విజయం మత్తునిస్తుంది. ఆ మత్తు నియంత్రణ కోల్పోతే జరిగే పరిణామాలు కనీసం ఊహించలేం. అలాంటి మత్తుతో తన భర్తకే చాలాకాలంపాటు దూరంగా గడపాల్సి వచ్చింది ఓ ప్రముఖ గాయకురాలు.
అల్కాయాజ్ఞిక్.. బాలీవుడ్ సింగర్ గా ఈమెది సుమారు నాల్గు దశాబ్దాల ప్రయాణం. 20 వేలకు పైగా వివిధ భాషల్లో పాటలు పాడింది. ముఖ్యంగా 90ల్లో కుమార్ సాను, ఉదిత్ నారాయణ్ తో కలిసి ఈమె పాడిన పాటలతో పాటు… ఆమె ప్రత్యేకంగా జావేద్ అక్తర్ వంటివాళ్లు రూపొందించిన కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో గజల్స్ తోనూ ఆకట్టుకున్నారు. నాల్గుదశాబ్దాల కాలంలో ఎందరో హీరోయిన్ల పాటలకు ప్రధాన గొంతుక ఈ అల్కాయాజ్ఞిక్. అంతమంది మనసు చూరగొని సినీసంగీత ప్రయాణంలో అద్భుతమైన విజయాలు సాధించిన అల్కా వ్యక్తిగత జీవితంలో మాత్రం నాటకీయ మలుపులు కనిపిస్తాయి.

అల్కాయాజ్ఞిక్ భర్త నీరజ్ కపూర్. తనకు వచ్చిన విజయాలతో చాలా కుటుంబాల్లోలాగే అల్కాయాజ్ఞిక్ కుటుంబంలోనూ గొడవలు ప్రారంభమయ్యాయి. భార్యా, భర్తలిద్దరూ దూరందూరంగానే గడిపినా వారి బంధం మాత్రం బీటలు వారకపోవడమే ఈ అల్కాయాజ్ఞిక్ ప్రేమకథ ప్రత్యేకత.
అసలు అల్కాయాజ్ఞిక్, నీరజ్ ఎలా కలిశారు..?
1989లో వ్యాపారవేత్తైన నీరజ్ కపూర్ తో అల్కాయాజ్ఞిక్ పెళ్లి జరిగింది. రెండు కుటుంబాల మధ్య సంబంధాలుండటంతో వారిరువురి పెళ్లికి ప్రేమ కూడా తోడై ఇద్దరినీ ముడివేసింది. నీరజ్ ది మేఘాలయా. రాజధాని షిల్లాంగ్ లో నీరజ్ కు ఇల్లుంది. నీరజ్ వాళ్ల అత్త.. అల్కాయాజ్ఞిక్ తల్లికి క్లాస్ మేట్. అల్కా తనను మౌసీ అని పిలుస్తుండేది. నీరజ్ ఆ మౌసీ మేనల్లుడు. అలా మౌసీ ఇంట్లోనే నీరజ్, అల్కా ఇద్దరూ మొదట కలుసుకున్నారు. ఆ తర్వాత వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయాలను ఓసారి అల్కాయాజ్ఞిక్ దూరదర్శన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
నీరజ్ తో ప్రేమలో ఉన్నప్పుడే అల్కాయాజ్ఞిక్ కెరీర్ లో కూడా నిలదొక్కుకుంటున్న రోజులవి. ఆ సమయంలో అల్కాయాజ్ఞిక్ ముంబైలో.. నీరజ్ షిల్లాంగ్ లో ఉండేవారు. దాంతో అల్కా తల్లిదండ్రులు వివాహాన్ని వ్యతిరేకించారు. ఇద్దరూ అక్కడోళ్లు, ఇక్కడోళ్లు అంటే కుదరని పని అని వారించారు. అయినా సరే తల్లిదండ్రులను ఎదిరించి నీరజ్ ను పెళ్లి చేసుకుంది అల్కాయాజ్ఞిక్.
ఆ తర్వాతేమైంది..?
ఓవైపు అల్కాయాజ్ఞిక్, మరోవైపు నీరజ్ ప్రేమలో మునిగిపోయారు. అలాంటి సమయంలో వారిరువురి పట్టుదల కాదనలేక.. ఇరువైపులా పెద్దలు వివాహానికి సరేనన్నారు. మొత్తానికి పెళ్లైపోయింది. కొంతకాలం అలా కలిసున్నారో, లేదో.. ఇక ఎవరి వర్కింగ్ ప్లేస్ లో వారుండి మధ్య మధ్య కలుసుకోవాలనుకున్నారు. అదే సమయంలో అల్కా కెరీర్ ఒక్కసారి పీక్ కు చేరింది. ఒక్కరోజు కూడా ముంబై విడిచి వెళ్లలేనంత బిజీ బిజీ షెడ్యూల్స్ తయారయ్యాయి.
వారిద్దరూ భౌతికంగా దూరం కావడంతో అవి రకరకాల భావోద్వేగాలకు దారితీశాయి. నీ కెరీర్ కు తగ్గట్టుగా నేను నీకు లభించడం నీ అదృష్టం.. కానీ, నాది మాత్రం దురదృష్టమంటూ తన భర్త ఎప్పుడూ అనేవాడని చెప్పారు అల్కాయాజ్ఞిక్. ఆయన అలా అనడం వెనుక ముమ్మాటికీ నాదే తప్పంటూ ఒకింత అపరాధభావాన్ని ప్రదర్శించారామె.
ప్రేమలో పడిన రెండు నెలలకు అల్కాయాజ్ఞిక్, నీరజ్ కపూర్ వివాహం జరిగింది. రాత్రిపూట వారు ఫోన్ లో గంటల కొద్దీ మాట్లాడుకోవడం.. ఫోన్ బిల్స్ బాగా రావడంతో మొదట్లో అల్కా తల్లిదండ్రుల్లో అనుమానం మొదలైంది. ఆ తర్వాత ఇంట్లో గొడవలూ మొదలయ్యాయి. కానీ, అల్కా, నీరజ్ ను పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకోవడంతో ఆ పెళ్లికి ఒప్పుకోక ఆమె తల్లిదండ్రులకు తప్పలేదు.
అల్కాయాజ్ఞిక్, నీరజ్ కపూర్ ఎక్కువభాగం వేర్వేరు నగరాల్లో ఒకరు ముంబై, ఇంకొకరు షిల్లాంగ్ లోనే గడిపారు. ఇద్దరి మధ్య ఈ దూరం ఎన్నో అంతరాలకు, అవాంతరాలకూ కారణమైంది. అలా అంతరాలేర్పడినప్పుడల్లా ఒకరినొకరు మళ్లీ అర్థం చేసుకోవడానికీ ఓ నాల్గు రోజుల సమయం పట్టేది. తన భర్త నీరజ్ తో తను ఎక్కువ సమయం కేటాయించలేకపోయినా.. తాను చూపించిన సహనం, ఓపికే తన విజయంలో కీలకపాత్ర పోషించాయంటోంది బాలీవుడ్ సింగర్ అల్కాయాజ్ఞిక్. అలా పెళ్లికి ముందు ప్రేమలో మునిగిపోయిన ఈ భార్యాభర్తలిద్దరూ వివాహమనంతరం 25 ఏళ్లకుపైగా ఒకరికొకరు దూరంగా గడిపాల్సివచ్చినా.. కలిసి ఉండటమే వీరి ప్రేమకథలో కనిపించే నిజాయితీ, పరస్పర విశ్వాసం. చిన్నచిన్న పొరపచ్చాలకే విడిపోతున్న నేటి రోజుల్లో… డైవర్స్ అవుతున్న కాలంలో.. అల్కా, నీరజ్ ది ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ.



