బర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అతగాడి టార్గెట్: అందుకోసం కోల్ కత్తా వీధుల్లో తన పాటల ప్రయాణం మొదలెట్టాడు!

అతడి వీధిపాటలే… బర్క్లీ మ్యూజిక్ కాలేజీకి పాస్ పోర్ట్.

జస్ట్ ఒక గిటార్, దానికి తోడు పాడాలన్న కోరిక.. అంతకుమించిన ఓ కల.. అతణ్ని కోల్ కత్తా స్ట్రీట్ సింగర్ గా మార్చేసింది. ఇప్పుడు కోల్ కత్తా నడిబొడ్డున అతడి పాట సృష్టించే పరవశం వీక్షకులకో అతిశయం.

ఆ 15 ఏళ్ల కుర్రాడి పేరు దేవ్ రాజ్. పార్క్ స్ట్రీట్ లో సాగే తన బస్కింగ్ సెషన్స్ తో అలరిస్తున్న పిట్ట కొంచెం, కూత ఘనం.

అతనేం భిక్షగాడై అడుక్కోవడం లేదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న ఉన్న బర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లో చదువుకోవాలన్నదే ఆ బుడతడి తపన. అందుకోసం డబ్బవసరం కాబట్టే తను గిటార్ చేతబూనాడు. తన గళం విప్పాడు. అతడి చేతి వేళ్లు గిటార్ పై తీగలను సవరిస్తూ.. గళం విప్పేతే జనం ఆగిపోవాల్సిందే.

ఓవైపు కోల్ కత్తా రద్దీ వీధుల్లో హారన్ల మధ్య కదులుతున్న వాహనాలు.. ఇంకోవైపు, వింటేజ్ నిర్మాణ దృశ్యాలు.. వాటికింద పాత పుస్తకాలు అమ్ముకునే విక్రయదారులు.. వాటన్నింటి మధ్యనున్న పార్క్ లో ఓ పాట అందరినీ కట్టిపడేస్తే అతనే దేవ్ రాజ్ భట్టాచార్య.

అతని వేళ్లు గిటార్ తీగలపై కదులుతున్నప్పుడు.. హారన్లతో కూడిన అపశృతుల మధ్య వీధి శబ్దాలను మించి ఆకట్టుకుంటున్న ఆ కుర్రాడిని అక్కడున్నవారంతా వీడియోలు తీసుకుంటున్నారు. వేర్వేరు గమ్యాలకు బయల్దేరినవారంతా అక్కడికెళ్లి గుమ్మిగూడుతున్నారు. ఆ కుర్రాడి నాదం అందరినీ సమ్మోహన పరుస్తోంది. కానీ, ఆ పాట వెనుక వేదన ఉంది. తండ్రీ, కొడుకుల మధ్య దాగున్న ప్రేమకథ వినిపిస్తుంది.

వేదనకు పరిష్కారంగా సంగీతంవైపు!

దేవ్ రాజ్ తల్లి క్యాన్సర్ తో మరణించింది. ఆమె ఓ మంచి గాయని. ఇంటిని ఎల్లవేళలా పాటలతో హుషారెక్కించేది. ఆమె మరణంతో నిర్వేదంలోకి జారిపోయిన దేవ్ రాజ్ ను ఆమె పాటల జ్ఞాపకాలు.. సంగీతం పట్ల ఆమె ప్రేమానుభూతి ఎప్పుడూ వెంటాడసాగాయి. తండ్రి దేవాశిష్ భట్టాచార్య ఓ పెద్ద నిర్మాణ సంస్థలో పనిచేసేవాడు. కానీ, కొడుకు కోసం తన పనులన్నీ వదిలేశాడు. అతడి కలలకు అండగా నిల్చాడు. అలా తండ్రి కొడుకులు ఒకరికొకరుగా.. తల్లి లేని ప్రేమను తండ్రిలో దేవ్ రాజ్ చూసుకుంటే.. భార్య పోయిన వెలితిని కొడుకు దేవ్ రాజ్ లో చూసుకున్నాడు తండ్రి దేవాశిష్.

దేవ్ రాజ్ తల్లి నేర్పిన పాటనే జీవనాధారం చేసుకోవాలనుకున్నాడు. సంగీతంలో ఎదగాలనుకున్నాడు. కలలేమో పెద్దవి. కుటుంబమేమో పొట్టగడిస్తే చాలనుకునే మధ్యతరగతి. కానీ, తండ్రి కొడుకును ఇష్టమైన రంగంలో తీర్చిదిద్దగలనన్న నమ్మకాన్ని మాత్రం వీడలేదు. సంకల్పముంటే ఏదైనా సాధ్యమేనని నమ్మాడు. అలా 2020 లాక్ డౌన్ సమయంలో మొదట గిటార్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు దేవ్ రాజ్. కానీ గురుముఖంగా నేర్చుకుందామనుకుంటే ఆ సమయంలో వీలు కాకపోవడంతో.. ఆన్లైన్ సంగీత క్లాసులకు హాజరయ్యాడు. కానీ, దేవ్ రాజ్ కు ఉన్న గ్రాహక సామర్థ్యంతో ఆ గిటార్ ను వెంటనే పట్టేశాడు. సంగీతంలో రాణించాలని తన తల్లి పాటల జ్ఞాపకాలతో ఉవ్విళ్లూరుతున్న దేవ్ రాజ్ వేళ్లు… అనతికాలంలోనే గిటార్ పై గింగుర్లు తిరిగే స్థాయికి చేరాయి.

మరి దేవ్ రాజ్ సంగీతాన్ని వీధికెందుకెక్కించాడు..?

భారత్ లో అంటే స్ట్రీట్ మ్యూజిక్ షోస్ తక్కువగానీ.. పలు యూట్యూబ్ ఛానల్స్ చూసినప్పుడు ఆయా దేశాల్లో వీధుల్లో సంగీతానికి ఎంత క్రేజుందో దేవ్ రాజ్ ను ఆకర్షించింది. ఎవరి దగ్గరికో వెళ్లడం వాళ్లు కాదనడం కంటే కూడా.. వీధిలోనే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభిస్తే నచ్చినవారెవరైనా తనకు అండగా నిలబడకపోతారానన్న ఓ చిన్ని ఆశ కూడా దేవ్ రాజ్ లో కల్గింది. ముందు కాస్త సంకోచించినా.. ఆ తర్వాత నాన్న దేవాశిష్ కూడా సరేనన్నాడు.

ఓ పాత గిటారు పట్టుకుని అలా వీధుల్లోకి బయల్దేరాడు దేవ్ రాజ్ భట్టాచార్య. మెల్లిమెల్లిగా పార్క్ స్ట్రీట్ లో అతనో ఐకాన్ ఐపోయాడు. పార్క్ స్ట్రీట్ అంటే కోల్ కత్తాలోని కల్చరల్ కారిడార్. ఒకప్పుడు జాజ్ క్లబ్బులకు వేదిక. ఇక క్రిస్మస్ సమీపిస్తే చాలు లైట్లతో, సంగీతంతో మిరుమిట్లు గొల్పే వీధి అది.

దేవ్ రాజ్ గుర్తింపు కోసం మాత్రమే తన పాటను వీధికెక్కించాడు. ఏం ఆశించాలి.. తననెవరైనా గుర్తిస్తారా… పట్టించుకునేవారుంటారా అవేం తెలియదు అతను ప్రారంభించేముందు.

కానీ, దేవ్ రాజ్ ప్రదర్శన జనాన్ని ఆకట్టుకుంది. అతడిని తమ మోబైల్ ఫోన్స్ లో చిత్రించడం మొదలైంది. మీడియాలో వార్తాకథనాలుగా మారాడు. ఇక తనో వైరల్ స్ట్రీట్ సింగర్ గా మన్ననలు పొందడం మొదలెట్టాడు. తనకు రోల్ మాడల్ ఇండియన్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అని చెబుతున్నాడు. తాననుకున్న రంగంలో తాను కూడా గంగూలీ తరహాలో ఎదగాలనుకుంటున్నాడు.

దేవ్ రాజ్ ఇప్పుడు ప్రాశ్చాత్య, భారతీయ శాస్త్రీయ సంగీతాలతో మిళితమైన శైలిలో రాణించాలనుకుంటున్నాడు. సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అమ్జాద్ అలీఖాన్, దివంగత హిందుస్థానీ వోకల్ ఆర్టిస్ట్ ఉస్తాద్ రషీద్ ఖాన్, ప్రముఖ బాలీవుడ్ సింగర్ పాపోన్, శంకర్ మహదేవన్ వంటి కళాకారులంటే దేవ్ రాజ్ కు క్రేజ్. వారిలాగే ఫ్యూజన్ ట్రాక్స్ ను తయారుచేయాలన్నది ఆకాంక్ష.

దేవ్ రాజ్ కోల్ కత్తా పార్క్ స్ట్రీట్ సింగర్ గా మాత్రమే పరిమితం కాలేదు.. ఇతడి ఖ్యాతి ఇనుముడించింది. ఈమధ్యే ముంబైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ లో ప్రదర్శన ఇవ్వడానికి ఆహ్వానాన్నీ అందుకున్నాడు. ఒక పెద్ద వేదికపై సగౌరవంగా అందిన ఆహ్వానంతో ఇస్తున్న మొట్టమొదటి ప్రత్యక్ష ప్రదర్శన అది దేవ్ రాజ్ కి. ఆ తర్వాత దేశజ్ కేఫ్ లోనూ ప్రదర్శనకు తనకు ఆహ్వానం అందింది. దేశజ్ కేఫ్ శాంతినికేతన్ సమీపంలో ట్రైబల్ ఆర్టిస్టులను గుర్తించేందుకు ఏర్పాటైన ఓ వేదిక. దేశజ్ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా మరో ప్రముఖ బెంగాలీ గాయని లగ్నజిత చక్రవర్తితో కలిసి ప్రదర్శనలో పాల్గొనే అవకాశం దేవ్ రాజ్ కు దక్కింది. వీధుల్లో పాడుతూ తిరుగుతున్న యువకుడికి.. దేశజ్ లోకి ఆహ్వానమందటం కచ్చితంగా అదో మైలురాయి. దేవ్ రాజ్ వంటి కళాకారులను ప్రోత్సహించడానికి, ఉద్ధరించడానికే కంకణం కట్టుకుని ఏర్పాటైన వేదిక దేశజ్ కేఫ్.

దేశజ్ కేఫ్ వంటి చోట్ల ఇచ్చేవి కేవలం ప్రదర్శనలు మాత్రమే కాదు.. కళారంగంలో విస్తృతమైన నెట్వర్క్ ను ఏర్పర్చేవనే విషయం దేవ్ రాజ్ కు అర్థమైంది. ఎవ్వరు పట్టించుకుంటారో, లేదో తెలియని స్ట్రీట్ సింగర్ నుంచి మొదలెట్టి.. ఇవాళ దేవ్ రాజ్ తన సంగీతంతో వివిధ వేదికలపై పిట్ట కొంచెమే అయినా తన కూతెంత ఘనమో నిరూపిస్తున్నాడు.

నిశ్శబ్దంగా ప్రారంభమై.. ఒక శబ్ద దృఢసంకల్పాన్ని కళ్లకుగట్టిన పాటల విజయంగా ఇప్పుడు 15 ఏళ్ల దేవ్ రాజ్ జర్నీ తనలాంటి యువతకు ఓ స్పూర్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles