వివాదాస్పదం సుబ్బులక్ష్మి పురస్కారం
……………………………………………………………………….
డా. మహ్మద్ రఫీ..✍️
- టి.యం.కృష్ణ మద్రాస్ మ్యూజిక్ అకాడమి అవార్డు అందుకున్నాక ఆపేసిన సుప్రీం కోర్టు
మద్రాస్ మ్యూజిక్ అకాడమి ప్రతిష్టాత్మకంగా హిందూ పత్రికతో కలసి ప్రతి ఏటా అందించే ఎం.ఎస్.సుబ్బులక్ష్మి సంగీత కళానిధి పురస్కారం ప్రకటించినప్పటి నుంచి వివాదాస్పదంగా మారింది! ఎన్నో ఏళ్లుగా ఈ పురస్కారానికి గొప్ప గౌరవం వుంది! ఈ ఏడాది కర్ణాటక సంగీత సంచలన గాత్ర విద్వాంసులు టి.యం.కృష్ణకు ప్రకటించినప్పటి నుంచి రభస జరుగుతూనే ఉంది! ఆయన ప్రతిభ గురించి వివాదం కానే కాదు! ఆయన వ్యవహార శైలి కానే కాదు! శాస్త్రీయ సంగీత సంపదను పామరులకు పంచి పెట్టడము కూడా అభ్యంతరం లేదు! కానీ, అతను ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ని విమర్శించడాన్ని వారి మనవడు బెంగళూరులో వుండే వి.శ్రీనివాసన్ తప్పు పట్టారు! ముందు మద్రాస్ మ్యూజిక్ అకాడమికి తన నిరసన తెలియజేస్తూ ఉత్తరం రాశారు!

ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పేరిట ఇచ్చే పురస్కారానికి టి. యం.కృష్ణ అర్హుడు కాదని, వెంటనే పురస్కార ప్రకటన వెనక్కి తీసుకోవాలని కోరారు! కానీ, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ మడమ తిప్పలేదు! దాంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు! అక్కడ వి.శ్రీనివాసన్ పిటిషన్ కొట్టి వేయడం జరిగింది! సుప్రీం కోర్టుకు వెళ్ళాడు! తీర్పు ఒక్కరోజు ఆలస్యమైంది! ఈనెల 15వ తేదీ కృష్ణ ఆ పురస్కారం అందుకున్నారు! 16వ తేదీ సుప్రీం కోర్టు తీర్పు వెలువడింది! అవార్డును ఆపేయాలని, ఇప్పటికే అందుకున్నారు కాబట్టి ఆ అవార్డును గుర్తించవద్దని, ఎక్కడా చెప్పుకోవద్దని కోర్టు ఆదేశించింది! అలా అని కృష్ణ విద్వత్తు ను తక్కువ చేయడం కాదని స్పష్టం చేసింది!
మన తెలుగు రాష్ట్రాల్లో వందలాది సంస్థలు ఎవరికంటే వారికి ఎడాపెడ అవార్డులు ఇచ్చేస్తుంటాయి! తమిళనాడులో అలా కాదు! అవార్డును ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవంగా ఎంతో విలువ కలిగిందిగా చూస్తారు! కళలను దైవంతో సమానంగా భావిస్తారు! కళాకారులను దైవ దూతలుగా పరిగణిస్తారు! ప్రేక్షకులు అద్భుత కళాప్రియులు! మైమరచి ఆస్వాదిస్తారు! అందుకే ఈ అవార్డు విషయంలో ఇంత రభస జరిగి హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది!
ఇంతకీ, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి మనవడు వి.శ్రీనివాసన్ అభ్యంతరం ఏమిటంటే… టి.యం.కృష్ణ ఒక సందర్భం లో సుబ్బులక్ష్మి గురించి అనరాని మాటలు అనడమే! ఏదో సందర్భంలో మాట్లాడుతూ సుబ్బులక్ష్మి అతి పెద్ద నకిలీ అని, సాధు స్వభావంలో కనిపించే బార్బీ బొమ్మ అని కృష్ణ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి! అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది! అయినా తానేం వెనక్కి తీసుకోవడం లేదని, తనకు అలా అనిపించిందని తన వివాదాస్పద వ్యాఖ్యలను కృష్ణ సమర్థించుకున్నారు! కొన్ని సంస్థలు ఆయన కచేరిలు ఏర్పాటు చేయడానికి కూడా వెనకడుగు వేశాయి! అయినా కృష్ణ రాజీ పడలేదు! క్షమాపణలు చెప్పలేదు!
వి.శ్రీనివాసన్ అభ్యంతరాన్ని హైకోర్టు కొట్టివేస్తూ అవార్డు ప్రదానం చేయవచ్చని ఈనెల 13వ తేదిన మధ్యంతర ఉత్తర్వ్యులు జారీ చేసింది. 15న చెన్నై లో సంగీత కళానిధి సుబ్బులక్ష్మి పురస్కార ప్రదానోత్సవం జరిగింది. నిన్న సోమవారం శ్రీనివాసన్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అవార్డు ప్రదానం జరిగింది కాబట్టి అవార్డుగా గుర్తించవద్దని, అవార్డు గ్రహీత అని చెప్పుకోకుండా ఉంటే మంచిది అని ఉత్తర్వులలో పేర్కొంది! అయితే తనపై శ్రీనివాసన్ చేసిన ఆరోపణలను టి.యం.కృష్ణ తీవ్రంగా ఖండించారు. తాను సుబ్బులక్ష్మిని విమర్శించిన సందర్భం వేరు అని, పూర్తిగా తాను మాట్లాడింది వివరించకుండా కేవలం ఆ విమర్శ పదాన్ని ఉటంకించి ఆరోపణలు చేయడాన్ని తప్పు పట్టారు! సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయాన్ని గౌరవిస్తానని చెప్పారు!


