బార్బర్ షాపు ఖూనీరాగం నుంచి బాలీవుడ్ దాకా! రఫీ జర్నీ.. ఇంట్రెస్టింగ్!!

ఆ గొంతుకెక్కి పాట అజరామరమైంది. ఆ గొంతు గురించి చెప్పడానికి.. ఎక్కడ మొదలుపెట్టాలో, ఎక్కడ ముగించాలో తెలియనితనం ఇంకింత వెక్కిరిస్తుంటుంది.

హిందీ పాటల రారాజు, లెజెండ్ వంటి విశేషణాలకంటే… వినయమే వ్యక్తికుండాల్సిన గొప్ప లక్షణమనేందుకు ఓ చక్కటి ఉదాహరణ మహ్మద్ రఫీ. ఎవరైనా హీరోకు తానో పాట పాడుతున్నాడంటే ముందు ఆ హీరోకు సంబంధించిన హావభావాలు, తన పాత్ర స్వభావం గురించి బాగా తెలుసుకునేవాడు. అందుకే, ఆయనెవరికి పాడితే వారే ఆ పాట పాడినట్టుగా ఒదిగిపోయేది.

24 December 1924 – 31 July 1980

డిసెంబర్ 25 క్రిస్ట్ మస్ ముందు రోజు సాయంత్రాన, 1924, డిసెంబర్ 24న పుట్టి.. ఏనాడూ జాతి, మత భేదాలు చూపని మహ్మదీయుడు రఫీ. భౌతికంగా లేకపోవచ్చుగానీ.. కావల్సినంత తీపి పంచిపోయింది ఆ గొంతు! అందుకే, పాట అజరామరమై రఫీ చిరంజీవయ్యాడు. రఫీ జయంతి డిసెంబర్ 24.. ఆయన్నోసారి తల్చుకునేందుకే ఈ బయోగ్రఫీ!

సొంతూరు పంజాబ్ అమృత్ సర్ జిల్లాలోని కోట్ల సుల్తాన్ సింగ్ గ్రామం. ఓ బార్బర్ షాపులో పనిచేస్తున్నప్పుడు రఫీ జీవితం మలుపు తిరిగింది. ఫికో అంటూ అంతా షార్ట్ కట్ గా పిల్చుకునే రఫీ.. తన స్కూల్ ముగిశాక పశువులు కాస్తూ జానపద పాటలు హమ్మింగ్ చేసేవాడు. ఆ తర్వాత లాహోర్ లో తన తండ్రి హాజీ మహమ్మద్ అలీ ఓ దాబా నడపడంతో 1942లో రఫీ కుటుంబం అక్కడికి మారిపోయింది. అక్కడే ఓ క్షౌరశాలలో పనికి కుదిరాడు. రఫీకి పంజాబీ ముస్లిం సూఫీ కవి వారిస్ షా రచించిన విషాదప్రేమ గీతాలైన హీర్ రాంజ్నా, 17 శతాబ్దానికి చెందిన పంజాబీ పొయెట్ హీర్ సాహిబ్ రచించిన పీలూ గీతాలంటే ఎనలేని మక్కువ. వాటిని బార్బర్ షాప్ లో పనిచేస్తూ హమ్మింగ్ చేసేవాడు. ఆ మధురమైన గొంతు కూడా ఆ హెయిర్ డ్రెస్సింగ్ షాప్ కు ఎస్సెట్ గా మారింది. అలా ఆ బార్బర్ షాపుకు వచ్చినవాళ్లలో ఒకరు ఆల్ ఇండియా రేడియోలో హెడ్ గా పనిచేస్తున్న జివాన్ లాలూ మట్టూకు రఫీ గొంతు గురించి చెప్పారు. సరే చూద్దామన్నట్టుగా మట్టూ ఓరోజు ఫైన్ మార్నింగ్ తానే కటింగ్ చేయించుకోవడానికి రఫీ పనిచేస్తున్న క్షౌరశాలకు వెళ్లాడు. రోజటిలాగే రఫీ ఆడుతూ పాడుతూ కటింగ్ చేస్తున్నాడు. రఫీ గొంతు విన్న మట్టూ ముగ్ధుడయ్యాడు. ఓరోజు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కు రమ్మని పిల్చి ఆడిషన్ చేశాడు. ఫోక్ సింగర్ గా AIRలో అవకాశం కల్పించాడు. తన తర్వాత సబార్డినేటైన బుధ్ సింగ్ తాన్ కు రఫీని అప్పగించాడు.

తాన్ రఫీకున్న ప్రతిభను గమనించి మరింత పదును పెట్టాడు. AIR నుంచి రఫీ పాట లాహోర్ ఫిల్మ్ స్టూడియోస్ కు చేరుకుంది. కొత్త సంగీత దర్శకుడైన శ్యామ్ సుందర్.. గుల్ బలోచ్ అనే సినిమా కోసం రఫీ వాయిస్ తో పంజాబీలో పాట రికార్డ్ చేశాడు. సినిమా ఫ్లాపైంది. కానీ, రఫీ గురించి ప్రచారం జరిగింది. ఆ విషయం ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ సోదరుడైన ఉస్తాద్ బర్కత్ అలీ ఖాన్ వరకూ వెళ్లింది. ఆయనతో ఏర్పడిన పరిచయంతో రఫీ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలోని ఖయాల్, తుమ్రీ ప్రక్రియల్లో నైపుణ్యం సాధించాడు. అప్పుడే రఫీకి ముంబైపై మనసు పడింది.

1944 చివరంకంలో ముంబై రైలెక్కాడు. కానీ ఐదేళ్లపాటు ప్లే బ్యాక్ సింగర్ కావాలన్న తన కల సాకారం కాకపోగా.. చాలామంది తరహాలోనే అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. 1949లో సజాద్ హుస్సేన్ అనే సంగీత దర్శకుడు ఇచ్చిన అవకాశం.. ఆ పాట హిట్ అవ్వడంతో రఫీకి ఓ దారి దొరికింది. ప్లేబ్యాక్ సింగింగ్ లో రఫీకి తొలి గురువు హుసన్ లాల్. పంజాబీ అయిన హుసన్.. సినిమా పాట రికార్డింగ్ కు ముందే తన ఇంటికి ఉదయం నాల్గు గంటలకే రఫీని పిల్చుకుని తంబూరా మీద ప్రాక్టీస్ చేయించేవాడు. శ్యామ్ సుందర్ అనే మ్యూజిక్ డైరెక్టర్ బజార్ అనే సినిమాలో లతామంగేష్కర్ తో కలిసి పాడే డ్యూయెట్ ప్రాక్టీస్ సెషన్ లో రఫీకి మెంటార్ గా వ్యవహరించాడు.

ఫిరోజ్ నిజామీ అనే సంగీత దర్శకుడైతే జుగ్ను అనే సినిమా కోసం నూర్జహాన్ తో కలిసి రఫీ పాడే డ్యూయెట్ కోసం పదే పదే రిహాల్సల్స్ చేయించాడట. అలా రఫీ ఆమెతో కలిసి ప్రాక్టీస్ చేసిన యహా బద్లా వఫా కా బేవఫా కే సివా క్యా హై పాట ఆ తర్వాత సూపర్ డూపర్ హిట్టైంది. రఫీ స్నేహశీలి. తన ముఖం ఎప్పుడూ చిరుదరహాసంతో పలకరిస్తుంది. అలాంటి రఫీ 1947 విభజన తర్వాత మాత్రం హర్టయ్యాడు. ఎక్ దిల్ కే తుక్డే హజార్ హుయే కోయి హయా గిరా కోయి వహా గిరా అంటూ పాడిన ఆ భావోద్వేగ గీతం వెంటాడేది. మహాత్మాగాంధీ హత్యకు గురైనప్పుడు కూడా సునో సునో ఏ దునియా వాలో.. బాపూకీ యే అమర్ కహానీ అంటూ పాడిన పాటా కదిలించింది. రఫీ గొంతులో భావోద్వేగాల్ని బలంగా పలికించి కనెక్టైన ఈ రెండు పాటలూ హుసన్ లాల్, భగత్ రామ్ ద్వయం కలిసి కంపోజ్ చేసినవి.

నౌషాద్ అనే మరో మ్యూజికల్ మెజిషియన్ చేతిలో పడ్డాక రఫీ గొంతు మరింత మాంత్రికమైంది. యే జిందగీ కే మేలే దునియా మే కమ్ నా హోంగే అఫ్సోస్ హమ్ నా హోంగే అంటూ 1948లో మేళా కోసం పాడిన పాట, 1949లో దులారీ కోసం పాడిన సుహానీ రాత్ ధల్ చుకీ నా జానే తుమ్ కబ్ ఆవోగే గీతం.. అలాగే, దీదార్, బైజు బావ్రా, అమర్ వంటి సినిమాల్లోని పాటలన్నీ రఫీని మరింత అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాయి.

అలా రఫీ గొంతుకు మదన్ మోహన్, హన్స్ రాజ్ బెహ్ల్, శ్యాంసుందర్, నౌషాద్, అల్లారఖా ఖురేషీ, ఖయ్యామ్, ఓపీ నయ్యర్, ఎస్. మొహిందర్, సర్దుల్ సింగ్ క్వాత్రాతో సహా.. పంజాబీ సంగీత దర్శకులెందరో ఫిదా అయిపోయారు.

1980లో మరణించిన రఫీ వెళ్లిపోయి 44 సంవత్సరాలవుతున్నా ఆయన గొంతులో మాధుర్యం.. ఆయన్నెప్పుడూ చిరంజీవిగా నిల్పేది. వివిధ భారతి, ఆల్ ఇండియా రేడియో ఉర్దూ బులెటిన్స్ లోనూ రఫీ పాటల పూదోటలు ఓ నోస్టాల్జియా.

రఫీది స్నేహగుణం, మృదుస్వభావం. రెమ్యునరేషన్ విషయంలో కూడా వారి వారి పరిస్థితులను బట్టే తీసుకునేవాడు. కానీ, ఏ పాటైనా మనసు పెట్టే పాడేవాడు. అలనాటి సంగీత దిగ్గజం ఖయ్యాం.. ఇన్సాఫ్ కీ షకల్ మే ఏక్ ఫరిష్తా థాయ్.. రఫీ సాహబ్ అనేవాడు. రఫీ నిరాడంబరత చూస్తే మానవుడి వేషంలో ఉన్న దేవదూతలా అనిపిస్తాడని. తన విజయానికి ఆ దేవుడు, ప్రజల అభిమానమే కారణమనే నిరాడంబర నిగర్వి రఫీ.

ఓపాట అర్థాన్ని దర్శకుడు, సంగీత దర్శకుడు, గీత రచయిత ఇందరి కోణంలో అర్థం చేసుకుని వారందరినీ మెప్పించే విధంగా పాడటం రఫీలో మాత్రమే చూశానన్నాడు మన్నాడే. పాడటం ఓ వృత్తి మాత్రమే అయితే… కన్నుమూసి 44 ఏళ్ల తర్వాత కూడా లోకమంతా రఫీని స్మరించుకునేవారు కాకపోవచ్చునేమో! కానీ, పాటంటే తనకున్న అభిరుచి, అందుకు తగ్గ వ్యక్తిత్వం తన అభిమానులు ఇవాల్టికీ నెమరు వేసుకుని గుర్తుచేసుకునేలా నిలబెట్టింది.

1970వ దశకంలో కిషోర్ కుమార్ ఎంట్రీతో ఒకానొక సమయంలో ఇక తాను అంతగా పాడలేకపోవచ్చునేమోనన్న ఒకింత సందేహం రఫీలో ఆవహించింది. కానీ, పాట పట్ల తనకున్న అంకితభావం తనపై దూకుడు ప్రదర్శిస్తున్న కిషోర్ తోనూ సమాంతరంగా నడిపించింది. కొన్ని పాటలు రఫీ మాత్రమే పాడాలనేలా నిల్చిపోయాయి. తేరీ గాలియో మే నా రఖేంగే అనే పాటతో పాటు.. అప్నీ ఆంఖోంమే బాసా కర్ వంటి గీతం ఆల్ టైం ఫేవరేట్ సాంగ్స్ గా గుర్తుండిపోయాయి.

కిషోర్, ముఖేష్, హేమంత్ వంటి మేటి గాయకులతో పాటు.. ఇవాల్టి బాలీవుడ్ సింగర్స్ వరకూ ఎందరితోనూ పాటల ప్రయాణం చేసిన లతా మంగేష్కర్ కు కూడా రఫీ ఇష్ట గాయకుడు. ఏ పాట పాడినా స్వరస్థానం ఏ మాత్రం అటూ ఇటుగా ఉండేది కాదంటూ తెలిసినవాళ్లతో చెప్పేదట లత. పెర్ఫెక్షనిస్ట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇవాల్టి బాలీవుడ్ టాప్ సింగర్ సోనూనిగమ్ వంటివాళ్లంతా రఫీ అనే ద్రోణుడికి ఏకలవ్యులు. ఇంక ఆ పాట ఎంత ప్రభావవంతమైందో ప్రత్యేకంగా చెప్పాలా..?

కిషోర్ పై ఇందిర ప్రభుత్వం ఎమర్జెన్సీ సమయంలో బినాకా గీత్ మాలతో పాటు.. దూరదర్శన్ లోనూ నిషేధం విధిస్తే.. రఫీ వద్దకు వచ్చి కొందరు ఇదే సమయం ఉపయోగించుకోండి అంటూ ఉసిగొల్పే ప్రయత్నం చేశారు. కిషోర్ పేరు మార్మోగుతున్న సమయంలో నిషేధం ఎదుర్కొంటున్న సమయమది. కానీ, రఫీ విలక్షణమైన వ్యక్తిత్వం కల్గినవాడు. చాడీలు చెప్పేవారి మాటలు విని ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు. కానీ, ఢిల్లీ వెళ్లాడు. కిషోర్ పై కోపంతో రగిలిపోతున్న సంజయ్ గాంధీని కలిశాడు. కిషోర్ పై బ్యాన్ ఎత్తేయండి.. మీకు ఒకటి కాదు.. పది ప్రోగ్రామ్స్ చేసిస్తానని మాటిచ్చాడు. నౌషాద్ తో కలిసి వెంటనే దూరదర్శన్ లో నాటి ఇందిర ప్రభుత్వ 20 సూత్రాల పథకానికనుకూలంగా ప్రోగ్రామ్ ఇచ్చాడు. వెంటనే కిషోర్ పై అప్పుడు బ్యాన్ ఎత్తేశారు. అదీ రఫీ అంటే!

రఫీ పనైపోయిందంటూ నాడు రాతలు రాసిన పత్రికలను ఏకిపారేస్తూ కిషోర్ కుమార్ కూడా ప్రెస్మీట్ పెట్టి హెచ్చరించాడు. అలా కిషోర్ కుమార్, రఫీ స్నేహబంధం రామ్ రహీమ్ అన్నట్టుగా సాగింది.

మంచి సృజనాత్ముకుడు కావాలంటే మొదటగా మంచి మనిషై ఉండాలనేవారు హీరో దిలీప్ కుమార్ రఫీని ఉదాహరణగా చెబుతూ. పాటగాడిగానే కాదు సహృదయమైనవాడిగా తన వ్యక్తిత్వంతోనూ చెరగని ముద్ర వేసి వెళ్లిపోయిన వందేళ్ల పాట రఫీ.

అభి నా జావో చోడ్ కర్.. కే దిల్ అభీ భరా నహి!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles