బజావో బ్యాండ్ బ్యాండ్ అంటూ బ్యాండ్ బాజా మోగించాడు!
ఆకాశంలో ఒక తార నా కోసమొచ్చింది ఈ వేళ అంటూ తెలుగునాట అడుగుపెట్టాడు. స్టేట్ రౌడీతో చుక్కల పల్లకిలో ఊరేగించాడు. బజావో బ్యాండ్ బ్యాండ్ అంటూ గ్యాంగ్ లీడర్ ఫ్యాన్స్ గుండెల్లో బ్రాస్ బ్యాండ్ మోగించాడు. రౌడీ అల్లుడిగా వచ్చి చిలుకా క్షేమమా అని పలకరించి.. కోరి కోరి కాలుతోంది కన్నె ఈడు ఎందుకో అంటూ సూతింగ్ గా రొమాన్స్ పండించాడు. ఈ పాటలన్నింటి వెనుక ఉన్న ఆ వెర్సటైల్ మ్యూజిక్ డైరెక్టరెవరో మళ్లీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కొందరు కళాకారులు ఎంత అలరించినా వారి ముద్రలేవీ లేకుండానే అలా వచ్చి ఇలా వెళ్లిపోతారు. కానీ, మరికొందరు మాత్రం వారి సంతకాన్ని బలంగా వదిలివెళ్లతారు. అలాంటివాడే బప్పీలహరి. సంగీతంతోనే కాకుండా… తను ఆరాధించే ఎల్విస్ ప్రెస్లీ తరహా రూపంతోనూ భిన్నంగా కనిపించి ఏ వేదికెక్కినా తానే ప్రధానాకర్షకుడయ్యాడు.

బంగారు గొలుసులు, వేళ్లకుంగరాలు, తన సైజుకంటే పెద్దగా కనిపించే సన్ గ్లాసెస్, తన శరీర ఛాయను మించి మెరిసే జాకెట్స్… అందుకే, తన పాటకే కాదు.. రూపానికీ ప్రత్యేక అభిమానగణాన్ని తయారుచేసుకున్నాడు బప్పీలహరి.
ఏ మాత్రం రిథమ్ ఉన్న వ్యక్తైనా తనంతట తానే డ్యాన్స్ ఫ్లోర్ పైకెక్కి కాళ్లు, చేతులూ కదపాల్సిందే. సంగీతంలో అదీ ఆయన సిగ్నేచర్. ఎంత ఫన్ గా, మిగిలినవారికి భిన్నంగా ఉంటాడో.. అలాగే, ఆయన బీట్ కూడా అంతే భిన్నంగా, అంతే ఫన్ గా సాగింది. కాబట్టే బప్పీలహరి గురించి ఇలా చెప్పుకుంటున్నాం.
బప్పీలహరికి సంగీతం హాబీ కాదు.. ఆయన చుట్టూ ప్రకృతంతా సంగీతమే. ఆయన తల్లిదండ్రులు అపరేష్, బాన్సూరి లహరి బెంగాలీలో శాస్త్రీయ సంగీత గాయకులు. ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ కూడా బప్పీకి బంధువు. లతా మంగేష్కర్ కుటుంబ స్నేహం కూడా బప్పీలహరి సంగీతం వైపు నడవడానికి మరో ప్రధాన కారణమైంది. ఆమె సూచనతో నాలుగో ఏటనే బప్పి… పండిట్ సమ్తా ప్రసాద్ వద్ద తబలా నేర్చుకున్నాడు. పదకొండేళ్లకే ఒక బెంగాలీ ధున్ కంపోజ్ చేస్తే… ఆ పాటను బప్పీలహరి తండ్రే రికార్డ్ చేశారు. 19 ఏళ్ల వయస్సులో బెంగాలీ సినిమాతో ఎంట్రీ.. 1973లో నన్హా షికారితో బాలీవుడ్ లోకి ఆరంగేట్రం… 1975లో జఖ్మీతో యావత్ హిందీ ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకోవడం.. ఇలా సాగింది బప్పీలహరి సినీ ప్రస్థానం.
ప్రారంభంలో చిన్న బడ్జెట్ సినిమాలకే సంగీతం అందించాడు. 1964లో బజార్ బంద్ కరో, మోహే కర్ దే బిద్దా, ఏక్ లడ్కీ బద్నాం సీ వంటి సినిమాల్లో ముకేశ్, కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడిన పాటలు బాలీవుడ్ లో కొందరిని ఆలోచింపజేశాయి. అలా నిర్మాత, దర్శకుడైన తాహిర్ హుస్సేన్ దృష్టిలో పడ్డాడు. ఆ టైంలో ఆర్డీ బర్మన్ బాగా బిజీగా ఉండటంతో.. ఆ అవకాశం కాస్తా బప్పీ తలుపు తట్టింది.
ఆ తర్వాత జఖ్మీ బప్పీలహరికి పెద్ద బ్రేక్ థ్రూ అయింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంతో పాటు, బెంగాలీ జానపద సంగీతాన్ని పునాది చేసుకుని.. ఆ రీతులకు పాశ్చాత్య వాయిద్యాలను వినియోగించాడు. రాక్ సంగీతాన్నీ అక్కడక్కడా వాడుతూ పాటకొక కొత్తదనాన్ని అద్దే యత్నం చేశాడు. ఇక ఛల్తే ఛల్తే సినిమా తర్వాత ఆయనిక వెనక్కి చూసుకోలేదు. అవకాశాలు వరదలా వెల్లువెత్తాయి.
1979లో లహూ కే దో రంగ్ ఆయన కెరీర్ లో మరో మైలురాయి. ఏసుదాసు పాడిన జిద్ నా కరో పాట ఇప్పటికీ ఎందరికో ఫేవరేట్ సాంగ్.
సంతూర్, షెహనాయ్, సితార్ వంటి సంప్రదాయ వాద్యాలకు… సింథసైజర్స్, ట్రంపెట్స్ వంటి వెస్టర్న్ వాద్యాలను మిళితం చేశాడు. జానపద, శాస్త్రీయ, భజన్, కవ్వాలీ, వెస్టర్న్ క్లాసికల్, సెకెడెలిక్ రాక్ వరకూ ప్రయోగాలు చేశాడు. అలాంటి ప్రయోగాలతో జనాన్ని ఉర్రూతలూగించి డిస్కో డ్యాన్సులు వేయించాడు.

మలుపు తిప్పిన డిస్కో డ్యాన్సర్!
1970ల చివర్లో అమెరికా వెళ్లినప్పుడు బప్పీలహరిపై అక్కడి డిస్కో మ్యూజిక్ ప్రభావం పడింది. ఆ ఎలక్ట్రిక్, హవాయ్ గిటార్స్ మెరుపులకు తోడైన బీట్స్ తనని ఆకర్షించాయి. తను తిరిగి రాగానే.. 1979లో సురక్షా అనే సినిమాలో మౌసమ్ హై గానే కా రూపంలో ఆయన మొదటి డిస్కో పాట స్వరపర్చాడు.
1982లో వచ్చిన డిస్కో డ్యాన్సర్ ఆయన కెరీర్ నే మలుపు తిప్పింది. ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ కల్గిన ఆల్బమ్స్ లో డిస్కో డ్యాన్సర్ కు స్థానముంటుంది. డిస్కో డ్యాన్సర్ సినిమా 1984లో సోవియట్ యూనియన్‌లో విడుదలై.. భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత రష్యా, ఉక్రెయిన్‌లలో ఆ పాటలు ఎన్నో రీమిక్స్‌లుగా మారాయి. రియాలిటీ షోలలోనూ ప్రదర్శితమయ్యాయి. కొందరు ఆయన శాస్త్రీయ సంగీతానికి దూరమై, పూర్తిగా ప్రాశ్చాత్యం వైపు అడుగులేస్తున్నాడని విమర్శించినా.. భవిష్యత్ తరాల ఆలోచనలను ప్రతిబింబించే ముందుచూపుతో బప్పీ నూతనత్వానికే ఓటు వేశాడు. తమ్మా తమ్మా లోగే, రాత్ బాకీ, యాద్ ఆ రహా హై వంటి ఎన్నో పాటలు రెట్రో రివైవల్స్ లో వినిపిస్తూనే ఉంటాయి.
భారతదేశానికి డిస్కోను బలంగా పరిచయం చేసినవాడు. బీట్ తో ఉర్రూతలూగించినవాడు. 70 ల నుంచి 80ల మధ్య ఆయన డిస్కో పాటలతో తెచ్చిన మార్పు… బాలీవుడ్ సంగీతాన్నే అమాంతం మార్చేసింది. ఆయన శబ్దాలకు ఆర్డీ బర్మన్ అంతటివాడు కూడా కొంతకాలం నిశ్శబ్దమైపోయాడు. సింథసైజర్స్, డ్రమ్స్ తో కొత్త బీట్ క్రియేట్ చేసి బ్యాండ్ బజాయించాడు. డిస్కోను ఇంటింటికీ చేర్చి బాలీవుడ్ ముద్రను దేశమంతా విస్తరించాడు.
డిస్కో డ్యాన్సర్, షరాబీ, డ్యాన్స్ డ్యాన్స్ వంటి సినిమాలతో ఆయన సృష్టించిన సంచలనం యావత్ సినీ సంగీత ప్రపంచం దృష్టినీ ఆయనవైపు మళ్లించింది. బాలీవుడ్ తో పాటు, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడ ఇలా పలు భాషల్లో.. పలు జాన్రాల్లో పాట వినగానే ఇది బప్పీదా మార్క్ అనేలా గుర్తింపు సాధించాడు.
1986లో ఏకంగా 33 సినిమాలకు 180 పాటలను స్వరపర్చి గిన్నీస్ వరల్డ్ రికార్డుకెక్కాడు. అలీషా చినాయ్, ఉషా ఉత్తుప్ వంటి గాయకులకు బ్రేక్ ఇచ్చాడు. అప్పుడప్పుడూ ఒంటినిండా బంగారు గొలుసులతో తానూ తెరపై మెరిసేవాడు. భారతీయ సంగీత దర్శకుల్లో గ్రామీ జ్యూరీలో తొలి వ్యక్తిగా ఎంపికైనవాడు.
బప్పీదాది సంగీతం కాదు.. అదో ఉత్తుంగ తరంగం. ఏ పెళ్లికెళ్లినా బారాత్ లో కనీసం ఒక్క పాటైనా బప్పీదాది లేకుండా ఉండదు. ఏ క్లబ్బుకెళ్లినా, రెట్రో నైట్స్ లోనైనా ప్లేలిస్టులో బప్పీ పాటలు బోలెడన్ని. ఆయన సృష్టించిన బీట్ ఎంత ఫేమస్ అంటే.. అతడు సినిమాలో థమన్ చేసిన పువ్వాయి పువ్వాయ అంటాడు ఆటో అప్పారావు పాట వినండి.. అందులో వెనుక వచ్చే డిస్కో మ్యూజిక్, ట్రంపెట్స్ మ్యాజిక్కు కు బప్పీదానే స్ఫూర్తి.
అలోకేష్ కాస్తా సినీ సంగీత రంగానికి బప్పీలహరిగా పరిచయమయ్యాడు. బాపి అని మొదట ఆయన అత్త మీరా లాహిరి ఆయన్ని పిల్చేది. నటి కాజోల్ తండ్రి శోము ముఖర్జీ సూచనతో అది కాస్తా బప్పీగా మారిపోయింది. అలా భారతీయ సినీ సంగీతంలో తనకంటూ ఓ పేజీ సృష్టించుకున్న బప్పీలహరి అయ్యాడు.
నవంబర్ 27, బప్పీలహరి పుట్టినరోజు. అందుకే ఓసారి ఆయన యాదిలో.. యాద్ ఆ రహా హై అని పాడుకుంటూ ఈ నివాళి.



