జన గణ మన అధినాయక జయహేలో పంజాబ్, సింధ్, గుజరాత, మరాఠా అంటూ రవీంద్రుడు రాసినట్టుగా… పంజాబ్, బెంగాల్ తరహాలో సింధ్ విభజన ఎందుకు జరగలేదు..? రవీంద్రుడి జాతీయగీతంలో అంత ప్రాధాన్యత దక్కించుకున్న సింధ్ ప్రాంతం భౌగోళికంగా భారత్ కు ఎందుకు దక్కలేదు…? పాకిస్థాన్ కే ఎందుకు పరిమితమైపోయింది..? ఇండో- పాక్ జియోపాలిటిక్స్ లో ఇదో ఆసక్తికరమైన అంశం. పుల్వామా దాడి తర్వాత భారతీయ వ్యాపారులు పాకిస్థాన్ కు టమాటాలు ఎగుమతి చేయడానికి నిరాకరించారు. ఓ పాక్ ప్రేమికుడైతే ఏకంగా మన జాతీయ గీతం నుంచి సింధ్ తొలగించాలనే డిమాండ్ నూ తెరపైకి తెచ్చాడు. ఏంటా సింధ్ కథ..? కాస్త తెలుసుకునే యత్నం చేద్దాం.

అఖండ భారతావనిగా ఉన్నప్పుడు కలిసి ఉన్న సింధ్ లేదా సింధు ప్రాంతమంతా ఓ చారిత్రక నేపథ్యమున్న ప్రావిన్స్. అందుకే రవీంద్రుడి జన గణ మన వంటి జాతీయగీతంలో సింధ్ ప్రస్తావన చేశారు. అలా ఆయన జాతీయగీతంలో సింధ్ ప్రాంతాన్ని పేర్కొనడం.. భారతాభిముఖ గుర్తింపుకు సంకేతంగా కూడా చెబుతుంటారు. 2011లో కేంద్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు సమర్పించిన అఫడవిట్ లో సింధ్ లేదా సింధు అనే రెండు పదాలు ఒకటేనని తెలిపింది. అవి సింధు నదికి చెందినవి.. లేదా సింధీ సమాజానికి చెందినవైనా కావచ్చనీ పేర్కొంది. కానీ, ఆ సింధ్ మాత్రం ఇప్పుడు భారత్ లో లేకుండా పోయింది.
కొద్దిరోజుల క్రితం రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా సింధ్ విషయంలో తన మనసులో మాట బయటపెట్టాడు. సింధ్-సరస్వతీ లేదా హరప్పా నాగరికతకు పుట్టినిల్లువంటిందన్నారు. మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ అన్నట్టుగా సింధ్ ప్రస్తుతం రాజకీయ కారణాలతో భౌగోళికంగా భారత్ లో లేకపోయినా.. నాగరికత పరంగా అదెప్పటికీ భారతదేశంలోని భాగమేనంటూ చెప్పుకొచ్చారు. భౌగోళిక ప్రాంతాల విషయానికొస్తే సరిహద్దులు మారొచ్చు.. రేపు సింధ్ ప్రాంతం తిరిగి భారత్ లో కలువచ్చునేమోనన్న ఒకింత ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎందుకు మరి సింధ్.. బెంగాల్, పంజాబ్ మాదిరిగా విభజనకు నోచుకోలేదు..?
పంజాబ్, బెంగాల్ విభజన చరిత్రలు చాలామందికి తెలిసినవే. ఈశాన్య భారత విభజనపై కూడా ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. అయితే, వీటన్నింటికీ సింధ్ విభజన కథ మాత్రం కాస్తా భిన్నం. భారత్ లో ముస్లిం, క్రైస్తవ, సిక్, జైన్ వంటి మైనార్టీ కమ్యూనిటీల్లా.. సింధ్ ప్రాంతంలో మైనార్టీగా మారిన సింధీ సమాజం అక్కడి నుంచి తమ ఊళ్లను వదిలి వెళ్లిరావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. థార్ ఎడారి దాటి వారంతా భారత్ వైపు వలసలుగా వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాల్లో సెటిలయ్యారు. ఇండియా పేరు ఇండస్ నుంచి.. హిందు అనే పేరు సింధు నుంచి వచ్చిందనే చెప్పుకుంటారు. అయితే, మరి సింధు ఎందుకు బెంగాల్, పంజాబ్ తరహాలో విభజించబడలేదు… భారతదేశానికి సింధ్ లో ఒక భాగం ఎందుకు రాలేదు…? మొత్తంగా సింధ్ ప్రావిన్స్ భౌగోళికంగా పాకిస్థాన్ కే ఎందుకు పరిమితమైపోయింది..?
ప్రాచీన నాగరికత నుంచి ఇస్లాం ప్రవేశం వరకు వైవిధ్యాన్ని చూసిన ప్రాంతం సింధ్!
ఒకనాడు మొహంజోదారో వంటి ప్రాచీన నగరాలకు, నాగరికతకు కేరాఫ్ అయిన సింధ్.. అలెగ్జాండర్ వంటి గ్రీకుల రాకను… 8వ శతాబ్దంలో అరబ్ ఆక్రమణలతో ఇస్లాం వ్యాప్తినీ చూసింది. ఆ తర్వాత మొఘలుల పాలనలో ఒక కీలకమైన ప్రావిన్స్ గా మారింది. ఇక బ్రిటీష్ పాలనలో బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది.
కానీ, 1936, ఏప్రిల్ 1వ తేదీన అది బాంబే ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి, ప్రత్యేక ప్రావిన్స్ గా ఏర్పాటైంది. దానికి సొంత శాసనసభ కూడా ఏర్పాటు చేశారు. దాంతో 1940వ దశకం నాటికి సింధ్ ఒక ప్రత్యేక రాజకీయ గుర్తింపును సంపాదించుకుంది.
1930ల నాటికే సామాజిక, మతపరమైన రాజకీయ కల్లోలం పెరుగుతూ వచ్చింది. దాంతో పాటే సింధ్ లో సూఫీ ప్రభావం కనిపించేదంటారు. దాన్ని స్థూలంగా సాచల్ సర్మస్త్ సూఫీ భావజాలమంటారు. అంటే, నేను హిందువు కాదు, ముస్లిం కాదు అనే భావనే దానర్థం.
ముస్లిం లీగ్ రాజకీయాలతో పాక్ వశమైన సింధ్!
సింధ్ లో కాంగ్రెస్ ముస్లింలను ఆకర్షించలేకపోయింది. సింధ్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఖోసో కోసం ప్రత్యేకంగా ఓ నీళ్ల పాత్రను ఏర్పాటు చేయడంతో.. కాంగ్రెస్ హిందు పార్టీగా ముద్రపడిపోయింది. అలాగే, 1940ల నాటికి మెల్లిగా సింధ్ లో ముస్లిం మెజార్టీ పెరుగుతూ వచ్చింది. త్రీ ఈజ్ టూ వన్ రేషియోగా ముస్లిం జనాభా డామినేషన్ పెరిగిపోయింది. దాంతో ముస్లిం లీగ్ సింధ్ ను సహజంగానే పాక్ లో భాగంగా చేసుకుంది. స్థానిక రాజకీయాల్లోనూ మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆ కల్లోల సమయంలో జరిగిన పరిణామాలను తనకనుకూలంగా మల్చుకుని ఎన్నికలను కూడా ప్రభావితం చేసి సింధ్ ప్రావిన్స్ ను పాక్ తనవైపుకు తిప్పుకుంది.
పంజాబ్, బెంగాల్ తరహాలో సరిహద్దు రేఖలు సింధ్ లో ఎందుకు లేవు..?
బెంగాల్, పంజాబ్ ప్రాంతాల్లో హిందు- ముస్లింలు పెద్ద సంఖ్యలో కలిసి జీవించేవారు. అక్కడ విభజన పరిస్థితుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో మతపరమైన జనాభా ఆధారంగా సరిహద్దులను స్పష్టంగా ఏర్పాటు చేశారు. కానీ, సింధ్ లో ముస్లింలదే స్పష్టమైన మెజార్టీ. హిందువులున్నా నగరాలకే పరిమితమైన సంఖ్య. రాజకీయంగా కూడా బలహీనులు. అదే సమయంలో ముస్లిం లీగ్ బాగా బలపడ్డది. అప్పటి ప్రధాన రాజకీయ శక్తైన కాంగ్రెస్ కూడా ఏమీ చేయలేని స్థితి. బాంబే ప్రెసిడెన్సీ నుంచి వేరుపడ్డాక సింధ్ పూర్తిగా ముస్లిం లీగ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అంతెందుకు నాటి బ్రిటీష్ రూలింగ్ సమయంలో పాకిస్థాన్ డిమాండ్ చేసినట్టు మొట్టమొదటి అసెంబ్లీ స్థానంగా కూడా సింధ్ నే ఆమోదించారు.
ఇక 1947 నాటికి సింధ్ పూర్తిగా ముస్లిం ఆధిపత్యం పెరిగిపోయింది. భౌగోళికంగా సింధ్ పాకిస్థాన్ దే అన్న స్పష్టత వచ్చేసింది. అదే సమయంలో అక్కడి హిందూ, జైన సమాజాలపై దాడులు, హింస పెరిగిపోయింది. దాంతో అక్కడివారు చాలామంది భారత్ లోని వివిధ ప్రాంతాలకు వలసల బాట పట్టారు. అలా భారతదేశంతో నాగరిక సంబంధమున్నా.. 1947 నాటికి భారత ఉపఖండం విడిపోయినప్పుడు.. రాజకీయ కారణాలతో, మతపరమైన ఆధిక్యంతో, భౌగోళికంగా సింధ్ పాక్ లో అంతర్భాగమైపోయింది.
1917లో రవీంద్రుడి జాతీయగీతం జన గణ మనలో ఓ నాగరికతా చిహ్నంగా చెప్పుకున్న సింధ్.. ఆ తర్వాత భౌగోళికంగా మాత్రం భారత్ కు దక్కని ఓ చేదైన స్మారక అనుభవంగా మిగిలిపోయింది.



