మన్యూనతతో వచ్చే పిల్లల సైకలాజికల్ జబ్బులూ తగ్గుతాయి.

ఆ తర్వాత పాఠాలు చెప్పడం చాలా చిన్న కథ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles