ఐఎస్ఎస్ నుంచి 287 రోజుల తర్వాత భూమ్మీదకు: సునీతా రికార్డుతో పాటు, ఆమె అదనపు వేతనంపైనా చర్చ!

అంతరిక్షం అనే అంతుచిక్కని ప్రదేశంపై అదేస్థాయి పరిశోధనలొకవైపు కొనసాగుతుంటే.. అలాంటి పరిశోధనల్లో అక్కడకెళ్లి చిక్కుకుపోయిన వ్యోమగాములు, శాస్త్రవేత్తలపై ఇంకెంత చర్చ జరగాలి..? అలాంటి ఉత్కంఠ కల్గించే చర్చే మనం సుమారు 9 నెలల కాలం నుంచి వింటున్నాం, చేస్తున్నాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సుమారు 9 నెలల పాటు చిక్కుకున్న నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ గా చెప్పుకునే నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మళ్లీ తిరిగి భూమ్మీదకు వస్తుండటంతో ఆ చర్చ ఇప్పుడు మరింత ఊపందుకుంది.

బోయింగ్ స్టార్ లైనర్ అనే అంతరిక్ష నౌక సాంకేతిక సమస్యలతో దెబ్బతినడంతో.. తిరిగి ఆ నౌకలో వారిని భూమ్మీదకు తీసుకురావడం కుదరని పనిగా తేల్చిన్నాట్నుంచీ… సునీతా, బుచ్ విల్మోర్ ఇద్దరూ గత ఏడాది జూన్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే గడుపుతున్నారు.

అయితే, ఇప్పుడు సునీతా విలియమ్స్ ఈనెల మార్చ్ 19వ తేదీన తిరిగి భూమ్మీదకు చేరుకునే అవకాశమున్నట్టుగా ఓ అంచనా. ఎందుకంటే, ఐఎస్ఎస్ తో స్పేస్ ఎక్స్ వ్యోమ నౌక అనుసంధానం కావడంతో… సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ను ఇక తీసుకురావడమే తరువాయి అనే ఆసక్తి నెలకొంది.

నల్గురు వ్యోమగాములతో ఐఎస్ఎస్ లోకి వెళ్లింది స్పేస్ x క్రూ డ్రాగన్ క్యాప్సూల్-10. ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో నిన్నటి ఆదివారం రోజున భారత్ కాలమాన ప్రకారం 9 గంటల 37 నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో ఈ క్యాప్సూల్ అనుసంధానమైనట్టు నాసా ప్రకటించింది. దాంతో ఐఎస్ఎస్ లో ఉన్న ఏడుగురు సిబ్బంది.. క్యాప్సూల్ లో ఐఎస్ఎస్ కు వస్తున్న నల్గురికి స్వాగతం పలికారు. అయితే, ఆ స్వాగతం పలికినవారిలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కూడా ఉండటంతో… ఇక తిరిగి 9 నెలలనంతరం భూమ్మీదకు చేరుకోవడమే తరువాయి అన్నట్టుగా వారిద్దరి రాకపై ఇంతకాలం జరిగిన చర్చ మరింత ఉత్కంఠను లేవనెత్తింది.

అంతా సవ్యంగా జరిగితే సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ తో పాటు.. అమెరికా వ్యోమగామి నికే హేగ్, రష్యాకు చెందిన వ్యోమగామి అలెగ్జాండర్ గోర్చునోప్ కూడా మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బయల్దేరితే.. బుధవారం అర్ధరాత్రి దాటాక.. గురువారం మబ్బున భూమ్మీద సురక్షితంగా కాలుపెట్టడం ఖాయం.

అయితే, నాసా శాస్త్రవేత్తగా సునీతా విలియమ్స్ ఓవర్ టైం అంతరిక్షంలో గడిపినందుకు ఆమె ఎక్కువ జీతం పొందుతారా అనే మరో ఆసక్తకరమైన చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది. ఎందుకంటే అతి ఎక్కువ కాలం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలల పాటు గడిపారు సునీతా, బుచ్మోర్ ఇద్దరూను. కాబట్టి వీరికి నాసా నుంచి భారీ పారితోషికం లభించవచ్చనేది ఇప్పుడు వినిపిస్తున్న వాదన.

కానీ, నాసా నిబంధనల ప్రకారం వ్యోమగాములు తమకు వచ్చే రెగ్యులర్ జీతాన్నే పొందుతారు తప్ప.. ఓవర్ టైం పేమెంటేమీ ఉండదనేది మరో వాదన. రవాణా, బస, ఆహారం ఇలాంటివాటికెలాగూ భత్యాన్నిస్తున్నందున.. అలాగే, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏవైనా జరిగినప్పుడు వాటికీ అదనంగా పేమెంట్ చేస్తున్నందున.. ఇక ఎక్కువకాలం గడిపినందుకు ఓవర్ టైం పేమెంట్ ఉండకపోవచ్చనీ నాసాలో పనిచేసిన మాజీ వ్యోమగామి కేడీ కోల్ మన్ అనే మరో మహిళా శాస్త్రవేత్త చెబుతున్నారు.

2010-11లో 159 రోజుల పాటు కోల్ మన్ రోజుకు 4 డాలర్ల చొప్పున 636 డాలర్ల అదనపు వేతనాన్ని అందుకున్నారు. అంటే 55 వేల రూపాయల పైచిలుకన్నమాట. ఈ లెక్కన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరూ కూడా 287 రోజుల పాటు ఐఎస్ఎస్ లో గడిపినందుకు 1 వేయి 148 డాలర్లు అంటే సుమారు లక్ష రూపాయల వరకూ అదనంగా వేతనంగా పొందే అవకాశమున్నట్టు కోల్ మన్ చెప్పే మాట.

అసలు సునీతా విలియమ్స్ జీతమెంత..?

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరూ కూడా యూఎస్ జనరల్ పే షెడ్యూల్ లో అత్యున్నత ర్యాంక్ GS-15 కిందకొస్తారు. జనరల్ షెడ్యూల్ వెబ్ సైట్ సమాచారం ప్రకారం వీరిద్దరూ ఇండియన్ కరెన్సీ ప్రకారం 1 కోటి 8 లక్షల నుంచి 1 కోటి 41 లక్షల వరకూ మూల వేతనం పొందుతున్నారట. ఈ జనరల్ షెడ్యూల్ ను 15 కేటగిరీలుగా విభజిస్తారు. GS-1 అంటే అత్యల్ప స్థాయి నుంచి.. GS-15 అంటే అత్యధిక స్థాయి అన్నమాట. ఐఎస్ఎస్ లో తొమ్మిది నెలల పాటు గడిపిన సమయంలో సునీతా విలియమ్స్, బుత్ విల్మోర్ జీతాలు ప్రోరేటెడ్ సాలరీస్ అంటే వారు పనిచేసిన దినాలు, గంటలను బట్టి సుమారు 81 లక్షల నుంచి 1 కోటి 5 లక్షల వరకూ ఉండొచ్చు.

కోల్ మన్ చెప్పిన రోజుకు 4 డాలర్ల లెక్క ప్రకారం సునీతా, విల్మోర్ పనిదినాలైన 287 రోజులకు రోజుకు 4 డాలర్ల చొప్పున లెక్కగడితే వారికందేది సుమారు లక్ష మాత్రమే అదనం. దీంతో వారి మొత్తం వేతనం 82 లక్షల నుంచి ఒక కోటి 6 లక్షల వరకూ ఉండొచ్చని ఓ అంచనా.

ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో రోజుకు నాల్గు డాలర్ల అదనపు పరిహారమనేది కాస్త మారే అవకాశాలూ లేకపోలేదు.

అయితే, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇన్నిరోజుల తర్వాత తిరిగి భూమ్మీద కాలు పెట్టడమే పెద్ద విశేషం. కాబట్టి, ఈ లెక్కలన్నీ సరాదాగా వారి వ్యోమగామి ఉద్యోగ జీవితాల్లో ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకునేందుకే తప్ప… వారు రావడమే ఇప్పుడు నాసాకే కాదు అంతరిక్షంపై పరిశోధనలు చేస్తున్న ప్రతీదేశానికీ క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్న ఓ పెద్ద వేడుక.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles