మోదుమూడి సుధాకర్.. ✍🏻
—————————————————-
నా సంగీతానుభవాలు:
జనం వార్తాపత్రికలు బాగా చదివే రోజుల్లో, సంగీత కార్యక్రమాల సమీక్షలకు కూడా ప్రాధాన్యత ఉండేది. సంగీతం పెద్దగా తెలియకపోయినా కొందరు విలేకరులు, సంగీత, నృత్య కార్యక్రమాలపై సమీక్షలు వ్రాస్తూ ఉండేవారు. అలాంటివారిలో ఉయ్యూరు నాగేశ్వరరావుగారు అనే ఒకాయన గతంలో బెజవాడలో ఉండేవారు. విశాలాంధ్ర పత్రికకు విలేకరి ఆయన.
ఆయనకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. సంగీతపరమైన సందేహాలను నన్ను అడిగి తీర్చుకొనేవారు. ఒక సందర్భంలో “ఆది నాట, అంత్య సురటి” అనే నానుడి గురించి చెప్తూ, గాయకులు కచేరీని నాటరాగంతో ఆరంభించి, సురటి రాగంతో ముగించే సంప్రదాయం ఒకటి ఉందని చెప్పాను. కొన్నాళ్ళకు ఒక సభలో నేను కచేరీ చేస్తే, మర్నాడు పత్రికలో..”గాయకుడు పాడిన అన్ని అంశాలూ బాగున్నాయి. అయితే, “ఆది నాట, అంత్య సురటి” అనే సంప్రదాయాన్ని పాటించలేదు. నాటకురంజితో ఆరంభించి, మధ్యమావతితో ముగించాడు” ..అని వచ్చింది.

అది ఒక నానుడి మాత్రమే అని, నాటతో ఆరంభించి, సురటితో ముగించి తీరాలనే నిబంధన ఎక్కడా లేదని నేను ఆయనకు వివరించాల్సి వచ్చింది..
వాగ్గేయకార కృతుల సాహిత్యాలు కొన్ని నాదగ్గర తీసుకొని, వాటిని శీర్షికలుగా ప్రయోగిస్తూండేవారాయన. “నిధి చాలా సుఖము అన్న త్యాగయ్య..” అంటూ శీర్షిక పెట్టారు ఒకసారి. నేను ఆయనకు తిరిగి వివరించవలసి వచ్చింది…త్యాగయ్యగారు అన్నది ‘నిధి చాలా సుఖము’ అని కాదని, ‘సుఖమా?’ ( సుఖము కాదని భావము) అని..
మరొకసారి ఒక సంగీత మిత్రుడు ఎదురై, “ఏమిటి? నీవు ఈమధ్య జగన్మోహిని రాగంలో సప్తస్వరాలనూ పలికించావట?” అన్నాడు నవ్వుతూ. ఆరా తీయగా తెలిసినదేమిటంటే.. “జగన్మోహినిలో శోభిల్లిన సప్తస్వరాలు”.. అనే శీర్షిక పెట్టి, అంతకు క్రితంరోజు నేను చేసిన కచేరీపై సమీక్ష వ్రాశారు విశాలాంధ్ర నాగేశ్వరరావుగారు. ఆరాగంలో సప్తస్వరాలనునేను పలికించినట్లు వ్రాశారు. “శోభిల్లు సప్తస్వర” అనే త్యాగయ్య కృతి “జగన్మోహిని” రాగంలో ఉంది అని ఆయనికి చెప్పింది నేనే.. అయితే, ఆయనకు తెలియనిది ఏమిటంటే, జగన్మోహిని రాగంలో త్యాగయ్యగారు సప్తస్వర సుందరులనైతే వర్ణించారు కానీ, ఆ రాగంలో సప్తస్వరాలు లేవు. 6 మాత్రమే ఉన్నాయి .. నేను సరిగానే పాడినా, కృతి సాహిత్యమూ, రాగం పేరూ రెండూ కలిసి వచ్చేట్టు అలా శీర్షిక పెట్టేశారాయన! ఈ వివరణ అంతా మళ్లీ ఆయనకు ఇవ్వాల్సివచ్చింది.
సంగీత కార్యక్రమాల సమీక్ష చేయాలంటే కనీస సంగీత పరిచయం అవసరం. కచేరీలో కళాకారులు పాడే అంశం ఏమిటి ? అది ఏ రాగం? ఎవరి రచన? ఇలాంటి ముఖ్య వివరాలు విలేకరులకు తెలుపాలనే ప్రధాన ఉద్దేశ్యంతో, గతంలో అకారాది అక్షరక్రమంలో 700 కు పైగా త్యాగయ్యగారి కృతుల రాగ, తాళ వివరాలతో కూడిన చేతి పుస్తకం ముద్రించాను. ఒక కృతి సాహిత్యాన్ని ఎలా వ్రాయాలో కూడా వివరంగా అందులో పొందుపరచటం జరిగింది.
ఉదాహరణకు: “బంటు రీతి” అని వదిలేయకుండా, “ బంటురీతి కొలువియ్యవయ్య రామా!..” రాగం: హంసనాదం, తాళం: ఆది, రచన: త్యాగరాజస్వామి
ఈవిధంగా వివరించే ఆ పుస్తకాన్ని సాంస్కృతిక విలేకరులకు అందజేశాను.
ఒకసారి మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఢిల్లీలో కచేరీలో చేసిన ఒక వినూత్న ప్రయోగం అర్థంకాక, ఆయన స్వరాల కోసం వెతుక్కున్నారని, అపస్వరాలు వచ్చాయని పత్రికలో వ్రాశాడు అక్కడి విలేకరి. ఎవరో మురళీగారి దృష్టికి అది తీసుకురాగా, “అటువంటి విమర్శలు నేను పట్టించుకోను..ఒక రాగంలో గ్రహభేదం చేస్తే వచ్చే వేరొక రాగంలోని స్వరాలతో ప్రస్తారం చేసి, తిరిగి మొదటి రాగంలోని స్వరాలకు మరలి, పాడటం నేను చేసిన ప్రయోగం..అది ఇంతకుముందు ఏ విద్వాంసుడూ చేయలేదు. తెలియనివారికి అవి అపస్వరాలుగా కనబడతాయి. ఇదంతా ఆ విలేకరికి చెప్పినా అర్థమవుతుందా?” అన్నారు మురళీగారు. తర్వాత విషయం తెలుసుకొని, మురళీగారికి క్షమాపణ చెప్పాడట ఆ విలేకరి.
సంగీతం తెలిసిన విలేకరి ఒకరు మా ఊళ్ళో ఉండేవారు. ఆయన కూడా సభా నిర్వాహకుడు కావటంతో, తక్కిన సభలపై అసూయతో, ఏ కార్యక్రమ సమీక్షా పత్రికలో రానిచ్చేవారు కాదు. తన ఆదాయానికి గండి పడినా, తనకు నచ్చని సభలకు ప్రాచుర్యం రాకుండా అడ్డుకోవటమే చివరకు ఆయన ఉద్యోగమైపోయింది!
మద్రాసులో సంగీత కచేరీల సమీక్ష చేసే విలేకరులు ఎంతో జ్ఞానస్థులై ఉంటారు. విద్వాంసులు కొందరు, తమ కచేరీ రోజు ఆ విలేకరుల ఇళ్లకు వెళ్లి, ముందుగా వారిని సముచిత రీతిని సత్కరించి, తమపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టకుండా వారిని ప్రసన్నం చేసుకొనేవారు.
ఆంధ్రజ్యోతి సంపాదకులు డా.నండూరి రామమోహనరావుగారు నాకు స్వయానా మేనమామ. ‘స్వరఝరి’ కార్యక్రమాలకు అతిథిగా ఆయనను ఎప్పుడైనా ఆహ్వానిస్తే, “నాకు శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం లేదు. అక్కడ పొరపాట్లు మాట్లాడకూడదు. అర్హులైన వారిని ఆహ్వానించు. నేను వచ్చి కచేరే వింటాను” అనేవారు. ఆంధ్రప్రభ సంపాదకులు వి. వి.దీక్షితులు గారు నన్నెంతో అభిమానించేవారు. “ఈ వారం సూర్యుడు” శీర్షికతో ప్రతిభావంతులైన యువతను పరిచయంచేస్తూ, అందుకు ఒకవారం నన్ను కూడా ఎంచుకున్నారు. విశాలాంధ్ర సంపాదకులు సి.రాఘవాచారి గారు అద్భుత వ్యక్తి , వక్త. అంతే కాదు; ఆయన ఎంతటి సంగీతప్రియులంటే, ప్రతి కచేరీకి వచ్చి, వెనుక వరుసలో కూర్చొని , కచేరీ ఆసాంతం విని, వెళ్ళేటప్పుడు రహస్యంగా నా చేతిలో ఎంతో కొంత రొక్కం పెట్టి, వెళ్ళేవారు. శివస్వామి , సుందరరాజన్ అనే ఇద్దరు తమిళులు బెజవాడలో రైల్వే ఉద్యోగులుగా ఉంటూ ఆంగ్ల పత్రికలలో సాంస్కృతిక కార్యక్రమాల సమీక్షలు ఎంతో శ్రద్ధగా చేసేవారు. ప్రతి అంశాన్ని కూలంకషంగా తెలుసుకొని, సద్విమర్శ చేసేవారు.
ఒకప్పుడు THE HINDU పత్రికలో FRIDAY REVIEW కు అత్యంత ప్రాధాన్యత ఉండేది. ప్రాంతాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాల సమీక్షలు సవివరంగా అందులో వచ్చేవి.. ‘సంగీత రత్న’ పెమ్మరాజు సూర్యారావుగారి వంటి విద్వాంసులు చక్కని సమీక్షలు వ్రాసేవారు. ఆ సమీక్షల ఆధారంగా కళాకారులను ఎంపిక చేసి, వారి కచేరీలు ఏర్పాటుచేసేవారు సంగీత సభా నిర్వాహకులు..ఆ రోజులు పోయాయి.. ఇప్పుడు అందరిదీ యాంత్రిక జీవనం..ఏ విషయం పైనా పరిశీలన, అవగాహన, సాధికారత ..ఎవరికీ అక్కరలేదు.. ఆ పదాలకు అర్ధాలు కూడా తెలియని తరం వచ్చేసింది..సర్వేజనాస్సుఖినోభవంతు..



