బాలీవుడ్ బాతాఖానీ బాగా చెప్పే పేర్లలో హుస్సేన్ జైదీ ఒకరు. అండర్ వరల్డ్ మాఫియాపైనే మస్త్ బుక్స్ రాసిన రచయిత. గతంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఆయన మరో ముచ్చటను వెలుగులోకి తెచ్చాడు. అదేంటంటే రిషీకపూర్, దిలీప్ కుమార్ వంటివారు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ను కలిసిన విషయాన్ని అప్పట్లో బహిరంగగానే చెప్పేవారంటూ వారు పంచుకున్న కొన్ని సంగతులను హుస్సేన్ జైదీ మరోసారి వెలుగులోకి తెచ్చారు.
90ల్లో బాలీవుడ్ చిత్రపరిశ్రమ అంటేనే అండర్ వరల్డ్ మాఫియా చేతుల్లో బందీ అనేది బాగా ప్రచారంలోకొచ్చిన మాట. బడా నిర్మాతలు, హీరోలు, దర్శకులు, ఫైనాన్షియర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇలా సినిమా మొదలై మార్కెట్ లోకి వెళ్లేవరకు ఎవరెవరైతే కీలకమో వారంతా దావూద్ అండ్ కంపెనీ కనుసన్నల్లోనే ఉండేవారన్నది విన్నదే. దావూద్ తో సంబంధాన్ని కల్గి ఉండటం ఆ తర్వాత నేరంగా మారిండొచ్చునేమోగానీ.. అంతకుమునుపు మాత్రం బాలీవుడ్ సినీరంగమంతా ఓ స్టేటస్ గా చెప్పుకునేవారంటాడు హుస్సేన్ జైదీ.

బాలీవుడ్ అంటే 90ల్లో తరచూ దుబాయ్ పర్యటనలు, అక్కడ వారికి అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసే బస.. ఇవన్నింటి వెనుకా దావూద్ కీలకపాత్రధారి. అయితే, బాలీవుడ్ లో పెట్టుబడులు పెట్టి దావూద్ డబ్బు సంపాదించుకోవాలనుకోలేదంటాడు హుస్సేన్ జైదీ. బాలీవుడ్ సినిమాలన్నా, తారలన్నా దావూద్ కు క్రేజ్ ఉండేది. హీరోయిన్లతో తిరగడమంటే పిచ్చి ఉండేది. దుపాయ్ ప్రయాణించే క్రమంలో వారికిచ్చే విందులు రోజుల తరబడి చెప్పుకునే స్థాయిలో ఏర్పాటు చేసేవాడట. అందుకే దిలీప్ కుమారైనా, రిషీ కపూరైనా, ఓ అమ్జాద్ ఖానైనా దావూద్ గురించి బాహటంగా చెప్పుకోవడానికే గర్వంగా ఫీలైన రోజులవి అంటాడు హుస్సేన్. అలాగే, సినీ తారలకు భారీ బహుమతులివ్వడమూ దావూద్ తో బాలీవుడ్ బంధాన్ని మరింత కొనసాగించింది. ఈ విషయాలన్నీ పింక్ విల్లాతో షేర్ చేసుకున్నాడు హుస్సేన్ జైదీ. ఆ లింక్ ఇక్కడ చూడొచ్చు.
తానోసారి దావూద్ ను ఇంటర్వ్యూ చేశానని.. అప్పుడు, బాలీవుడ్ ను ఎందుకు భయపెడుతున్నావని ప్రశ్నించానంటాడు. దానికి సమాధానంగా.. తాను బాలీవుడ్ ను భయపెట్టాలని ఏనాడూ చూడలేదని.. కేవలం, వారితో తిరగాలని ఆశపడ్డట్టు దావూద్ చెప్పాడంటాడు హుస్సేన్. కానీ, అండర్ వరల్డ్ మాఫియాలో దావూద్ తర్వాత వచ్చినవారు మాత్రం ఆయనకు భిన్నంగా వ్యవహరించారు. బాలీవుడ్ ప్రముఖులకు దావూద్ బహుమతులిచ్చి వారిని పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లి, విందులిస్తే.. అదే బాలీవుడ్ నుంచి అబూ సలేం డబ్బులు వసూల్ చేసేవాడంటాడు హుస్సేన్.
దాదాపు బాలీవుడ్ అంతా కూడా దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు కోరుకుందంటాడు హుస్సేన్ జైదీ. తాను చాలామందితో మాట్లాడినప్పుడు వారు భాయ్ తో మాట్లాడామనే విషయాన్ని గర్వంగా చెప్పేవారంటాడు. అలాంటివార్ల పేర్లు తాను బయటపెట్టనుగానీ.. ఆ సమయంలో పోలీసులకు ఇంకా అండర్ వరల్డ్ మాఫియాపై పట్టులేదని.. అందుకే, బాలీవుడ్ ప్రముఖులెవ్వరికీ కూడా ఆ సమయంలో దావూద్ తో టచ్ లో ఉండటం తప్పనిపించలేదన్నది హుస్సేన్ జైదీ చెప్పిన మాట.

అయితే, ముంబైలో అండర్ వరల్డ్ మాఫియాపై పోలీసులు ఫోకస్ పెంచాక.. ఆ పరిస్థితుల్లో క్రమంగా మార్పు వచ్చేసింది. పరిశ్రమ ప్రముఖులంతా ఏ దావూద్ నైతే ఇష్టపడ్డారో,. ఆయనతో మాట్లడ్డాన్ని గర్వంగా ఫీలయ్యారో.. వారే క్రమంగా దూరమవుతూ బంధాలను తెంచుకున్నారు. కనీసం, ఆయనతో ఫోన్ సంభాషణలనూ పూర్తిగా బంద్ చేసుకున్నారు.
దావూద్ బాలీవుడ్ తో బంధాన్ని కొనసాగించే విషయంలో ఆయనకు హిందీ చిత్రరంగం పట్ల ఉన్న క్రేజ్ ఒక కారణమైతే.. అంతకుమించిన కారణం మరోటి అంతర్లీనంగా దాగుందంటాడు హుస్సేన్ జైదీ. తన నల్ల ధనాన్ని వైట్ మనీగా మార్చేందుకు బాలీవుడ్ ను బాగా ఉపయోగించుకున్నాడు దావూద్ ఇబ్రహీం. ఆయన నేరుగా సినిమాలకు పెట్టుబడులు పెట్టేవాడు కాదు.. కానీ, అప్పిచ్చేవాడు. ఆ అప్పు రూపంలో డబ్బు తీసుకున్న నిర్మాతలు సినిమాల్లో పెట్టుబడులు పెట్టేవారు. ఆ క్రమంలో దావూద్ బ్లాక్ మనీ కాస్తా వైట్ గా మారిపోయేది. అలా ఆ వైట్ మనీని అప్పిచ్చినవారినుంచి తిరిగి తీసుకునేవాడు దావూద్ ఇబ్రహీం.
ఇండియన్ ఎక్స్ ప్రెస్, ది ఏసియన్ ఏజ్ వంటి పత్రికల్లో పనిచేసిన హుస్సేన్ జైదీ బాలీవుడ్ పై పలు బుక్స్ రాశాడు. డోంగ్రీ టూ దుబాయ్, సిక్స్ డికేడ్స్ ఆఫ్ ది ముంబై మాఫియా, మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై, బ్లాక్ ఫ్రైడే, ముంబై అవేంజర్స్, మై నేమ్ ఈజ్ అబూ సలేం వంటి ఎన్నో బుక్స్ ఆయన రాసినవుండగా.. బాలీవుడ్ విషయాలను అప్పుడప్పుడూ ఇలా పంచుకుంటూ గత చరిత్ర తాలూకు స్మృతులను హుస్సేన్ చెబుతుంటారు.



