రాజ్ పథ్ లో కవాతు… బ్యాండ్ మేళంతో భారీ ర్యాలీలు, దేశభక్తి గీతాలు, స్వాతంత్ర సమరయోధుల నినాదాలతో కనిపించే స్కూల్ పిల్లలు.. మళ్లీ అంతా ఓసారి రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవడం ఇవే రొటీన్ గా మనం ప్రతీ గణతంత్ర దినోత్సవం రోజున చూసేవి, చేసేవి. కానీ, అంత పెద్ద రాజ్యాంగాన్ని తన చేతిరాతతో రాసిన వ్యక్తెవరో మీకు తెలుసా..? మన గణతంత్రానికి తన అక్షరాలతో ఒక రూపాన్నిచ్చిన ఆయనెవరో ఈ గణతంత్ర దినోత్సవాన ఓసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం.

భారత హస్తలిఖిత రాజ్యాంగం వెనుకున్న ఆ శిల్పి పేరు ప్రేమ్ బీహారీ నారాయణ్ రాయ్జాదా.
డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ తో పాటు, ఆ ముసాయిదా రూపకల్పనలో ఎందరో ప్రముఖులున్నప్పటికీ.. దాన్ని ఒంపుసొంపైన అక్షరాల రూపమిచ్చింది మాత్రం ప్రేమ్ బీహారీ నారాయణే.
రాజ్యాంగం తొలి ముసాయిదా 1949, నవంబర్ 26నే పూర్తైంది. మూడేళ్ల సుదీర్ఘ చర్చలనంతరం ఆ మహత్తర కార్యం రూపుదిద్దుకుంది. భారతదేశానికి ఒక చట్టాన్ని రూపొందించడమే కాదు… అప్పటివరకూ వలసపాలనలో ఉన్న దేశాన్ని ఆ ప్రభావం నుంచి పూర్తి విముక్తి చేసిన ఒక మహాకార్యమది. నవనాగరిక సమాజపు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించే ఒక దార్శనిక పత్రం.
ప్రతీ పేజీలోనూ ప్రేమ్ బీహారీ నారాయణ్ స్వీయ దస్తూరితో పాటు, నందలాల్ బోస్, ఆయన శిష్యులు రూపొందించిన బొమ్మలు, చిహ్నాలు కనిపించేలా రాజ్యాంగ పుస్తకాన్ని తీర్చిదిద్దారు. హరప్పా నాగరికత నుంచి స్వాతంత్రోద్యమం వరకూ భారతదేశ ప్రయాణానికి ప్రతీకలు ఆ చిహ్నాలు. రాజ్యాంగాన్ని ఒక పుస్తకం రూపంలోకి తీసుకొచ్చే బాధ్యతను ప్రేమ్ బీహారీ నారాయణ్ రాయ్జాదాకు దక్కింది.
ప్రేమ్ బీహారీ నారాయణ్ నేపథ్యమేంటి..?
కాలిగ్రాఫర్స్ కుటంబంలో 1901, డిసెంబర్ 17న జన్మించాడు ప్రేమ్ బీహారీ నారాయణ్. చిన్న వయస్సులోనే అనాథగా మారిన ఆయనను తాత మాస్టర్ రామ్ పర్షాద్ జీ సక్సేనా, మామ మహాశ్య చతుర్ బీహారీ నారాయణ్ సక్సేనా పెంచారు. తాత పర్షియన్, ఆంగ్ల భాషల్లో పండితుడు. బ్రిటీష్ అధికారులకు పర్షియన్ నేర్పినవాడు.
ముత్యాల్లాంటి రాత ఆ ఇంట్లో అందరి తలరాతైంది. అందుకే కాలీగ్రఫీ ఆ ఇంట్లో ఓ హాబీగా కాకుండా.. ఓ అలవాటుగా మారిపోయింది. తాత శిక్షణలోనే ప్రేమ్ బీహారీ నారాయణ్ కూడా ముత్యాల్లాంటి అక్షరాలు రాయడంలో దిట్టగా మారాడు. ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చదువుకున్నాడు. యుక్తవయస్సుకొచ్చేసరికి ప్రేమ్ బీహారీ నారాయణ్ పేరు గొప్ప కాలిగ్రాఫర్ గా పేరు సంపాదించాడు.

ప్రేమ్ బీహారీ నారాయణ్ ను సంప్రదించిన నెహ్రూ!
ఇవాళ అంటే కంప్యూటర్ లో.. ఏకంగా స్మార్ట్ మోబైల్ లో కూడా ఏ భాషలో అంటే ఆ భాషలో టైపింగ్ చేయగల్గుతున్నాం. అంతకుముందు టైప్ రైటర్స్ శకం నడిచినా… స్వాతంత్రోద్యమ సమయంలో చేతిరాతే దిక్కు. అదిగో అలాంటి సమయంలో హస్తలిఖితంగా రాజ్యాంగాన్ని రాయాల్సిన సమయంలో నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా ప్రేమ్ బీహారీని సంప్రదించారు. సొగసైన ఇటాలిక్ శైలిలో రాజ్యాంగాన్ని రాయాలని కోరాడు. దానికి పారితోషికం ఎంత తీసుకుంటారో కూడా నెహ్రూ బీహారీని అడిగారు.
కానీ, బీహారీ సమాధానం నెహ్రూను నివ్వెరపర్చింది. చరిత్రలో ఒక కథగా నిల్చింది. ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే ఆయన రాజ్యాంగాన్ని తన కాలీగ్రఫీతో రాయడానికి ఒప్పుకున్నారు. జీవితం తనకు చాలానే ఇచ్చిందని నెహ్రూను సమాధానపర్చాడు. అయితే, పారితోషికంకు బదులుగా ఆయన ఒక్క కోరికను మాత్రం నెహ్రూ ముందుంచారు. రాజ్యాంగంలోని ప్రతీ పేజీపైన తన పేరుండాలి. అలాగే, చివరి పేజీపైన తన పేరుతో పాటు.. తను కాలీగ్రఫీలో నిష్ణాతుడయ్యేందుకు కారకుడైన తన తాత మాస్టర్ పర్షాద్ జీ సక్సేనా పేరుండాలన్నది ఆ కండిషన్.
కాన్స్టిట్యూషన్ హాల్ లో ఓ గది కేటాయింపు!
ప్రేమ్ బీహారీకి కాన్స్టిట్యూషన్ హాల్ లో ఓ గది కేటాయించారు. ఆ భవనమే ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ క్లబ్ గా మారింది. అప్పటికి ముసాయిదాలో 395 ఆర్టికల్స్, ఎనిమిది షెడ్యూల్స్, ఒక ప్రియాంబుల్ ను చేర్చారు.
ఒంటరిగానే పనిచేస్తూ ప్రేమ్ బీహారీ ఆరు నెలల పాటు సంపూర్ణ ఏకాగ్రతతో మొత్తం రాజ్యాంగాన్ని రాశారు. ప్రేమ్ ఫౌండేషన్ సమాచారం మేరకు రాజ్యాంగం రాయడానికి ప్రేమ్ బీహారీ 432 పెన్ నిబ్స్ వాడారట. ముఖ్యంగా చెక్క హోల్డర్స్ కు నంబర్ 303 నిబ్స్ ను అమర్చి.. మసి సీసాల్లో ముంచి రాజ్యాంగాన్ని రాశారు. శారీరకంగా, మానసికంగా ఎంతో అలసటకు గురిచేసే పనది.

ఎక్కడా చెరుపులు, మలిపేయడాలు, మచ్చలు, సవరణల వంటివేవీ లేకుండా ఒక పేజీ నుంచి మరో పేజీలోకి నిరాఘాటంగా ప్రవేశిస్తూ.. వ్యాసుడు చెబితే సాక్షాత్తూ ఆ విఘ్నేశ్వరుడే రాసిన చందంగా రాజ్యాంగాన్ని రాసేశారట ప్రేమ్ బీహారీ.
తరతరాలు నిల్చిపోయేలా పుటల తయారీ!
రాజ్యాంగం మొత్తం 16*22 అంగుళాల పరిమాణంలో గోధుమ కలర్ లో ఉండే పర్చ్మెంట్ షీట్స్ పై రాశారు. దాదాపు వెయ్యేళ్లు నిల్చే సామర్థ్యమున్న షీట్స్ అవి. మొత్తం పూర్తైన తర్వాత 251 పేజీలతో… సుమారు 3 కిలోల 75 గ్రాముల బరువుందట ఆ రాజ్యంగ ముసాయిదా బుక్.
1950, జనవరి 24న రాజ్యాంగసభ సభ్యులంతా ఆ పత్రాలపై సంతకాలు చేశారు. మొట్టమొదటి సంతకం భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ చేయగా.. చివరి సంతకం ఫిరోజ్ గాంధీ చేశారు.
ఆ తర్వాత డెహ్రాడూన్ లోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఫోటోలిథోగ్రఫీ పద్ధతిలో ప్రతులు తయారుచేశారు. అయితే, రాజ్యాంగం తయారయ్యాక పుస్తకాలను చాలామంది చూసే ఉండొచ్చుగానీ.. హస్తలిఖితంగా తయారైన ఆ ప్రతుల గురించి మాత్రం అరుదుగా తెలుసుకుని ఉంటారు. అందుకే, మన రాజ్యాంగాన్ని హస్తలిఖితంగా రాసిన ఆ ప్రేమ్ నారాయణ్ బీహారీని ఈరోజు మనమిలా తల్చుకుంటున్నాం.



