క్రేజీ శుక్లా: ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ స్టార్!

అతి సర్వత్ర వర్జయేత్.. ఈ నీతి సూక్తి దాదాపు తెలుగువాళ్లందరికీ తెలిసుంటుంది. ఏ విషయంలో అతైనా ఆ క్రేజ్ సామాజికంగా వెటకారానికి దారితీస్తుంది. అప్పటివరకూ తాము సంపాదించిన గుర్తింపునూ దాటి సదరు వ్యక్తులపై ఓ విభిన్నచూపు ప్రసరిస్తుంది.

ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే… కొన్ని రంగాల్లో ప్రముఖులుగా చలామణి అవుతూ.. వారు సాధించిన ఘనకార్యాలేంటో ఓసారి తరచిచూస్తే మచ్చుకు చెప్పుకునేందుకొక్కటి కూడా కనబడనివారు… పైరవీలు, పైసాతో ఉన్నత స్థానాల్లో కూర్చుని గొప్పలు పోయినప్పుడు ఇలాంటి అతి సర్వత్ర వర్జయేత్ అనే నీతి సూక్తులు గుర్తుకొస్తాయి.

అలాంటి పరిస్థితినే ఇప్పుడు రాజీవ్ శుక్లా అనే రాజ్యసభ సభ్యుడు.. అంతకుమించి క్రీడాలోకంలో ఆయనేం చేశారో పెద్దగా ఎవ్వరికీ తెలియదుగానీ… బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ లో ఎదుర్కోవాల్సి వస్తోంది. అసలు వెటకారం పరాకాష్ఠకు చేరితే ఎలాగుంటుందో.. అలాంటి మీమ్స్ తోనూ.. ఆయన తన X ఖాతాలో చేసిన పోస్ట్ కింద కామెంట్స్ రూపంలోనూ కనిపిస్తున్నాయి.

ఎక్కడ వీవీఐపీలుంటే అక్కడ వాలే కొందరు పెద్దమనుషుల్లో రాజీవ్ శుక్లా పేరు కూడా కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఇంగ్లాండ్-ఇండియా చివరి టీ20 మ్యాచ్ ముంబై వేదికగా జరగడం, అభిషేక్ శర్మ శివతాండవం, ఆ మ్యాచుకు ప్రముఖులైన అమితాబచ్చన్, రిషీ సునాక్, నారాయణమూర్తి, అజయ్ పిరమిల్, ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మెంబర్స్ రావడం తెలిసిందే. ఈ క్రమంలో రిషీ సునాక్ తో ఓ ఫోటో దిగిన రాజీవ్ శుక్లా.. ఆ ఫోటోను తన X ఖాతాలో షేర్ చేశాడు.

ఇక అక్కడ్నుంచి శుక్లాపై విభిన్నమైన కామెంట్స్ వెటకారమై, వ్యంగ్యమై వచ్చిపడుతూనే ఉన్నాయి. అంతేకాదు, కొందరు ఏకంగా మీమ్స్ కూడా తయారుచేసి వదులుతున్నారు.

గత కొద్ది రోజుల క్రితమే బ్రిటీష్ బ్యాండ్ కోల్డ్ ప్లే కు చెందిన పాప్యులర్ సింగర్ క్రిస్ మార్టిన్ కు సంబంధించిన ఓ కాన్సర్ట్ కు కూడా రాజీవ్ శుక్లా హాజరయ్యారు. సచిన్ తో కలిసి హాజరైన శుక్లాకు అసలు క్రిస్ మార్టిన్ ఎవ్వరో కూడా తెలియదు. ఆ విషయాన్ని ఆయన తండ్రితో పరిచయం నేపథ్యంలో తెలుసుకున్నాడు. అప్పుడే క్రిస్ మార్టిన్ నూ తను పరిచయం చేసుకున్నాననీ కాస్త నిజాయితీగానే చెప్పుకొచ్చాడు.

కానీ, ఏ సెలబ్రిటీ కనిపిస్తే వారితో ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పెడుతూ… ఒక ఉన్నతస్థాయిలో రాజ్యసభ మెంబర్ గా, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి షేర్ చేస్తుండటం… ఆయన క్రేజీ మనస్తత్వాన్ని పట్టిచూపించేంది. దాన్నే డీకోడ్ చేసేలా మీమ్స్ రూపొందించడంతో పాటు.. ఒక రేంజులో నెటిజన్స్ ఆడుకుంటున్నారు.

పైగా రిషీ సునాక్ తో కలిసిన ఫోటోను షేర్ చేస్తూ రిషీ అద్భుతమైన వ్యక్తే కాదు.. బ్రిటన్ లో అత్యంత ప్రభావవంతమైన మాజీ ప్రధాని అంటూ ఆయన ఏవో కొత్త విషయాలను ఇన్వెంట్ చేసి చెబుతున్నట్టు చేసిన పోస్ట్ తో శుక్లా సోషల్ మీడియా కామెడీ కింగ్ గా మారిపోయాడు.

అబ్బ శుక్లాజీ మీరెంత బిజీగా ఉన్నారు. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా మీరలా ఎలా వాలిపోగల్గుతున్నారు. ఇది మీకు మాత్రమే సాధ్యమైన పని. శుక్లా అశ్వద్థామలాంటివాడని ఒకరంటే.. సెలబ్రిటీలను కలవడం, ఫోటోలు దిగడంతో శుక్లాజీకి అసలు తీరికే లేకుండా పోయిదంటూ కొందరు సెటైర్స్ వేస్తున్నారు.

మీ నెట్ వర్క్ ఇంతలా ఉందా అంటూ కొందరు కామెంట్ చేస్తే… ది బెస్ట్ నెట్ వర్క్ కు నోబెల్ బహుమతిలో అవకాశం కనుక ఉంటే అది శుక్లాకే ఇవ్వాలంటూ ఎగతాళి, గెలి చేసేవాళ్లు కొందరు. శుక్లా వంటి మృదుస్వభావి సహజంగానే ప్రజల్ని ఆకర్షిస్తారని మరికొందరు.. ఇలా సోషల్ మీడియా ఒక ఆటే ఆడుతోంది రాజీవ్ శుక్లాతో.

అల్లు అర్జున్ ఘటనలో జరిగిన విచారకర ఘటనల్లో సామాన్యుల క్రేజ్ కే జనం స్పందనలు భిన్నంగా కనిపించాయి. అంత క్రేజ్ అవసరమా అంటూ ప్రశ్నలు వెల్లువెత్తాయి. అలాంటిది తానే ఓ రాజ్యసభ సభ్యుడిగా, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ స్థానంలో ఉండి ఈ విధమైన క్రేజ్ చూపించడంతో… రాజీవ్ శుక్లా టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా ఐపోయాడు.

మన దక్షిణాది క్రేజీ స్టార్ బాలయ్యంత కాకపోయినాయ… ఉత్తరాదికీ రాజకీయ, క్రీడారంగాల్లో శుక్లాలాంటి మెరుపుతునకలు తయారవ్వడం ఆయా రంగాలకు మంచి ఎంటర్టైన్మెంటే మరి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles