కల్నల్ నిజాముద్దీన్ ఎవరు..? బోస్ ను కాపాడిన ఈ అన్ సంగ్ హీరో తెలుసా..??

మనదేశంలో చారిత్రక యోధులంటే ఏ కొందరి పేర్లకో మాత్రమే పరిమితం. వారికే విగ్రహాలు, పుస్తకాల్లో పాఠ్యాంశాలు, వార్షికోత్సవాలునూ. కానీ, వారి చుట్టూ కూడా తల్చుకోవాల్సిన బోలెడంత మంది ఉన్నారు. అలాంటి వ్యక్తే కల్నల్ నిజాముద్దీన్. ఎవరాయన..?

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 71 ఏళ్లు గడుస్తున్నా.. మనందరి సామూహిక జ్ఞాపకాల్లో ఏ కొందరి పేర్లో మాత్రమే గుర్తుంటాయి. వారినే చారిత్రక పురుషులు, స్త్రీలుగా కొనియాడుతుంటాం. కానీ, నాటి స్వాతంత్ర్య ఉద్యమానికి నిశ్శబ్దంగా ఒక ఆకారాన్నిచ్చి వెలుగులోకి రానివారెందరో. చరిత్ర అంచుల్లోనే నిల్చిపోయినవారు ఇంకెందరో. ఎందుకంటే వారు మహాసభల్లో ప్రసంగించేవారు కాదు, ఒప్పందాలు కుదుర్చుుకునే పెద్ద మనుషులు కాదు. కేవలం అలాంటి పెద్దమనుషులకు డ్రైవర్లుగా, సందేశాలను చేరవేసే సేవకులుగా మాత్రమే వారు పరిమితం. అలాంటివారి త్యాగాలు, ధైర్యకథలు చరిత్రకెక్కకపోవచ్చునేమోగానీ… అలాంటి కొన్ని వాస్తవాలు కాస్త లోతుల్లోకి వెళ్లితే కనిపిస్తాయి.

అలాంటి కథే కల్నల్ నిజాముద్దీన్. ఈయన స్టోరీ వింటుంటే… యుద్ధకాలపు థ్రిల్లర్ ను తలపిస్తుంది. కానీ, ప్రజాదరణ దక్కని చరిత్రగా మిగిలిపోయింది. ఎందుకంటే, నిజాముద్దీనే ఏ బెటాలియన్లకు నాయకుడూ కాదు… సిద్ధాంత గ్రంథాలు రాసినవాడూ కాదు. కానీ, అవసరమైన సమయంలో తన ప్రాణాలు పోయినా పర్లేదని.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను రక్షించేందుకు మూడు తూటా దెబ్బలు తిన్నాడు.

చిన్ననాట సైపుద్దీన్ గా పిలువబడ్డ నిజాముద్దీన్ కు కల్నల్ అనే బిరుదు నాటి బ్రిటీష్ సామ్రాజ్యవాదులిచ్చింది కూడా కాదు. స్వయానా సుభాష్ చంద్రబోస్ ఇచ్చింది. ఆగ్నేయాసియా అడవుల్లో నిజాముద్దీన్ చూపిన తెగువకు గుర్తింపుగా బోస్ పెట్టుకున్న పేరు కల్నల్ నిజాముద్దీన్.

ఢాక్వాన్ టూ రంగూన్… ఊపిరిసల్పని ప్రయాణం!

1901లో ఉత్తరప్రదేశ్ ఆజంఘర్ జిల్లా ఢాక్వాన్ లో జన్మించాడు సైపుద్దీన్. సైపుద్దీన్ తండ్రి ఇమామ్ అలీ రంగూన్ లో ఓ చిన్న క్యాంటీన్ నడిపేవాడు. తల్లి మాత్రం గ్రామంలోనే ఉంటూ కుటుంబ బాధ్యతలు చూసుకునేది. చాలామందిలాగే చరిత్ర కథలు వింటూ పెరిగాడు సైపుద్దీన్. ఓవైపు బ్రిటీష్ యూనిఫామ్స్ ఆకట్టుకునేవి.. ఇంకోవైపు, భయపెట్టేవి. ఏదేతే అదైందని.. ఇంటి నుంచి చెప్పా పెట్టకుండా ఇరవై ఏళ్ల వయస్సులో పారిపోయాడు సైపుద్దీన్. బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో చేరాడు. ఆరోజుల్లో గ్రామీణ యువతకు సైన్యంలో చేరడం బ్రిటీష్ కిరీటానికి విధేయతేం కాదు. కానీ, జీవనోపాధి కోసం, జీతం కోసం.. అలాగే, ప్రపంచాన్ని చూడాలన్న ఆశతో సైపుద్దీన్ లాగే చాలామంది యువత బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో చేరేవారు.

సైపుద్దీన్ ను కలిచివేసిన ఘటనేంటి..?

బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు… ఓ బ్రిటీష్ అధికారి మాటలు సైపుద్దీన్ కు తల తీసినంత పనిచేశాయి. గాయపడిన భారతీయులను కాదు ముందు రక్షించాల్సింది.. మన వస్తువులను సరఫరా చేసే గాడిదలను మొదట రక్షించాలి. ఇదీ ఆ అధికారి తెల్లజాతి సైనికులకిచ్చిన ఆదేశం. అది విన్న సైపుద్దీన్ కు మనసు చివుక్కుమంది. భారతీయుల ప్రాణాలను అంత తేలికగా తీసుకుంటున్న బ్రిటీష్ అధికారుల తీరు కుదిపేసింది. యుద్ధంలో గాయం కల్గించిన బాధ కంటే ఎక్కువ ఆవేదన చెందాడు. కానీ, లోపల పగ రగిలిపోతోంది.

మరి సైపుద్దీన్ ఏం చేశాడు..?

ఎవరైతే గాడిదల కంటే తక్కువగా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నవారిని పూచికపుల్లలా తీసేశాడో… ఆ అధికారిని కాల్చి చంపేశాడు సైపుద్దీన్. ఇక అక్కడినుంచి పారిపోయాడు. బ్రిటీష్ సైన్యం అతడి కోసం వెతకడం ప్రారంభించింది. కానీ, సైపుద్దీన్ జారుకున్నాడు. సింగపూర్ చేరుకున్నాడు. అక్కడ తన బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ యూనిఫాంతో పాటు.. తన సైపుద్దీన్ అనే పేరును కూడా వదిలేశాడు. ఆ తర్వాత సైపుద్దీన్ కాస్తా నిజాముద్దీన్ గా మారి..సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ- ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరాడు.

నేతాజీ సైన్యంలో చేరిన తర్వాత ఏం జరిగింది..?

1943లో సుభాష్ చంద్రబోస్ బెర్లిన్ నుంచి సబ్ మెరైన్ లో ఆగ్నేయాసియా వరకూ ఒక సాహసోపేతమైన ప్రయాణం చేశాడు. ఇరవయ్యో శతాబ్దంలోనే అత్యంత ధైర్యవంతమైన ప్రయాణాల్లో ఒకటిగా చెబుతుంటారు. ఆయన ఇండియన్ నేషన్ ఆర్మీ బాధ్యతలు స్వీకరించిన్నాట్నుంచే… నిజాముద్దీన్ కూడా బోస్ వెంట నడిచాడు. అందుకే, వారిద్దరి మధ్యా గాఢమైన బంధం ఏర్పడింది.

నిజాముద్దీన్ ఏం వ్యూహకర్త కాదు. కానీ, అప్రమత్తంగా ఉండేవాడు. కార్యాచరణ ఏది అప్పజెప్పినా బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేవాడు. అందుకే బోస్ కు విశ్వాసపాత్రుడైనాడు. దాంతో మలేషియాకు చెందిన రాజు బోస్ కు బహుమతిగా ఇచ్చిన 12 సిలిండర్ల శక్తివంతమైన కారును నడిపేందుకు నిజాముద్దీన్ ను డ్రైవర్ గా నియమించుకున్నాడు సుభాష్ బోస్. అలాంటి యుద్ధకాలంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కారు నడపడమంటే మామూలు విషయం కాదు. ఎప్పుడెవ్వరు ఎక్కడినుంచి విరుచుకుపడతారో తెలీదు. హత్యాయత్నాలు, దాడుల నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అది.

బర్మా అడవుల్లో మూడు తూటాలనెదుర్కొన్న నిజాముద్దీన్!

1943-44 మధ్య బర్మా అడవుల్లో బ్రిటీష్ సైన్యంతో జరుగుతున్న హోరాహోరీ యుద్ధ పోరాటంలో బోస్ తో పాటు.. నిజాముద్దీన్ కూడా పాల్గొన్నాడు. అక్కడే చరిత్రకెక్కకపోయినా… ఒక ఇండియన్ నేషనల్ స్టార్ ను కాపాడిన ఘనత దక్కించుకున్నాడు నిజాముద్దీన్. 2016లో ది టెలీగ్రాఫ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోజు జరిగిన ఘటనను ఆయన వివరించాడు.

అడవిలో పొదల మధ్య ఒక తుపాకీ గొట్టం బయటకొచ్చి.. అది సుభాష్ చంద్రబోస్ వైపు ఎక్కుపెట్టి ఉండటాన్ని నిజాముద్దీన్ గమనించాడు. ఒక్క క్షణం కూడా యోచించకుండా సుభాష్ చంద్రబోస్ ముందుకు దూకాడు. సుభాష్ బోస్ వైపు ఎక్కుపెట్టిన తుపాకీ గొట్టం నుంచి వచ్చిన మూడు తూటాలు నిజాముద్దీన్ శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లాయి. నిజాముద్దీన్ ఆ సమయంలో స్పృహ కోల్పోయాడు. ఇండియన్ నేషనల్ ఆర్మీలో ప్రసిద్ధ వైద్యురాలుగా ఉన్న లక్ష్మీ సెహగల్ నిజాముద్దీన్ శరీరం నుంచి ఆ తూటాలను తొలగించారు. ఆ ఘటన తర్వాతే సుభాష్ చంద్రబోస్… నిజాముద్దీన్ ను కల్నల్ గా సంబోధించాడు. అదే ఆ తర్వాత కల్నల్ నిజాముద్దీన్ గా స్థిరపడిపోయింది.

ఆగ్నేయాసియాలో బోస్ నీడలా నిజాముద్దీన్!

తూటాగాయాలైన తర్వాత కూడా నాల్గేళ్లపాటు.. వియత్నాం, జపాన్, థాయ్ లాండ్, మలేషియా, సింగపూర్ ఇలా ఏ దేశానికి బోస్ వెళ్లినా నిజాముద్దీన్ ఆయనకు నీడలా ఉంటూ బాడీగార్డ్ గా పనిచేశాడు. సుభాష్ బోస్ అంటే చలనశీలత. ఎందుకంటే, ఆయన బ్రిటీష్ ఇండియన్ ఆర్మీకి చిక్కకుండా ఉండేందుకు.. అలాగే, తన ఆధ్వర్యంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీని చురుకుగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు స్థలాలు మారుస్తూ తిరుగుతూనే ఉండేవాడు. ఆయనతో పాటే.. నిజాముద్దీన్ ప్రయాణమూ సాగింది.

మళ్లీ సాధారణ జీవితంలోకి నిజాముద్దీన్!

1945 ఆగస్ట్ లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీ రద్దైంది. వేలాదిమంది సైనికుల్లాగే నిజాముద్దీన్ కూడా మెల్లిగా సామాన్య జీవితంలోకి వచ్చేశాడు. ఆ తర్వాత అజ్బున్ నిషా అనే మహిళను పెళ్లి చేసుకుని.. రంగూన్ లోనే బ్యాంక్ అధికారికి డ్రైవర్ గా పనిచేశాడు. తండ్రి నేతాజీ బాడీగార్డుగా పనిచేసి తూటాలకు గాయపడిన అడవులకు దూరంగా.. అదే రంగూన్ లో ఆయనకు పిల్లలు పుట్టి సాధారణ జీవితాన్ననుభవించాడు. 1969లో తిరిగి భారత్ కు వచ్చాడు. మళ్లీ తన సొంతూరు ఢాక్వాన్ లో స్థిరపడ్డాడు. తన ఇంటికి హింద్ భవన్ అని పేరు పెట్టుకున్నాడు. ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎప్పుడూ ఎగిరేలా ఏర్పాటు చేసుకున్నాడు. తన ఇంటికెవ్వరు వచ్చినా వెళ్లిపోయేటప్పుడు జైహింద్ అని చెప్పేవాడు. ఆ నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన బోస్ అంటే నిజాముద్దీన్ కు అమితమైన భక్తి. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ సుభాష్ బోస్ ను వదల్లేదు నిజాముద్దీన్.

సుదీర్ఘమైన జీవితం.. కానీ, ఆలస్యమైన గుర్తింపు!

2017లో తన స్వగ్రామం ఢాక్వాన్ లోని ఇంట్లోనే కన్నుముశారు నిజాముద్దీన్. శతాధిక వృద్ధుడిగా 117 ఏళ్లు బతికినట్టు చెబుతారు. కానీ, జాతీయస్థాయిలో నిజాముద్దీన్ కు గుర్తింపు మాత్రం ఆలస్యంగానే దక్కింది. 2016లో నిజాముద్దీన్.. తన 107 ఏళ్ల భార్యతో కలిసి బ్యాంక్ ఖాతా తెరవడంతో ఆయన వార్తల్లోకెక్కాడు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జంటగా వార్తల్లోకొచ్చారే తప్ప.. ఆయన, బర్మా అడవుల్లో నేతాజీని కాపాడిన యోధుడని.. మూడు తూటా దెబ్బలు తిన్నాడనే విషయం మాత్రం మరుగున పడిపోయింది. చరిత్ర వేదికలపైన నిలబడేవారినే కీర్తిస్తుంది తప్ప… ఇదిగో వారి నీడలను గమనించదనేది నిజాముద్దీన్ కథ మనకు చెప్పే మరో పాఠం.

అంతేకాదు, భారత స్వాతంత్ర్య పోరాటమంటే కేవలం జైళ్ళల్లో గడపడమో, కోర్టుల్లో వాదనలు సాగడానికో.. లేక, అంతర్గతంగా దేశంలో జరిగిందో మాత్రమే కాదు.. భారత్ వెలుపల ఖండాంతరాలు దాటి సామాన్యుల చేసిన పోరాటాల్లోనూ ఆ చరిత్ర కనిపిస్తుంది. అందుకే, నిజాముద్దీన్ ను గుర్తు చేసుకోవడమంటే.. గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు.. పరిమితమైపోయిన చరిత్ర పురుషుల్లో అతనూ ఉన్నాడని ఈ లోకానికి తెలియజెప్పడం కూడా!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles