సమాంతర సినిమాకు కొత్త దిశను చూపిన చైతన్య ప్రతీక.. శ్యాం బెనెగల్!

Shanthi Ishaan.. ✍🏻

#ShyamBenegal

#ankur

శ్యామ్ బెనెగల్! 70వ దశకంలో భారతీయ సినిమాలో ఈ పేరొక ప్రభంజనం. Parallel Cinemaని కొత్త దారుల్లో నడిపించిన దర్శకుడాయన. నా ఫేవరెట్ డైరెక్టర్లు ఎంత మంది ఉన్నా ఒక్కరి పేరే చెప్పాలంటే మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేది ఆయన పేరే! శ్యామ్ బెనెగల్ trilogy- అంటే మొదటి మూడు సినిమాలైన Ankur, Nishanth, Manthan అగ్గి రవ్వలు, వ్యవస్థ మీద ఎక్కుపెట్టిన బాణాలు. వీటిలో మొదటి రెండూ తెలంగాణ నేపథ్యంలో రూపొందించినవి. Mandi కూడా ఆ కోవలోకే వస్తుంది. Ankur, Nishanth దొరల దాష్టీకాన్ని ప్రశ్నిస్తే Mandi పడుపు వృత్తిలో మగ్గిపోతున్న ఆడవాళ్ళ బతుకు చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది.

ఇరవైకి పైగా సినిమాలు, 50కి పైగా డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్, టీవీ షోలు చేసిన శ్యామ్ బెనెగల్ దాదాపు అన్నింటా అవార్డులు గెలుచుకున్నారు. అంతే కాదు… జనంలో చైతన్య స్ఫూర్తిని కూడా రగిలించారు.

శ్యాం బెనగల్


శ్యామ్ బెనెగల్ ఉత్తేజభరితమైన ప్రయాణానికి నాంది పలికింది మాత్రం “అంకుర్”! అంకుర్ అంటే అంకురం, మొలక. అణగారినవర్గాల్లో మొలకెత్తిన చైతన్యానికి ప్రతీక ఈ సినిమా.
1974లో వచ్చిన “అంకుర్” తెలంగాణలో దొరల మోచేతి నీళ్ళు తాగుతూ బ్రతికిన తక్కువ జాతి వారి కథ, వ్యథ. లక్ష్మి (షబానా అజ్మీ) బధిరుడైన కిష్టయ్య (సాధు మెహర్) భార్య. పెళ్ళై చాలాకాలమైనా పిల్లలు పుట్టరు. పిల్లల కోసం లక్ష్మి మొక్కని దేవుడు లేడు. జమీందారు కొడుకైన సూర్య (అనంత్ నాగ్) సిటీలో చదువు పూర్తి చేసుకుని ఊరికి తిరిగొస్తాడు. తండ్రి బలవంతం మీద సరూని బాల్య వివాహం చేసుకుంటాడు. తండ్రి ఒత్తిడి కారణంగానే పొలం బాధ్యతలు తీసుకుని మరో ఇంట్లో ఒంటరిగా ఉంటుంటాడు. లక్ష్మి, కిష్టయ్య అతని పనులు చేసి పెడుతుంటారు. లక్ష్మి మీద మోజు పెంచుకున్న సూర్య ఆమెకు వంట పని అప్పజెబుతాడు. దళిత మహిళ చేతి వంట కోసం తమ ఇంటి వంటను కాదనడం ఊరి పూజారికి అస్సలు నచ్చదు. ఇక సూర్యకి కావల్సిన ఎరువులను ఎడ్ల బండిలో తెచ్చి పెట్టడం కిష్టయ్య పని.
ఓరోజు కల్లు దొంగతనం చేశాడన్న ఆరోపణలపై సూర్య కిష్టయ్యకు గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తాడు. ఆ అవమానం తట్టుకోలేక కిష్టయ్య చెప్పాపెట్టకుండా ఊరి నుంచి పారిపోతాడు. ఇదే అదనుగా సూర్య లక్ష్మిని లొంగదీసుకుంటాడు. కొన్నాళ్ళకు సరూ కాపురానికి వస్తుంది. రావడమే లక్ష్మి మీద అయిష్టం పెంచుకుంటుంది. అనారోగ్యాన్ని సాకుగా చూపి ఆమెను పనిలో నుంచి తీసేస్తుంది. అప్పటికే గర్భవతి అయిన లక్ష్మి తినడానికి సరైన తిండి లేక కృశించిపోతుంది. కొన్నాళ్ళకు కిష్టయ్య కొంత డబ్బు సంపాదించి తిరిగి ఇంటికి వస్తాడు. లక్ష్మి తన బిడ్డనే కడుపులో మోస్తోందని మురిసిపోతాడు. కానీ లక్ష్మి మాత్రం అపరాధ భావనతో కుంగిపోతుంది. కిష్టయ్య సంబరంగా పని అడుగుదామని చిన్న జమీందారు ఇంటికి వస్తాడు. అతణ్ణి అల్లంత దూరంలో చూసిన సూర్య బెదిరిపోతాడు. విషయం తెలుసుకుని తన మీద పగ తీర్చుకోవడానికే వస్తున్నాడని ఊహించుకుని అతణ్ణి కొరడాతో కొట్టిస్తాడు. ఆ వెనకే వచ్చిన లక్ష్మి సూర్యను శాపనార్థాలు పెట్టి భర్తను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతవరకు ఈ చోద్యమంతా చూస్తున్న ఓ చిన్న పిల్లాడు కాస్త దూరం పరిగెట్టి ఓ చిన్న రాయి తీసి జమీందారు ఇంటి కిటికీకేసి విసురుతాడు. కిటికీ అద్దం పగులుతుంది. అక్కడితో సినిమా ముగుస్తుంది. దొరల పెత్తనానికి అడ్డుకట్ట వేసే చైతన్యానికి ఆ చిన్నపిల్లవాడు విసిరిన రాయే అంకురమన్నమాట!


“అంకుర్” ద్వారా శ్యామ్ బెనెగల్ తను పుట్టి పెరిగిన తెలంగాణలో కింది జాతివాళ్ళు ఎదుర్కొంటున్న అన్యాయాలను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. రియలిస్టిక్ నేరేటివ్ లో సాగే ఈ సినిమాలో పాటలు గానీ నేపథ్య సంగీతం గానీ వినిపించవు. అడపాదడపా ఊరి జనం పాడుకునే పల్లె పదాలు, రేడియోలో వినిపించే ఒకటీ, అరా పాటలే తప్ప వేరే BGM అన్నదే లేదు. ఇది సత్యజిత్ రే రియలిస్టిక్ సినిమాని తలపిస్తుంది.
ఇక ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశం పాత్రల characterization. ఇందులోని ప్రతి పాత్రా పూర్తి మంచిదీ కాదు అలాగని పూర్తి చెడ్డదీ కాదు. పాత్రల ప్రవర్తన పరిస్థితులకు తగ్గట్లుగా కనిపిస్తుంది. భర్త తాగుబోతు అయినా, బధిరుడే అయినా, పిల్లల్లేకపోయినా లక్ష్మికి అతనంటే చెప్పలేని మమకారం. అనుకోని పరిస్థితుల్లో తప్పు చేసినా లోలోపల కుమిలిపోతుంటుంది. ఈ పాత్రలో జీవించేసిన షబానా అజ్మీ ఒంటి చేత్తో సినిమాను విజయం వైపు నడిపించింది. ఇక సూర్య అభ్యుదయ భావాల, అహంకారాల కలబోత. తనకు ఎలాంటి పట్టింపులూ లేవని నిరూపించాలనుకున్నా జన్మత: వచ్చిన అహంకారం అతని అభ్యుదయానికి అడ్డుగా నిలుస్తుంది. బహుశా ఇతను ఆ కాలంలో ఎటూ తేల్చుకోలేని యువతకు ప్రతినిధి అయి ఉంటాడు. సూర్య పాత్రలో అనంత్ నాగ్ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో కథకు సంబంధం లేకపోయినా కథను ముందుకు నడిపించే క్యారెక్టర్ రాజమ్మది. ఆడదాన్ని మగాడు తన ఆస్తిగా ఎలా భావిస్తున్నాడో, ఆమె మీద పెత్తనం చెలాయించడమే తన జన్మ హక్కని ఎలా అనుకుంటున్నాడో ఈ పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశారూ డైరెక్టర్. రాజమ్మ పాత్ర లక్ష్మి పాత్రకు చాలా దగ్గరగా ఉంటుంది. లక్ష్మిలో అంతర్మథనానికి, సంఘర్షణకు కారణమవుతుంది.
శ్యామ్ బెనెగల్ “అంకుర్” ద్వారా సాంఘిక దురాచారాలను కూడా ఎండగడతారు. కుల వ్యవస్థ, జమీందారీ వ్యవస్థ, ఆడ, మగ వ్యత్యాసం, వరకట్నం ఇలాంటి ఎన్నో అంశాలు అంతర్లీనంగా కథతో పాటు సాగిపోతాయి.
సామాజిక సందేశం ఇచ్చే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలే కాదు ప్రేక్షకుల ఆదరణ కూడా గెలుచుకుంది. ఐదు లక్షలు పెట్టి తీస్తే కోటి రూపాయలు వసూలు చేసింది. శ్యాం బెనెగల్ కి, షబానా అజ్మీ, సాధు మెహెర్లకు జాతీయ అవార్డులు సాధించి పెట్టింది.
“అంకుర్” ద్వారా శ్యామ్ బెనెగల్ ఇండియన్ ప్యారలెల్ సినిమాకి అంకురార్పణ చేశారు. రూపు మార్చుకున్నప్పటికీ ఆ ఉద్యమం ఇప్పటికీ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. మెయిన్ స్ట్రీమ్ సినిమాకి దీటైన ప్రత్యామ్నాయంగా కొనసాగుతోంది.

(సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున (23 డిసెంబర్) శ్యామ్ బెనెగల్ వెళ్ళిపోయారు!)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles