కెనడా దర్యాప్తు సంస్థలను మూడు చెర్ల నీళ్లు తాగించాడు! గారెత్ వెస్ట్.. ఎవరా గ్రాండ్ పేరెంట్స్ స్కామ్ క్రిమినల్..?

నేరాలు వాటి రకాలు పరిశీలిస్తే… ఏక్ సే ఏక్ అబ్బురపర్చే స్కామ్స్ కళ్ల ముందు కదలాడతాయి. అలాంటి ఓ స్కామ్ గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. 46 రాష్ట్రాల్లోని వృద్ధుల నుంచి డబ్బులు కొల్లగొట్టి ఉత్తరమెరికా పోలీసులను మూడు చెర్ల నీళ్లు తాగించిన ఓ కెనడియన్ స్కామ్ కింగ్ కథ ఇది.

క్రాస్ బార్డర్ ఎల్డర్ మోసంగా ప్రచారంలోకొచ్చిన ఈ కథలో.. హీరో, విలన్ రెండూ గారెత్ వెస్ట్. గారెత్ వెస్ట్ ను శుక్రవారం జూలై 4న రాయల్ కెనడియన్ మౌంటెండ్ పోలీసులు క్యూబెక్ లో అరెస్ట్ చేశారు. గారెత్ వెస్ట్ చేసిన ఈ క్రాస్ బార్డర్ ఎల్డర్ మోసం అమెరికా చరిత్రలోనే ఈ తరహాలో ఓ అతి పెద్ద మోసంగా చెబుతున్నారు.

గారెత్ వెస్ట్ స్కామ్ స్కీమ్ చూస్తే ఓ క్రైమ్ సినిమాకు సరిపడా సబ్జెక్ట్ కనిపిస్తుంది. తన పథకాలు కూడా ఓ సినిమాకు స్క్రీన్ ప్లే రాసిన చందంగా పక్కాగా అమలు చేస్తూ వచ్చాడు.

మానసికంగా, శారీరకంగా బలహీనంగా ఉన్న వృద్ధులే గారెత్ వెస్ట్ స్కామ్ లో తన ప్రధానమైన సబ్జెక్ట్. అలా 46 రాష్ట్రాల్లోనూ వృద్ధులను టార్గెట్ చేసుకుని వారినుంచి అత్యవసరంగా డబ్బు అవసరముందనే సాకులతో లొంగదీసుకుని ఈ కుంభకోణాన్ని నడిపించి ఏకంగా మిలియన్ డాలర్స్ కొల్లగొట్టాడు గారెత్ వెస్ట్.

అసలు ఏంటీ ఈ స్కామ్ అంటారా..?

మొదట ఒంటరిగా ఉండే వృద్ధులను గుర్తించడం. వారి కుటుంబాలను, వారు ఎక్కడ ఉంటున్నదీ గుర్తించడం. ఆ తర్వాత వారి కుటుంబీకుల్లోని మనవలు, మనవరాళ్లు అనుకోకుండా అరెస్ట్ అయ్యారని.. లేదా, యాక్సిడెంట్స్ లో గాయాలపాలైనారని వారికి వెంటనే వైద్యసాయం, బెయిల్ మంజూరు వంటివి కావాలంటే డబ్బులు కావాలంటూ ఫేక్ కాల్స్ ద్వారా ఈ స్కామ్ కు తెరలేపాడు గారెత్ వెస్ట్. ముఖ్యంగా ఏవో కేసుల్లో జైలు పాలైనట్టు.. వారికి బెయిల్ ఇప్పించాలని చెబుతూనే.. విషయం బయటకు పొక్కితే మరోవైపు వాళ్ల మానానికే ప్రమాదమని ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ తో ఒంటరిగా ఉండే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని కొరియర్స్ తో లేదా, డిజిటల్ లావాదేవీలతో డబ్బులు గుంజడం గారెత్ వెస్ట్ స్కామ్ ప్లాన్ లో భాగం.

యూఎస్ దర్యాప్తు సంస్థలు 2024లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. వెస్ట్ మాంట్రియల్ కాల్ సెంటర్స్ నుంచి గారెత్ వెస్ట్ పనిచేశాడు. డజన్ల కొద్ది ఏజెంట్స్ ను నియమించుకున్నాడు. వీలైనంత ఎక్కువ మంది ఫోన్ నంబర్స్ సేకరించాడు. అలా ఫేక్ కాల్స్ తో మిలియన్ డాలర్లు కొల్లగొట్టాడు. గత ఏడాది వర్జీనీయాలో దర్యాప్తు సంస్థలకు ఈ మోసపూరిత కాల్స్ బెడద మరింత పెరిగినట్టు పక్కా సమాచారమందింది.

గారెత్ వెస్ట్ ది లగ్జరీ జీవనశైలి!

గారెత్ వెస్ట్ తనను తాను ఓ విజయవంతమైన మాంట్రియల్ రియల్ ఎస్టేట్ డెవలపర్ గా పరిచయం చేసుకునేవాడు. ఇక తన స్కామ్ నుంచి వచ్చే మిలియన్ డాలర్ల డబ్బుతో విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడ్డాడు. హై ఎండ్ బంగ్లాలు, లగ్జరీ కార్లతో గారెత్ వెస్ట్ తన స్కామ్స్ ను తన హ్యాపీ లైఫ్ స్కీమ్స్ కు ఉపయోగించుకున్నాడు.

కెనడియన్ బ్రాడ్ క్యాస్ట్ పేర్కొన్న ప్రకారం మార్చ్ లో ఒంటారియోలోని బర్లింగ్టన్ లో ఓ ఇంటిని పోలీసులు తనిఖీలు చేశారు. అక్కడ వెస్ట్ ఉన్నాడన్న పక్కా సమాచారంతో ఆ ఇంటిపై దాడులు చేశారు. సమీపంలోనే వెస్ట్ ఉన్నాడు కానీ.. పోలీసులకు మాత్రం చిక్కకుండా పారిపోయాడు.

యూఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్, ప్రావిన్షియల్ పోలీసులతో కలిసి పనిచేసిన రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు గతంలో ఇలాంటి సెక్యూరిటీ స్కామ్స్ తో సంబంధమున్న 23 మందిని అరెస్ట్ చేశారు. కానీ, వెస్ట్ తో పాటు, మరో అనుమానితుడైన జిమ్మీ లిమాకి మాత్రం పోలీసులకు చిక్కలేదు.

46 రాష్ట్రాల్లో వృద్ధ బాధితులను టార్గెట్ గా చేసుకుని ఏకంగా 30 మిలియన్ డాలర్స్ అంటే 200 కోట్ల 40 లక్షల రూపాయలకు పైగా ఓ పెద్ద కుంభకోణానికి తెగబడి తడిబట్టతో గొంతుకోసాడు వెస్ట్. గారెత్ చేసిన నేరానికి దోషిగా తేలితే యూఎస్ చట్టాల ప్రకారం 40 ఏళ్ల ఫెడరల్ జైలు శిక్ష తప్పకపోవచ్చు. గారెత్ ను శనివారం రోజు, జూలై 5న క్యూబెక్ సుపీరియర్ కోర్టులో హాజరుపర్చారు అక్కడి పోలీసులు.

ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ డబ్బులు గుంజేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని యూఎస్ దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ అకస్మాత్తుగా కాల్స్ వస్తే, వాటిని ధృవీకరించుకున్నాకేగానీ ముందడుగు వేయొద్దంటున్నారు. ఈ తరహా మోసాలు ప్రాశ్చాత్య దేశాల్లోనే కాదు.. మన దగ్గరా మొదలవుతున్న తరుణంలో గారెత్ వెస్ట్ క్రైమ్ స్టోరీతో మనమూ అలర్ట్ అవ్వాల్సిందే మరి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles