మంగోలియాలో పేదరికంలో పుట్టి తల్లిదండ్రులు వదిలించుకున్న ఆ పిల్లవాణ్ని.. కేవలం ఓ ఆరు వందల రూపాయలకు కొనుగోలు చేశాడు చైనాకు చెందిన ఓ రైతు. అప్పుడు ఆరువందలకు కొనుక్కున్న ఆ బుడతడే.. ఇప్పుడు చైనాలో మిల్క్ డెయిరీ గాడ్ ఫాదర్ గా ఉద్భవించాడు. కటిక దరిద్రం తనను కన్నతల్లిదండ్రులు వదిలించునేలా చేస్తే… 600 రూపాలయలకు తనను కొనుగోలు చేసిన పెంపుడు తండ్రికి దత్తపుత్రుడై పేరు నిలబెట్టాడు. అంతేనా…? ఏకంగా ఇప్పుడు అక్షరాలా 3 వేల 400 కోట్ల ఆర్థిక సామ్రజ్యాన్నే సృష్టించాడు. చైనా మార్నింగ్ పోస్ట్ ఆకాశానికెత్తుతూ రాసిన ఓ రైతు సక్సెస్ స్టోరీ ఇది.

నిశ్శబ్ద విప్లవంలా నియు పేరు!
నియు జెన్షెంగ్ ఈ పేరొక నిశ్శబ్ద విప్లవం. 50 యువాన్లకు అంటే ఆరు వందల రూపాయలకు అమ్మడుపోబడిన బుడతడు ఎదిగిన తీరుకు ఓ దృశ్యరూపం. చైనా నుంచి జకార్తా వీధుల వరకూ విస్తరించి బిలియన్ యువాన్ల సామ్రాజ్యానికి అధిపతైన ఓ పాడి రైతు ఆదర్శకథ.
పనిచేసిన కంపెనీనే సవాల్ చేసి పైపైకి!
మెంగ్నియు.. చైనాలోని అతి పెద్ద పాల డెయిరీల్లో ఇదొకటి. ఈ డెయిరీ వ్యవస్థాపకుడే నియు జెన్షెంగ్. ఆగ్నేయాసియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఐస్ క్రీమ్స్ గా మెంగ్నియు పేరిప్పుడక్కడ మార్మోగుతోంది.
మంగోలియా నియు పుట్టిన దేశం. నియు పుట్టగానే కనీసం కొడుకును కూడా సాకలేని కటిక దరిద్రం అనుభవిస్తున్న తల్లిదండ్రులు బిడ్డను అమ్మకానికి పెట్టారు. ఎవరైనా పిల్లల్లేనివారుగానీ, పిల్లలపైన అమితప్రేమ కల్గినవారుగానీ తమ పిల్లవాణ్ని కొంటే జస్ట్ 50 యువాన్లకు బిడ్డణ్ని అమ్మడానికి సిద్ధపడ్డారు. అలా ఓ పశువుల రైతు కంట పడ్డాడు నియు. సరిగ్గా 7 యూఎస్ డాలర్స్.. అంటే 50 యువాన్లిచ్చి నియును సదరు పశువుల రైతు కొనుగోలు చేశాడు. అయితే, తనను దత్తత తీసుకున్న తండ్రి జీవితం కూడా అంతేమీ బాలేకుండాపోయింది. చైనాలోని రాజకీయాల్లో చిక్కుకుని తన ఆస్తులనూ కోల్పోయాడు. ఆ సమయంలో నియుకు పొట్ట గడవాలంటే ఏదైనా పని చేయాల్సిందే. చైనాలో వీధులూడ్చి డబ్బు సంపాదించుకున్నాడు. అదే సమయంలో అలా జీవితం గడుస్తుండగానే దత్తత తీసుకున్న పెంపుడు తల్లిదండ్రులిద్దరూ మరణించారు. దాంతో మళ్లీ యుక్తవయస్సులోనే నియూ ఒంటరిగా అనాథలా బతకాల్సి వచ్చింది.
ఓ పాలడెయిరీలో వాష్ మ్యాన్ గా మొదలై!
1983లో ఓ పాల డెయిరీలో నియూకు బాటిల్స్ వాషింగ్ మ్యాన్ ఉద్యోగం లభించింది. ఆ డెయిరీ పేరు యిలీ. అది చైనాలోని పాల ఉత్పత్తి కేంద్రాల్లో ఆ తర్వాత కొద్దికాలానికే నంబర్ వన్ పొజిషన్ కు చేరుకుంది. బాటిల్స్ వాషింగ్ చేస్తూ పొట్ట పోసుకుంటున్న కంపెనీలోనే.. అంచెంలంచెలుగా ఎదిగాడు. వర్క్ షాప్ డైరెక్టర్ అయ్యాడు. తన అనుభవం మేనేజ్మెంట్ ను ఇంప్రెస్ చేసింది. 1992 నాటికి ఉత్పత్తి కార్యాకలాపాలను పర్యవేక్షించే వైస్ చైర్మన్ స్థాయికెదిగాడు. నియూ వార్షిక జీతం ఏకంగా ఒక మిలియన్ యువాన్.. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 1 కోటి 19 లక్షల 95 వేల వరకూ ఎగబాకింది. అదిగో అదే నియూ ఆత్మవిశ్వాసాన్ని కనబర్చే మొట్టమొదటి సక్సెస్ స్టోరీ.
తాను ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ… యిలీ డెయిరీలో నెలకొన్న అంతర్గత రాజకీయాలు, కొన్ని వివాదాల కారణంగా నియు ఆ డెయిరీలో తన ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. కానీ, పాడి ఉత్పత్తుల్లో తనకున్న అనుభవాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. 1999లో 10 మిలియన్ యువాన్.. అంటే సుమారు ఓ 12 కోట్ల రూపాయల మూలధనంతో మెంగ్నియు డెయిరీని తానే స్వయంగా ప్రారంభించాడు. అప్పటికే, తాను ఛాలెంజ్ చేసి వైదొలిగిన కంపెనీ యిలీ ఆస్తులు ఏడాదికి 14 వేల కోట్లకుపైగా ఆదాయాన్ని రాబడుతున్న రోజులవి. అలాంటి సమయంలో దానికి సవాల్ విసురుతూ మెంగ్నియు డెయిరీని స్థాపించడం నిజంగా ఓ సాహసోపేతమైన చర్యే.
నియు.. గ్రామీణ మార్కెట్స్ పై ఫోకస్ చేశాడు. స్థానిక మాండలికాలను అర్థం చేసుకునేందుకు యత్నించాడు. అక్కడి స్థానిక పోటీ ధరలపై ఆరా తీశాడు. అలా ఉత్పత్తి ఓవైపు చేస్తూనే.. అంతకుమించి మార్కెటింగ్ స్ట్రాటజీస్ పైన అధ్యయం చేశాడు. సరిగ్గా 2004 నాటికి మెంగ్నియు 7.2 బిలియన్ యువాన్లు… అంటే 8 వేల కోట్ల 43 వేల లక్షలకుపైగా వార్షికాదాయాన్ని ఆర్జించే స్థాయికెదిగింది. అలా సరిగ్గా ఏడాది తిరక్కుండానే మెంగ్నియు.. యిలీ పాల ఉత్పత్తుల మార్కెట్ ను అధిగమించి అగ్రశ్రేణి మిల్క్ బ్రాండ్ గా అవతరించింది.
ఆగ్నేయాసియాలో పాల ఉత్పత్తులతో పైపైకి!
చైనాలో మెంగ్నియు సక్సెస్ తర్వాత నియు.. ఆగ్నేయాసియా వైపు దృష్టి సారించాడు. ముఖ్యంగా ఇండోనేషియా మార్కెట్ ను స్టడీ చేసిన నియు.. అక్కడ తన మిల్క్ బై ప్రోడక్టైన ఐస్ క్రీమ్స్ కి డిమాండ్ ఉందనే విషయాన్ని గ్రహించాడు. క్వాలిటీ ఐస్ క్రీమ్స్ కేవలం ధనవంతులకేనన్న భావన ఉన్నచోట.. అదే క్వాలిటీ పేద, మధ్యతరగతికి అందిచగల్గితే ఇండోనేషియా మార్కెట్ లో జెండా పాతొచ్చనేది నియుకి స్పష్టమైంది. అలా 2015లో ఎయిస్ అనే బ్రాండ్ నేమ్ తో ఐస్ క్రీమ్ ను ప్రారంభించాడు. కేవలం 900 నుంచి 15 వందల ఇండోనేషియన్ రూపాయలకే దాన్ని మంచి నాణ్యతతో అమ్మడం ప్రారంభించాడు. స్థానికంగా అక్కడివారు ఇష్టపడే కొబ్బరిపాల కాఫీ వంటి వివిధ రకాల రుచులతో మార్కెట్ లోకి ప్రవేశించడంతో పాటు… రిటెయిలర్స్ కు ఫ్రీ రిఫ్రిజిరేటర్స్, వారికి కావల్సిన విద్యుత్ పై సబ్సిడీలిస్తూ వాటిని తన కంపెనీయే భరించేలా మార్కెట్ ను తనవైపు క్యాప్ఛర్ చేశాడు నియు.
తక్కువ ఖర్చులో ఎక్కువ క్వాలిటీ అనే నినాదంతో ఆగ్నేయాసియా మార్కెట్ లోకి దిగిన నియు.. ఇప్పుడు ఇండోనేషియాలోని 12 వందల జిల్లాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తున్నాడు. ఏడాదికి 2 బిలియన్ యువాన్లు.. అంటే 3 వేల 420 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తూ ఆగ్నేయాసియాలో టాప్ మోస్ట్ బ్రాండ్ గా తన డెయిరీ ప్రోడక్ట్స్ ను నిలబెట్టాడు.
పేద, మధ్య తరగతి పల్స్ పట్టుకున్న మార్కెట్ స్ట్రాటజీ!
పేద, మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకుని మార్కెట్స్ ను తనవైపు తిప్పుకుంటున్న నియు జెన్షెంగ్ వ్యాపార తత్వం కేవలం లాభాలకే పరిమితమవ్వడం కాకుండా, నాణ్యతను కూడా అందిస్తుండటంతో ఇప్పుడు నియు పేరు అంతటి చైనాతో పాటు, ఆగ్నేయాసియా మార్కెట్ లోని పాలవ్యాపారంలో మారుమ్రోగిపోతోంది.
ఇదంతా ఒక 6 వందల రూపాయలకు అమ్ముడుబోయి… చిన్ననాటే కన్నతల్లిదండ్రులు, పుట్టిన దేశం మంగోలియాకు దూరమై.. ఇంకెక్కడో చైనాలో పెరిగిన ఓ వ్యక్తి తిరగరాసిన ఆర్థిక చరిత్ర. అయితే, ఇంతవరకే అయితే, ఎందరో బిలియనీర్స్ లాగే నియు కూడా మిగిలిపోయేవాడు. కానీ, నియుకు తానెదుర్కొన్న ఆర్థిక పరిస్థితులు, చిన్ననాటే తన తల్లిదండ్రులు అమ్మేస్తే ఇంకెవరి దగ్గరో పెరగడం, వారు బానే చూసుకుంటున్నారనుకునేలోపు వారికీ దూరమవ్వడం.. చైనా వీధుల్లో స్కావెంజర్ అవతారమెత్తడం ఇవన్నీ గుర్తున్నాయి. అందుకే, తాను పుట్టిన మంగోలియాలో అనారోగ్యంతో, పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు వైద్యచికిత్సనందిస్తున్నాడు. తన ఎదుగుదలకు కారణమైన చైనా అంతటా పాఠశాలల నిర్మాణంలో తన వంతు బాధ్యతగా వితరణ చేస్తున్నాడు.
అందుకే, ఇప్పుడు నియు చైనీస్ సోషల్ మీడియాలో ఓ బిజినెస్ సూపర్ స్టార్. పాల విప్లవంలో ఓ కొత్త గాడ్ ఫాదర్. కష్టపడితేనేగానీ తినడానికి రొట్టెముక్క దొరకదని గ్రహించిన్నాట్నుంచి.. ఇవాళ టాప్ మోస్ట్ కంపెనీగా తన పాల ఉత్పత్తుల మెంగ్నియును నిలిపి వార్తల్లో పతాకశీర్షికయ్యాడు నియు జెన్షెంగ్.



