తిరుగుబాటు చిరునామా ఆ బాండిట్ క్వీన్!

Bandit Queen!

జూలై 25.. చంబల్ లోయలో ప్రతిధ్వనించిన ఓ అభినవ దుర్గ ప్రతిబింబం హత్యకు గురైన రోజు! ఆ ప్రతిబింబమే పూలన్ దేవీ. అవును, తన మల్లా సామాజిక వర్గం మొత్తం ఆమెను అభినవ దుర్గగానే అభివర్ణించింది. ఎందుకంటే, జీవితమనేది ఓ కష్టాల కూపమైతే.. ఆ కూపంలో ఆమె అనుభవించందేదీ లేదన్నట్టుగా సాగింది నరకప్రాయమైన ఆమె ప్రయాణం. అప్పటివరకూ పడటమే కానీ… ఎదిరించడం తెలీని సామాజికవర్గంలోంచి ఎన్నికెష్టాలెదురైనా ఎదురీదుతూ, ఎదిరిస్తూ ఎగిసిపడ్డ కెరటం పూలన్ దేవీ. ఆమె హత్యకు గురైన జూలై 25న ఒక్కసారి ఆమె కథ చెప్పుకుందాం.

2001 జూలై 25న పూలన్ దేవీ ఢిల్లీలోని తన నివాసం వద్ద దుండగుల కాల్పులకు బలైంది. అప్పటివరకూ ఆమె జీవన పయనంలో పూలు, పళ్ల కంటే ముళ్లే ఎక్కువ చూసింది. అణగారిన వర్గాలవారిపై అగ్రకులాల ఆధిపత్యం ఎలా ఉంటుందో చెప్పడానికి పూలన్ దేవీ కథ ఓ ఉదాహరణ. ఉత్తరప్రదేశ్ లోని గోర్ఖాకాపూర్వాలో యమునానది తీరాన పడవలు నడుపుకుంటూ బతికేవారికి మల్లా సామాజికవర్గంలో జన్మించిన పూలన్ దేవి ఓ బందిపోటుగా రూపాంతరం చెందేందుకు ఎదురైన సవాళ్లే ఆమె కథలోని ఆసక్తికర విశేషాలు. పదకొండేళ్ల వయస్సులోనే బాల్యవివాహమైతే… 35 ఏళ్ల భర్త లైంగిక దాడులనెదుర్కొంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. కింది స్థాయి కులం మహిళపై అత్యాచారం జరిగిందన్న వార్త చర్చనీయాంశమైన ప్రతీసారీ పునురజ్జీవం పోసుకునే కథ పూలన్ దేవి.

అసలు మేరీ థేరీసా క్యూనీ, పాల్ రాంబాలి వంటి ఫ్రెంచ్ రైటర్స్ పూలన్ దేవి గురించి రాసేంత గొప్ప ఏముంది ఆమె కథలో…? శేఖర్ కపూర్ వంటి పేరెన్నికగన్న దర్శకుడు బ్యాండిట్ క్వీన్ సినిమానే తీసేంత ఘనతేముంది ఆమె జీవన ప్రస్థానంలో…? ఆమె చనిపోయి ఇన్నేళ్లైనా ఇప్పటికీ మనమెందుకింకా ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం..?

1981, ఫిబ్రవరి 14వ తేదీ… అది ఉత్తరప్రదేశ్ కాన్పూర్ కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని యమునా నదీ తీరంలో ఠాకూర్ల ప్రభావం అధికంగా ఉన్న బెహ్మాయ్ ప్రాంతమది. అక్కడేకంగా 39 మందిని ఠాకూర్లను తీసుకెళ్లి… అందులో 22 మంది ఠాకూర్లను పిట్టల్ని కాల్చేసినట్టు కాల్చేసింది ఓ 19 ఏళ్ల యువతి. ఆమె మనం చెప్పుకుంటున్న పూలన్ దేవి.

ఇప్పటికీ సుమారు 44 ఏళ్లు గడుస్తున్నా.. పూలన్ పాలిట నిందితులు.. ఆ తర్వాత ఆమె బాధితులైన కుటుంబాల్లో ఇంకా కొందరు మాత్రం తమకు న్యాయం కావాలని పోరాడుతూనే ఉన్నారు. అలా అణగారిన సామాజిక వర్గంలోని ఓ 19 ఏళ్ల యువతి దేశం చూపు మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది.

