చెప్పిన కథనే చెబుతూ: మిస్ ఫైరైన థగ్ లైఫ్!

ఎమోషన్సే కనిపించని చోట అవి ఎంటరై బంధం బలపడ్డాక… ఆ ఎమోషన్స్ ను మించి అనుమానాలు మొదలైతే ఏమవుతుంది..? అందులోనూ, నిత్యం గన్స్ తో సావాసం చేస్తూ ఆధిపత్యపోరుతో రగిలిపోయే గ్యాంగ్ స్టర్స్ లోనే.. నీడను కూడా నమ్మని స్థాయిలో అనుమానాలు చోటుచేసుకుంటే ఏమవుతుంది..? శత్రువుతో ఢీకొట్టే యుద్ధాల కన్నా కూడా అంతర్గత ప్రత్యర్థులతో జరిగే యుద్ధాలే ఆసక్తికరమని.. రాజకీయపార్టీల మధ్య జరిగే అంతర్గత కలహాలపై నెలకొనే క్యూరియాసిటీ ఇప్పటికే మనకు చెబుతోంది. ఒక దళపతి, ఒక నవాబ్ తర్వాత అలాంటి మరో సబ్జెక్టే తాజాగా విడుదలైన మణిరత్నం థగ్ లైఫ్.

పురాణేతిహాసంతో ముడిపడ్డ దళపతైనా… గాడ్ ఫాదర్ ను తలపించే కల్ట్ క్లాసిక్ నాయకుడైనా… రక్తం పంచుకుపుట్టినవారే ఆధిపత్యపోరుతో తలపడే నవాబైనా.. దగ్గర దగ్గర అలాంటి ఇతివృత్తంతోనే ఇప్పుడు తీసిన థగ్ లైఫైనా.. మణిరత్నం సబ్జెక్ట్స్ పునరావృతమవుతున్నాయనే బలమైన వాదనకు ఆయన తెరలేపుతున్నారు. పైగా తనకంటూ ఒక అభిమానగణాన్ని, ఇతరులతో పోలిస్తే ఒక వెర్సటాలిటీని చూపించగల్గే సమర్థతను నిరూపించుుకన్నాక.. రాను రాను తీస్తున్న సినిమాల్లో సాంకేతికత మినహా.. ఎమోషన్ మిస్సవుతుండటం మరో ప్రధాన లోపం.

ఒక సోల్ లేకుండా సినిమా నిర్మాణం జరిగితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈమధ్యకాలంలో మణిరత్నం తీస్తున్న సినిమాలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. పైగా సినిమా నిర్మాణంలో సాంకేతిక అంశాలు.. ప్రధానంగా కెమెరా, ఆర్ట్ డైరెక్షన్, లొకేషన్స్ ఎంపిక, నటీనటుల గ్రూమింగ్, తన శైలికి సింబాలిక్ అయిన షాట్స్ డివిజన్, లైటింగ్ వంటివాటికి ఇచ్చిన ప్రాధాన్యత.. కథ, కథనం, పాటలు పాడే గాయకులు, ప్రధానంగా ఇతర భాషల్లోకి అనువదించే మాటలు, పాటల లిరిక్స్ వీటి విషయంలో తీసుకోకపోవడం పాన్ ఇండియా సినిమాల రోజుల్లో కచ్చితంగా ఓ ఫెయిల్యూరే.

సినిమాల్లో ఒక రెయిన్ సీన్ చిత్రీకరించాలన్నా.. ఎక్కడో చలిమంచులో చయ్య చయ్య వంటి పాటలను తెరకెక్కించాలన్నా.. డ్రోన్ కెమెరాలతో హిమాలయాలను కళ్ల ముందుంచాలన్నా… థగ్ లైఫ్ లో చూపించినట్టు జైసల్మేర్ ఎడారినీ అంతే అందంగా ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ చేయాలన్నా… ఇంతమంది దర్శకులు చూపించిన గోవాను అంతకన్నా అందంగా కనువిందు చేయాలన్నా మణిరత్నం దృశ్యానికి మినిమం గ్యారంటీ ఉంటుంది. థగ్ లైఫ్ లోనూ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ తన పాత్ర విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అద్భుతమైన దృశ్యాలతో, భిన్నమైన కెమెరా ఫ్రేమ్స్ తో అలరించారు. ఏదో తెలియని ఒక సోల్ తో అలరిస్తుందనే ఒక నమ్మకం గతంలో మణిరత్నం సినిమాపైనుండేది. కానీ, అలాంటి మణిరత్నం సినిమాలో ఆ ఆత్మే మిస్సై… పునరావృతమయ్యే సబ్జెక్ట్స్ తో.. ఎమోషనల్ గా కనెక్ట్ కాని స్థితికి చేరడం సదరు దర్శకుడు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని చెబుతోంది.

ఇక ఏ సినిమాకైనా సంగీతం ప్రధానం. అలాంటి సంగీతానికి కేరాఫ్ గా.. ఇళయరాజాతో తీసిన ప్రతీ సినిమాలోని ప్రతీపాటా హిట్ చేసిన కాలం నుంచి… భారతదేశం నుంచి ఆస్కార్ అందుకునే రెహమాన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్ కు లైఫ్ ఇచ్చిన మణిరత్నం.. థగ్ లైఫ్ లో మాత్రం లైఫ్ ఉండే మ్యూజిక్ చేయించుకోలేకపోయారు. ఇదొక థగ్ లైఫ్ కు మాత్రమే పరిమితమైంది కాదు.. చాలాకాలంగా మణి సినిమాల్లో పాటలు ఏమంత గుర్తుండకపోవడాన్ని మనం గమనించవచ్చు. శ్రావ్యమైన చెవికింపైన సంగీతాన్ని అందించాల్సిన చోట… ఏకంగా మితిమీరిన వెస్ట్రనైజేషన్ తో.. వినసొంపైన, ఆహ్లాదంగా పాడుకునే బాణీలు లేకపోవడం కూడా దారితప్పుతున్న సంగీతానికి ఓ సూచిక. ఒక రోజా, బొంబాయి వంటి సినిమాలు మినహా.. ఆ తర్వాత రెహమాన్ ఎక్కువ ఆకట్టుకునే బాణీలందించింది ఒక జెంటిల్మన్, ప్రేమికుడు, ఒకే ఒక్కడు, భారతీయుడు వంటి శంకర్ సినిమాలకేనన్నదీ గమనించొచ్చు. సో మొత్తంగా ఏదో చేయబోయి ఇంకేదో అవుతుండటాన్ని.. కచ్చితంగా ఈ జనం గమనిస్తారనే ఒక ఆలోచన మణిరత్నం వంటి దర్శకుల సోయిలోకి రావల్సి ఉందేమో బహుశా!

గ్యాంగ్ స్టర్స్ మధ్య నెలకొనే అనుమానాలు, ఆధిపత్యపోరుతో తెరకెక్కిన థగ్ లైఫ్ లో ఇంద్రాణి (త్రిష) వంటి పాత్రల సృష్టి.. సినిమాలో వాటి ప్రాధాన్యత వంటి అంశాలు కూడా చర్చకొచ్చేవే. మొత్తంగా 36 ఏళ్ల తర్వాత నాయకుడుతో జట్టు కట్టిన మామా, అల్లుళ్ల సినిమా జనం అంచనాలను మాత్రమే పెంచింది తప్ప… క్యూరియాసిటీని రేకెత్తించే సినిమాగా మాత్రం నిలవలేకపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే పూర్తిగా డిజప్పాయింట్ చేసింది. మొదటి హాఫ్ కొంత పట్టుతో సినిమాను నడపగల్గినా.. సెకండ్ హాఫ్ లో ల్యాగ్ చేసి సినిమా ఎప్పుడైపోతుందా.. ఎప్పుడు వెళ్లిపోదామా.. అసలేముంది ఈ సినిమాలో అనే సందేహాలకు కారణమైన స్క్రీన్ ప్లే నిరాశపరుస్తుంది. అంచనాలను పెంచుతూ చర్చకొచ్చిన థగ్ లైఫ్.. చివరకు ఆశించిన ఫీల్ ను ఇవ్వక జనాన్ని నిరాశపర్చి నిశ్శబ్దంగా థియేటర్లలోంచి వెళ్లిపోవడం విషాదం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles