వాహ్ ఉస్తాద్!
నారాయణాచార్యుల శివతాండవ ఢమరుక ధ్వనికి సరిపోలిక.. ఆ తబలా!
……………………………………………………………………………………………………………..
Vamsy Krishna… ✍🏻
తమ్ములై, ఘటితమోదమ్ములై, సుకృతరూ
పమ్ములై, శాస్త్రభాగ్యమ్ములై, నవకోర
కమ్ములై, వికచపుష్పమ్ములై, దుమ్మెదల
తమ్ములై, భావమంద్రమ్ములై, హావఫు
ల్లమ్ములై, నూత్న రత్నమ్ములై, వల్గుహా
సమ్ములై, గన్గొనలసొమ్ములై, విశ్రాంతి
దమ్ములై, రక్తకిసలమ్ములై, రక్తిచి
హ్నమ్ములై, తంద్రగమనమ్ములై గెడఁగూడి
కులుకునీలపుఁగండ్లఁ దళకుజూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
అని సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారి స్వరం నుండి ఉత్తుంగ జలపాత తరంగాల్లా దూకుతున్న ఆ శివతాండవ ఢమరుక ధ్వనిని సరిపోల్చడానికి , సరిపోల్చుకోవడానికి నాకు రెండు దశాబ్దాలు పట్టింది. మొట్టమొదటి సారి జాకీర్ హుస్సేన్ ను వింటున్నప్పుడు నన్నా శివతాండవ ధ్వని ఉక్కిరిబిక్కిరి చేసింది. తబలాను ఆనీ ఆననట్టు కనిపిస్తూనే ఆ మునివేళ్ళు సృష్టించిన ఒక మాయా మార్మిక సౌందర్యం నన్నొక శబ్ద లేశంగా మార్చి మరొక లోకం లోకి తీసుకునిపోయింది.
ఆ హరిప్రసాద్ చౌరాసియా లాంటి మహానుభావులు వెన్నెల లాంటి స్వర్గాన్ని ఇలమీదకు తీసుకునివస్తే, జాకీర్ హుస్సేన్ ఇక్కడ నాలాంటి మామూలు మనిషిని , సంగీతం ఏమాత్రం తెలియని అజ్ఞానిని కూడా ఆ స్వర్గం లోకి తీసుకుని వెళతారు. ఆ శక్తి జాకీర్ హుస్సేన్ కి ఎక్కడ నుండి వచ్చింది

జాకీర్ అల్లా రఖా ఖురేషీ అకా జాకీర్ హుస్సేన్ పుట్టినప్పుడు తండ్రి ప్రముఖ తబలా విద్వాంసుడు, అల్లా రఖా ఆరోగ్యం అస్సలు బాగాలేదు. చివరి క్షణాలు అనే భావించారు రాజ్ కపూర్, నర్గీస్, అశోక్ కుమార్ అయితే చివరి చూపు కోసం అల్లా రఖా దగ్గరకు వచ్చారు కూడా. అలాంటి సమయం లో జాకీర్ శ్వాస అందుకున్నారు. పుట్టినప్పుడు పక్కనే ఉన్న అందరూ Unlucky Child అని అనుకున్నారు. ఇంటికి తీసుకుని వచ్చిన తరువాత తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేయలేదు . అంతిమ క్షణాలలో భర్త, అప్పుడే పుట్టిన పిల్లాడు , చుట్టూ సానుభూతి చూపిస్తూ Unlucky Child అంటున్న చుట్టు పక్కల వాళ్ళు. ఆ తల్లి కూడా తనకు పుట్టిన బిడ్డ Unlucky Child అనే అనుకుంది. అల్లా రఖా కుటుంబానికి చాలా దగ్గర అయిన ఒక ఫ్యామిలీ జాకీర్ హుస్సేన్ తీసుకుని వెళ్ళింది. కొన్నాళ్లపాటు జాకీర్ అక్కడే పెరిగాడు. ఆ తరువాత జాకీర్ పెరిగి పెద్దయి బోలెడంత పేరు సంపాదించాక “జాకీర్ హుస్సేన్ : ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్ ” అనే పుస్తకం కోసం నస్రీన్ మున్నీ కబీర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయం పంచుకుంటూ ” తనకు పాలిచ్చి పెంచిన తల్లిని ” I sadly don’t remember the name of this kind lady, but she became a sort of surrogate mother to me for the first few weeks” అని తల్చుకున్నారు.
కొన్ని రోజుల తరువాత ఒక గ్యానీ బాబా అల్లా రఖా ఇంటికి వచ్చాడు . జాకీర్ హుస్సేన్ తల్లిని పేరు పెట్టి “బావీ బేగం. నీ కొక కొడుకు వున్నాడు . రాబోయే నాలుగు సంవత్సరాలు అత్యంత ప్రమాదకరమైనవి. జాగ్రత్తగా ఉండాలి. నీ భర్త ఆరోగ్యాన్ని కూడా నీ కొడుకు కుదుట పరుస్తాడు. నీ కొడుకు కి జాకీర్ హుస్సేన్ అని పేరు పెట్టు ” అని చెప్పాడట. ఆ సంఘటన తలచుకుని జాకీర్ నస్రీన్ తో ” హుస్సేన్ అనేది మా కుటుంబ పేరు కాదు . నా పేరు అయితే ఖురేషీ కావాలి లేదా అల్లా రఖా ఖురేషీ కావాలి. కానీ గ్యానీ బాబా వలన హుస్సేన్ నా పేరులోకి వచ్చి చేరింది ” అని చెప్పాడు
గ్యానీ బాబా చెప్పినట్టు గానే జాకీర్ చిన్నతనం లో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఒకసారి కిరోసిన్ తాగేశాడు. ఉన్నట్టుండి హై ఫీవర్ వచ్చేది. లేదా ఒంటినిండా దద్దుర్లు వచ్చేవి. ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాడు. చిత్రంగా అనారోగ్యం తో జాకీర్ బాధ పడినప్పుడల్లా తండ్రి అల్లా రఖా ఆరోగ్యం కుదుట పడేదట. అలా పడుతూ, లేస్తూ నాలుగు సంవత్సరాలు తిరిగేసరికి అల్లా రఖా , జాకీర్ హుస్సేన్ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్య వంతులు అయ్యారు
.పుట్టిన బిడ్డ చెవిలో ముస్లిం సంప్రదాయం ప్రకారం కల్మా చెప్పాలి, కానీ బిడ్డను తీసుకుని రాగానే అల్లా రఖా జాకీర్ చెవిలో తబలా ధ్వనులు వినిపించాడు. అది మొదలు తబలా జాకీర్ జీవితం అయిపొయింది. మీ చిన్నప్పటి ముచ్చట ఏదైనా చెప్పండి అని నస్రీన్ అడిగినప్పుడు జాకీర్ “మా చిన్న వంటఇంట్లో వంట చేయడానికి ఉద్దేశించిన కుండలు వరుసగా నిలబెట్టి ఉండేవి. నేనొక కుండను బోర్లించి తబలా లాగా వాయించేవాడిని ఇది నాకు మూడేళ్లప్పుడు జరిగిన గుర్తున్న సంఘటన ” అని చెప్పారు జాకీర్
తబలా కి మొదటినుండీ మనదేశం లో పెద్దగా ప్రాచుర్యం లేదు. చచ్చిన మేక చర్మం మీద వేళ్ళాడించే వాళ్ళూ సంగీతజ్ఞులేనా అనే చిన్న చూపు ఉండేది . దానికి చెక్ పెట్టినవాడు అల్లా రఖా . ఆ సంప్రదాయాన్ని కొనసాగించింది జాకీర్ హుస్సేన్ . పదకొండేళ్ల వయసులో అమెరికాలో మొదటి ప్రదర్శన ఇచ్చిన జాకీర్ ఆ తరువాత వెనక్కి తిరిగి చూడలేదు.
ప్రదర్శన అంతా ముగిసిన తరువాత గ్రీన్ రూమ్ లోకి ఎవరో ఒకరు తెలిసిన వారు వస్తారు. “క్యా బాత్ హై ” అంటారు. ఆ మాట ప్రదర్శన రక్తి కట్టింది అనడానికి సూచన. హడావిడి అంతా ముగుస్తుంది . ముని వేళ్ళ వంక ఒక్కసారి చూసుకుని ఇంటికి చేరతాడు. ఒక పెద్ద సమూహం నుండి చిన్న ఇంటిలోకి. అక్కడ కేవలం తాను ,భార్య, పిల్లలు. ఒక ప్రశాంత వాతావరణం. ఒక కాన్సర్ట్ ముగిశాక మిగిలిన నిశ్శబ్దం. ఎలా వర్ణించడం? మళ్ళీ మాతృగర్భం లోకి వెళ్లినట్టు, అక్కడ తనకు అనుకూలమైన గోరువెచ్చని వేడిలో సేద తీరినట్టు. పక్క మీద వాలినాక మెల్లగా కాన్సర్ట్ అంతా మళ్ళీ హృదయంలో మొదలు అవుతుంది. వేలమంది ప్రేక్షకుల మధ్య జరిగిన ప్రదర్శనే ఇప్పుడు మౌనంగా తన హృదయంలో. అది కాన్సర్ట్ అయిన తరువాత జాకీర్ హుస్సేన్ స్థితి
అది ఒక జాకీర్ హుస్సేన్ కేనా? కాదు ఆ జాకీర్ హుస్సేన్ విన్నాక ప్రతి ప్రేక్షక శ్రోతా ఒక రంగుల హరివిల్లును తనతో తీసుకుని వెళతాడు. ఒక శివ తాండవాన్ని, ఒక పార్వతీ లాస్యాన్ని తనతో తీసుకుని వెళతాడు. సముద్ర హోరును, జలపాతాలు దూకే ధ్వనినీ , కార్చిచ్చు రగులుకున్న శబ్దాన్ని, గాలి వీచే చప్పుడును, హరీంద్ర ఘర్జనను తన శక్తి మేరకు తనతో తీసుకుని వెళతాడు. జాకీర్ లాగీ ప్రేక్షక శ్రోత కూడా అలా మంచం మీద వాలినప్పుడు మళ్ళీ ఒక సారి జాకీర్ హుస్సేన్ సృష్టించిన సంగీత ప్రపంచాన్ని సొంతంగా సృష్టించుకుంటాడు
తకిటతక, తకతకిట, తకతకిట, తకిటతక
తకతదిగిణతొగిణతొ, కిటతకతదిగిణతొ
కిటతకతదిగిణతొ, కిటతకతదిగిణతొ
చటులంబులగు జతులు సరిగాఁగఁ దూగించి
ససరిరిస రిగరిరిస సరిగాగ రీగాగ
ధసగాగ గధపాప ధపసాస
…….
రిరిసరిస సరిగాగ రీగాగ రిగరిరిస
…….
సరిసాస పదపాప సరిగ నెత్తులుముడిచి
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
ఆ నారాయణా చార్యుల వారూ , జాకీర్ హుస్సేనూ నన్ను నన్నుగా నిలవనీరు!