పూలన్ ఠాకూర్లను కాల్చిచంపడం వెనుక.. బాల్యం నుంచే ఆమెను రగిలించిన ఆవేదన ఉంది. అంతకుముందు ఆ అగ్రకులాలు కన్నూమిన్నూ కానని పశువుల్లా పాల్పడ్డ సామూహిక అత్యాచారాల కథలు ఆమెను ఓ మహిషాసుర మర్ధినిగా మార్చాయి. కులవివక్ష చూపే వారెవరైనా ఇంకలాంటి సాహసం చేయాలంటే వణుకు పుట్టాలన్న కసి ఆవహించింది. ఆ కసే ఆమెను బందిపోటును చేసింది. నిండా మునిగాక చలేంటన్న ఓ వైరాగ్య ధోరణి నుంచి ఇకముందు తనలా ఎవరికీ జరుగొద్దన్న తెగింపు పుట్టుకొచ్చింది. అందుకే బెహ్మాయ్ ఉదంతంతో చంబల్ లోయలో ప్రతిధ్వనించిన ఆ ధ్వనులు.. అగ్రకులాలవారినే కాదు.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలనే గజగజలాడించాయి. సర్కార్ కే సవాల్ విసిరాయి. బెహ్మాయ్ ఊచకోతలో 22 మంది ఠాకూర్లను పిట్టలను కాల్చేసినట్టు కాల్చేస్తే.. మరో 80 మంది నరకానికి దగ్గరగా వెళ్లి ప్రాణాలను కాపాడుకుని తిరిగివచ్చినంత పనైంది. అది పీడ కలలాంటి నిజంగా మారింది ఆ బెహ్మాయ్ గ్రామానికి. ఆ బెహ్మాయ్ ఘటనతో అప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్న అదే ఠాకూర్ వంశానికి చెందిన వీపీ సింగ్ తన పదవికి ఏకంగా రాజీనామానే చేయాల్సి వచ్చింది. ఓ 19 ఏళ్ల మల్ల సామాజికవర్గ యువతి దేశవ్యాప్త వార్తై కూర్చుంది. మార్కెట్లన్నీ ఖాళీ మాత ఫోటోలతో దర్శనమిస్తే.. వాటన్నింటి ముఖభాగం మాత్రం పూలన్ దేవీదే.

అగ్ర కులస్థులమని, వీరులమని, క్షత్రియులమని విర్రవీగినవారిలో వణుకు పుట్టించి తిరుగుబాటుకు చిరునామా అయి కూర్చుంది పూలన్.

ఓసారి తనను బాల్యవివాహం చేసుకుని అత్యాచారం చేసి హింసించిన మాజీ భర్త ఊరికెళ్లి అతణ్ని బయటకు ఈడ్చుకొచ్చి కత్తితో కసితీరా పొడిచి చంపేసింది పూలన్. ఇంకెవడైనా బాల్యవివాహాలు చేసుకుంటే ఇదే గతి పడుతుందని హెచ్చరించే నినాదాలు ఆ తర్వాత ఆ గ్రామాల గోడలపై కనిపించడానికీ పూలన్ దేవే కారణమైంది.

బెహ్మాయ్ లో ఇప్పటికీ బందిపోట్ల కాల్పుల్లో గురైనవారి స్మారక చిహ్నం… ఆ చిహ్నంపై అసువులు బాసిన వారి పేర్లూ కనిపిస్తాయి. నిరాయుధులు, నిర్దోషులు, అమాయకులైన ఉన్నత వర్గాలవారిని ఓ బందిపోటు దొంగలముఠా పొట్టనపెట్టుకుందన్నట్టుగా అక్కడి చిహ్నంపై రాతలు కనిపిస్తాయి. కానీ పూలన్ దేవి వంటి నిమ్నకులాలపై జరిగిన అత్యాచారాలు, అక్కడి ఠాకూర్లు జరిపిన దమనకాండలను సూచించే ఏ చిహ్నాలు మాత్రం కానరావు.

బలమైన సామాజిక వర్గమైన ఠాకూర్లు అక్కడితో ఊరుకోలేదు. కక్షలు, కార్పణ్యాలతో రగిలిపోయిన చంబల్ లోయలో.. 1979, అక్టోబర్ మాసంలో పూలన్, విక్రమ్ ఇద్దరినీ తీసుకెళ్లి.. విక్రమ్ మల్లాను కిరాతకంగా కాల్చిచంపేశారు. పూలన్ దేవిని బట్టలు విప్పి కొట్టారు. మూడువారాల పాటు పశువుల్లా పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ అత్యాచారాలకు పాల్పడ్డారు. పూలన్ ఆ పరిస్థితుల్లో మళ్ళీ ఒంటరైంది. మెల్లిగా అక్కడినుంచి తప్పించుకుని మరింత శక్తివంతంగా మారింది. ఆ తర్వాత మళ్లీ దెబ్బ తిన్న పులి దెబ్బ ఇంకా ఎంత గట్టిగా ఉంటుందో బెహ్మాయ్ కి వెళ్లి రుచి చూపించింది. తాను తప్పించుకున్న 17 నెలల వరకూ తన పగ చల్లార్చుకునేందుకు ఓపిక పట్టింది. అలా 1981లో అగ్రకులాల వారికి కంటిమీద కునుకు లేకుండా చేసిన సింహస్వప్నమై కూర్చుంది ఆ బాండీట్ క్వీన్.

పడిపోయిన ప్రతీసారి అంతకంతకూ శక్తి కూడగట్టుకున్న అపరఖాళీ పూలన్. అందుకే, పడి లేచే కెరటంలా సవాళ్లే జీవితమై బతికింది.

అప్పట్లోనే పూలన్ దేవి దేశంలో ఓ మోస్ట్ వాంటెండ్ బందిపోటు. ఆమె తలకు ప్రభుత్వం ఏడున్నర లక్షల వరకూ ప్రకటించింది. బెహ్మాన్ లో ఠాకూర్లు, ఇతర అగ్రవర్ణాలవారికి పూలన్ దేవీ ఓ కిరాతకురాలు… 1981 కాల్పుల్లో అసువులు బాసిన వారి కుటుంబాల్లోని పసుపు, కుంకుమలను చెరిపేసిన ఓ నరరూప రాక్షసురాలు. కానీ కొందరికి పూలన్ దేవీ ఓ ఆడ లేడీ హీరో. ఆమె స్వగ్రామంలో పూలన్ ఇంటిముందు ఇనుప గేటుకు ‘వీరనారి పూలన్ దేవి’ అని రాసి ఉంటుంది. ఆమెకో విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని తానే ఆవిష్కరించడం మరో విశేషం!

అపరఖాళీ మాతలా చంబల్ ప్రాంతంలో నిమ్నకులాల ఆరాధ్యురాలై… మరెందరికో కిరాతకురాలైన పూలన్ దేవీకి కూడా దుర్గాదేవంటే సెంటిమెంట్! అందుకే ఆమె జేబులో ఓ చిన్నపాటి విగ్రహం కూడా ఉండేదంటారు. మొత్తంగా.. పెద్దలను కొట్టి పేదలకు పంచే ఓ లేడీ రాబిన్ హుడ్ పూలన్ దేవీ తర్వాత కాలంలో పోలీసులకు లొంగిపోయింది. కేసు విచారణ లేకుండానే 11 ఏళ్లకు పైగా జైలు జీవితాన్ని గడపింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూలాయంసింగ్ యాదవ్ పగ్గాలు చేపట్టాక ఆమెపై కేసులెత్తేశాడు. ఆ తర్వాత ఆమె అదే సమాజ్ వాది పార్టీ నుంచి అణగారినవర్గాల ప్రతినిధిగా 1996లో మీర్జాపూర్ లోక్ సభ స్థానం నుంచి తిరుగులేని ఆధిత్యంతో విజయం సాధించింది. ఆ తర్వాత 1999లోనూ పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి గెలిచి మరోసారి చట్టసభలోకి అడుగుపెట్టింది.

ఓ అడ్రస్ లేని ఓ బాలిక తన చుట్టూ ఉన్న దుర్మార్గపు సమాజపు కామకేళికి బలైంది. తిరుగుబాటు చేసి ప్రతిఘటించి తన అడ్రస్ కై అంతా తెలుసుకునే స్థాయిలో గర్జించింది.

అలిశెట్టి చెప్పినట్టు తాను శవమై.. ఒకరికి వశమై.. తనువు పుండై.. ఒకడికి పండై.. ఎప్పుడూ ఎడారై.. ఇంకెందరికో ఒయాసిస్సై.. మాటలకందని ఆ బాధల మంటల్లోంచి అగ్నికణమై ఎగిసిపడింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న మల్ల సామాజిక వర్గ నాయకురాలై పోరాడింది. వివక్షలో పరాకాష్టననుభవించిన ఆ తెగింపు నుంచి చట్టసభల్లో అడుగిడే వరకు నిమ్నకులాల నాయకురాలైన సక్సెస్ స్టోరీ పూలన్.

అణగారిన వర్గాల్లో అత్యాచారాలకు గురైన ఓ మహిళ బందిపోటుగా… ఆ తర్వాత పార్లమెంటేరియన్ గా రూపాంతరం చెందిన తీరు దేశంలో ఓ చరిత్ర. అందుకే పూలన్ దేవీ చరిత్రలో ఎలాంటి కోణాలున్నా… ఆయా కోణాలపై ఎవరి అభిప్రాయాలేవైనా.. అమె ఎప్పటికీ చర్చనీయాంశమైన ఓ సబ్జెక్టే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles