మధుమతిని దాటి, కుమారఖలి స్వాధీనం: 1971 వార్ ముచ్చట!

చాలామంది మర్చిపోయన ఓ యుద్ధఘట్టం గురించి ఓసారి జ్ఞాపకం చేసుకుందాం. భారత సైనిక దళాలు మధుమతి నదిని దాటి కుమారఖలిని స్వాధీనం చేసుకున్న ఆ భీకర యుద్ధ ఘట్టమేంటి..?

రక్తపు మరకలు ఆరిపోకమునుపే యుద్ధాలను మర్చిపోతారనేది ఓ మంగోలియన్ సామెత. భారత సైనిక చరిత్రలో చాలా యుద్ధాల పరిస్థితీ అంతే.కేవలం పోరాటం చేసిన ఆయా రెజిమెంట్స్, బెటాలియన్స్ లో మాత్రమే గుర్తుండిపోయే రక్తంతో రాసుకున్న త్యాగపూరిత జ్ఞాపకాలవి.

1971లో భారత్ – పాక్ మధ్య జరిగిన యుద్ధంలో ప్రస్తుతం బంగ్లాదేశ్ గా అవతరించిన నాటి తూర్పు పాకిస్థాన్ లో కీలక స్థావరం కుమారఖలి పట్టణం. అక్కడికి చేరుకోవాలంటే.. ముందుగా భీకరంగా ప్రవహిస్తున్న ఓ నదిని దాటాలి. అదే మధుమతి నది. మధుమతిని దాటడం నాటి సైనిక బృందాలకు ఓ పెద్ద ప్రహసనం.. అలాగే, నది తర్వాత ఉన్న కుమారఖలిని స్వాధీనపర్చుకోవడం మరో పెద్ద టాస్క్. ఇండియన్ ఆర్మీలో మేజర్ జనరల్ స్థాయికి ఎదిగిన నాటి బ్రిగేడియర్ రాజేంద్రనాథ్ నాయకత్వంలోని 62 మౌంటెన్ బ్రేగేడ్ ఆ ఆపరేషన్ చేపట్టింది. నాడు తూర్పు, పడమర అన్న తేడా లేకుండా పాక్ తో ఇరువైపులా జరిగిన యుద్ధాలు భీకరమైనవే. కానీ, తూర్పువైపున జరిగిన యుద్ధం మరింత తీవ్ర ప్రతిఘటనతో కూడుకున్నది. అక్కడి మధుమతి నదిని దాటడమనేది ప్రాణాలకు తెగించడమే. కానీ, దాన్ని కవల్రీ ఆర్మ్డ్ ఫోర్సెస్.. PT-76 అనే లైట్ వెయిట్ అంఫైబియన్ ట్యాంకుల సాయంతో ఆ నదిని దాటి పాక్ సైన్యన్ని నిశ్ఛేష్ఠులను చేయడం ఓ పెద్ద విజయం.

అలా మన ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్ కు వ్యూహాత్మక ప్రాంతమైన కుమారఖలి పట్టణాన్ని విజయవంతంగా స్వాధీనపర్చుకున్నారు. ఈ ఆపరేషన్ మొత్తం రాత్రి వేళ చీకట్లో జరగడం మరో విశేషం. లోతైన, వెడల్పాటి, భీకర ప్రవాహంతో కూడుకున్న మధుమతి నదిలోంచి సోవియెట్ టెక్నాలజీ లైట్ వెయిట్ ట్యాంకుల సాయంతో… ఆ టాస్క్ ను పూర్తి చేసింది ఇండియన్ ఆర్మీ. అదీ, ప్రత్యర్థి పాక్ బలగాల కంట పడకుండా, వారిని ఏ మాత్రం అప్రమత్తం కానీయకుండానే అటాక్ చేయడం నాటి యుద్ధంలోని ప్రత్యేకత.

ప్రధాన జలమార్గం – కీలకమైన పట్టణం!

నాటి తూర్పు పాకిస్థాన్.. నేటి బంగ్లాదేశ్ లోని ఖుల్నా డివిజన్ లోని కుష్టియా జిల్లాకు నైరుతీ భాగంలో ఉంది కుమారఖలి పట్టణం. ఆ పట్టణం అక్కడ తాలూకాతో సమానం. అది మధుమతి నది ఒడ్డున ఉంది. మధుమతి నది పెట్టని గోడలాగా శత్రువుల నుంచి కాపాడే సహజమైన అడ్డుకట్టలాంటి విశాలమైన నది.

అలాగే కుమరఖలి పట్టణం స్వాధీనంతో పాటు, అక్కడి ఫెర్రీ పాయింట్ ను నియంత్రించడం ద్వారా పాకిస్థాన్ సరఫరా మార్గాలను అడ్డుకోవడంతో పాటు… కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాలను అక్కడి నుంచి చేరుకునే అవకాశం ఇండియన్ ఆర్మీకి లభించింది. ఘస్కాల్, దంసా చాషీ క్లబ్, కుమారఖలి పోలీస్ స్టేషన్ వంటి ప్రాంతాల్లో అప్పటికే అక్కడి ప్రాంతవాసులు తిరుగుబాటుదారులుగా తమ సొంత అస్తిత్వం కోసం ముక్తి బాహినీ ఫ్రీడం ఫైటర్స్ పేరిట.. పాకిస్థానీ దళాలతో పోరాటాలు చేస్తున్నారు. ఆ క్రమంలో పాక్ సైనికులకు, ముక్తి బాహినీ ఫైటర్స్ కు మధ్య అప్పటికే చిన్నపాటి ఎదురుకాల్పులు కూడా జరిగాయి.

62 మౌంటెన్ సైనికులది అసమాన యుద్ధ నైపుణ్యం!

నాటి 1971 ఆపరేషన్ లో 62 మౌంటెన్ బ్రిగేడ్ లోని 5వ బెటాలియన్ మరాఠా లైట్ ఇన్ఫంట్రీ, నాల్గవ సిఖ్ లైట్ ఇన్ఫంట్రీ, గోర్ఖా రైఫిల్స్ వంటి ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ చూపిన తెగువ అసమానమైనది. మధుమతి నది ఉత్తర భాగంలో 7 మౌంటెన్ బ్రిగేడ్ ట్రూప్ కూడా వారికి తోడైంది. సోవియట్ టెక్నాలజీతో కూడిన PT-76 అంఫైబియస్ లైట్ వెయిట్ ట్యాంకులతో 45వ కవల్రీ స్క్వాడ్రన్ కు చెందిన ఆర్మీ సిబ్బంది కూడా వారికి తోడ్పాటునందించింది.

45 కవల్రీ స్క్వాడ్రన్ కమాండర్ గా అప్పుడు మేజర్ పీ. కే. బాత్రా వ్యవహరించారు. ఆ తర్వాత మేజర్ జనరల్ స్థాయికెదిగారు. మేజర్ జనరల్ రాజేంద్రనాథ్ కొడుకు దినేష్ కపిల.. వాయు అనే ఓ పత్రికలో ఈ యుద్ధానికి సంబంధించి విపులంగా రాశారు. 1971లో జరిగిన ఆ యుద్ధాన్ని ఒక అసమానమైన ధైర్య విరాటపర్వంగా పేర్కొన్నారు. అలాంటి యుద్ధాల్లో సాహసం చేసినవారికి గ్యాలంట్రీ అవార్డ్స్ దక్కాల్సిన అవసరముందన్నారు.

1971, డిసెంబర్ 14-15 తేదీల్లో మధుమతి నది దాటే ముందు పెద్ద కసరత్తే చేసింది భారత ఆర్మీ బృందం. మేజర్ బాత్రా వెల్లడించిన వివరాల ప్రకారం మధుమతి నది అప్పటికే పొంగిపొర్లుతూ పారుతోంది. దాని వెడల్పు 500 నుంచి 700 గజాల వెడల్పుతో నది వడివడిగా, ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మరోవైపు, అటు తూర్పు వైపున పాక్ సైన్యానికి చెందిన రెండు బెటాలియన్స్ శత్రువెదురైతే చాలు విరుచుకుపడేందుకు రెడీగా ఉన్నాయి. మద్దతుగా వచ్చిన ట్రూప్స్, ఆర్టీలరీతో కాపలా కాస్తున్నాయి.

అప్పటికే డిసెంబర్ 12న బాత్రా స్క్వాడ్రన్ లోని రెండు ట్రూప్స్ మినహా.. మిగిలిన దళాలన్నీ 62 మౌంటెన్ బ్రిగేడ్ కమాండ్ కు సహకరించేందుకు అక్కడికి చేరుకున్నాయి. మరాఠా లైట్ ఇన్ఫంట్రీ పడమటి ఒడ్డుకు చేరుకుని భారీ కవచాన్ని ఏర్పాటు చేసింది. సుమారు వంద కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసి లక్ష్యం కోసం గమ్యస్థానానికి చేరుకుంది ఆ ట్రూప్.

అర్ధరాత్రి లోపే క్రాస్ చేయాలన్నది టాస్క్!

చాలా రిస్క్ తో కూడుకున్న నిర్ణయం. బ్రిగేడ్ ఆపరేషన్ విఫలమైతే అంతే సంగతులు. కానీ, బ్రిగేడియర్ రాజేంద్రనాథ్ ఆపరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆంజనేయుడిలా తాను ముందుండి మేజర్ బాత్రా మొదటి ట్యాంక్ డ్రైవర్ సీటులో కూర్చుంటే… రాముడిలా రాజేంద్రనాథ్ ట్యాంక్ పైకప్పుపై కూర్చుని దళాలను ముందుకు నడిపించాడు.

కుమారఖలి స్వాధీనం – పాకిస్థాన్ కు షాక్!

ట్యాంకులు, ఇన్ఫంట్రీ కలిసిన దళాలు పాకిస్థానికు చేరుకోవడమే ఆలస్యం.. పాక్ స్థావరాలను వేగంగా ఛేదించి తుదముట్టించింది ఇండియన్ ఆర్మీ.

పాక్ 9 ఇన్ఫంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ కు ఇండియన్ యుద్ధ ట్యాంకులు మధుమతి నది దాటుతునట్టు మొట్టమొదట సమాచారం అందింది. కానీ, దాన్ని వారు పట్టించుకోలేదు. అసంబద్ధ సమాచారమని కొట్టిపడేశారు. భయంతో చెబుతున్నారేమోనని లైట్ తీసుకున్నారు. కానీ, చిన్నగా అనుమానం మొదలైన పాక్ ఆర్మీ అధికారులు.. ఓ అధికారిని చూసి రమ్మని పంపించారు. అతను వెనక్కి తిరిగి వచ్చి అవుననే సమాధానం ఇవ్వడంతో పాటే… ట్యాంకులు యుద్ధానికి సై అంటూ దూసుకొస్తున్నాయనే సరికి పాక్ షాక్ అయింది.

భారత్ ముప్పేట దాడితో కుమారఖలి పట్టణంతో పాటు, అక్కడి ఫెర్రీ పాయింట్ కూడా తక్కువ సైన్యం సాయంతోనే భారత్ చేజిక్కించుకుంది. పాక్ సైన్యానికి చెంది 393 మంది యుద్ధఖైదీలుగా భారత్ కు పట్టుబడ్డారు. పాక్ భారీగా తన ఆయుధ సంపత్తిని కూడా కోల్పోయింది. ఆ విజయంతో జెస్సోర్- కుష్టియా ప్రాంతంలో పాకిస్థాన్ లాజిస్టిక్స్ దెబ్బతిని ఈస్ట్ కమాండ్ ప్రాంతమంతా పతనమైపోయింది.

అయితే, ఆ ఆపరేషన్ కు ముందే మేజర్ జనరల్ బాత్రా ఆ యుద్ధాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. తనకు వ్యక్తిగతంగా అదో భారీ సవాలుగా భావించారాయన. ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం కావొద్దనే సంకల్పంతో పాటే.. ట్యాంకులు గనుక మధుమతి నదిని విజయవంతంగా దాటకపోతే ఆపరేషన్ మొత్తం ప్రమాదంలో పడిపోతుందన్న బాత్రా స్పృహ, గట్టి పట్టుదలే.. నాటి ఆ మధుమతి నదిని ఛేదించి, కుమారఖలి స్వాధీనపర్చుకున్న విజయానికి కారణం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles